
విశాఖలో ఎస్‌డీసీని ప్రారంభిస్తున్న వినయ్‌కుమార్ తదితరులు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వ నవరత్న కంపెనీ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) విశాఖపట్నంలో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సెంటర్(ఎస్‌డీసీ)ను ప్రారంభించింది. రక్షణతోపాటు వివిధ రంగాలకు సంబంధించి సురక్షితమైన ఐటీ సేవలను అందించడమే లక్ష్యంగా విశాఖలోని రామ్‌నగర్ ప్రాంతంలో ఈ ఎస్‌డీసీని ఏర్పాటు చేసినట్లు బీఈఎల్ శుక్రవారం ఒక ప్రకటన ద్వారా స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేసింది.
150 మంది ఇంజనీర్లు పని చేసేవిధంగా ఏర్పాటు చేసిన ఎస్‌డీసీ కేంద్రాన్ని ఇటీవల బీఈఎల్ డైరెక్టర్ (బెంగళూరు కాంప్లెక్స్) కె.వినయ్‌కుమార్ ప్రారంభించినట్లు వెల్లడించింది. బెంగళూరులోని స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్ (ఎస్‌బీయూ)ను విస్తరిస్తూ విశాఖలో ఎస్‌డీసీని ఏర్పాటు చేసినట్లు వివరించింది. బీఈఎల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ డివిజన్ ఇప్పటికే అతి కీలకమైన రక్షణ, ఎయిర్‌స్పేస్, ఈ–గవర్నెన్స్, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ వంటి రంగాల్లో అనేక ప్రాజెక్టులను విజయవంతంగా అమలుచేసింది.
అత్యంత కీలకమైన విభాగాల్లో సురక్షితమైన ఐటీ సేవలను అందించే లక్ష్యంతో విశాఖలో ఎస్‌డీసీ యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఇక్కడ నుంచి డీఆర్‌డీవోతో కలిపి నేవీకి సంబంధించిన అన్ని రకాల ఐటీ ఆధారిత ప్రాజెక్టులను చేపట్టనుంది. వీటితోపాటు స్మార్ట్ సిటీ, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ రంగాల్లో అవసరమైన సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌ను అందించనున్నట్లు పేర్కొంది.
ఆహ్లాదకరమైన, అత్యంత సురక్షిత వాతావరణంలో ఉద్యోగులు పనిచేసే విధంగా ఎస్‌డీసీ ఏర్పాటు చేసినట్లు వివరించింది. ఇప్పటికే ఐటీ రంగంలో దిగ్గజ సంస్థలు ఇన్ఫోసిస్, అమెజాన్ డెవలప్‌మెంట్ సెంటర్, రాండ్‌స్టాడ్ వంటి ప్రతిష్టాత్మకమైన ఐటీ కంపెనీలను ఆకర్షించిన విశాఖ... తాజాగా మరో నవరత్న కంపెనీ బీఈఎల్ కూడా తమ యూనిట్‌ను ఏర్పాటు చేయడంతో రాష్ట్ర విద్యార్థులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment