Nilgiri mountain train: బిజీ జీవితాన్ని పక్కనపెట్టి.. అత్యంత నెమ్మదిగా ప్రయాణం చేయాలని ఉందా? ప్రకృతిని ఆస్వాదిస్తూ కన్నుల పండుగ చేసుకోవాలనిపిస్తోందా? అయితే మీకు పర్ఫెక్ట్ ఛాయిస్ ఈ రైలు. ఇది గంటకు 9 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తుంది. ఇంత ఆలస్యంగా వెళ్లే రైలునెవరైనా ఎక్కుతారా? అని సందేహించకండి. పూర్తిగా తెలుసుకుంటే ఎప్పుడెప్పుడు వెళ్దామా అనుకుంటారు.
మనదేశంలో విస్తృతమైన రైల్వే నెట్‌వర్క్ గురించి తెలిసిందే. కానీ అత్యంత నెమ్మదిగా వెళ్లడానికి ప్రసిద్ధి పొందిన ఈ రైలు తమిళనాడులోని నీలగిరి మౌంటైన్ రైల్వేలో ఉంది. ఇది అంత నెమ్మదిగా నడిచినా మీకు ఏమాత్రం బోర్ కొట్టదు. ఎందుకంటే ఈ ప్రయాణాన్ని అత్యద్భుతంగా మలుస్తుంది అక్కడి ప్రకృతి. మెట్టుపాలెం నుంచి ఊటీ వరకు.. దట్టమైన అడవులు, పచ్చని తేయాకు తోటలు, ఎప్పుడూ నిలువెల్లా తడిసి మెరిసే రాతి కొండలు అబ్బుర పరుస్తాయి.
ఇదంతా ఓకే.. కానీ ఆలస్యానికి కారణం మాత్రం.. అక్కడ ఉన్న వంతెనలు, సొరంగాలు. 100కు పైగా వంతెనల మీదుగా, 16 సొరంగాలలోంచి వెళ్తుంది. అత్యంత తీవ్రమైన ములుపులు వందకు పైనే ఉన్నాయి. మధ్యలో ఐదు స్టేషన్లు కూడా ఉన్నాయి. అందుకే 46 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ఐదు గంటలు పడుతుంది. ఇది మనదేశంలో అత్యంత వేగవంతమైన రైలు కంటే సుమారు 16 రెట్లు నెమ్మది. కానీ మీరు దారి పొడవునా నీలగిరి కొండల అందాలను ఆస్వాదించవచ్చు. ఊటీ నుంచి తిరిగి వెళ్లేటప్పుడు మాత్రం గంట తక్కువ సమయం తీసుకుంటుంది.
రైలు ప్రయాణానికే కాదు.. ఈ మార్గం నిర్మాణానికో చరిత్ర ఉంది. ఈ మార్గాన్ని 1854లో ప్రతిపాదించారు. కానీ ఎత్తైన పర్వతాలు ఉండటంతో ట్రాక్ నిర్మాణం చాలా కష్టమైంది. 1891లో మొదలుపెట్టి.. 1908లో పూర్తి చేశారు. ఇంతటి గొప్ప ట్రాక్‌మీద ప్రయాణించే రైలుకెంత ప్రత్యేకత ఉండాలో కదా! అందుకే ఈ రైలునూ అలాగే తయారు చేశారు. బోగీలన్నింటినీ కలపతో తయారు చేశారు.
చదవండి: బాలపిట్టలూ బయటికెగరండి
మేఘాలను ప్రతిబింబించే నీలి రంగు వేయడంతో వింటేజ్ భావన కలిగిస్తుంది. రైలులో నాలుగు బోగీలుంటాయి. ఫస్ట్ క్లాస్ బోగీలో 72 సీట్లు, సెకండ్ క్లాస్‌లో 100 సీట్లు ఉంటాయి. మొదట మూడు బోగీలే ఉండేవి. పర్యాటకులు పెరగడంతో అదనపు బోగీ ఏర్పాటు చేశారు. సెలవులు, వారాంతాల్లో బిజీగా ఉండే రైలులో ప్రయాణించాలంటే ముందే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment