నీలగిరి : ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన తాగునీటి ప్రాజెక్టుల ప్రతిపాదనలు రద్దు చేసేదిశగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నియోజకవర్గ అభివృద్ధి నిధి (ఎస్‌డీసీ) కింద అప్పటి సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి జిల్లాకు కేటాయించిన రూ.12.30 కోట్ల పనులను నిలిపేసిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం...అదే తరహాలో తాగునీటి పథకాల ప్రాజెక్టుల కోసం రూపొం దించిన ప్రతిపాదనలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి హోదాలో జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి కొత్తగా తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టేందుకు గాను రూ.27.01 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో ఆగమేఘాల మీద ఈ ప్రతిపాదనలు తయారు చేశారు.
అప్పట్లో ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ఇలా చేశారన్న ఆరోపణలూ వచ్చాయి. గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ నిబంధనల మేరకు కొత్త ప్రాజెక్టులు చేపట్టాలనుకున్నప్పుడు పార్ట్ -ఏ ప్రకారం తొలుత ప్రాజెక్టు ప్రదేశాలను సర్వే చేయడంతోపాటు వాటిని అన్ని రకాలుగా విచారణ చేస్తారు. రాష్ట్రస్థాయిలో టెక్నికల్ ఏజెన్సీ బృందం ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ ఏజెన్సీ ఆమోదం పొందిన తర్వాత పార్ట్ -బీ ప్రకారం ఆయా పనులకు టెండర్లు పిలుస్తారు. కానీ అంతకంటే ముందుగానే ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో టెండర్ల ప్రక్రియ నిలిచిపోయింది. ఇక ప్రస్తుతం టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ వాటర్ పవర్ గ్రిడ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతోపాటు, ఆ కార్యక్రమాన్ని నల్లగొండ జిల్లాలోనే శంకుస్థాపన చేస్తానని సీఎం కేసీఆర్ కరీంనగర్ సభలో ప్రకటించారు. దీంతో ఆయా తాగునీటి ప్రాజెక్టులు రద్దుచేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
తాగునీటి ప్రతిపాదనలు రద్దు!
Published Fri, Aug 8 2014 2:47 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement