TSIIC
-
హైదరాబాద్‌లో అతిపెద్ద అంతర్జాతీయ ప్లాస్టిక్ ఎక్స్పో ప్రారంభం
దేశంలో మూడో అతిపెద్ద ప్లాస్టిక్ ఎక్స్పో హైప్లెక్స్-2023 హైదరాబాద్‌లో శుక్రవారం (ఆగస్ట్ 4) ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ టీఎస్ఐఐసీ ఎండీ, వైస్ చైర్మన్ వెంకట నర్సింహా రెడ్డి ఇతర ప్రముఖులతో కలిసి ప్రారంభించారు. ఆగస్టు 4 నుంచి 7వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు నగరంలోని హైటెక్స్‌లో ఈ ప్రదర్శన జరగనుంది. ఎనిమిది సంవత్సరాల తర్వాత హైప్లెక్స్ అనే పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. ఇంతకుముందు ఐప్లెక్స్గా వ్యవహరించేవారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ అండ్ ఫెసిలిటేషన్ ఆఫీస్ అడిషనల్ డెవలప్మెంట్ కమిషనర్ చంద్ర శేఖర్, హెచ్ఎంఈఎల్ ఎండీ, సీఈవో ప్రభుదాస్, గెయిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీవాస్తవ, ఇండియన్ ప్లాస్టిక్స్ ఇన్స్టిట్యూట్ నేషనల్ ప్రెసిడెంట్ అనిల్ రెడ్డి వెన్నం, ఎఫ్‌టీసీసీఐ ప్రెసిడెంట్ మీలా జయదేవ్ గౌరవ అతిథులుగా హాజరై ప్రసంగించారు. షో డైరెక్టరీ, డైలీ షో మ్యాగజైన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీఎస్ఐఐసీ ఎండీ, వైస్ చైర్మన్ వెంకట నర్సింహా రెడ్డి మాట్లాడుతూ టీఎస్ ఐపాస్ చట్టం తెలంగాణ ప్రభుత్వ మైలురాయి నిర్ణయమని పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన లైసెన్సుల జారీ ప్రక్రియను ఈ చట్టం వేగవంతం చేస్తోందన్నారు. దీని కింద గత ఎనిమిదిన్నర సంవత్సరాలలో 24000 పరిశ్రమ ప్రతిపాదనలను ఆమోదించినట్లు చెప్పారు. మొదటి ప్లాస్టిక్ పార్క్ విజయవంతమైందని, రెండోది కావాలన్నా భూమి ఇచ్చేందుకు టీఎస్ఐఐసీ సిద్ధంగా ఉందని తెలిపారు. దాదాపు 20,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ఎక్స్‌పోలో ప్రపంచవ్యాప్తంగా 400 సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. తెలంగాణ అండ్ ఆంధ్రా ప్లాస్టిక్స్ మ్యాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (టాప్మా) ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న ఈ ప్రదర్శనలో రూ.500 కోట్ల మేర వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నట్లు తాప్మా అధ్యక్షుడు విమలేష్ గుప్తా తెలిపారు. -
తెలంగాణలో అతిపెద్ద స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్.. ఎక్కడో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ యువతకు ఉపాధి లక్ష్యంగా నగరానికి ఆనుకుని యాదాద్రి జిల్లా పరిధిలోని దండుమల్కాపురం (ఎన్‌హెచ్– 65) వద్ద టీఎస్ఐఐసీ, తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్ ఫెడరేషన్ నిర్మిస్తోన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ (ఎస్డీసీ) డిసెంబరులో అందుబాటులోకి రానుంది. ఈ ప్రాంతంలో సుమారు 547 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నెలకొల్పిన ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పరిశ్రమల పార్క్‌కు ఎస్డీసీ తలమాణికం కానుంది. ఈపార్క్‌లో దశలవారీగా ప్రత్యక్ష, పరోక్షంగా సుమారు 20–30 వేల మందికి ఉపాధి కల్పించనున్నట్లు టీఎస్ఐఐసీ వర్గాలు తెలిపాయి. ఎస్‌డీసీపై కేటీఆర్ ట్వీట్.. ఇటీవల మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి కేటీఆర్ సైతం ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుపై సామాజిక మాధ్యమం ట్విటర్లో ట్వీట్ చేశారు. టీఎస్ఐఐసీ, తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన.. రాష్ట్రంలోనే అతిపెద్ద స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్, ఇండస్ట్రియల్ పార్క్ ఇదేనని పేర్కొన్నారు. దండుమల్కాపురం పార్క్‌లో సుమారు 589 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కొలువుదీరనున్నాయన్నారు. సుమారు 20–30 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పనే లక్ష్యంగా ఈ పార్క్‌ను ఏర్పాటు చేశామన్నారు. స్థానిక పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా నైపుణ్యం కలిగిన కార్మికులు, టెక్నీషియన్లు, ఉద్యోగులను తీర్చిదిద్దేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అవసరమైన శిక్షణనిస్తుందన్నారు. ఇటీవల హర్యానా స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు సైతం తమ స్టడీటూర్‌లో భాగంగా ఈ కేంద్రాన్ని, పార్క్‌ను సందర్శించి స్ఫూర్తి పొందినట్లు తెలిపారు. కాగా ఈపార్క్‌లో సుమారు 60 శాతం స్థలాన్ని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించారు. ఈ పార్క్‌లో టౌన్షిప్ ఏర్పాటు ద్వారా వాక్‌టు వర్క్ కాన్సెప్ట్‌ను అమలు చేయనున్నారు. ఇప్పటికే ఈ పార్క్‌లో సుమారు 200 పరిశ్రమలు తమ కంపెనీలు నెలకొల్పే పనులు చేపట్టడం విశేషం. వచ్చే ఏడాది జూన్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆయాసంస్థలు చర్యలు చేపట్టాయి. ఇప్పటికే 30 పరిశ్రమలు ఈ పార్క్‌లో ఉత్పత్తులకు శ్రీకారం చుట్టాయి. మిగతా పరిశ్రమలు కూడా తమ కంపెనీల స్థాపనకు చర్యలు తీసుకుంటున్నాయి. పలు పారిశ్రామిక పార్క్‌ల పరిశీలన తర్వాతే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం దేశవ్యాప్తంగా పలు పారిశ్రామిక వాడలను పరిశీలించిన అనంతరమే టీఎస్ఐఐసీ, టీఐఎఫ్ సంస్థలు ఈ పార్క్‌ను అభివృద్ధి చేశాయి. దక్షిణాది రాష్ట్రాల్లో అతిపెద్ద ఎంఎస్ఎంఈ పార్క్ ఇదేనని తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్ ఫెడరేషన్ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. రూ.236 కోట్ల అంచనా వ్యయంతో విద్యుత్, మంచినీరు, రహదారులు, మురుగు నీటి పారుదల వ్యవస్థలను ఏర్పాటు చేశామన్నారు. ఈ పార్క్‌లో అంతర్భాగంగా 194 ఎకరాల్లో టౌన్షిప్ ఏర్పాటు చేయడంతోపాటు ఇందులో పాఠశాలలు, కమర్షియల్ మార్కెట్లు, ఎంటర్టైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ పార్క్‌కు డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ సంస్థనుంచి పలు అంశాల్లో ప్రశంసలు దక్కినట్లు పేర్కొన్నాయి. ఈ పార్క్‌లో సుమారు 40 వేల మొక్కలు నాటి హరితహారానికి చర్యలు తీసుకున్నామన్నాయి. (క్లిక్ చేయండి: ఇది బెంగళూరు కాదు సార్.. హైదరాబాదే!) -
TS: ఏళ్లకేళ్లు గడిచిపోతున్నా పరిశ్రమలు లేవు.. వేల ఎకరాల భూమి నిరుపయోగం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించడం, పరిశ్రమల స్థాపనతో ఆర్థికంగా అభివృద్ధి చెందడం లక్ష్యంగా ప్రభుత్వం పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసింది. వివిధ పరిశ్రమల ఏర్పాటు కోసం వేల ఎకరాలను కేటాయించింది. కానీ ఏళ్లకేళ్లు గడిచిపోతున్నా.. ఆ స్థలాల్లో పరిశ్రమలు ఏర్పాటుకావడం లేదు. అలాగని తిరిగి ప్రభు త్వం చేతిలోకీ రావడం లేదు. వేల ఎకరాలు ఎటూ కాకుండా నిరుపయోగంగా మారిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే దీనిపై దృష్టి పెట్టి పారిశ్రామిక పార్కుల్లోని ఖాళీ స్థలాలను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం మొదలుపెట్టినా ఫలితం మాత్రం కానరావడం లేదు. మంత్రి ఆదేశాలు జారీచేసి రెండేళ్లు కావొస్తున్నా.. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలోని పారి శ్రామిక వాడల్లో ఉన్న భూమిని వెనక్కి తీసుకునే ప్రక్రియ అంగుళం కూడా ముందుకు కదలలేదు. 55 వేల ఎకరాల్లో పారిశ్రామిక పార్కులు పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా రాష్ట్రంలో ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేస్తోంది. ఈ పారిశ్రామిక వాడల్లో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల కల్పన, భూమి ధర నిర్ణయం, ప్లాట్ల కేటాయింపు వంటి అంశాలను తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) చూసుకుంటోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీఐఐసీ 1973 నుంచి 2014 వరకు సుమారు 27 వేల ఎకరాలను అభివృద్ధి చేయగా.. రాష్ట్ర విభజన తర్వాత టీఎస్ఐఐసీ 28వేల ఎకరాల్లో 152 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసింది. రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక చట్టం టీఎస్ఐపాస్ ద్వారా 2014 నుంచి ఇప్పటివరకు 20,909 పరిశ్రమలకు అనుమతు లు ఇవ్వగా.. రూ.2.41 లక్షల కోట్ల పెట్టుబడులు, 16.81 లక్షల మందికి ఉపాధి లభించినట్టు అధికార వర్గాల అంచనా. అయితే పారిశ్రామికవాడల్లో భూములు కేటాయించినా పరిశ్రమలు స్థాపించకపోవడంతో ఇటు భూములకు, అటు ఉపాధికి గండిపడుతోంది. రెండేళ్ల కింద ఆదేశించినా.. భూకేటాయింపులు పొందినా కార్యకలాపాలు ప్రారంభించని పరిశ్రమలను గుర్తించి, నోటీసులు జారీ చేయాలని.. ఆయా భూములను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు 2020 ఆగస్టులో ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రంగంలోకి దిగిన టీఎస్ఐఐసీ 65 పరిశ్రమలకు సంబంధించి సుమారు రెండు వేల ఎకరాల్లో ఎలాంటి కార్యకలాపాలు జరగడం లేదని గుర్తించింది. ఒక ఎకరం మొదలుకుని 250 ఎకరాల మేర విస్తీర్ణం వరకు ఈ ప్లాట్లు ఉన్నట్టు తేలి్చంది. ప్రధానంగా హెచ్ఎండీఏ పరిధిలోని రావిర్యాలలో ఉన్న ఫ్యాబ్‌సిటీ, మామిడిపల్లిలోని హార్డ్‌వేర్ పార్క్, కరకపట్లలోని బయోటెక్ పార్క్, నానక్‌రామ్‌గూడలోని పారిశ్రామికవాడల్లో ఉన్న ఈ భూముల కేటాయింపులను రద్దు చేసి.. ఇతర పరిశ్రమలకు కేటాయించాలని నిర్ణయించింది. ఆయా పరిశ్రమల యజమానులకు 2020 సంవత్సరం చివరిలోనే నోటీసులు ఇచి్చంది. కానీ ఇప్పటివరకు ఒక్క ఎకరం కూడా తిరిగి ప్రభుత్వపరం కాలేదు. ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు విపరీతంగా పెరగడంతో.. వాటిని వదులుకోవడానికి సంబంధిత పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదని అధికార వర్గాలు అంటున్నాయి. నోటీసులు అందుకున్నవారిలో కొందరు పనులు ప్రారంభించేందుకు ఒకటి, రెండేళ్లు గడువు ఇవ్వాలని కోరగా.. మరికొందరు టీఎస్ఐఐసీకి కొంత మొత్తాన్ని అపరాధ రుసుముగా చెల్లించినట్టు తెలిసింది. కానీ చాలా మంది టీఎస్ఐఐసీ తమకు నోటీసులు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించారు. అసలు గడువు రెండేళ్లే అయినా.. నిబంధనల ప్రకారం పారిశ్రామిక వాడల్లో భూకేటాయింపులు జరిగిన రెండేళ్లలో కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉంటుంది. పరిశ్రమలకు భూకేటాయింపులు, మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టిన టీఎస్ఐఐసీ ఆయా భూముల్లో కార్యకలాపాల అంశాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దీంతో కొందరు లబ్ధిదారులు తమకు కేటాయించిన ప్లాట్లను ఇతర అవసరాలకు వినియోగిస్తుండగా.. మరికొందరు ఖాళీగా వదిలేశారు. రాష్ట్రంలో భూముల ధరలు భారీగా పెరగడం, పారిశ్రామిక పెట్టుబడులు, స్థాపన వేగవంతం కావడంతో.. ఇప్పుడు పారిశ్రామిక పార్కుల్లో ప్లాట్లకు డిమాండ్ పెరిగింది. సేల్ డీడ్ ఇవ్వక.. రుణాలు రాక.. అయితే టీఎస్ఐఐసీ కొన్నేళ్ల కింద భూకేటాయింపుల నిబంధనలను మార్చింది. కేటాయింపులు పొందిన వారికి నేరుగా ‘సేల్ డీడ్’ ఇవ్వకుండా ‘అగ్రిమెంట్ ఆఫ్ సేల్’ పేరిట రిజిస్ట్రేషన్ చేస్తోంది. తాము ఏళ్ల తరబడి కార్యకలాపాలు ప్రారంభించక పోవడానికి ఈ నిబంధనే కారణమని నోటీసులు అందుకున్న కొందరు పరిశ్రమల యజమానులు చెప్తున్నారు. పెట్టుబడి వ్యయంలో 70 శాతం దాకా భూమి కొనుగోలు, భవన నిర్మాణాలకే ఖర్చవుతోందని.. యంత్ర సామగ్రి, పరికరాలకు రుణాల కోసం బ్యాంకులకు వెళితే అప్పు పుట్టడం లేదని అంటున్నారు. భూములకు సంబంధించి ‘సేల్ డీడ్’ ఉంటేనే రుణాలు ఇస్తామంటున్నాయని వాపోతున్నారు. టీఎస్ఐఐసీ ఎన్వోసీ ఇస్తామన్నా.. బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని.. దాంతో పరిశ్రమ కార్యకలాపాలు ప్రారంభించలేక పోతున్నామని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు పారిశ్రామికవేత్తల ఇబ్బందిని తొలగించడం, ఇటు ఖాళీ ప్లాట్ల స్వా«దీనంలో ఇక్కట్లను అధిగమించడం కోసం.. భూకేటాయింపు నిబంధనల్లో సవరణలు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు టీఎస్ఐఐసీ వర్గాలు చెప్తున్నాయి. -
బొమ్మల కొలువుగా తెలంగాణ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిర్మల్ కొయ్యబొమ్మలు వంటి హస్తకళాకృతులు మినహా చెప్పుకోదగిన స్థాయిలో ఆధునిక పిల్లల ఆటవస్తువులు, బొమ్మల తయారీ యూనిట్లు లేవు. పిల్లల బొమ్మలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని తెలంగాణను టాయ్స్‌హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం సంకల్పించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 20 బొమ్మల తయారీ యూనిట్లు ఉన్నట్లు టీఎస్ఐఐసీ అంచనా. ఈ నేపథ్యంలో బొమ్మల తయారీ రంగంలో ఉన్న అవకాశాలను మరింతగా ఉపయోగించుకోవాలని సర్కారు భావిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్‌లో బొమ్మల తయారీ యూనిట్ల ఏర్పాటుకు వీలుగా ‘టాయ్స్ పార్క్’ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే దండుమల్కాపూర్‌లో తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టిఫ్) ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ పార్కు కార్యకలాపాలు ప్రారంభించింది. ఇతర పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా ప్రభుత్వం మరో రెండు వేల ఎకరాలను సేకరించి మౌలిక వసతులపై దృష్టి సారించింది. ఇక్కడే టాయ్స్ పార్కు కోసం డిమాండ్‌ను బట్టి 70 నుంచి 100 ఎకరాల వరకు కేటాయించేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇందులో బొమ్మల మ్యూజియం, కామన్ ఫెసిలిటీ సెంటర్, చిల్డ్రన్ అమ్యూజ్మెంట్ పార్కు తదితరాలను ఏర్పాటు చేస్తారు. ఏటా 10–15 శాతం పెరుగుదల పిల్లలకు వినోదంతోపాటు విజ్ఞానం పంచే ఆట వస్తువులు, బొమ్మల తయారీ పరిశ్రమ దేశంలో శైశవ దశలో ఉంది. అయితే ఆటబొమ్మలకు ఏటా భారత్‌లో 10 నుంచి 15శాతం డిమాండ్ పెరుగుతోంది. భారత్‌లో చిన్నారులు ఉపయోగించే ఆట వస్తువులు, బొమ్మల్లో 80శాతం చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. వీటిలో ఎక్కువగా ప్లాస్టిక్, విషపూరిత రసాయనాలతో తయారైనవే ఉంటుండటంతో కొన్ని రకాల బొమ్మలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో పెరుగుతున్న డిమాండ్‌ను దేశంలోని తయారీ యూనిట్లు తట్టుకోలేకపోతున్నాయి. గ్రేటర్ నోయిడా, ఢిల్లీ, ముంబైలో మాత్రమే ఈ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. భారత్‌లో పిల్లల బొమ్మల వాణిజ్యం విలువ రూ.12వేల కోట్లు ఉన్నట్లు అంచనా. అన్ని వసతులు హైదరాబాద్‌లోనే పిల్లల ఆట వస్తువులు, బొమ్మల తయారీ యూనిట్లు స్థానికంగా లేకపోవడంతో ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. బొమ్మల తయారీ పరిశ్రమను ప్రోత్సహిస్తే దక్షిణాది రాష్ట్రాల మార్కెట్ అవసరాలకు సరిపడా ఇక్కడే ఉత్పత్తి చేయొచ్చు. తెలంగాణలో తయారీ యూనిట్ల ఏర్పాటుకు దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ఉత్పత్తిదారులు ఆసక్తి చూపుతున్నారు. ఎలక్ట్రానిక్ ఆట బొమ్మలు, సాఫ్ట్ టాయ్స్ పరిశ్రమకు హైదరాబాద్ హబ్‌గా మారేందుకు అవసరమైన అన్ని వసతులు దండుమల్కాపూర్‌లో అందుబాటులోకి వస్తాయి. – ఆకారం జనార్దన్ గుప్తా, అధ్యక్షుడు, టాయ్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ తయారీదారులను ఏకతాటిపైకి తెస్తున్నాం దండుమల్కాపూర్‌లో ఏర్పాటు చేసే టాయ్స్ పార్క్ ప్రత్యేకతలు, అందుబాటులో ఉండే మౌలిక వసతులు, బొమ్మల తయారీ, మార్కెటింగ్‌కు తెలంగాణలో ఉన్న అవకాశాలపై ప్రచార వీడియోను రూపొందిస్తున్నాం. ఇటీవల రాష్ట్రంలో బొమ్మల తయారీదారులు, పంపిణీదారులతో సమావేశం ఏర్పాటు చేశాం. ఇక్కడి వసతులపై విస్తృత ప్రచారం కల్పిస్తున్నాం. బొమ్మల తయారీదారులను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సాఫ్ట్, ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్, కొయ్య బొమ్మల వంటి హస్తకళాకృతుల తయారీదారుల నుంచి యూనిట్ ఏర్పాటుపై ఆసక్తి వ్యక్తీకరణ కోరుతున్నాం. –శ్రీహా రెడ్డి, నోడల్ ఆఫీసర్, తెలంగాణ టాయ్స్ విభాగం -
స్టార్టప్‌లకు స్వర్గధామం.. టీఎస్‌ఐఆర్‌ఐఐ
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో పురుడు పోసుకున్న పలు అంకుర పరిశ్రమలు ఇప్పుడు పల్లెబాట పట్టనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికవృద్ధి, ఉపాధి కల్పనకు బాటలు పరిచే అంకుర పరిశ్రమలకు ఆర్థిక చేయూతనందించేందుకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (టీఎస్ఐఐసీ) అధిక ప్రాధాన్యమిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ దిశానిర్దేశం మేరకు ఆయా స్టార్టప్‌లకు రూ.30 లక్షల వరకు ఆర్థిక సాయం అందజేసే అవకాశాలున్నట్లు టీఎస్ఐఐసీ వర్గాలు తెలిపాయి. ఇందులో ప్రయోగాత్మకంగా చేపట్టే ప్రాజెక్టులకు సైతం సాయం అందుతుందని స్పష్టం చేశాయి. ఇందుకోసం తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్స్ ఫర్ రూరల్ ఇంపాక్ట్ ఇన్సెంటివ్స్ (టీఎస్‌ఐఆర్‌ఐఐ) పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపాయి. ► ఈ పథకం అమలుకు సంబంధించిన బాధ్యతలను తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ నిర్వర్తిస్తుందని పేర్కొన్నాయి. ఆర్థిక సాయం సూక్ష్మ, చిన్న, కుటీర, మధ్యతరహా పరిశ్రమలు, వీటికి సంబంధించిన సాంకేతికతను అభివృద్ధి చేసే స్టార్టప్ సంస్థలకు వర్తిస్తుందని తెలిపాయి. ఈ పథకానికి సంబంధించి హెచ్‌టీటీపీఎస్://టీమ్టీఎస్ఐసీ.తెలంగాణ.జీఓవీ.ఐఎన్/టీఎస్ఐఆర్ఐ–ఇన్సెంటివ్స్/ అనే సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న సంస్థలను టీఎస్ఐసీ ఏర్పాటు చేసిన గ్రాస్రూట్స్ అడ్వైజరీ కౌన్సిల్ మూల్యాంకనం చేస్తుందని.. ఆయా సాంకేతికత ద్వారా ఒనగూరే ప్రయోజనాలను విశ్లేషిస్తుందని టీఎస్ఐఐసీ వర్గాలు తెలిపాయి. నగరం నుంచి పల్లెలకు... ► నగరంలో అంకుర పరిశ్రమలకు స్వర్గధామంలా మారిన టీహబ్‌లో నూతనంగా వందలాది స్టార్టప్‌లు పురుడు పోసుకున్న విషయం విదితమే. వీటిలో ప్రధానంగా ఐటీ, అనుబంధ రంగాలు, సేవలు, బ్యాంకింగ్, హెల్త్‌కేర్, ఇన్సూరెన్స్ ఇతర సేవారంగ విభాగానివే అత్యధికంగా ఉన్నాయి. ఈ నూతన పథకంతో స్టార్టప్‌లు ఇప్పుడు నగరంలోనే పురుడు పోసుకున్నప్పటికీ.. పల్లెలకు తరలివెళ్లనున్నాయి. (క్లిక్: హెచ్ఎండీఏ ప్లానింగ్‌లో దళారుల దందా : ఆమ్యామ్యాలు లేకుంటే పెండింగే) ► గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ప్రధానంగా వ్యవసాయం, పాడి పరిశ్రమ, హార్టికల్చర్, చేనేత, ఇతర కుటీర పరిశ్రమలకు సాంకేతిక దన్ను అందించడం, వారి ఉత్పత్తులకు బ్రాండింగ్, మార్కెటింగ్ సదుపాయం కల్పించడం ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు స్టార్టప్‌లు రూపొందించే టెక్నాలజీ దోహదం చేయనుంది. ఈ సంస్థలు రూపొందించే ఉత్పత్తులు లేదా సాంకేతికత గ్రామీణుల జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే ఈ పథకం ఉద్దేశమని నిపుణులు చెబుతుండడం విశేషం. -
సర్కారు వారి మాట
సాక్షి, సిటీబ్యూరో: ఏళ్లుగా కంపెనీలు నెలకొల్పని పరిశ్రమల నుంచి ప్రభుత్వ భూముల స్వాదీనానికి రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాలకల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) రంగం సిద్ధం చేస్తోంది. గ్రేటర్‌కు ఆనుకొని హెచ్ఎండీఏ పరిధిలో సుమారు రెండువేల ఎకరాల వరకు ఖాళీ స్థలాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ స్థలాలను తిరిగి కంపెనీలు నెలకొల్పేవారికి కేటాయించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో ఎకరం మొదలు వంద ఎకరాలకు పైగా భూములున్న కంపెనీలుండడం గమనార్హం. ఈ ప్రాంతాల్లోనే అత్యధికం... రెండేళ్ల క్రితం టీఎస్ఐఐసీ నుంచి స్థలాలను దక్కించుకున్న పలువురు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, కంపెనీల యజమానులు ఇప్పటికీ కంపెనీలను నెలకొల్పలేదు. ఇలా నిరుపయోగంగా ఉన్నవిలువైన ప్రభుత్వ స్థలాలు.. ప్రధానంగా ర్యావిర్యాల ఫ్యాబ్‌సిటీ, మామిడిపల్లిలోని హార్డ్‌వేర్‌పార్క్, నానక్‌రామ్‌గూడలోని ఐటీపార్క్, నాచారం పారిశ్రామిక వాడ, పాశమైలారం, పటాన్చెరు ప్రాంతాలున్నాయి. గతంలో కేటాయింపులిలా.. ♦ నాలుగేళ్లుగా టీఎస్ఐఐసీ సుమారు 4,169 ఎకరాల భూములను 2,290 కంపెనీలకు కేటాయించింది. ఇందులో 95 సంస్థలు ఎస్సీ,ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారివి. ఈ కంపెనీలు పూర్తిస్థాయిలో ఏర్పాటైతే రాష్ట్రానికి సుమారు రూ.56,597 కోట్ల పెట్టుబడుల వెల్లువతోపాటు..1.50 లక్షల మందికి ఉపాధి దక్కనుందని టీఎస్ఐఐసీ వర్గాలు చెబుతున్నాయి. ఆయా కంపెనీలు ఏర్పాటు చేయని సంస్థల నుంచి భూములు స్వా«దీనం చేసుకొని తిరిగి ఇతర సంస్థలకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం దిశానిర్దేశం చేయడంతో ఈ మేరకు టీఎస్ఐఐసీ కార్యాచరణ సిద్ధంచేస్తోంది. ♦ ఇప్పటికే కొన్ని కంపెనీల నుంచి భూములు స్వా«దీనం చేసుకోగా..సదరు యజమానులు కోర్టులను ఆశ్రయించడం గమనార్హం. గత ఏడేళ్లుగా టీఎస్ఐఐసీ పారిశ్రామిక వాడల ఏర్పాటుకు వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.50 లక్షల ఎకరాలతో భూబ్యాంకును ఏర్పాటు చేయనుంది. ♦ గత ఏడేళ్లుగా 18 ప్రాంతాల్లో 19,961 ఎకరాల్లో పారిశ్రామిక వాడలుగా తీర్చిదిద్దడంతోపాటు మౌలిక వసతులు కల్పించింది . మరో 15,620 ఎకరాలను పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు వీలుగా అభివృద్ధి చేస్తోంది. ఇందులో రావిర్యాల, మహేశ్వరంలోని హార్డ్‌వేర్ క్లస్టర్, సుల్తాన్‌పూర్‌లోని మెడికల్ డివైజెస్ పార్క్‌లున్నాయి. రాబోయే రెండేళ్లలో 80 ప్రాంతాల్లో ప్రత్యేకంగా పారిశ్రామిక వాడలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు టీఎస్ఐఐసీ వర్గాలు చెబుతున్నాయి. -
ఖాళీగా ఉంచుతామంటే కుదరదు... టీఎస్ఐఐసీ షాకింగ్ నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల ఏర్పాటు కోసం కేటాయించిన భూముల్లో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండా ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న వాటిని తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియను టీఎస్ఐఐసీ (తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ) ముమ్మరం చేసింది. పారిశ్రామిక వాడల్లో నిరుపయోగంగా ఉన్న ప్లాట్లను గుర్తించి స్వాధీనం చేసుకోవాలని గత ఏడాది ఆగస్టులో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. కోట్ల రూపాయల విలువ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఇప్పటివరకు 65 సంస్థల నుంచి సుమారు 1,960 ఎకరాల భూమిని టీఎస్ఐఐసీ స్వాధీనం చేసుకుంది. వీటి విలువ రూ.కోట్లలో ఉంటుందని అధికారులు అంటున్నారు. నిరుపయోగంగా ఉన్న భూముల్లో ఎక్కువ శాతం హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోనే ఉన్నాయి. ఆదిభట్ల సెజ్, మడికొండ ఐటీ పార్క్, ఫ్యాబ్‌సిటీ, హార్డ్‌వేర్ పార్క్, ఐడీఏ నాచారం, పాశమైలారం, పటాన్చెరు, కరకపట్ల బయోటెక్ పార్క్‌తోపాటు పలు చోట్ల ఖాళీ ప్లాట్లు ఉన్నట్లు తేలింది. కార్యకలాపాలు ప్రారంభించని కొందరు పారిశ్రామికవేత్తలు మరికొంత సమయం కావాలని టీఎస్ఐఐసీని కోరుతుండగా, మరికొందరు కోర్టును ఆశ్రయించారు. స్వాధీనం చేసుకున్న భూములను పెట్టుబడులతో వచ్చే వారిలో అర్హులైన వారికి తిరిగి కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఐదు దశాబ్దాలుగా వేల ఎకరాలు కేటాయింపు పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించానే లక్ష్యంతో ప్రభుత్వాలు పరిశ్రమల ఏర్పాటు కోసం దశాబ్దాల తరబడి భూములు కేటాయిస్తున్నాయి. ఐదు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఏపీలో పారిశ్రామిక మౌలిక సదుపాయల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) ఏర్పడింది మొదలు 2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు సుమారు 27వేల ఎకరాలు పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీఎస్ఐఐసీగా రూపాంతరం చెందిన తర్వాత నూతన పారిశ్రామిక చట్టం (టీఎస్ఐపాస్)లో భాగంగా సుమారు ఐదు వేల ఎకరాలకుపైగా పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించినట్లు అంచనా. రాష్ట్రంలోకి పెట్టుబడులు వేగంగా వస్తుండటంతో 35 వేల ఎకరాలను పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా టీఎస్ఐఐసీ మౌలిక సదుపాయల కల్పన పనులు చేపట్టింది. టీఎస్ఐపాస్ ద్వారా 2015 నుంచి ఇప్పటి వరకు 15,852 పరిశ్రమలు రూ.2.14 లక్షల కోట్ల పెట్టుబడులతో రాష్ట్రానికి రాగా, 15.60 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. వీటిలో రూ.98 వేల కోట్ల పెట్టుబడులతో కార్యకలాపాలు ప్రారంభించిన 12 వేలకు పైగా యూనిట్లు 7.71 లక్షల మందికి ఉపాధి ఇస్తున్నాయి. 1,343 ఎకరాల మేర ఖాళీ ఓ వైపు పారిశ్రామిక వాడల్లో భూములు పొందినా కార్యకలాపాలు ప్రారంభించక పోవడంతో నిరుపయోగంగా మారగా, మరోవైపు వివిధ పారిశ్రామిక జోన్లలో 1,343 ఎకరాల విస్తీర్ణం మేర 1,205 ప్లాట్లు విక్రయానికి నోచుకోలేదు. పెరుగుతున్న మార్కెట్ ధరలకు అనుగుణంగా ఈ ఖాళీ ప్లాట్ల ధరలను కూడా ప్రభుత్వం సవరిస్తూ పెట్టుబడులతో వచ్చే వారికి కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటనలు ఇస్తోంది. కేటాయింపులు జరగని ప్లాట్లతోపాటు తిరిగి స్వాధీనం చేసుకునే ప్లాట్లను కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కేటాయించేందుకు టీఎస్ఐఐసీ సన్నాహాలు చేస్తోంది. పారిశ్రామిక జోన్ల వారీగా ఖాళీగా ఉన్న ప్లాట్లు పారిశ్రామిక జోన్ ఖాళీ ప్లాట్లు సైబరాబాద్ 128 కరీంనగర్ 7 ఖమ్మం 31 మేడ్చల్–సిద్దిపేట 133 నిజామాబాద్ 3 పటాన్చెరు 130 శంషాబాద్ 347 వరంగల్ 418 యాదాద్రి 8 ............................................... మొత్తం 1,205 చదవండి : రికార్డు స్థాయిలో పెరిగిన దేశ జీడీపీ -
రెండేళ్ల కింద హడావుడి.. తరలింపు అంతా కాగితాల్లోనే
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను సిటీ బయటికి తరలించాలన్న నిర్ణయం కాగితాలకే పరిమితం అవుతోంది. పొల్యూషన్ కంట్రోల్ బో ర్డు, పరిశ్రమల శాఖ, టీఎస్ఐఐసీ విభాగాల మధ్య సమన్వయ లోపంతో తీవ్రంగా జాప్యం జరుగుతోంది. ఇదే సమయంలో పరిశ్రమలున్న ప్రాంతా లు, ఆ చుట్టుపక్కల నివసించే లక్షలాది మంది కాలుష్యంతో తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. రెండేళ్ల కింద హడావుడి హైదరాబాద్ సిటీలో ఉన్న కాలుష్య పరిశ్రమలను దశల వారీగా ఔటర్ రింగ్ రోడ్డు నుంచి 30 కిలోమీటర్ల అవతలి ప్రాంతాలకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణ యం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) రెండేళ్ల కింద హడావుడి చేసింది. రెడ్, ఆరంజ్ కేటగిరీల కిందికి వచ్చే అత్యంత కాలుష్య కారక 500 కంపెనీలను వికారాబాద్, జహీరాబాద్ తదితర ప్రాంతాలకు తరలించాలని.. మరో 600 బల్‌్కడ్రగ్, ఫార్మా, అనుబంధ కంపెనీలను ముచ్చర్లలో ఏర్పాటుచేస్తు న్న ఫార్మాసిటీకి మార్చాలని నిర్ణయించింది. ఏడాది కింద జహీరాబాద్, వికారాబాద్ ప్రాంతాలకు పరిశ్రమల తరలిం పు కోసం అవసరమైన స్థలాలను గుర్తించినట్లు టీఎస్ఐఐసీ వర్గాలు ప్రకటించాయి. కానీ అడుగు ముందుకుపడలేదు. ఏయే ప్రాంతాల్లో.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాటేదాన్, జీడిమెట్ల, మల్లాపూర్, బాలానగర్, ఉప్పల్, పాశమైలారం తదితర పారిశ్రామిక వాడలున్నాయి. వీటిలో ప్రధానంగా బల్క్ డ్రగ్, ఆయిల్, ఇంటరీ్మడియెట్స్, ఆయిల్, ప్లాస్టిక్, రబ్బర్, ప్లాస్టిక్ విడిభాగాలు, స్టీలు విడిభాగాల తయారీ వంటి పరిశ్రమలు ఉన్నాయి. ఆయా పారిశ్రామిక వాడల నుంచి వ్యర్థజలాలను శుద్ధి చేయకుండానే బహిరంగ నాలాలు, కాల్వలు, చెరువులు, కుంటల్లోకి వదులుతుండటంతో జల వనరులన్నీ కాలుష్య కాసారంగా మారాయి. సిటీ పరిధిలో సుమారు 100 చెరువులు ప్రమాదకర స్థాయికి చేరినట్టు అంచనా. ఈ నేపథ్యంలోనే తొలుత ఆయా పారిశ్రామికవాడల్లోని కాలుష్య కారక కంపెనీలను తరలించాలని నిర్ణయించారు. పరిశ్రమ వర్గాల అభ్యంతరాలివే.. ప్రభుత్వం తరలించాలని నిర్ణయించిన సుమారు 1,100 కంపెనీల్లో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలే ఎక్కువగా ఉన్నాయని.. వాటిల్లో సమీప ప్రాంతాలకు చెందిన వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారని పారిశ్రామిక వర్గాలు అంటున్నాయి. వాటిని ఒకేసారి నగరానికి దూరంగా తరలిస్తే.. కార్మికులకు ఉపాధి దూరమవుతుందని, అటు పరిశ్రమలకు పెనుభారంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తరలింపును మధ్యతరహా, భారీ పరిశ్రమలకే వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కాలుష్యం పెరిగిపోతోంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న కాలుష్య కారక పరిశ్రమలు జన జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిశ్రమల వల్ల గాలి, నీళ్లు, భూమి అన్నీ కలుషితం అవుతున్నాయి. పరిశ్రమల నుంచి వెలువడుతున్న కార్బన్, సల్ఫర్ ఉద్గారాలతో కొన్ని ప్రాంతాల్లో ఊపిరాడని పరిస్థితి నెలకొంటోంది. అదే సమయంలో సిటీలోని వందల చెరువులు, కుంటలు విషపూరిత రసాయనాలతో ప్రమాదకరంగా మారాయి. మరోవైపు పలు పరిశ్రమల నుంచి వెలువడుతున్న ఘన, ద్రవరూప వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడేస్తుండడంతో మెర్క్యురీ, లెడ్, ఆర్సెనిక్ వంటి భార లోహాలు, మూలకాలు, విషపూరిత రసాయనాలు నేలలోకి చేరుతున్నాయి. భూగర్భ జలాలు సైతం కాలుష్యకాసారంగా మారుతున్నాయి. కాలుష్యానికి కళ్లెం వేసేదిలా? పరిశ్రమల కలుషితాలను నియంత్రించేందు కు పలు నిబంధనలు ఉన్నాయి. వాటిని తప్పనిసరిగా పాటించాలి. దీనిపై పర్యావరణ నిపుణులు కూడా పలు సూచనలు చేశారు. పారిశ్రామిక వ్యర్థాలను ఆరు బయట, నాలాలు, చెరువులు, కుంటల్లో పారబోస్తే క్రిమినల్ కేసులు పెట్టాలి. సంబంధిత పరిశ్రమలను మూసేసేందుకు ఆదేశాలివ్వాలి. కొత్తగా ఏర్పాటు చేసే పరిశ్రమలు వ్యర్థాలను శుద్ధి చేసేందుకు తప్పనిసరిగా ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలి. వాటిని ఏర్పాటు చేయకుంటే అనుమతులు ఇవ్వొద్దు. పీసీబీ, టీఎస్ఐఐసీ, రెవెన్యూ, పోలీస్ తదితర శాఖలకు చెందిన అధికారులతో కలిసి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి కాలుష్య ఉద్గారాల కట్టడికి చర్యలు తీసుకోవాలి. నాలాలు, చెరువులు, మూసీ పరీవాహక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి.. వాటిని పీసీబీ, జీహెచ్ఎంసీ, పోలీసు కమిషనర్ కార్యాలయాలకు అనుసంధానించి నిఘా పెట్టాలి. హైదరాబాద్ సిటీలో కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలను కట్టడి చేసేందుకు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాం. మార్గదర్శకాల ప్రకారం నడుచుకోని కంపెనీల మూసివేతకు ఆదేశాలిస్తున్నాం. – పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాట ఇదీ.. సిటీ నుంచి కాలుష్య పరిశ్రమలను వికారాబాద్, జహీరాబాద్, ముచ్చర్ల ఫార్మా సిటీ ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. మరో ఏడాదిలోగా ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నాం. – పరిశ్రమలశాఖ వాదన ఇదీ.. పరిశ్రమలను తరలించేందుకు ఆయా ప్రాంతాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నాం. త్వరలోనే తరలింపు పూర్తవుతుంది. – టీఎస్ఐఐసీ అభిప్రాయమిదీ.. -
తెరుచుకుంటున్నది అరకొరే..!
సాక్షి, హైదరాబాద్: కరోనా సంక్షోభంలో లాక్డౌన్ కొనసాగుతున్నా ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్‌లు), పారిశ్రామిక వాడల్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రభుత్వం కొన్ని షరతులతో ఏప్రిల్ 28న అనుమతి ఇచ్చింది. అయితే అనుమతిచ్చి వారం కావస్తు న్నా పరిశ్రమల యాజమాన్యాలు పూర్తిస్థాయిలో ఉత్పత్తిని ప్రారం భించడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన సామాజిక దూరం, పారిశుద్ధ్యం వంటి చర్యలు చేపట్టినా కార్మికులు పూర్తిస్థాయిలో విధులకు హాజరు కావట్లేదు. టీఎస్ఐఐసీ పరిధిలోని పారిశ్రామికవా డల్లో 30 శాతం పరిశ్రమలు కార్యకలాపాలు ప్రారంభించినట్లు తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టిఫ్) చెప్తోం ది. ఇందులో ఎక్కువ గా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉండగా, మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లోని పరిశ్రమలు పూర్తిస్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించలేదు. ముడి సరుకులు, ఫినిషింగ్ గూడ్స్‌ను మార్కెట్‌కు తరలించే పరిస్థితి లేకపోవడంతో ఉత్పత్తి ప్రారంభించేందుకు పారి శ్రామిక వర్గాలు వెనుకంజవేస్తున్నాయి. మరోవైపు వ లస కార్మికులు స్వస్థలాలకు వెళ్లిపోతుండటం పరిశ్రమలు తెరుచుకోకపోవడానికి మరో కారణం. ఐటీ రంగంలో లే ఆఫ్‌లు: లాక్‌డౌన్‌తో ప్రాజెక్టులు, ఆదాయం లేక ఉద్యోగులను తొలగించేం దుకు పలు ఐటీ కంపెనీలు ప్రయత్నిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ మేరకు పలు కంపెనీలు అంతర్గతంగా టెర్మినేషన్ లెటర్లను ఉద్యోగులకు ఇస్తున్నాయి. పలు కంపెనీలు ‘లే ఆఫ్’కు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి ఫిర్యాదులను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్మిక, ఐటీ, పరిశ్రమల శాఖ అధికారులతో పాటు, ఐటీ పరిశ్రమల ప్రతినిధులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు కమిటీ ముందుకు 42 ఫిర్యాదులు వచ్చినట్లు ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటివరకు సగానికి పైగా ఫిర్యాదులపై విచారణ పూర్తయిందని, మిగతా ఫిర్యాదులపైనా కమిటీ విచారణ జరుపుతోందన్నారు. కొన్ని కంపెనీలు లే ఆఫ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేందుకు సుముఖత చూపినట్లు ఐటీ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇటు కొన్ని కంపెనీలు లే ఆఫ్ ప్రకటించకుండా వేతనాల్లో కోత, అన్ పెయిడ్ హాలిడేస్ వంటి పద్ధతులను అనుసరిస్తున్నాయి. నిర్మాణ రంగం పరిస్థితి కొంత మెరుగు.. పారిశ్రామికరంగంతో పోలిస్తే నిర్మాణ రంగం పనులు వేగంగా తిరిగి ప్రారంభమవుతున్నట్లు భవన నిర్మాణదారులు, డెవలపర్లు చెప్తున్నారు. వారం వ్యవధిలో 40 శాతం కార్యకలాపాలు ప్రారంభం కాగా, పనులు ప్ర స్తుతానికి ఒకే షిఫ్టులో జరుగుతున్నాయి. హైదరాబాద్ పరిధిలోని మెగా ప్రాజెక్టుల్లో మూడు షిఫ్టుల్లో పనుల ప్రారంభానికి మరికొంత సమయం పట్టొచ్చు. -
లాక్డౌన్ నుంచి పరిశ్రమలను మినహాయించండి
సాక్షి, హైదరాబాద్: టీఎస్ఐఐసీ పారిశ్రామిక వాడల్లోని ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు లాక్డౌన్ నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టిఫ్) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రయోగాత్మకంగా నడిపేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ టిఫ్ అధ్యక్షులు కె.సుధీర్‌రెడ్డి బుధవారం సీఎంకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలోని 10 వేలకు పైగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) ఐదు వేల రకాల ఉత్పత్తుల ద్వారా సుమారు 15 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయని వినతి పత్రంలో పేర్కొన్నారు. టీఎస్ఐఐసీ పారిశ్రామిక పార్కుల్లో పరిశ్రమలు, వాటి కార్యాలయాలు ఒకే ఆవరణలో ఉండటంతో వేతనాల చెల్లింపు, సరఫరాదారులు, కొనుగోలుదారులతో సమన్వయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఐటీ రంగం తరహాలో ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు లేకపోవడంతో కార్మికులకు జీవనోపాధి కరువైందన్నారు. దేశవ్యాప్త లాక్డౌన్ ఎత్తివేతపై సంప్రదింపులు జరుగుతున్న ప్రస్తుత సమయంలో తమకు కొన్ని వెసులుబాట్లు కల్పించాలని టిఫ్ వినతిపత్రంలో సీఎంను కోరింది. వినతిపత్రంలోని ముఖ్యాంశాలు ► రోజుకు ఒక షిఫ్ట్ చొప్పున పనిచేసేందుకు అవసరమైన సిబ్బందికి అనుమతివ్వాలి. పరిశ్ర మలకు 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న కార్మికులకు అనుమతి ఇవ్వాలి. ఈ మేరకు పోలీసు, జీహెచ్ఎంసీ అధికారులు నిర్దేశిత కాల వ్యవధితో పాస్‌లు జారీ చేయాలి. రవాణా సౌకర్యాలు, ముడిసరుకులు, ఉత్పత్తికి సంబంధించిన వివరాలను కంపెనీలు ఎప్పటికప్పుడు సమర్పిస్తాయి. ► ఫ్యాక్టరీ పరిసరాలను శానిటైజ్ చేయడం, కార్మికుల రోజూ వారీ ఆరోగ్యంపై పర్యవేక్షణ, పనిప్రదేశంలోనూ సామాజిక దూరం పాటించే లా యాజమాన్యాలు జాగ్రత్తలు తీసుకుంటాయని ప్రభుత్వానికి హామీ ఇస్తాయి. -
పట్నం శిగలో మరో నగ!
సాక్షి, ఇబ్రహీంపట్నం : పట్నం శిగలో మరో నగ మెరువనుంది. ఇప్పటికే అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు ఈ ప్రాంతంలో కొలువుదీరడంతో ఇబ్రహీంపట్నం ఖ్యాతి ప్రంపంచ స్థాయిలో మారుమోగుతోంది. రక్షణ రంగ సంస్థలైన అక్టోపస్, బీడీఎల్, ఎన్ఎస్జీ తదితర ప్రభుత్వరంగ సంస్థలతో పాటు ఆదిబట్లలో టాటా ఏరోస్పేస్, టాటా లాకిడ్ మార్టిన్, బోయింగ్ విమానాల తయారీ కంపెనీ, సాఫ్ట్వేర్ దిగ్గజం టీసీఎస్ తదితర సంస్థలు పట్నం నియోజకవర్గం చుట్టూ ఏర్పాటైన విషయం తెలిసిందే. వీటిరాకతో ఈ ప్రాంతంలో రియల్‌వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందం మాదిరిగా సాగుతోంది. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని పడమర ప్రాంతం ఆదిబట్ల, బొంగ్లూర్, కొంగరకలాన్ ప్రాంతంలో ఔటర్ రింగ్‌రోడ్డు రాకతో కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి జరిగింది. తూర్పు భాగంలో రక్షణ రంగ సంస్థలు ఏర్పాటయ్యాయి. కొలువుదీరనున్న హ్యుందాయ్ ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఎల్మినేడు వ్యవసాయాధారిత గ్రామం. ప్రస్తుతం ఈ గ్రామం వైపు బహుళజాతి కంపెనీలు చూస్తున్నాయి. ఈక్రమంలో ఆదిబట్ల తరహాలో అభివృద్ధి జరిగేందుకు అవకాశం ఉంది. ఎల్మినేడు గ్రామంలో హ్యుందాయ్ కార్ల కంపెనీ ఏర్పాటు కోసం ప్రభుత్వం యోచిస్తోంది. టీఎస్ఐఐసీ ద్వారా భూములు సేకరించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. నాలుగు సంవత్సరాలుగా భూములు సేకరణ కోసం అధికారులు సర్వే చేస్తున్నారు. కార్ల తయారీలో దిగ్గజంగా కొనసాగుతున్న హ్యుందాయ్ పరిశ్రమను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనని తెలుస్తోంది. గతంలో ఏరోస్పేస్ ఏర్పాటు కోసం ఇక్కడ భూములు కేటాయించాలనే యోచనలో ఉన్న ప్రభుత్వం.. భవిష్యత్తు అవసరాల కోసం అదే స్థానంలో ఈ కార్ల కంపెనీ ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే ఆదిబట్లలో హెలీకాప్టర్ విభాగాలు, బోయింగ్ విమానాల తయారీ అవుతున్న విషయం తెలిసిందే. అదేవిధంగా ఎల్మినేడులో కార్ల తయారీ కంపెనీ కొలువు దీరనున్న నేపథ్యంలో ఈ ప్రాంతం రూపురేఖలు మారబోతున్నాయి. పరిశ్రమల శాఖ ఈ సంస్థ ఏర్పాటు కోసం కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసింది. సూమారు 2 వేల మందితో పని చేసే ఈ కంపెనీలో సుమారు రూ.10వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు యాజమాన్యం ముందుకొచ్చింది. త్వరలోనే అధికారికంగా ప్రభుత్వం కంపెనీ ఏర్పాటు కోసం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. జోరుగా కొనసాగుతున్న సర్వే ఎల్మినేడు గ్రామంలోని సర్వే నంబరు 512లో 378.09 ఎకరాలు ప్రభుత్వ భూమి, సర్వే నంబరు 166లో 108.09 ఎకరాలు, 421 నంబర్లో 178.33 ఎకరాలు , సర్వే నంబరు 492లో 1.17 ఎకరాల భూములను సేకరిచేందుకు టీఎస్ఐఐసీ అధికారులు నిర్ణయించారు. ప్రభుత్వ, పట్టా భూముల్లో వ్యవసాయం చేసుకొని జీవనం సాగిస్తున్న రైతులకు పరిహారం చెల్లించేందుకు సర్కారు చర్యలు తీసుకోనుంది. గతంలో ఇచ్చిన పరిహారం కంటే లక్ష రూపాయలు ఎక్కువగా ఇప్పించేందుకు కృషి చేస్తున్నట్లు స్థానిక ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటికే రైతులను ఒప్పించడానికి బహిరంగ విచారణ చేపట్టారు. ఈ భూముల సర్వే వేగవంతంగా సాగుతోంది. రెండుమూడు రోజులుగా ఎల్మినేడు గ్రామంలోనే ఉండి అధికారులు సర్వే చేస్తున్నారు. ఇప్పటికే రైతులకు నోటీసులు జారీ చేశారు. వారి భూములను కంపెనీ ఏర్పాటు చేసేందుకు సేకరించనున్నట్లు తెలియజేశారు. దీనికి రైతుల నుంచి కూడా సానుకూల స్పందన వస్తోంది. దసరా తరువాత పరిహారం అందజేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. మారనున్న రూపురేఖలు కార్ల తయారీ కంపెనీ ఏర్పాటు కానున్న నేపథ్యంలో భూముల ధరలు ఆకాశాన్ని తాకే అవకాశం ఉంది. ఇప్పటికే బహుళజాతి కంపెనీలు ఇక్కడ కొలువు దీరడంతో రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎల్మినేడుతో పాటు కప్పపహాడ్, తుర్కగూడ, ఎర్రకుంట, తులేకలాన్, పోచారం, చర్లపటేల్‌గూడ, కర్ణంగూడతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న భూమల ధరలు త్వరలో బంగారం కానున్నాయి. ఇప్పటికే ఒక్కో ఎకరం సుమారు రూ.75 లక్షలకు పైగా పలుకుతున్నాయి. హ్యుందాయ్ కార్ల తయారీ కంపెనీ ఏర్పాటు తర్వాత ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోతాయి. ఇప్పటికే అప్రమత్తమైన రియల్టర్లు ఎల్మినేడు ప్రాంతంలోని భూములు కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నారు. పట్నం మరింత అభివృద్ధి ఇప్పటికే ఇబ్రహీంపట్నంలో ప్రఖ్యాత సంస్థలు కొలువుదీరాయి. వాటి ఏర్పాటుకు చాలా కృషి చేశాను. ఈ ప్రాంతంలో వివిధ కంపెనీలను నెలకొల్పేందుకు ప్రభుత్వం ఆసక్తిగా ఉంది. ఎల్మినేడులో హ్యుందాయ్ కార్ల తయారీ పరిశ్రమ రాబోతుంది. ఈ నేపథ్యంలో అభివృద్ధి పరుగులు పెట్టనుంది. ఆదిబట్ల తరహాలో ఎల్మినేడును తయారు చేయాలన్నదే నా లక్ష్యం. ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి కూడా పెరుగుతుంది. త్వరలోనే కంపెనీ ఏర్పాటుక సేకరించే భూములకు పరిహారం చెల్లింపునకు అ«ధికారులతో మాట్లాడుతాను. – మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం -
దసరాకు ‘ఐటీ టవర్’
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్ యువత కలలు సాకారం కానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ తర్వాత ఆ స్థాయిలో నిర్మాణం చేసిన ఐటీ టవర్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. అక్టోబర్ 8న విజయదశమి(దసరా) రోజు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా ప్రారంభించేందుకు టవర్‌ను సిద్ధం చేస్తున్నారు. ముహూర్తం నాటికి మూడు ఫ్లోర్లు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పనుల్లో వేగం పెంచారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని లోయర్ మానేరు డ్యాం సమీపంలో రూ.30 కోట్ల నిధులతో జీ+5 అంతస్తులతో 65 వేల చదరపు అడుగుల వైశాల్యంలో రూపుదిద్దుకుంటున్న ఐటీ టవర్ కరీంనగర్‌కు ఐకాన్‌గా మారనుంది. ప్రపంచం ఐటీ వైపు పరుగుతీస్తున్న సమయంలో నిర్మాణం పూర్తిచేసుకుంటున్న ఐటీటవర్ కరీంనగర్‌ను ప్రపంచపటంలో నిలపనుంది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండవ స్థానం కరీంనగర్ ఐటీ టవర్‌కు దక్కనుంది. 2018 జనవరి 8న శంకుస్థాపన జరిగిన రోజే 11 కంపెనీలు ఎంవోయూ చేసుకున్నాయి. ఇతర దేశాల్లో స్థిరపడ్డ తెలంగాణకు చెందిన ఐటీ కంపెనీలు ఐటీ టవర్ ప్రారంభం రోజే కంపెనీలను స్థాపించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ కంపెనీల స్థాపన ద్వారా సుమారు 1200 మంది స్థానిక యువతకు ఉద్యోగాలు లభించే సువర్ణావకాశం ఉంది. అతిపెద్ద వనరుగా ఉన్న యువత మెట్రో నగరాలకు వలస వెళ్లే అవసరం లేకుండా ఆ స్థాయి ఐటీ ఉద్యోగాన్ని స్థానికంగానే ఉంటూ చేసుకునేందుకు చక్కటి అవకాశం దక్కనుంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ మన ప్రాంతంలో ప్రారంభమవడమే కాకుండా ఉద్యోగార్థులకు తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్(టాస్క్) ద్వారా ప్రపంచస్థాయి శిక్షణతో నైపుణ్యం పెంపొందించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఐటీతో మన యువత ప్రపంచంతో పోటీ పడేందుకు కరీంనగర్ కేరాఫ్‌గా మారనుంది. అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది... ఐటీ కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాకూడదనే ఉద్దేశంతో... జిల్లా కేంద్రాల్లో కూడా ఐటీని నెలకొల్పాలనే ప్రభుత్వ సంకల్పం అభివృద్ధి వికేంద్రీకరణకు దోహదపడుతుందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం ఎల్ఎండీ సమీపంలో నిర్మాణం జరుగుతున్న ఐటీ టవర్ పనులను టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహరెడ్డితో కలిసి పరిశీలించారు. దసరాకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు టవర్‌ను సిద్ధం చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద ఐటీ.. – టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహరెడ్డిరాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత అతిపెద్ద ఐటీ టవర్‌ను కరీంనగర్లో స్థాపించడం జరుగుతుందని తెలంగాణ ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ) మేనేజింగ్ డైరెక్టర్ నర్సింహరెడ్డి అన్నారు. కంపెనీలను స్థాపించే వారికి పవర్‌టారిఫ్, బ్రాండ్‌బాండ్ నెట్‌వర్క్‌లో రాయితీలను, అదనపు ప్రోత్సాహకాలను కూడా ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుగ్గిళ్లపు రమేశ్, కట్ల సతీష్, బోనాల శ్రీకాంత్, ఆర్కిటెక్చర్ చేతనాజైన్, కాంట్రాక్టర్ సిద్దారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జోరందుకోనున్న డ్రైపోర్టులు
సాక్షి, హైదరాబాద్: చుట్టూ భూభాగమే ఉన్నప్పటికీ తెలంగాణ నుంచి ఎగుమతులను ప్రోత్సహించేందుకు డ్రైపోర్టులు ఏర్పాటుచేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ డ్రైపోర్టుల ఏర్పాటు ప్రతిపాదన తెరమీదకు వచ్చి నాలుగేళ్లు కావస్తున్నా భూసేకరణ కొలిక్కి రావడం లేదు. నాలుగు చోట్ల డ్రై పోర్టులు ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించగా, సార్వత్రిక ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సౌకర్యాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఐఐసీ) యోచిస్తోంది. హైదరాబాద్– విజయవాడ మార్గంలో నల్లగొండ జిల్లా చిట్యాల వద్ద డ్రైపోర్టు ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఎగుమతులను ప్రోత్సహించాలని నిర్ణయించింది. పారిశ్రామిక, ఇతర ఎగుమతులను ఏటా లక్ష కోట్ల రూపాయల నుంచి 1.50 లక్షల కోట్లకు పెంచేలా ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే రాష్ట్రానికి సముద్ర తీర ప్రాంతం లేకపోవడంతో పోర్టు స్థానంలో డ్రైపోర్టులను ఏర్పాటుచేసుకోవడంపై దృష్టిపెట్టింది. రాష్ట్రంలో డ్రైపోర్టుల ఏర్పాటులో సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసే బాధ్యతను లండన్ కేంద్రంగా ఉన్న ‘ఎర్నెస్ట్ యంగ్’అనే అంతర్జాతీయ కన్సల్టెన్సీకి గతంలో అప్పగించింది. రాష్ట్రం నుంచి వివిధ రంగాలకు సంబంధించి ఎగుమతి అవకాశాలు, రోడ్లు, రైలు మార్గాల్లో ట్రాఫిక్ తదితరాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలో నాలుగు డ్రైపోర్టుల ఏర్పాటుకు అవకాశం ఉందని కన్సల్టెన్సీ నివేదిక ఇచ్చింది. 65వ నంబరు జాతీయ రహదారిపై జహీరాబాద్ వద్ద, 163వ నంబరు జాతీయ రహదారిపై భువనగిరి వద్ద, హైదరాబాద్–బెంగళూరు మార్గంలో 44వ నంబరు జాతీయ రహదారిపై జడ్చర్ల వద్ద, మిర్యాలగూడ–వాడపల్లి మార్గంలో దామరచర్ల వద్ద డ్రైపోర్టుల ఏర్పాటుకు అనువైన పరిస్థితులు ఉన్నట్లు అంచనాకు వచ్చారు. డ్రైపోర్టు ఏర్పాటుకు కనీసం 400 ఎకరాల భూమి అవసరమవుతుందనే అంచనాతో భూసేకరణపై టీఎస్ఐఐసీ దృష్టి సారించింది. తొలి డ్రైపోర్టుకు ‘చిట్యాల’ఎంపిక రాష్ట్రంలో నాలుగు డ్రైపోర్టుల ఏర్పాటుకు అవకాశముందని ఆ కన్సల్టెన్సీ సంస్థ సూచించినా, ప్రస్తుతానికి ఏదో ఒక చోట మాత్రమే డ్రైపోర్టును అభివృద్ది చేయాలని నిర్ణయించారు. 2035 నాటికి పెరిగే రోడ్డు, రైలు ట్రాఫిక్ రద్దీని పరిగణనలోకి తీసుకుంటే.. ప్రస్తుతానికి ఒక డ్రైపోర్టు మాత్రమే రాష్ట్ర అవసరాలకు సరిపోతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో తొలిదశలో హైదరాబాద్–విజయవాడ మార్గంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. ఈ మార్గం మీదుగానే మచిలీపట్నం, విశాఖపట్నం ఇతర సముద్ర ఓడ రేవులకు సరుకులు రవాణా అవుతున్న నేపథ్యంలో తొలి డ్రైపోర్టును విజయవాడ మార్గంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. డ్రైపోర్టుకు రోడ్డు, రైలు మార్గాల అనుసంధానం కీలకం కావడంతో హైదరాబాద్–విజయవాడ మార్గంలో నల్లగొడ జిల్లా చిట్యాల అత్యంత అనువైన ప్రదేశమని టీఎస్ఐఐసీ అంచనాకు వచ్చింది. దీంతో భూసేకరణపై దృష్టి సారించి, ప్రైవేటు బ్యాంకు ఐసీఐసీఐతో టీఎస్ఐఐసీ మంతనాలు జరుపుతోంది. గతంలో ఓ ప్రైవేటు సంస్థ తనఖాకు సంబంధించిన 11వందల ఎకరాలు ప్రస్తుతం ఐసీఐసీఐ అదీనంలో ఉన్నాయి. ఇందులో డ్రైపోర్టు ఏర్పాటుకు 400 ఎకరాలు కేటాయించాల్సిందిగా టీఎస్ఐఐసీ మంతనాలు జరుపుతోంది. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత భూసేకరణ ప్రక్రియ వేగవంతం కానుంది. సేకరణ తర్వాతే ప్రతిపాదనలు చిట్యాలలో ప్రతిపాదిత డ్రైపోర్టును పబ్లిక్, ప్రైవేటు భాగస్వా మ్యం (పీపీపీ) విధానంలో అభివృద్ధి చేసేందుకు అదానీ గ్రూప్ ఆసక్తి చూపుతోంది. అయితే భూసేకరణ ప్రక్రియ కొలిక్కి వచ్చిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం ప్రతిపాదనలు పంపాలని టీఎస్ఐఐసీ యోచిస్తోంది. దేశంలో పారిశ్రామిక, ఇతర ఎగుమతులు ప్రోత్సహించేందుకు కనీసం 300 డ్రైపోర్టులు అవసరమని అంచనా కాగా, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 21 డ్రైపోర్టులు అభివృద్ధి దశలో ఉన్నాయి. ఇందులో ఇన్లాండ్ కంటెయినర్ డిపోలు (ఐసీడీ), కంటెయినర్ ఫ్రైట్ స్టేషన్లు (సీఎఫ్ఎస్), ఎయిర్ ఫ్రయిట్ స్టేషన్లు (ఏఎఫ్సీ) ఉన్నాయి. ఈ 21 డ్రైపోర్టులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫ్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తున్నాయి. ఈ 21 డ్రైపోర్టులలో రాష్ట్రానికి చెందిన ఒక్క ప్రాజెక్టూ లేకపోవడం గమనార్హం. ఇతర డ్రైపోర్టులపైనా దృష్టి తొలిదశలో చిట్యాల డ్రైపోర్టును అభివృద్ది చేస్తూనే మరో మూడు డ్రైపోర్టుల ఏర్పాటుకు అనువైన చోట భూ సేకరణ జరపాలని టీఎస్ఐఐసీ భావిస్తోంది. హైదరాబాద్–ముంబై మార్గంలో జహీరాబాద్ వద్ద నిమ్జ్ కోసం ప్రతిపాదించిన 450 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించే యోచనలో ప్రభుత్వం ఉంది. హైదరాబాద్–బెంగుళూరు మార్గంలో జడ్చర్ల వద్ద అనువైన స్థలంపై అన్వేషణ కొనసాగుతోంది. హైదరాబాద్–వరంగల్ మార్గంలోనూ భువనగిరి ప్రాంతంలో మరో డ్రైపోర్టు ఏర్పాటుకు భూ సేకరణ జరపాలని టీఎస్ఐఐసీ భావిస్తోంది. అయితే రాష్ట్రం నుంచి జరిగే ఎగుమతులను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతానికి చిట్యాల డ్రైపోర్టు అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయాలని టీఎస్ఐఐసీ కసరత్తు చేస్తోంది. -
‘రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తోంది’
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన రాష్ట్రమై నా అన్ని రంగాల్లో తెలంగాణ పురోగమిస్తోందని రాష్ట్ర పరిశ్రమల, మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టీఎస్ఐఐసీ) చైర్మన్ గ్యాదరి బాల మల్లు అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బుధవారం పరిశ్రమల భవన్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పారిశ్రామిక రంగంలో రాష్ట్రం దేశంలోనే ముందుందన్నారు. భవిష్యత్‌లో పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పనలో మరిన్ని మైలు రాళ్లను చేరుకోవడానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో టీఎస్ఐఐసీ సీఈవో వి.మధుసూదన్‌రావు, సీఈ శ్యామ్ సుందర్, సీజీఎం గీతాంజలి, జీఎం కళావతి తదితరులు పాల్గొన్నారు. -
మహిళా పారిశ్రామికవేత్తలకు స్థలాల్లో 10% కోటా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 140కు పైగా పెద్ద పారిశ్రామికవాడలున్నాయని, అందులో 10 శాతం స్థలాలను మహిళా పారిశ్రామికవేత్తలకు కేటాయిస్తామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. సుల్తాన్ పూర్లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఫిక్కి లేడీస్ ఆర్గనైజేషన్ పారిశ్రామికవాడలో 18 మంది మహిళా పారిశ్రామికవేత్తలకు శుక్రవారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో స్థల కేటాయింపుల పత్రాలను మంత్రి అందజేశారు. ఈ పారిశ్రామిక వాడను తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ) నిర్మించింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ప్రభుత్వం నుంచి ప్రత్యేక రాయితీ, సదుపాయాల అవసరం లేకుండానే సమర్థవంతంగా పనిచేయగలమనే సందేశాన్ని మహిళా పారిశ్రామికవేత్తలు సమాజానికి పంపాలని సూచించారు. వీరి కోసం 200 ఎకరాల్లో మూడు పారిశ్రామికవాడలు ఏర్పాటు చేశామన్నారు. సుల్తాన్‌పూర్‌లో 50 ఎకరాలు, 30 ఎకరాల్లో కొవే, 120 ఎకరాల్లో ఎలీప్ పారిశ్రామికవాడలను నెలకొల్పగా, అన్ని చోట్లా స్థలాలు పూర్తిగా అమ్ముడుపోవడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. అవసరమైతే మహిళా పారిశ్రామికవేత్తల కోసం మరో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి మరో రెండు ప్రాంతాల్లో స్థలాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఫిక్కి మహిళా పారిశ్రామికవేత్తల పార్కులో ప్రభుత్వ ఖర్చులతోనే రోడ్లు, విద్యుత్, నీటి సరఫరా లాంటి మౌలిక సదుపాయాలు కల్పించామని, సాధారణంగా ఈ వ్యయాన్ని పారిశ్రామికవేత్తల నుంచి టీఎస్ఐఐసీ వసూలు చేస్తుందన్నారు. 1,500 మందికి ఉద్యోగాలు.. సుల్తాన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన పారిశ్రామికవాడలో 1,500 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని, పురుషులకు సైతం ఉద్యోగాలివ్వాలని మంత్రి కేటీఆర్ కోరారు. హైదరాబాద్‌ను రెండో ఇంటిగా ఏర్పాటు చేసుకుని, ఇక్కడ మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఫిక్కి ఇండియా అధ్యక్షుడు రాశేష్ షాను కోరారు. ఫిక్కి లేడిస్ ఆర్గనేషన్ ఇండియా అధ్యక్షురాలు పింకీరెడ్డిపై ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంశలు కురిపించారు. ఆమె శక్తి సామర్థ్యాలు, ఉత్సాహాన్ని చూస్తుంటే భారత దేశానికి సైతం అధ్యక్షురాలు కాగలదు అని చమత్కరించారు. ఫిక్కి ఇండియా అధ్యక్షుడు రశేష్ షా మాట్లాడుతూ, బ్యాంకు కుంభకోణాలు, ఎన్పీఏలకు సంబంధించిన ఉదంతాలు బయటపడిన ప్రతిసారి ప్రభుత్వం, పారిశ్రామికవేత్తల మధ్య సంబంధాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితిలో పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, ఎండీ నర్సింహారెడ్డి, ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ ఇండియా అధ్యక్షురాలు పింకీరెడ్డి, జ్యోత్స అంగార, యూఎస్ కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డా, బిట్రిష్ హైకమిషనర్ ఆండ్రు ఫ్లెమింగ్ తదితరులు పాల్గొన్నారు. -
ఫార్మాసిటీలో మూడు ప్లాంట్లు
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఔషధ నగరి పారిశ్రామికవాడలో ఔషధాలతో పాటు భారీ ఎత్తున విద్యుదుత్పత్తి జరగనుంది. రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాల పరిధిలోని 19,333.20 ఎకరాల భారీ విస్తీర్ణంలో నిర్మించనున్న హైదరాబాద్ ఫార్మాసిటీలో సౌర, సహజవాయువులు, ఘన వ్యర్థాల విద్యుదుత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్ఐఐసీ) నిర్ణయం తీసుకుంది. ఈ పారిశ్రామికవాడ అవసరాలకు 985 మెగావాట్ల విద్యుత్ కావాల్సి ఉండ గా, ఈ మూడు రకాల విద్యుత్ ప్లాంట్ల ద్వారా 688 మెగావాట్ల విద్యుత్‌ను అక్కడికక్కడే ఉత్పత్తి చేసి విని యోగించుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. 435 మెగావాట్ల రూఫ్‌టాప్ సోలార్, 250 మెగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం, మరో 3 మెగావాట్ల వేస్ట్ ఎనర్జీ(వ్యర్థాల నుంచి విద్యుదుత్పత్తి) ప్లాంట్లను ఫార్మాసిటీలో నెలకొల్పుతామని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు సమర్పించిన ప్రాజెక్టు నివేదికలో టీఎస్ఐఐసీ ప్రతిపాదించింది. ఫార్మాసిటీ తుది విడత నిర్మాణం పూర్తయ్యే నాటికి ఈ విద్యుదుత్పత్తి ప్లాంట్ల ఏర్పాటును పూర్తి చేస్తామని తెలిపింది. గ్యాస్ ఆధారిత విద్యుదు త్పత్తి ప్లాంట్‌కు అవసరమైన సహజవాయువులను సర ఫరా చేసేందుకు గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరే షన్ అంగీకరించింది. ఫార్మాసిటీలోని పరిశ్రమలు, నివాస సముదాయాల నుంచి ఉత్పత్తయ్యే ఘన వ్యర్థాలతో విద్యుదుత్పత్తి జరపనున్నారు. అతిపెద్ద రూఫ్ టాప్ ! ఫార్మాసిటీలో ఏర్పాటు కానున్న 435 మెగావాట్ల రూఫ్‌టాప్ సోలార్ పవర్ ప్లాంట్ దేశంలోనే అతిపెద్దదిగా అవతరించనుంది. దేశంలో మరెక్కడా కనీసం 10 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రూఫ్‌టాప్ సోలార్ పవర్ ప్లాంట్ కూడా లేదు. ఫార్మాసిటీలో వేల ఎకరాల విస్తీర్ణంలో పరిశ్రమలు, వాణిజ్య భవనాలు, విశ్వవిద్యాలయం, నివాస సముదాయాలకు సంబంధించిన భవనాలను నిర్మించనుండటంతో భారీ విస్తీర్ణంలో భవనాలపైన ఖాళీ ప్రాంతం అందుబాటులోకి రానుంది. ఫార్మాసిటీ ప్రణాళిక ప్రకారం... 19,333 ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు కానుండగా, 9,535 ఎకరాల్లో పరిశ్రమలు, 1,507 ఎకరాల్లో రెసిడెన్షియల్ టౌన్షిప్, 322 ఎకరాల్లో ఫార్మా వర్సిటీ, 544 ఎకరాల్లో కార్యాలయాలు, 827 ఎకరాల్లో పరిశోధన కేంద్రం, 203 ఎకరాల్లో లాజిస్టిక్ హబ్, 104 ఎకరాల్లో ఆస్పత్రి, 141 ఎకరాల్లో హోటల్‌ను నిర్మించనున్నారు. వీటన్నింటికి సంబంధించిన భవనాలపై భాగంలో సౌర విద్యుత్ పలకలను ఏర్పాటు చేయడం ద్వారా 435 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. -
మహబూబాబాద్‌లో టెక్స్టైల్ క్లస్టర్ ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం నుంచి వలస వెళ్లిన సూరత్ వస్త్ర (పవర్లూమ్) పరిశ్రమల యజమానులు శనివారం తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ) ప్రధాన కార్యాలయంలో చైర్మన్ బాలమల్లును కలిశారు. వస్త్ర పరిశ్రమ క్లస్టర్ ఏర్పాటుకు మహబూబాబాద్‌లో 200 ఎకరాల స్థలం కేటాయించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. తాము ఇక్కడ వీరభద్ర స్వామి టెక్స్టైల్ మాన్యుఫ్యాక్చ రర్స్ అండ్ వీవర్స్ వేల్ఫేర్ సొసైటీని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఎంసీపీసీడీఎస్ కింద టెక్స్టైల్ క్లస్టర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు, స్పెషల్ ప్యాకేజీ మంజూరయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రాజెక్టు రిపోర్టును బాలమల్లుకు అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన క్లస్టర్ ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
ఊరవతలికి కాలుష్యం!
