SDC
-
విశాఖలో బీఈఎల్ ‘ఎస్డీసీ’
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వ నవరత్న కంపెనీ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) విశాఖపట్నంలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్(ఎస్డీసీ)ను ప్రారంభించింది. రక్షణతోపాటు వివిధ రంగాలకు సంబంధించి సురక్షితమైన ఐటీ సేవలను అందించడమే లక్ష్యంగా విశాఖలోని రామ్‌నగర్ ప్రాంతంలో ఈ ఎస్డీసీని ఏర్పాటు చేసినట్లు బీఈఎల్ శుక్రవారం ఒక ప్రకటన ద్వారా స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేసింది. 150 మంది ఇంజనీర్లు పని చేసేవిధంగా ఏర్పాటు చేసిన ఎస్డీసీ కేంద్రాన్ని ఇటీవల బీఈఎల్ డైరెక్టర్ (బెంగళూరు కాంప్లెక్స్) కె.వినయ్‌కుమార్ ప్రారంభించినట్లు వెల్లడించింది. బెంగళూరులోని స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్ (ఎస్‌బీయూ)ను విస్తరిస్తూ విశాఖలో ఎస్డీసీని ఏర్పాటు చేసినట్లు వివరించింది. బీఈఎల్‌కు చెందిన సాఫ్ట్వేర్ డివిజన్ ఇప్పటికే అతి కీలకమైన రక్షణ, ఎయిర్‌స్పేస్, ఈ–గవర్నెన్స్, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ వంటి రంగాల్లో అనేక ప్రాజెక్టులను విజయవంతంగా అమలుచేసింది. అత్యంత కీలకమైన విభాగాల్లో సురక్షితమైన ఐటీ సేవలను అందించే లక్ష్యంతో విశాఖలో ఎస్డీసీ యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఇక్కడ నుంచి డీఆర్డీవోతో కలిపి నేవీకి సంబంధించిన అన్ని రకాల ఐటీ ఆధారిత ప్రాజెక్టులను చేపట్టనుంది. వీటితోపాటు స్మార్ట్ సిటీ, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ రంగాల్లో అవసరమైన సాఫ్ట్వేర్ సొల్యూషన్స్‌ను అందించనున్నట్లు పేర్కొంది. ఆహ్లాదకరమైన, అత్యంత సురక్షిత వాతావరణంలో ఉద్యోగులు పనిచేసే విధంగా ఎస్డీసీ ఏర్పాటు చేసినట్లు వివరించింది. ఇప్పటికే ఐటీ రంగంలో దిగ్గజ సంస్థలు ఇన్ఫోసిస్, అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్, రాండ్‌స్టాడ్ వంటి ప్రతిష్టాత్మకమైన ఐటీ కంపెనీలను ఆకర్షించిన విశాఖ... తాజాగా మరో నవరత్న కంపెనీ బీఈఎల్ కూడా తమ యూనిట్‌ను ఏర్పాటు చేయడంతో రాష్ట్ర విద్యార్థులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. -
తెలంగాణలో అతిపెద్ద స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్.. ఎక్కడో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ యువతకు ఉపాధి లక్ష్యంగా నగరానికి ఆనుకుని యాదాద్రి జిల్లా పరిధిలోని దండుమల్కాపురం (ఎన్‌హెచ్– 65) వద్ద టీఎస్ఐఐసీ, తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్ ఫెడరేషన్ నిర్మిస్తోన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ (ఎస్డీసీ) డిసెంబరులో అందుబాటులోకి రానుంది. ఈ ప్రాంతంలో సుమారు 547 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నెలకొల్పిన ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పరిశ్రమల పార్క్‌కు ఎస్డీసీ తలమాణికం కానుంది. ఈపార్క్‌లో దశలవారీగా ప్రత్యక్ష, పరోక్షంగా సుమారు 20–30 వేల మందికి ఉపాధి కల్పించనున్నట్లు టీఎస్ఐఐసీ వర్గాలు తెలిపాయి. ఎస్‌డీసీపై కేటీఆర్ ట్వీట్.. ఇటీవల మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి కేటీఆర్ సైతం ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుపై సామాజిక మాధ్యమం ట్విటర్లో ట్వీట్ చేశారు. టీఎస్ఐఐసీ, తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన.. రాష్ట్రంలోనే అతిపెద్ద స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్, ఇండస్ట్రియల్ పార్క్ ఇదేనని పేర్కొన్నారు. దండుమల్కాపురం పార్క్‌లో సుమారు 589 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కొలువుదీరనున్నాయన్నారు. సుమారు 20–30 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పనే లక్ష్యంగా ఈ పార్క్‌ను ఏర్పాటు చేశామన్నారు. స్థానిక పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా నైపుణ్యం కలిగిన కార్మికులు, టెక్నీషియన్లు, ఉద్యోగులను తీర్చిదిద్దేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అవసరమైన