గ్రాహం విలియం లిన్, సిల్వియా ప్లాసిక్ హనీమూన్ ట్రిప్
ఉదకమండలం (ఊటి) : లాహిరి లాహిరి లాహిరిలో.. ఓహో జగమే ఊగెనుగా.. తూగెనుగా అన్నట్టు సాగింది యూకేకు చెందిన గ్రాహం విలియం లిన్, సిల్వియా ప్లాసిక్ హనీమూన్ ట్రిప్. యునెస్కో గుర్తింపు పొందిన తమిళనాడులోని నీలగిరి పర్వతాల అందాలను ఈ జంట ప్రత్యేక రైలు (చార్టర్డ్ సర్వీసెస్)లో వీక్షించింది. 2.5 లక్షల రూపాయలు చెల్లించి ప్రత్యేక రైలులో.. ప్రత్యేక ప్రయాణం చేసిన ఇంగ్లిస్ కపుల్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
ప్రసిద్ద నీలగిరి పర్వతాల పర్యటన కోసం దక్షిణ రైల్వే ‘నీలగిరి మౌంటేన్ రైల్వే’పేరిట చార్టర్డ్ రైల్వే సర్వీసులను నడుపుతుండేది. అయితే, 1997లో మొదలైన ఈ సర్వీసులు 2004లో ఆగిపోయాయి. అధునాతన కోచ్‌లు, లోకోమోటివ్స్‌ను అందుబాటులోకి తెచ్చి రైల్వే శాఖ నీలగిరి మౌంటేన్ సర్వీసులను ఈ శుక్రవారం మళ్లీ పునఃప్రారంభించింది. లక్కీగా యూకే దంపతులు విలియం, సిల్వియాకు నీలగిరి మౌంటేన్ సర్వీసుల మొదటి ట్రిప్‌లో ప్రయాణించే అవకాశం వచ్చింది. దాంతో మూడు కోచ్‌ల ప్రత్యేక చార్టర్డ్‌లో.. పచ్చని ప్రకృతి నెలవైన నీలగిరి అందాలను ఆస్వాదిస్తూ.. 13 సొరంగాల గుండా పయనించి తమ జీవితంలో మరపురాని సంతోషాల్ని సొంతం చేసుకున్నారు. 143 సీట్ల సామర్థ్యం గల రైలు మొత్తాన్ని అద్దెకు తీసుకుని ఈ యూకే జంట హనీమూన్ ట్రిప్‌ను గ్రాండ్‌గా డిజైన్ చేసుకుంది. మెట్టుపాలెం నుంచి ఊటి వరకు 48 కిలోమీటర్లు సాగిన ఈ ప్రయాణం అయిదున్నర గంటల పాటు కొనసాగింది.
Comments
Please login to add a commentAdd a comment