గ్రేటర్లో పర్యావరణ హననానికి కారణమవుతోన్న కాలుష్య కారక పరిశ్రమలను దశలవారీగా నగరానికి దూరంగా తరలించేందుకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ)సన్నాహాలు చేస్తోంది. ఇందులో తొలివిడతగా కాటేదాన్ పారిశ్రామిక వాడలోని సుమారు వెయ్యి కంపెనీలను వికారాబాద్, జహీరాబాద్ ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆయా ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను సైతం గుర్తించినట్లు టీఎస్ఐఐసీ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత మరికొన్ని పరిశ్రమలను సైతం ముచ్చెర్ల ఫార్మా సిటీకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: తొలిదశలో కాటేదాన్ పారిశ్రామిక వాడలోని సుమారు వెయ్యి కంపెనీలను వికారాబాద్, జహీరాబాద్ ప్రాంతాలకు తరలించేందుకు టీఎస్ఐఐసీ ఏర్పాట్లు చేస్తోంది. అనంతరం జీడిమెట్ల, కుత్భుల్లాపూర్, మల్లాపూర్, బాలానగర్ తదితర ప్రాంతాల్లోని మరో వెయ్యి బల్క్‌డ్రగ్, ఫార్మా పరిశ్రమలను ముచ్చెర్లలో ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీకి దశలవారీగా తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు టీఎస్ఐఐసీ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. అయితే పరిశ్రమల తరలింపును కాటేదాన్ పారిశ్రామిక వాడకు సంబంధించిన పరిశ్రమల వర్గాలు వ్యతిరేకిస్తుండడం గమనార్హం. ప్రస్తుతం కాటేదాన్‌లో సూక్ష్మ,చిన్న తరహా పరిశ్రమలే అధికంగా ఉన్నాయని, కాలుష్య కారక పరిశ్రమలను ఇప్పటికే కాలుష్య నియంత్రణ మండలి మూసివేయించిందని వారు స్పష్టం చేస్తున్నారు. విడతల వారీగా పరిశ్రమల తరలింపు... గ్రేటర్ పరిధిలో కాటేదాన్, జీడిమెట్ల, మల్లాపూర్, బాలానగర్, ఉప్పల్, పాశమైలారం తదితర పారిశ్రామిక వాడలున్నాయి. వీటిలో ప్రధానంగా ఆయిల్, ప్లాస్టిక్, రబ్బర్, ప్లాస్టిక్ విడిభాగాలు, స్టీలు విడిభాగాలు తదితర కాలుష్య కారక పరిశ్రమలకు కాటేదాన్ నిలయంగా ఉంది. ఈ పారిశ్రామిక వాడ కారణంగా స్థానికంగా ఉన్న నూర్‌మహ్మద్ కుంట కాలుష్యకాసారమైన విషయం విదితమే. అంతేకాదు ఈ వాడ జి.ఓ.111 పరిధిలోనే ఉండడంతో జంటజలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్సాగర్లకు సైతం శాపంగానే పరిణమిస్తోంది. ఈనేపథ్యంలో తొలివిడతగా ఈ పారిశ్రామిక వాడలోని కాలుష్య కారక కంపెనీలను వికారాబాద్, జహీరాబాద్ ప్రాంతాలకు తరలించనున్నట్లు టీఎస్ఐఐసీ వర్గాలు తెలిపాయి. కాగా తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం తరవాత నగరానికి ఆనుకొని ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్‌రింగ్‌రోడ్డుకు ఆవల 30 కి.మీ దూరం తరలించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. అయితే వీటిలో ఫార్మా, ఇంటర్మీడియెట్, బల్క్‌డ్రగ్ పరిశ్రమలను ముచ్చెర్లలో ఏర్పాటుచేయనున్న ఫార్మాసిటీకి దశలవారీగా తరలించాలని నిర్ణయించారు. పరిశ్రమ వర్గాల అభ్యంతరాలివే.. కాటేదాన్‌లో ప్రస్తుతం సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలే అధికసంఖ్యలో ఉన్నాయని..వీటిలో సమీప గ్రామాలకు చెందిన వేలాది మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారని కాటేదాన్ పారిశ్రామికవాడ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వీటిని ఒకేసారి నగరానికి సుదూరంగా తరలిస్తే కార్మికులకు ఉపాధి దూరమౌతుందని..మరోవైపు పరిశ్రమల తరలింపు చిన్న పరిశ్రమలకు పెనుభారంగా మారుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రధానంగా ఈ తరలింపును మధ్యతరహా, భారీ పరిశ్రమలకే వర్తింపజేయాలని డిమాండ్ చేస్తుండడం గమనార్హం. -
జహీరాబాద్ నిమ్జ్‌కు ‘పచ్చ’ జెండా!
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక జహీరాబాద్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ జోన్ (నిమ్జ్) ప్రాజెక్టు నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. ఈ మెగా పారిశ్రామికవాడ నిర్మాణంలో అనుసరించాల్సిన నియమ నిబంధనల (టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్)కు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ఎక్స్పర్ట్స్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) ఆమోదం తెలిపింది. తొలి దశ పర్యావరణ అనుమతులుగా భావించే ‘టీఓఆర్’కు ఆమోదం లభించడంతో.. తుది అనుమతులు కోరేందుకు మార్గం సుగమమమైంది. నిమ్జ్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం బహిరంగ విచారణ జరిపి తుది దశ అనుమతుల కోసం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసుకోనుంది. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ) ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా న్యాల్కల్, ఝరాసంఘం మండలాల్లో 12,635 ఎకరాల భారీ విస్తీర్ణంలో నిమ్జ్‌ను ప్రభుత్వం నిర్మిస్తోంది. ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2.44 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. రూ.37,740 కోట్ల పెట్టుబడులతో వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలు ఈ పారిశ్రామికవాడలో ఏర్పాటవనున్నాయి. 2040 సంవత్సరం నాటికి రూ.96,778 కోట్లు విలువ చేసే ఉత్పత్తులు జరగనున్నాయి. 2030 నాటికి పూర్తి.. నిమ్జ్ నిర్మాణానికి రూ.4,500 కోట్ల అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. సైట్ అభివృద్ధి, అంతర్గత రోడ్లు, నీరు, విద్యుత్ సరఫరా, వరద, మురుగు నీటి కాల్వలు, భవనాలు, వీధి దీపాలు, పచ్చదనం అభివృద్ధికి ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. ప్రాజెక్టుకు వెలుపల మౌలిక సదుపాయాల కోసం మరో రూ.6,100 కోట్ల వ్యయం కానుంది. 2020 నాటికి ప్రాజెక్టు తొలి దశ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని, 2030 నాటికి మొత్తం పూర్తవుతుందని ప్రభుత్వం పేర్కొంటోంది. నిమ్జ్ పరిధిలో 17 గ్రామాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. 12,635 ఎకరాలకు గాను 2,884 ఎకరాలు టీఎస్ఐఐసీ ఇప్పటికే సేకరించింది. హైదరాబాద్ నుంచి 65 కి.మీ. పరిశ్రమల స్థాపన, పెట్టుబడులు ఆకర్షించేందుకు నిమ్జ్ ప్రతిపాదిత ప్రాంతం అనుకూలమని ప్రభుత్వం చెబుతోంది. ప్రాజెక్టు సమీపంలో ఇప్పటికే మహీంద్ర, ఎంఆర్ఎఫ్ టైర్స్, అరబిందో ఫార్మా, స్పార్శ్ ఫార్మా, కావేరీ ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్, బీహెచ్ఈఎల్, ఆర్డాన్స్ ఫ్యాక్టరీ మెదక్, భారత్ డైనమిక్స్(బీడీఎల్), ట్రైడెంట్ షుగర్స్ లాంటి మెగా పరిశ్రమలున్నాయంది. హైదరాబాద్ నుంచి 65 కి.మీ., ఓఆర్ఆర్ నుంచి 50 కి.మీ, దూరంలోని ఈ ప్రాజెక్టుకు రహదారులు, విమానాశ్రయం, రైల్వే స్టేషన్, సీ పోర్టు (కృష్ణపట్నం, జవహర్లాల్ పోర్ట్ ట్రస్ట్) సదుపాయాలతో పాటు నీరు, విద్యుత్ సదుపాయాలున్నాయని పేర్కొంది. కాగా, నిమ్జ్‌లో ప్రధానంగా ఎలక్ట్రిక్ పరికరాలు, ఫుడ్ అండ్ ఆగ్రో ప్రాసెసింగ్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ట్రాన్స్పోర్ట్ ఎక్విప్మెంట్ రంగాల పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. జోన్ల వారీగా ప్రాజెక్టు అభివృద్ధి ఇలా.. జోన్ స్థలం (ఎకరాల్లో) ఉత్పత్తి పరిశ్రమలు 7,107 సాంకేతిక సదుపాయాలు 550 మౌలిక వసతులు 883 గృహ నిర్మాణం 638 లాజిస్టిక్స్ 899 పచ్చదనం 1,603 రహదారులు 955 మొత్తం 12,635 నోట్: కామన్ ఫోల్డర్లో నీమ్జ్ జహీరాబాద్ పేరుతో ప్రాజెక్టు సైట్ మ్యాప్ ఫోటోలు ఉన్నాయి. పరిశీలించగలరు. 12,635 - ఎకరాల్లో మెగా పారిశ్రామిక వాడ నిర్మాణం 4,500 - కోట్లు అంచనా వ్యయం 6,100- కోట్లు ప్రాజెక్టు వెలుపల మౌలిక వసతులకు.. 2,40,000- మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి -
పారిశ్రామికాభివృద్ధికి కృషి: బాలమల్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం పారిశ్రామికాభివృద్ధి సాధించడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు అన్నారు. టీఎస్ఐఐసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి గురువారానికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా బుధవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికాభివృద్ధి సాధించడానికి కృషి చేస్తానని చెప్పారు. ‘‘టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక.. గత విధానానికి భిన్నంగా జిల్లా స్థాయికి టీఎస్ఐఐసీ కార్యకలాపాలను విస్తరించేలా కార్యాచరణ రూపొందించాం" అని అన్నారు. అంతేకుండా " హైదరాబాద్ చుట్టుపక్కలే కాకుండా, తెలంగాణ అంతటా పరిశ్రమలను నెలకొల్పాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం. ఈమేరకు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశనంలో అనేక కొత్త పారిశ్రామిక ప్రాజెక్టులను తీసుకొస్తున్నాం. ఏడాది కాలంలోనే కీలకమైన ఫార్మాసిటీ, కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కు, జహీరాబాద్ నిమ్జ్, మెడికల్ డివైజెస్ పార్కు, బుగ్గపాడు మెగా ఫుడ్ పార్కు, ఏరోస్పేస్ పార్కు, ఐటీ మ్యానుఫ్యాక్చరింగ్ పార్కు, సైన్స్ పార్కు, టీ–హబ్ వంటి ప్రాజెక్టులకు కార్యరూపం దాల్చడం సంతోషంగా ఉంది’’ అని బాలమల్లు పేర్కొన్నారు. -
ఎన్.శంకర్ స్టుడియోకు ప్రభుత్వ స్థలం
హైదరాబాద్: తెలంగాణ రాజధాని నగరంలో మరో సినీ స్డూడియో అందుబాటులోకి రానుంది. తెలంగాణ ఉద్యమంలో తనదైన శైలిలో పోరాటం సాగించిన ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ స్టూడియో నిర్మాణ రంగంలో అడుగుపెడుతున్నారు. ఉద్యమ సమయంలో ఆయన రూపొందించిన ‘జై బోలో తెలంగాణ’ సినిమా ప్రభావం ఏమిటన్నది అందరికీ తెలిసిందే. శంకర్ అంటే ప్రత్యేకాభిమానం కనబరిచే ముఖ్యమంత్రి కేసీఆర్ స్టూడియోకు అవసరమైన స్థలాలను ప్రతిపాదించాల్సిందిగా టీఎస్ఐఐసీ, రంగారెడ్డి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ క్రమంలో శేరిలింగంపల్లి మండలం నానక్‌రామ్‌గూడ సర్వే నం.149లో ఎనిమిది ఎకరాలను శంకర్‌కు కేటాయించేందుకు టీఎస్ఐఐసీ సూత్రప్రాయంగా అంగీకరించింది. అదే సమయంలో ఖానామెట్‌లోని సర్వే నం.41/14లో పది నుంచి పదెకరాలను ప్రతిపాదిస్తూ జిల్లా యంత్రాంగం లేఖ రాసింది. ఈ రెండు స్థలాల్లో ఏదో ఒకదానిని ఖరారుచేస్తూ అతి త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. టూ స్టేట్స్ రీమేక్: హిందీలో సూపర్ హిట్ అయిన ‘టూ స్టేట్స్’ సినిమాను ఎన్.శంకర్ తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటున్న తెలుగు టూ స్టేట్స్లో సునీల్ హీరో. -
టీఎస్ఐఐసీకి బీవోఐ రుణ సదుపాయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీఎస్ఐఐసీ చేపడుతున్న ప్రాజెక్టులకు, పారిశ్రామిక వాడల అభివృద్ధికి రుణ సదుపాయం కల్పించడానికి బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) ముందుకొచ్చింది. టీఎస్ఐఐసీ ద్వారా పరిశ్రమలను స్థాపిస్తున్న కంపెనీలకు, పారిశ్రామికవేత్తలకు కూడా రుణాలివ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ఎండీ ఈవీ నర్సింహారెడ్డితో బుధవారం పరిశ్రమ భవన్లో బీవోఐ (నేషనల్ బ్యాకింగ్ గ్రూప్, సౌత్) వినియోగదారుల సంబంధాల కార్య నిర్వహణాధికారి వినయ్దీప్ మట్టా, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ జేఎస్వీ సూర్యనారాయణరాజు భేటీ అయ్యారు. టీఎస్ఐఐసీ ప్రాజెక్టులకు, కొత్త ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధికి రుణ సదుపాయం కల్పించనున్నట్టు వారు తెలిపారు. భూముల కొనుగోళ్లకు మినహా ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు రుణ సదుపాయం అందిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో పరిశ్రమలను ఏర్పాటుకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, నిరుద్యోగులకు విరివిగా రుణాలను అందించాలని బీవోఐ అధికారులకు బాలమల్లు సూచించారు. -
రాయదుర్గంలో ఎకరా రూ. 42.59 కోట్లు
♦ భూముల వేలానికి కొత్త రికార్డు ధర ♦ టీఎస్ఐఐసీకి రూ. 185 కోట్ల ఆదాయం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల విక్రయానికి తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) నిర్వహించిన వేలంలో రికార్డు స్థాయి ధరలు నమోదయ్యాయి. గత ఏడాది నిర్వహించిన వేలానికి మించి భూముల ధర పెరిగిపో యింది. మొత్తం ఐదు లాట్లలో 15 ఎకరాల భూముల విక్రయానికి టీఎస్ఐఐసీ ఈ నెల 10న ఆన్లైన్లో టెండర్లు నిర్వహించింది. శుక్రవారం ఈ టెండర్లు తెరిచారు. బిడ్డర్లు ఎక్కువ ధర వెచ్చించి భూములను కొనుగోలు చేసేందుకు పోటీ పడటంతో గరిష్ట రేట్లు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలోని రాయదుర్గం ప్రాంతంలో 2.84 ఎకరాల లాట్‌కు గరిష్టంగా గజానికి రూ. 88 వేల చొప్పున ధర చెల్లించేందుకు ఒక బిడ్డర్ టెండర్ దాఖలు చేశారు. దీంతో ఇక్కడి భూమి ఎకరానికి రూ. 42.59 కోట్ల ధర పలికినట్లయిది. గతంలో ఏడాదిన్నర కిందట ఇదే ప్రాంతంలో టీఎస్ఐఐసీ వేలం వేసిన భూములకు గరిష్టంగా ఎకరానికి రూ. 29 కోట్ల ధర వచ్చింది. ఇప్పుడు అంతకు మించి ధర పలకడం విశేషం. మరో లాట్లో ఎకరా రూ. 29.33 కోట్లు రాయదుర్గం ప్రాంతంలోనే 2.15 ఎకరాల మరో లాట్‌కు నిర్వహించిన టెండర్లలో గజానికి రూ. 60,600 చొప్పున కొనుగోలు చేసేందుకు మరో బిడ్డర్ ముందుకొచ్చారు. దీనికి ఎకరానికి రూ. 29.33 కోట్లు ధర పలికినట్లు స్పష్టమవుతోంది. ఇంకా టెండర్లు ఖరారు చేయకపోవటంతో బిడ్లు దాఖలు చేసిన సంస్థలు, వ్యక్తుల పేర్లను టీఎస్ఐఐసీ యాజమాన్యం వెల్లడించ లేదు. ఈ రెండు లాట్లకు మొత్తం ఎనిమిది బిడ్లు దాఖలు కాగా, మిగతా మూడు లాట్లకు ఒక్క టెండర్ కూడా దాఖలు కాలేదు. గరిష్ట ధర చొప్పున లెక్కగడితే ఈ విడత భూముల విక్రయంతో టీఎస్ఐఐసీకి రూ. 185 కోట్ల ఆదాయం సమకూరుతుందని టీఎస్ఐఐసీ వర్గాలు అంచనా వేశాయి. ప్రధానంగా హైదరాబాద్ సుస్థిర నగరాభివృద్ధి, శాంతిభద్రతలు, ఐటీ రంగ వృద్ధి కారణంగానే భూముల విక్రయానికీ విశేష స్పందన లభించిందని టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి అభిప్రాయపడ్డారు. -
టీఎస్ఐఐసీలో మరో మూడు జోన్లు
• కొత్తగా నిజామాబాద్, యాదాద్రి, ఖమ్మం ఏర్పాటు • 9కి పెరిగిన సంఖ్య.. సబ్ జోన్‌గా సిద్దిపేట సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పారి శ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ)లో 3 కొత్త జోన్లు, ఓ సబ్ జోన్ ఏర్పాటయ్యాయి. కొత్త జిల్లాల్లో సంస్థ కార్యకలాపాలు విస్తరించేందుకు గాను యాజమాన్యం జోన్ల పునర్వ్య వస్థీకరణ జరిపింది. దీంతో జోన్ల సంఖ్య 9కి పెరిగింది. ఇప్పటికే సైబరాబాద్, శంషాబాద్, జీడిమెట్ల, పటాన్చెరు, వరం గల్, కరీంనగర్ జోన్లుండగా కొత్తగా నిజామాబాద్, ఖమ్మం, యాదాద్రి కేంద్రం గా 3 కొత్త జోన్లు, సిద్దిపేట కేంద్రంగా సబ్ జోన్ ఏర్పాటు చేస్తూ టీఎస్ఐఐసీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే జీడిమెట్ల జోన్‌ను మేడ్చెల్ –సిద్దిపేటగా పేరు మార్చింది. అయితే, జీడిమెట్ల కేంద్రంగానే జోన్ కార్యాలయం పనిచేయనుంది. ఏ జోన్ పరిధిలో ఏ జిల్లాలు? నిజామాబాద్ జోన్ పరిధిలో ఆదిలాబాద్, కుమ్రంభీం, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు, కరీంనగర్ జోన్ పరిధిలో మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలు, వరంగల్ జోన్ పరిధిలో భూపాలపల్లి, వరంగల్ (అర్బన్), వరంగల్ (రూరల్), జనగాం జిల్లాలు, ఖమ్మం జోన్ పరిధిలో ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలు, యాదాద్రి జోన్ పరిధిలోకి నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాలు రానున్నాయి. యాదాద్రి జోన్ భువనగిరి కేంద్రంగా పనిచేయనుంది. ఇక మేడ్చెల్–సిద్దిపేట జోన్ పరిధిలో సిద్దిపేట, మేడ్చెల్, మల్కాజిగిరి జిల్లాలు, పటాన్చెరు జోన్ పరిధిలో సంగారెడ్డి, మెదక్ జిల్లాలు, శంషాబాద్ జోన్ పరిధిలో రంగారెడ్డి (శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, గండిపేట, శంకర్పల్లి, మొయినాబాద్, చేవెళ్ల మండలాలు మినహా), మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల్, నాగర్‌కర్నూల్ జిల్లాలు, సైబరాబాద్ జోన్ పరిధిలో వికారాబాద్, హైదరాబాద్ జిల్లాలతో పాటు రంగారెడ్డి జిల్లాలోని శేర్లింగంపల్లి, రాజేంద్రనగర్, గండిపేట, శంకర్పల్లి, మొయినాబాద్, చేవెళ్ల మండలాలు రానున్నాయి. ఉద్యోగావకాశాల కోసం: గ్యాదరి 31 జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకునేందుకు, స్థానిక యువతకు ఉద్యో గావకాశాలు కల్పించేందుకు జోన్లను పున ర్వ్యవస్థీకరించామని సంస్థ చైర్మన్ గ్యాదరి బాలమల్లు తెలిపారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, పరిశ్రమల మంత్రి కేటీఆర్ ప్రణాళిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మంత్రి హరీశ్‌రావు చొరవతో సిద్దిపేటలో సబ్ జోన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. -
రాజస్తాన్, హరియాణాల్లో టీఐఎఫ్ బృందం పర్యటన
సాక్షి, హైదరాబాద్: మోడల్ ఇండస్ట్రియల్ పార్క్‌లను అధ్యయనం చేసేందుకు టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు ఆధ్వర్యంలో తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టీఐఎఫ్) ప్రతినిధులు శనివారం రాజస్తాన్‌లోని మానెసర్, హరియా ణాలోని నిమ్రాన్ పారిశ్రామిక వాడలను సందర్శించారు. పరి శ్రమల నుంచి వెలువడే కాలుష్య ఉద్గారాలను ఎలా నియం త్రిస్తున్నారనే విషయాల్ని తెలుసుకున్నారు. అక్కడ కాలుష్య జలాలను శుద్ధి చేసేందుకు 20 ఎకరాల్లో ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయడంతో.. రాష్ట్రంలోని చౌటుప్పల్ దండు మల్కాపురం ఇండస్ట్రియల్ పార్క్, ముచ్చర్ల ఫార్మాసిటీల్లోనూ ఇదే తరహాలో ప్లాంట్లు నెలకొల్పేలా ప్రణాళికలు తయారు చేయాలని నిర్ణయించారు. పర్యటనలో రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ సుదర్శన్‌రెడ్డి, టీఐఎఫ్ అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అందరిదీ అదే దారి
ఇండస్ట్రియల్ ఏరియాలో ఎన్నో అక్రమాలు వాణిజ్య భవనాల నిర్మాణాలకే మొగ్గు ఎక్కువ మంది ఇదే తరహా పనులు సహకారం అందించిన అధికారులు సాక్షిప్రతినిధి, వరంగల్ : పరిశ్రమల స్థాపన పేరిట భూములు తీసుకోవడం, వెంటనే వాటిని మూసివేసి వాణిజ్య భవనాలు నిర్మించిన వ్యవహారం కలకలం రేపుతోంది. పరిశ్రమల స్థాపన, మనుగడ కోసం పనిచేయాల్సిన రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ అధికారులే... వీటిని మూసివేయించేందుకు సహకరించినట్లు స్పష్టమవుతోంది. పరిశ్రమల స్థాపన కోసం భూములు తీసుకుని వాణిజ్య భవనం నిర్మించిన విషయంలో హైకోర్టు జోక్యంతో పరిశ్రమల శాఖ ఇటీవల తీసుకున్న తాజా నిర్ణయం సంచలనం కలిగిస్తోంది. పరిశ్రమల కోసం తీసుకున్న భూముల్లో నిర్మించిన వాణిజ్య భవనాల అనుమతులను రద్దు చేయాలని పరిశ్రమల శాఖ, ఇటీవల తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్ఐఐసీ)ని ఆదేశించింది. దీంతో వరంగల్ నగరం ములుగురోడ్డులోని పారిశ్రామిక ప్రాంతంలోని వారిలో ఆందోళన మొదలైంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వాణిజ్య భవనాల అనుమతులను రద్దు చేయాలని పరిశ్రమల శాఖ ఆదేశించడంతో ఆ ప్రాంతంలోని వారికి ఇబ్బందికరంగా మారింది. వరంగల్ నగరంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడు దశాబ్దాల క్రితం చర్యలు చేపట్టింది. పరిశ్రమలు స్థాపించేందుకు ఆసక్తి ఉన్న 130 మందికి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్ఐఐసీ) భూములను కేటాయించింది. ములుగు రోడ్డులో సుమారు 50 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశ్రమల కోసం ఇచ్చింది. భూములు తీసుకున్న ఔత్సాహికులు చిన్న, మధ్యతరహా పరిశ్రమలు స్థాపించారు. మరోవైపు వరంగల్ నగరం విస్తరించడం మొదలైంది. దశాబ్ద కాలంగా ఇది వేగంగా జరుగుతోంది. భూములకు డిమాండ్ పెరుగుతుండడంతో ధరలు సైతం ఇదే స్థాయిలో ఎగబాకాయి. పరిశ్రమల స్థాపన కోసం భూములు తీసుకున్న వారికి అది అనువుగా కనిపించింది. పరిశ్రమలను బంద్ చేసి తమకు కేటాయించిన భూముల్లో... నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య సముదాయాలను స్థాపించారు. నెలవారీగా లక్షల రూపాయల వచ్చేలా ప్రముఖ సంస్థలకు అద్దెకు ఇచ్చారు. పరిశ్రమల కోసం స్థాపించిన భూములను ఇలా వాణిజ్య అవసరాల కోసం వినియోగించకూడదని నిబంధనలను ఉన్నా పరిశ్రమల శాఖ అధికారులు పట్టించుకోలేదు. దీంతో ప్రభుత్వ లక్ష్యం పూర్తిగా నీరుగారిపోయింది. హైకోర్టు జోక్యంతో ఇప్పుడు పరిశ్రమల శాఖ చర్యలకు సన్నద్ధమైంది. -
మా ఇష్టం !
ఇండస్ట్రియల్ ఏరియాలో అక్రమాలు వరంగల్‌లో నిబంధనలకు తిలోదకాలు పరిశ్రమలకు ఇచ్చిన భూములు దుర్వినియోగం ఇష్టారాజ్యంగా వాణిజ్య భవనాల నిర్మాణం అన్నింటిపైనా చర్యకు పరిశ్రమల శాఖ ఆదేశం సాక్షిప్రతినిధి, వరంగల్ : వరంగల్ నగరం ములుగు రోడ్డులోని పారిశ్రామిక ప్రాంతంలో భారీగా అక్రమాలు జరిగాయి. పరిశ్రమలు స్థాపిస్తామని ప్రభుత్వానికి చెప్పి భూములు తీసుకున్న కొందరు.. పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించారు. ప్రభుత్వ స్ఫూర్తిని పక్కనబెట్టి తమకు లాభమైన పనులు చేశారు. ప్రభుత్వం కేటాయించిన భూముల్లో పరిశ్రమలు స్థాపించి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలనే విషయాలను పట్టించుకోకుండా ఆ భూముల్లో ఇష్టం వచ్చినట్లుగా భారీ భవంతులు నిర్మించి, బడా వాణిజ్య సంస్థలకు కిరాయికి ఇచ్చారు. సొంత లాభం మాత్రమే చూసుకుంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పరిశ్రమల శాఖ అధికారులు సైతం.. పరిశ్రమలను మూసివేసిన వారికే మద్దతు పలికారు. నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య భవనాలు నిర్మిస్తున్నా పట్టించుకోకుండా అక్రమార్కులకు అంటకాగారు. పారిశ్రామిక ప్రాంతంలో నిబంధనల ఉల్లంఘనపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా, దీనిపై స్పందించాలని హైకోర్టు పరిశ్రమల శాఖను ఆదేశించింది. దీంతో పరిశ్రమల శాఖ తాజాగా ఇచ్చిన ఆదేశాలు సంచలనం కలిగిస్తున్నాయి. ‘పరిశ్రమల స్థాపన కోసం భూములు తీసుకుని... సొంత అవసరాల కోసం భవనాలు నిర్మించిన అంశంలో చర్యలు తీసుకోవాలి. వరంగల్ నగరం ములుగురోడ్డు పారిశ్రామిక ప్రాంతంలో 2009 ఫిబ్రవరి 7, అక్టోబరు 1 తేదీల్లో అనుమతులు పొందిన కంది జితేందర్‌రెడ్డి, కంది సరళాదేవి నిర్మించిన భవనాల అనుమతులను రద్దు చేయాలి. వాణిజ్య భవనాలు నిర్మిస్తున్న సమయంలో చర్యలు తీసుకోకుండా వ్యవహరించిన పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ వరంగల్ జోనల్ మేనేజర్ సి.హెచ్.ఎస్.ఎస్ ప్రసాద్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. వరంగల్ ములుగు రోడ్డులోని పారిశ్రామిక ప్రాంతంలో పరిశ్రమల స్థాపన కోసం భూములు పొంది ఇతర అవసరాల కోసం వినియోగిస్తున్న వారి విషయంలో విచారణ జరపాలి’ అని పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్ ఈ నెల 12న తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్ఐఐసీ) సీఎండీని ఆదేశించారు. దీనిపై తదుపరి చర్యలు త్వరలోనే మొదలుకానున్నాయి. ‘వరంగల్ నగరం ములుగురోడ్డులోని పారిశ్రామిక ప్రాంతంలో పరిశ్రమల స్థాపన కోసం కేటాయించిన భూమి(715 సర్వే నంబర్)లో శ్రీ వెంకటేశ్వర ఆటోమోటివ్స్‌కు చెందిన కంది జితేందర్‌రెడ్డి, కంది సరళాదేవి వాణిజ్య భవనం(15–1–422/ఎ,బి) నిర్మించారు. ఎల్ఐసీ, ఓరియంటల్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ, ఎర్గో, టాటా మోటార్స్ ఫైనాన్స్ వంటి సంస్థలకు లీజుకు ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా చేసిన ఈ వ్యవహారంపై స్పందించి భవన నిర్మాణ అనుమతులు రద్దు చేయాలని కోరుతున్నాము’ అని వరంగల్ నగరానికి చెందిన ఓ వ్యక్తి హైకోర్టులో రిట్ పిటిషన్(13/2016) వేశారు. హైకోర్టు దీన్ని స్వీకరించింది. ఈ వ్యవహారాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ కార్యదర్శిని ఈ ఏడాది ఫిబ్రవరి 15న ఆదేశించింది. నెలలు గడిచినా దీనిపై పరిశ్రమల శాఖ నిర్ణయం తీసుకోలేదు. దీంతో పిటిషనర్ మళ్లీ హైకోర్టును ఆశ్ర యించారు. హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు. పరిశ్రమల శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. దీంతో పరిశ్రమల శాఖ చర్యలు మొదలుపెట్టింది. భవన నిర్మాణదారును, పిటిషనర్‌ను పిలిచి రికార్డులు స్వీకరించింది. అన్ని అంశాలను పరిశీలించి నిబంధనల ఉల్లంఘించారని నిర్ధాణకు వచ్చింది. చర్యలు తీసుకోవాలని టీఎస్ఐఐసీ సీఎండీని ఆదేశించింది. చర్యలు తీసుకుంటాం వరంగల్ ములుగురోడ్డు పారిశ్రామిక ప్రాంతానికి సంబంధించి ఓ కేసు ఉంది. హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన అంశంపై ఈ కేసులో పరిశ్రమల శాఖ కార్యదర్శి నుంచి ఆదేశాలు వచ్చాయి. దీనిపై చర్యలు తీసుకుంటాం. – ఇ.వి.నర్సింహారెడ్డి, టీఎస్ఐఐసీ సీఎండీ. -
హనుమకొండ ఐటీ సెజ్ ఏర్పాటుకు మరింత గడువు
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ) వరంగల్ జిల్లా హనుమకొండ మండలం మడికొండ గ్రామంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఐటీ/ఐటీఈఎస్ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)కి మరికొంత గడువు లభించింది. దీనితో సహా మొత్తం ఏడు సంస్థలకు సెజ్‌ల ఏర్పాటుకు గాను కేంద్రం మరికొంత గడువిచ్చింది. -
‘డబుల్’ వేగంతో పనిచేయండి
సాక్షి, హైదరాబాద్: రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గ్రామ, పట్టణ ప్రాంతాలకు వేర్వేరు పద్ధతులను అనుసరించి నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్‌లో స్థలాల కొరత ఉన్నందున అపార్ట్మెంట్ పద్ధతిలో మైవాన్ పరిజ్ఞానం వినియోగించి ఇళ్లను నిర్మించాలని, గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక కాంట్రాక్టర్లతో ఎక్కడివక్కడ పద్ధతిలో నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా ఎమ్మెల్యేలు చొరవ చూపాలని ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక, పనుల అప్పగింత వ్యవహారాలను కలెక్టర్లు పర్యవేక్షించాలన్నారు. పేదలకు ఇళ్లను నిర్మించి ఇవ్వటంలో ప్రభుత్వం కొత్త విధానాన్ని అనుసరిస్తున్నందున ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగించిన పద్ధతులకు స్వస్తిపలకాలని ఆదేశించారు. ఆది వారం సాయంత్రం ఆయన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పురోగతిపై ఉన్నతస్థాయిలో సమీక్షించారు. జిల్లాల్లో 2 లక్షలు, హైదరాబాద్‌లో లక్ష ఇళ్ల నిర్మాణం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని, నగరంలోని బస్తీలను కాలనీలుగా మార్చాలని చెప్పారు. ఇందుకోసం అంతర్గత రహదారులు, మంచినీటి వసతి, విద్యుత్, డ్రైనేజీ లాంటి మౌలిక వసతులును మెరుగుపరచాల్సి ఉంటుందని సీఎం పేర్కొన్నారు. 3 నుంచి 9 అంతస్తులతో ఇళ్లు... కొత్త ఇళ్ల నిర్మాణం కోసం అవసరమైన స్థలాలను టీఎస్ఐఐసీ, దిల్, గృహనిర్మాణ సంస్థ పరిధి నుంచి సమీకరించాలని, అవసరమైతే ప్రభుత్వ భూములూ కేటాయించేందుకు సిద్ధమని ముఖ్య మంత్రి కేసీఆర్ వెల్లడించారు. మూడు నుంచి తొమ్మిది అంతస్తులుగా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని, ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మైవాన్ పరిజ్ఞానాన్ని వినియోగించాలన్నారు. ఇళ్ల నిర్మాణం కోసం ముందుకొచ్చిన సంస్థలతో చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. ఇళ్ల కోసం ఉచితంగా ఇసుకను అందజేయాలని, సిమెంటు కంపెనీలతో మాట్లాడి ఫ్యాక్టరీ ధరకే అందేలా చూడాలని ఆదేశించారు. హైదరాబాద్‌లో నిర్మాణంలో ఉన్న వాంబే, జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లనూ త్వరగా పూర్తి చేయాలన్నారు. రాజీవ్ స్వగృహ ఇళ్లను ప్రభుత్వోద్యోగులు, పోలీసులకు కేటాయించాలని నిర్ణయించినందున అందుకు అవసరమైన కసరత్తును వెంటనే పూర్తి చేయాలన్నారు. సమావేశంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి గోపాల్, గృహనిర్మాణశాఖ కార్యదర్శి అశోక్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు రాహుల్ బొజ్జా, రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ భూముల వేలానికి ప్రభుత్వం నోటిఫికేషన్
హైదరాబాద్ : మళ్లీ భూముల వేలానికి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్ పరిధిలో 62 ప్రాంతాల్లోని భూముల వేలానికి తెలంగాణ రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) నోటిఫికేషన్ జారీ చేసింది. సదరు భూములను ఇటీవల వేలం వేశారు. అయితే స్పందన కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఖానామెట్, రాజేంద్రనగర్, మణికొండ, నార్సింగి,పుప్పాలగూడ, నిజాంపేట ప్రాంతాల్లో భూములు వేలం వేయనున్నారు గజానికి అత్యల్పంగా రూ. 7 వేలు, అత్యధికంగా రూ. 45 వేల ఆప్ సెట్ ధరను ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 22వ తేదీన ఈ ఆక్షన్ ద్వారా సదరు ప్రాంతాల్లోని భూములను విక్రయించనున్నారు. -