శిక్షణనిస్తుందన్నారు. ఇటీవల హర్యానా స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు సైతం తమ స్టడీటూర్‌లో భాగంగా ఈ కేంద్రాన్ని, పార్క్‌ను సందర్శించి స్ఫూర్తి పొందినట్లు తెలిపారు. కాగా ఈపార్క్‌లో సుమారు 60 శాతం స్థలాన్ని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించారు. ఈ పార్క్‌లో టౌన్షిప్ ఏర్పాటు ద్వారా వాక్‌టు వర్క్ కాన్సెప్ట్‌ను అమలు చేయనున్నారు. ఇప్పటికే ఈ పార్క్‌లో సుమారు 200 పరిశ్రమలు తమ కంపెనీలు నెలకొల్పే పనులు చేపట్టడం విశేషం. వచ్చే ఏడాది జూన్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆయాసంస్థలు చర్యలు చేపట్టాయి. ఇప్పటికే 30 పరిశ్రమలు ఈ పార్క్‌లో ఉత్పత్తులకు శ్రీకారం చుట్టాయి. మిగతా పరిశ్రమలు కూడా తమ కంపెనీల స్థాపనకు చర్యలు తీసుకుంటున్నాయి. పలు పారిశ్రామిక పార్క్‌ల పరిశీలన తర్వాతే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం దేశవ్యాప్తంగా పలు పారిశ్రామిక వాడలను పరిశీలించిన అనంతరమే టీఎస్ఐఐసీ, టీఐఎఫ్ సంస్థలు ఈ పార్క్‌ను అభివృద్ధి చేశాయి. దక్షిణాది రాష్ట్రాల్లో అతిపెద్ద ఎంఎస్ఎంఈ పార్క్ ఇదేనని తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్ ఫెడరేషన్ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. రూ.236 కోట్ల అంచనా వ్యయంతో విద్యుత్, మంచినీరు, రహదారులు, మురుగు నీటి పారుదల వ్యవస్థలను ఏర్పాటు చేశామన్నారు. ఈ పార్క్‌లో అంతర్భాగంగా 194 ఎకరాల్లో టౌన్షిప్ ఏర్పాటు చేయడంతోపాటు ఇందులో పాఠశాలలు, కమర్షియల్ మార్కెట్లు, ఎంటర్టైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ పార్క్‌కు డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ సంస్థనుంచి పలు అంశాల్లో ప్రశంసలు దక్కినట్లు పేర్కొన్నాయి. ఈ పార్క్‌లో సుమారు 40 వేల మొక్కలు నాటి హరితహారానికి చర్యలు తీసుకున్నామన్నాయి. (క్లిక్ చేయండి: ఇది బెంగళూరు కాదు సార్.. హైదరాబాదే!) -
తాగునీటి ప్రతిపాదనలు రద్దు!
నీలగిరి : ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన తాగునీటి ప్రాజెక్టుల ప్రతిపాదనలు రద్దు చేసేదిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నియోజకవర్గ అభివృద్ధి నిధి (ఎస్డీసీ) కింద అప్పటి సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి జిల్లాకు కేటాయించిన రూ.12.30 కోట్ల పనులను నిలిపేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం...అదే తరహాలో తాగునీటి పథకాల ప్రాజెక్టుల కోసం రూపొం దించిన ప్రతిపాదనలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి హోదాలో జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి కొత్తగా తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టేందుకు గాను రూ.27.01 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో ఆగమేఘాల మీద ఈ ప్రతిపాదనలు తయారు చేశారు. అప్పట్లో ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ఇలా చేశారన్న ఆరోపణలూ వచ్చాయి. గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ నిబంధనల మేరకు కొత్త ప్రాజెక్టులు చేపట్టాలనుకున్నప్పుడు పార్ట్ -ఏ ప్రకారం తొలుత ప్రాజెక్టు ప్రదేశాలను సర్వే చేయడంతోపాటు వాటిని అన్ని రకాలుగా విచారణ చేస్తారు. రాష్ట్రస్థాయిలో టెక్నికల్ ఏజెన్సీ బృందం ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ ఏజెన్సీ ఆమోదం పొందిన తర్వాత పార్ట్ -బీ ప్రకారం ఆయా పనులకు టెండర్లు పిలుస్తారు. కానీ అంతకంటే ముందుగానే ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో టెండర్ల ప్రక్రియ నిలిచిపోయింది. ఇక ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ వాటర్ పవర్ గ్రిడ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతోపాటు, ఆ కార్యక్రమాన్ని నల్లగొండ జిల్లాలోనే శంకుస్థాపన చేస్తానని సీఎం కేసీఆర్ కరీంనగర్ సభలో ప్రకటించారు. దీంతో ఆయా తాగునీటి ప్రాజెక్టులు రద్దుచేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.