సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ యువతకు ఉపాధి లక్ష్యంగా నగరానికి ఆనుకుని యాదాద్రి జిల్లా పరిధిలోని దండుమల్కాపురం (ఎన్‌హెచ్– 65) వద్ద టీఎస్‌ఐఐసీ, తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్ ఫెడరేషన్ నిర్మిస్తోన్న స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ (ఎస్‌డీసీ) డిసెంబరులో అందుబాటులోకి రానుంది. ఈ ప్రాంతంలో సుమారు 547 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నెలకొల్పిన ఎంఎస్‌ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పరిశ్రమల పార్క్‌కు ఎస్‌డీసీ తలమాణికం కానుంది. ఈపార్క్‌లో దశలవారీగా ప్రత్యక్ష, పరోక్షంగా సుమారు 20–30 వేల మందికి ఉపాధి కల్పించనున్నట్లు టీఎస్‌ఐఐసీ వర్గాలు తెలిపాయి.
ఎస్‌డీసీపై కేటీఆర్ ట్వీట్..
ఇటీవల మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి కేటీఆర్ సైతం ఈ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుపై సామాజిక మాధ్యమం ట్విటర్‌లో ట్వీట్ చేశారు. టీఎస్‌ఐఐసీ, తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన.. రాష్ట్రంలోనే అతిపెద్ద స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్, ఇండస్ట్రియల్ పార్క్ ఇదేనని పేర్కొన్నారు. దండుమల్కాపురం పార్క్‌లో సుమారు 589 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కొలువుదీరనున్నాయన్నారు. సుమారు 20–30 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పనే లక్ష్యంగా ఈ పార్క్‌ను ఏర్పాటు చేశామన్నారు. స్థానిక పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా నైపుణ్యం కలిగిన కార్మికులు, టెక్నీషియన్లు, ఉద్యోగులను తీర్చిదిద్దేందుకు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ అవసరమైన శిక్షణనిస్తుందన్నారు.
ఇటీవల హర్యానా స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు సైతం తమ స్టడీటూర్‌లో భాగంగా ఈ కేంద్రాన్ని, పార్క్‌ను సందర్శించి స్ఫూర్తి పొందినట్లు తెలిపారు. కాగా ఈపార్క్‌లో సుమారు 60 శాతం స్థలాన్ని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించారు. ఈ పార్క్‌లో టౌన్‌షిప్ ఏర్పాటు ద్వారా వాక్‌టు వర్క్ కాన్సెప్ట్‌ను అమలు చేయనున్నారు. ఇప్పటికే ఈ పార్క్‌లో సుమారు 200 పరిశ్రమలు తమ కంపెనీలు నెలకొల్పే పనులు చేపట్టడం విశేషం. వచ్చే ఏడాది జూన్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆయాసంస్థలు చర్యలు చేపట్టాయి. ఇప్పటికే 30 పరిశ్రమలు ఈ పార్క్‌లో ఉత్పత్తులకు శ్రీకారం చుట్టాయి. మిగతా పరిశ్రమలు కూడా తమ కంపెనీల స్థాపనకు చర్యలు తీసుకుంటున్నాయి.
పలు పారిశ్రామిక పార్క్‌ల పరిశీలన తర్వాతే..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం దేశవ్యాప్తంగా పలు పారిశ్రామిక వాడలను పరిశీలించిన అనంతరమే టీఎస్‌ఐఐసీ, టీఐఎఫ్ సంస్థలు ఈ పార్క్‌ను అభివృద్ధి చేశాయి. దక్షిణాది రాష్ట్రాల్లో అతిపెద్ద ఎంఎస్‌ఎంఈ పార్క్ ఇదేనని తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్ ఫెడరేషన్ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. రూ.236 కోట్ల అంచనా వ్యయంతో విద్యుత్, మంచినీరు, రహదారులు, మురుగు నీటి పారుదల వ్యవస్థలను ఏర్పాటు చేశామన్నారు. ఈ పార్క్‌లో అంతర్భాగంగా 194 ఎకరాల్లో టౌన్‌షిప్ ఏర్పాటు చేయడంతోపాటు ఇందులో పాఠశాలలు, కమర్షియల్ మార్కెట్లు, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ పార్క్‌కు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ సంస్థనుంచి పలు అంశాల్లో ప్రశంసలు దక్కినట్లు పేర్కొన్నాయి. ఈ పార్క్‌లో సుమారు 40 వేల మొక్కలు నాటి హరితహారానికి చర్యలు తీసుకున్నామన్నాయి. (క్లిక్ చేయండి: ఇది బెంగళూరు కాదు సార్.. హైదరాబాదే!)
Comments
Please login to add a commentAdd a comment