రెండో విడత వేలంతో రూ.200 కోట్లు రాబడి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) గురువారం నిర్వహించిన ప్రభుత్వ భూముల వేలం ద్వారా ఖజానాకు సుమారు రూ.200 కోట్ల మేర ఆదాయం సమకూరింది. హెచ్ఎండీఏ పరిధిలోని రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో 30 ప్లాట్లకు సంబంధించి గురువారం పరిశ్రమల భవన్లో ఈ వేలం విధానం ద్వారా అమ్మకం జరిపారు. 133 ఎకరాలను వేలానికి పెట్టగా 33 ఎకరాలను కొనుగోలుదారులు ఈ వేలం ద్వారా సొంతం చేసుకున్నారు. పారిశ్రామిక, గృహ అవసరాల కోసం నిర్వహించిన వేలంలో పలు ప్లాట్లకు గరిష్ట ధర దక్కింది. ఖానామెట్‌లో గరిష్టంగా ఎకరానికి రూ.29 కోట్ల చొప్పున.. కున్ మోటారెన్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ రెండెకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఇదే ప్రాంతంలో మరో ప్లాటుకు ఎకరాకు రూ.18.20 కోట్లు పలికింది. గృహ అవసరాల కోసం ఉద్దేశించిన ప్లాట్లలో అత్యధికంగా షేక్‌పేట మండలం అల్ హమ్రా కాలనీలో చదరపు గజానికి రూ.76,200 చొప్పున 920 గజాలకు రూ.7 కోట్ల మేర ధర పలికింది. మిగతా ప్రాంతాల్లోనూ భూములు అధిక ధరలకు అమ్ముడయ్యాయని, దశలవారీగా మరికొన్ని ప్లాట్లను వేలం వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి ‘సాక్షి’కి వెల్లడించారు. కాగా రెండో విడత వేలంలో 54 ప్లాట్లను వేలం వేస్తున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసినా.. రాజేంద్రనగర్ మండలం పుప్పాలగూడ భూములపై కోర్టు కేసుల నేపథ్యంలో వేలం నిలిచిపోయింది. ఈ భూములను కూడా వేలం వేస్తే ప్రభుత్వానికి మరో రూ.500 కోట్ల మేర ఆదాయం లభించే అవకాశముందని టీఎస్ఐఐసీ వర్గాలు వెల్లడించాయి. తొలి విడతలో అత్యధికంగా రూ.29.2 కోట్లు గత ఏడాది నవంబర్ 25న 27 భూముల తొలి విడత వేలానికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసి, వేలం వేయగా.. ఎనిమిది చోట్ల భూముల అమ్మకాలకు స్పందన లభించింది. తొలి విడతలో జరిగిన భూముల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రూ.329 కోట్ల మేర ఆదాయం లభించింది. ప్రముఖ ఫార్మా సంస్థ అరబిందో హైదరాబాద్ రాయదుర్గం పరిధిలో అత్యధికంగా ఎకరాకు రూ.29.28 కోట్లు కోట్ చేసి ఐదెకరాలను దక్కించుకుంది. రాయదుర్గంతో పాటు మణికొండ, కోకాపేట ప్రాంతాల్లోనూ నివాస స్థలాల వేలానికి మంచి స్పందన లభించింది. 2007-08లో జరిగిన వేలం ద్వారా సగటున ఎకరాకు రూ.18 కోట్ల నుంచి రూ.23 కోట్ల మేర పలికింది. -
సిటీలో అంత సీన్లేదు
శివారు భూములకు రికార్డు స్థాయిలో ధర నగర నడిబొడ్డున ఉన్న భూములకు స్పందన శూన్యం హైదరాబాద్ : హైదరాబాద్ నగర శివారు భూములకు ఉన్న డిమాండ్ నగర నడిబొడ్డున ఉన్న భూములకు లేదనే విషయం తెలంగాణ మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టీఎస్ఐ ఐసీ) నిర్వహించిన వేలంలో స్పష్టమైంది. శివారు భూములు పరిశ్రమల స్థాపనకు ఉపయోగంగా ఉండటం వల్ల వాటికి డిమాండ్ పెరగటంతోపాటు గతంలో ఎన్నడూ లేని రికార్డు స్థాయి ధర నమోదైంది . నగర నడిబొడ్డున ఉన్న భూమిని వేలానికి పెట్టినా.. కొనుగోలు చేయటానికి ఎవ్వరూ ముందుకు రాకపోవటంతో మళ్ళీ వేలం పాటకు సిద్ధం కావాలని భావిస్తున్నారు. హైదరాబాద్ గ్రేటర్ పరిధిలోని 27 ప్రాంతాల్లో గుర్తించిన 98.70 ఎకరాల ప్రభుత్వ భూమిను టీఎస్ఐఐసీ గత నెల 30న ఇచ్చిన ఈ టెండర్ కమ్ ఈ వేలం ప్రకటన ద్వారా బుధవారం వేలం నిర్వహించిన విష యం తెలిసిందే. ఈ వేలంలో నగర శివారులోని రాయదుర్గం, కోకాపేట, మణికొండ ప్రాంతాలలోని ప్రభుత్వ భూములకు రికార్డు స్థాయిలో ధర పలుకగా, నగర నడి బొడ్డు ప్రాంతాలైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లలోని భూముల వేలంలో ఎవ్వరు పాల్గోన లేదు. రాయదుర్గంలో ఎకరాకు రికార్డు స్థాయిలో రూ.29.28 కోట్లు ధర నిర్ణయం కాగా, ఇక్కడనే మరో బిట్లో ఉన్న ప్రభుత్వ భూములకు ఎకరానికి రూ. 24.20 కోట్లు పలికింది. మణికొండ ,కొకాపేటల్లో ఉన్న భూములకు కూడా ఎకరాకు రూ. 12.63 కోట్లు ధర నమోదైంది.బంజారా హిల్స్, జూబ్లీహిల్స్‌ల్లోని 10 ప్రాంతా ల్లో ఉన్న 3.25 ఎకరాల ప్రభుత్వ భూమిని కొనుగోలు చేయటానికి మాత్రం ఎవ్వరూ ముందుకు రాలేదు. ఇక్కడి 3.25 ఎకరాల భూమికి రూ. 100 కోట్లు రాగలవని గతంలో రెవెన్యూ యంత్రాంగం అంచనా కూడా వేసింది. 3.25 ఎకరాల భూమి పది ప్రాంతాల్లో చిన్న,చిన్న బిట్లుగా ఉండటం వల్ల ముందుకు రాలేదని తెలుస్తోంది.మళ్లీ వేలం నిర్వహించనున్నట్లు తెలిసింది. -
టీఎస్ఐఐసీ భూములపై రుణాలు
♦ నెల రోజుల్లో పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి ప్రణాళిక ♦ ఉత్పత్తి ప్రారంభించాకే పరిశ్రమలకు భూ రిజిస్ట్రేషన్ ♦ టీఎస్ఐఐసీ పనితీరుపై మంత్రి జూపల్లి సమీక్ష సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక పార్కుల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు అవసరమైన నిధుల సమీకరణకు తమ ఆధీనంలోని భూములపై రుణాలు తీసుకునే అంశాన్ని పరిశీలించాలని పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ)కి సూచించారు. సంస్థ కార్యాలయంలో మంగళవారం మంత్రి టీఎస్ఐఐసీ పనితీరును సమీక్షించారు. సమీక్షలో సంస్థ ఎండీ ఈ.వి.నర్సింహారెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి అవసరమైన కన్సల్టెంట్ల ఎంపిక, ప్రాజెక్టు రిపోర్టుల తయారీ తదితరాలను నెల రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమిని గుర్తించడం, అభివృద్ధి చేయడం, పెట్టుబడిదారులకు రాష్ట్రంలో ఉన్న సౌకర్యాలను వివరించడంపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. టీఎస్ఐఐసీలో సిబ్బంది కొరతను తీర్చేందుకు టీఎస్పీఎస్సీ ద్వారా తక్షణమే నియామకాలు చేపట్టేందుకు అవసరమైన ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి పంపించాలని ఆదేశించారు. పరిశ్రమల నిర్మాణం పూర్తయి ఉత్పత్తి ప్రారంభించిన తర్వాతే సంబంధిత సంస్థ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని మంత్రి సూచించారు. టీఎస్ఐపాస్ విధానంలోని ప్రత్యేకతలను ప్రస్తావించిన జూపల్లి పారిశ్రామిక రంగంలో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచేలా సిబ్బంది పనిచేయాలన్నారు. పారిశ్రామిక పార్కుల్లో ఖాళీగా ఉన్న స్థలాలు, పరిశ్రమలకు కేటాయించిన భూములు, రాయిదుర్గ్ ఫైనాన్షియల్ జిల్లాలో భూముల కేటాయింపు, కేటాయింపులు జరిగినా వినియోగంలోకి రాని భూముల రద్దు, పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులు, ఫుడ్‌పార్కులు, ఫైబర్‌గ్లాస్ పార్కు, డ్రైపోర్టులు, టెక్స్టైల్ పార్కుల పురోగతి, ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ వినియోగం, ఎంఎల్ఆర్ మోటార్స్, శ్రీదేవి ఫుడ్స్‌కు కేటాయించిన భూములు, గేమ్ సిటీ, టీ హబ్ డిజైనర్ ఎంపిక, మైక్రోసాఫ్ట్‌కు పొరుగున పుప్పాలగూడలో వీజేఐల్ కన్సల్టెంట్స్‌కు కేటాయించిన భూ కేటాయింపులు రద్దు తదితర అంశాలపై మంత్రి సమీక్షించారు. పారిశ్రామికవాడల స్థానిక సంస్థలను (ఐలా)అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి చేర్చే అంశంపై సూత్రప్రాయంగా అంగీకరించినా ఫైలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉందని అధికారులు జూపల్లి దృష్టికి తీసుకువచ్చారు. కోర్టులో ఉన్న కేసుల స్థితిగతులపై నివేదిక రూపొందించి క్రమం తప్పకుండా సమీక్షించాలని టీఎస్ఐఐసీ అధికారులను ఆదేశించారు. -
మొబైల్ పాలసీకి పచ్చజెండా
- టీఎస్ఐఐసీ ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం - మైక్రోమాక్స్‌కు 18.66 ఎకరాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ‘మొబైల్ పాలసీ’ని ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మొబైల్ పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలపై టి-స్విప్ట్ బోర్డు (పెట్టుబడుల ఆహ్వాన సంస్థ) ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. మౌలిక సౌకర్యాల కల్పనకయ్యే వ్యయంతో సంబంధం లేకుండా టీఎస్ఐఐసీ సేకరించిన ధరకే మొబైల్ తయారీ పరిశ్రమలకు భూమిని కేటాయిస్తారు. అనుబంధ పరిశ్రమలతోసహా రూ.10 కోట్లకు మించకుండా పెట్టుబడిలో 20 శాతం సబ్సిడీ ఇస్తారు. ఈ నూతన విధానం ప్రకారం పెట్టుబడిలో సగం మొత్తానికి ఐదేళ్లలో 5.25 శాతం వార్షిక వడ్డీ కోటి రూపాయలకు మించకుండా ఉండాలి. వంద శాతం స్టాంపు డ్యూటీని పరిశ్రమలకు తిరిగి చెల్లించడం, ఉత్పత్తులపై 5 శాతం వ్యాట్ విధింపు, సీఎస్టీని (కేంద్ర అమ్మకపు పన్ను) 2 శాతం తగ్గించడం వంటి అంశాలను నూతన మొబైల్ పాలసీలో పేర్కొన్నారు. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ(టీఎస్ఈఆర్సీ) నిర్ణయించిన ధరలకు అనుగుణంగా మొబైల్ తయారీ పరిశ్రమలకు 25 శాతం లేదా గరిష్టంగా రూ.30 లక్షలకు మించకుండా రాయితీ, నిరంతరాయంగా విద్యుత్ ఇస్తారు. నియామకాల్లో 80 శాతం ఉద్యోగ అవకాశాలు స్థానికులకు ఇవ్వాలనే షరతు విధించారు. రాయితీలు పొందాలంటే ఉత్పత్తి ప్రారంభించిన మొదటి రెండేళ్లలో కనీసం వేయి మందికి ఉపాధి కల్పించాల్సి ఉంటుంది. మైక్రోమాక్స్‌కు తాయిలాలు రాష్ట్రంలో తొలిసారిగా మొబైల్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చిన మైక్రోమాక్స్ సంస్థకు మొబైల్ పాలసీ నిబంధనలకు లోబడి రాయితీలు, ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తొలి దశలో రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో రూ.80 కోట్ల పెట్టుబడితో 1,250 మందికి ఉపాధి కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మైక్రోమాక్స్ సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించింది. ఈ ప్రతిపాదనను పరిశీలించిన రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పన సంస్థ(టీఎస్ఐఐసీ) రాయితీలు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి సిఫారసు చేసింది. రావిర్యాలలో ఎకరానికి రూ.30 లక్షల చొప్పున 18.66 ఎకరాలు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ఫ్యాబ్‌సిటీలో ‘మొబైల్ హబ్’
సెల్‌ఫోన్ విడిభాగాల తయారీకి సర్కారు గ్రీన్‌సిగ్నల్ మైక్రోమ్యాక్స్ సంస్థకు 50 ఎకరాలు కేటాయింపురూ.200 కోట్లతో ఆ సంస్థ ప్రత్యేక యూనిట్ ఏర్పాటుకొత్తగా మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తున్న పలు సంస్థలు. సాక్షి, రంగారెడ్డి జిల్లా: సెల్‌ఫోన్ విడిభాగాల తయారీకి మహేశ్వరం మండలం రావిరాల సమీపంలోని ఫ్యాబ్‌సిటీ కేంద్రంగా మారనుంది. ఈ ప్రాంతంలో టీఎస్ఐఐసీకి కేటాయించిన భూముల్లో సెల్యులార్ పరిశ్రమల స్థాపనకు పలు సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడ మైక్రోమ్యాక్స్ సంస్థ 50 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.200కోట్ల పెట్టుబడితో ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి ఆ సంస్థ ఏర్పాట్లు వేగిరం చేసింది. దీంతో గురువారం రాష్ట్ర మంత్రి మహేందర్‌రెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించనుంది. ఈ ప్రకటన వెలువడిన తర్వాత పలు కంపెనీలు తమ నిర్ణయాన్ని ప్రకటించనున్నాయి. రెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలు.. రావిరాలలో ఏర్పాటు చేసే ‘మొబైల్ ఫోన్ తయారీ హబ్’తో భారీ సంఖ్యలో ఉద్యోగావకాశాలు కలగనున్నాయి. ఈ నెల మొదటివారంలో ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ ప్రతినిధుల బృందం సీఎం కేసీఆర్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే. అనంతరం ఆ ప్రతి నిధుల బృందం ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసింది. ప్రస్తుతం మైక్రోమ్యాక్స్ సంస్థ ఇక్కడ యూనిట్ ఏర్పాటు చేసేందుకు పచ్చజెండా ఊపింది. సామ్సంగ్ కంపెనీ సై తం యూనిట్ ఏర్పాటుకు ఆసక్తి చూపుతోంది. అదేవిధంగా తైవాన్‌కు చెందిన మరో కంపెనీ ప్రతినిధులు గురువారం రాష్ట్ర ప్రభుత్వంతో భేటీ అయ్యారు. ఇలా పలు సంస్థలు ఇక్కడ యూనిట్ల ఏర్పాటుకు సానుకూలత చూపుతుండడంతో అధిక సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటు కానున్నట్లు అధికారవరా్గాలు చెబుతున్నాయి. నూతన పారిశ్రామిక విధానంలో కంపెనీలకు భారీ రాయితీలివ్వనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే పరోక్షంగా పేర్కొంది. మొత్తంగా రెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సర్కారు భావిస్తోంది. -
ఆ తర్వాతే తయారీ సంస్థలు
మొబైల్ హబ్ ఏర్పాట్లపై టీఎస్ఐఐసీ కసరత్తు ప్రత్యేక పార్కుల ఏర్పాటుపై ప్రణాళిక సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలిసారిగా మొబైల్ ఫోన్ల తయారీ హబ్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలు అధికంగా చైనాలోనే ఉన్నాయి. దేశంలో ప్రస్తుతం కేవలం మొబైల్ ఫోన్ అసెంబ్లీ యూనిట్లు మాత్రమే ఉన్నాయి. ఇదే విషయాన్ని ఇటీవల సీఎంతో భేటీ జరిపిన ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ ప్రతినిధి బృందం వెల్లడించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ను మొబైల్ ఫోన్ల తయారీ హబ్‌గా తీర్చిదిద్దుతామని సీఎం ప్రకటించారు. మొబైల్ హబ్ నెలకొల్పేందుకు భూమితోపాటు మౌలిక సౌకర్యాలు, ఇతర అంశాలకు మద్దతు పలికేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేస్తోంది. హబ్ ఏర్పా టు ద్వారా 1.50 లక్షల నుంచి 2 లక్షల మేర ఉద్యోగాలు కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యం. మొబై ల్ హబ్ ఏర్పాటుకు అనువైన స్థలం కోసం టీఎస్ఐఐసీ అన్వేషిస్తోంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మంచిరేవుల, రావిర్యాలలో ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ పరిశ్రమలను ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ ప్రతినిధులు సందర్శించారు. సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. తొలుత అసెంబ్లీ యూనిట్లు నేరుగా మొబైల్ తయారీ పరిశ్రమలు కాకుం డా అసెంబ్లీ యూనిట్లు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో మొబైల్ తయారీ పరిశ్రమలు వున్నాయి. ఇప్పటికే సెల్కాన్, వీడియోకాన్ వంటి మొబైల్ తయారీ పరిశ్రమలు తమ అసెంబ్లీ యూనిట్లను హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేసే సన్నాహాల్లో ఉన్నాయి. -
అక్రమాలు రూ.కోట్లు దాటుతున్నాయ్!
- నిబంధనలకు నీళ్లు - డిపాజిట్ చేయకముందే పనులు కట్టబెట్టేందుకు సన్నాహాలు - జలమండలి అధికారుల నిర్వాకం సాక్షి,సిటీబ్యూరో: ఒకటీ... రెండూ కాదు... ఏకంగా రూ.20 కోట్ల విలువైన పనుల్లో నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. జలమండలి ఆధ్వర్యంలో మాదాపూర్ స్పోర్ట్స్ సిటీకి మంచి నీటి సరఫరాకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) రూ.20 కోట్లు డిపాజిట్ చేయాల్సి ఉంది. అయితే అంతకుముందేతమకు నచ్చిన వారికి పనులు కట్టబెట్టేం దుకు జలమండలి అధికారులు అత్యుత్సాహం చూపుతుండడం సంచలనం సృష్టిస్తోంది. మరోవైపు రూ.20 కోట్ల విలువైన పనులను సాధారణంగా జలమండలి ప్రాజెక్టు విభాగం పర్యవేక్షిస్తుంది. దీనికి భిన్నంగా ఆపరేషన్స్ విభాగం పర్యవేక్షణలోనే చేపడుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినవారికి పనులు కట్టబెట్టేందుకే ఈ తతంగం ఆగమేఘాల మీద జరుగుతుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదీ కథ... మాదాపూర్ సబ్‌డివిజన్ పరిధిలోని ఇనార్బిట్ మాల్ వెనుక వైపున నిర్మిస్తున్న స్పోర్ట్స్ సిటీకి మంచినీటి సరఫరాకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) ముందుకొచ్చింది. దీనికి సైబర్ గేట్‌వే ప్రాంతంలోని విప్రో సంస్థ వె నుక వైపున 5 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల గ్రౌండ్ లెవల్ సర్వీస్ రిజర్వాయర్ (జీఎల్ఎస్ఆర్) నిర్మించాల్సి ఉంది. అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్పోర్ట్స్సిటీకి మంచినీటి సరఫరాకు 800 డయా వ్యాసార్థం గల మైల్డ్‌స్టీల్ పైప్‌లైన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ రెండు పనులకు రూ.20 కోట్లు వ్యయమవుతుందని అంచనా. నిబంధనల ప్రకారం ఈ మొత్తాన్ని టీఎస్ ఐఐసీ సంస్థ జలమండలికి డిపాజిట్ చేయాల్సి ఉంది. మహానగరం పరిధిలో ఏదేని అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీకి నీటి సరఫరా చేయాలంటే ముందుగానే డిపాజిట్ వసూలు చేయడం జలమండలి పాటిస్తున్న నిబంధన. కానీ ఈ విషయంలో కొందరు అధికారులు బోర్డును తప్పుదోవ పట్టించి సదరు సంస్థ నిర్మాణ వ్యయాన్ని డిపాజిట్ చేయకముందే టెండర్లు పిలిచి తమకు నచ్చిన వారికి పనులు కట్టబెట్టేందుకు రంగం సిద్ధంచేయడం గమనార్హం. మరోవైపు తాజాగా పనులు దక్కించుకుంటున్న వారికి సైతం ఈ రంగంలో అంతగా అనుభవం, అర్హతలు లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ భాగోతంలో తమకు బాగానే గిట్టుబాటవుతుందనే ఉద్దేశంతోనే అధికారులు ఈ తతంగం నడిపారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమాల దారిలో.. సాధారణంగా రూ.కోటి... అంతకంటే ఎక్కువ నిర్మాణ వ్యయమయ్యే పనులను జలమండలి ప్రాజెక్టు విభాగం పర్యవేక్షిస్తుంది. కానీ ఆపరేషన్స్ విభాగం ఆధ్వర్యంలో తమకు సంబంధం లే ని పనులకు టెండర్లు పిలవడంలో ఆంతర్యం ఎవరికీ అంతుబట్టడం లేదు. ఇదే క్రమంలో మారేడ్‌పల్లి నిర్వహణ డివిజన్ పరిధిలో రూ.9.20 కోట్లతో చేపట్టే రిజర్వాయర్ పనులు, ఫతేనగర్, షాపూర్, తార్నాక, ఎస్పీఆర్ హిల్స్ ప్రాంతాల్లో ఒక్కొక్కటి రూ.10 కోట్లతో నిర్మించే రిజర్వాయర్ పనులను ఆపరేషన్స్ విభాగం పర్యవేక్షణలో చేపట్టేందుకు రంగం సిద్ధమవడం గమనార్హం. ఈ విషయంలో విజిలెన్స్ విభాగం జోక్యం చేసుకుంటే అక్రమాల డొంక కదులుతుందని బోర్డు ఉద్యోగ, కార్మిక సంఘాలు కోరుతున్నాయి. -
పారిశ్రామిక పార్కులు
* ఆరు చోట్ల ఏర్పాటు చేయాలని నిర్ణయం * భూములు గుర్తించిన టీఎస్ఐఐసీ సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : దేశంలోనే అత్యున్నత పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించిన రాష్ట్ర సర్కారు ఆ దిశగా అడుగులు వేస్తోంది. జిల్లాలో ఇండస్ట్రీయల్ పార్కుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో మరిన్ని పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా పారిశ్రామికంగా అభివృద్ధి సాధించవచ్చని భావిస్తోంది. ఇందులో భాగంగా ఆరు చోట్ల ఈ పార్కులను ఏర్పాటు చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. నెన్నెల, సిర్పూర్(టి), అంకుసాపూర్(కాగజ్‌నగర్ మండలం), చెన్నూరు, చాట (కుభీర్ మండ లం), ఆలూరు(సారంగాపూర్)లో నెలకొల్పాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఇం దుకోసం అవసరమైన భూముల గుర్తింపు ప్రక్రియ ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తోంది. నెన్నెలలో ఏర్పాటు చేయతలపెట్టిన పారిశ్రామిక పార్కు కోసం సుమారు వెయ్యి ఎకరాల భూములను గుర్తించారు. అలాగే సిర్పూర్ (టి) పార్కు కోసం సుమారు 700 ఎకరాలు, చెన్నూరు కోసం 461 ఎకరాలు, చాట కోసం 147 ఎకరాలు, ఆలూరు కోసం 239 ఎకరాల భూమిని ప్రాథమికంగా గుర్తించారు. జిల్లా పరిశ్రమల శాఖ, టీఎస్ఐఐసీ (తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ) అధికారులు సంయుక్తంగా ఈ ప్రక్రియ చేపట్టారు. సాగుకు యోగ్యంగా లేని ప్రభుత్వ భూములను మాత్రమే పారిశ్రామిక పార్కుల కోసం సేకరిస్తామని జిల్లా పరిశ్రమల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ పార్కుల్లో అన్ని సౌకర్యాలను కల్పించాలని నిర్ణయించారు. ఈ భూములను అభివృద్ధి చేయడంతోపాటు, పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ లైన్లను నిర్మించడం, రోడ్లు, పారిశ్రామిక వ్యర్థాలను తరలించేందుకు అవసరమైన డ్రెయినేజీల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. వీటిలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ఉత్సాహం చూపుతున్న పారిశ్రామిక వేత్తలకు ఈ పార్కుల్లో స్థలాలను కేటాయించడం ద్వారా వారికి తోడ్పాటునందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆశించిన ఫలితమివ్వని ఎస్టేట్లు.. జిల్లాలో ప్రస్తుతానికి మూడు ఇండస్ట్రియల్ ఎస్టేట్లు ఉన్నాయి. ఆదిలాబాద్‌తోపాటు, నిర్మల్, మంచిర్యాలల్లో ఎస్టేట్లను రెండు దశాబ్దాల క్రితం ఏపీఐఐసీ ఏర్పాటు చేసింది. అయితే.. ఈ పట్టణాలు దినదినాభివృద్ధి చెందడంతో ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్లలో పరిశ్రమల కంటే నివాస గృహాలు అధికంగా వెలిశాయి. ఐటీడీఏ (సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ) పరిధిలో కూడా మరో ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉట్నూర్‌లో ఉంది. గిరిజనులు చిన్న, కుటీర పరిశ్రమలను నెలకొల్పి ఉపాధి పొందేలా చేయూత నిచ్చేందుకు ఉట్నూర్‌లో ఈ ఎస్టేట్‌ను ఏర్పాటు చేసినప్పటికీ, సరైన పర్యవేక్షణ లేక ఈ ఎస్టేట్‌లో చాలా యూనిట్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి.. జిల్లాలో కొత్తగా పత్తి ఆధారిత పరిశ్రమల స్థాపనకు పారిశ్రామిక వేత్తలు మొగ్గు చూపుతున్నారు. స్పిన్నింగ్, జిన్నింగ్-ప్రెస్సింగ్, పారాబాయిల్డ్, సిరామిక్స్, కార్న్ (మొక్కజొన్న ఉత్పత్తులు) ప్రొడక్ట్స్ వంటి పరిశ్రమలు వచ్చే అవకాశాలున్నాయని పరిశ్రమల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. పక్కనే ఉన్న మహారాష్ట్రలో ప్రైవేటు సెక్టార్లో మొక్కజొన్న ఆధారిత భారీ పరిశ్రమలున్నాయి. జిల్లాతోపాటు, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో ఉత్పత్తి అవుతున్న మొక్కజొన్న చాలా మట్టుకు ఈ పరిశ్రమలకు వెళుతోంది. ఇలాంటి పరిశ్రమలు ఇక్కడే నెలకొల్పడం ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగు పడటంతో పాటు, వెనుకబడిన జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధిని సాధించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. -
కంపెనీలు స్థాపించకుంటే భూములు వెనక్కి
మహేశ్వరం: టీఎస్ఐఐసీ ద్వారా పొందిన భూముల్లో కంపెనీలు స్థాపించకుంటే ఆ స్థలాలను వెనక్కి తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ చంపాలాల్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మండల పరిధిలోని రావిర్యాల, కొంగరఖుర్దు, రాజీవ్ జేమ్స్‌పార్కు, గంగారం, నాగారం గ్రామాల్లోని ప్రభుత్వ భూములను పరిశిలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఎస్ఐఐసీ ద్వారా తీసుకున్న భూముల్లో కంపెనీలు స్థాపించకుంటే ఆ భూములను వెనక్కి తీసుకొని ఇతర పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. రావిర్యాల రెవెన్యూ పరిధిలోని రాజీవ్ జేమ్స్‌పార్కులో ఖాళీగా ఉన్న భూములను పరిశీలించి కంపెనీలు ఎందుకు స్థాపించడం లేదంటూ జేమ్స్‌పార్కు అధికారులను ప్రశ్నించారు. అయితే ప్రస్తుతం డైమండ్ కంపెనీలు తీవ్ర నష్టాల్లో ఉన్నాయని, అందుకే కొత్త కంపెనీలే స్థాపించడానికి ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. మహేశ్వరంలో మరిన్ని పరిశ్రమలు రానున్న రోజుల్లో మహేశ్వరం, రావిర్యాల, శ్రీనగర్, గంగారం, నాగారం గ్రామాల్లో భారీ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని జేసీ పేర్కొన్నారు. ఇటీవల గంగారం గ్రామం సర్వే నెంబరు 181లో సుమారు 100 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇండియన్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులు పరిశీలించినట్లు చెప్పారు. రావిర్యాల, కొంగర ఖుర్దు , నాగారం గ్రామాల్లో కంపెనీలు స్థాపించడానికి పలు ఐటీ, సాప్ట్వేర్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. కొంగరఖుర్దు సర్వే నెం-289లో సుమారు 55 ఎకరాలు, గంగారం సర్వే నెంబరు 181లో సుమారు 120 ఎకరాలు, నాగారంలో సర్వే నెంబరు 181లో 45 ఎకరాల ప్రభుత్వ భూమిని జేసీ పరిశీలించారు. చెరువుల ఆక్రమణకు పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదన్నారు. జేసీ వెంట తహసీల్దార్ కె. గోపీరామ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మహ్మద్ రఫీ తదితరులున్నారు. -
‘మెట్రో’ స్థలం మార్చలేదు
ఆక్వా స్పేస్ డెవలపర్స్‌కు అనుకూలంగా వ్యవహరించలేదు: టీఎస్ఐఐసీ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు గతంలో కేటాయించిన 15 ఎకరాల స్థలాన్ని మార్చలేదని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ) స్పష్టం చేసింది. ఆక్వా స్పేస్ డెవలపర్స్ కోసం ఎటువంటి ఆశ్రీత పక్షపాతం చూపలేదని పేర్కొంది. ఈ మేరకు టీఎస్ఐఐసీ వీసీ, ఎండీ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2007లో రూ. 580.50 కోట్లను చెల్లించి రాయదుర్గంలోని ఏపీఐఐసీ భూమిని డీఎల్ఎఫ్ (ప్రస్తుతం ఆక్వా స్పేస్ డెవలపర్స్) కొనుగోలు చేసిందని అందులో పేర్కొన్నారు. ఆ సొమ్ము ప్రభుత్వ ఖజానాలో జమ అయిందని తెలిపారు. అయితే ఆ భూమిలో వారసత్వ సంపద (పురాతన శిలా ఫలకాలు) ఉన్నందున ప్రత్యామ్నాయ స్థలాన్ని ఆ సంస్థకు కేటాయించామని తెలిపారు. అదేవిధంగా వేలంలో కొన్న భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ. 2.90 కోట్లను, రూ. 31.92 కోట్ల స్టాంపు డ్యూటీని 2013 సెప్టెంబర్‌లోనే ఆ సంస్థ చెల్లించిందని ఆ ప్రకటనలో వెల్లడించారు. మొత్తంగా ఏడేళ్ల తర్వాత 2014 ఆగస్ట్‌లో ఆ సంస్థతో ఎక్స్ఛేంజ్ డీడ్ కుదుర్చుకున్నామన్నారు. సంస్థ పేరు మార్పునకు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) కూడా అంగీకరించిందని.. పేరు మార్పు పూర్తిగా చట్టపరమైనదని, ఇందులో ఎటువంటి తప్పు లేదని వివరించారు.