Nilgiri Hills
-
గంటకు 9 కిలోమీటర్లు.. మనదేశంలో అత్యంత నెమ్మదిగా వెళ్లే రైలు ఇదే!
Nilgiri mountain train: బిజీ జీవితాన్ని పక్కనపెట్టి.. అత్యంత నెమ్మదిగా ప్రయాణం చేయాలని ఉందా? ప్రకృతిని ఆస్వాదిస్తూ కన్నుల పండుగ చేసుకోవాలనిపిస్తోందా? అయితే మీకు పర్ఫెక్ట్ ఛాయిస్ ఈ రైలు. ఇది గంటకు 9 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తుంది. ఇంత ఆలస్యంగా వెళ్లే రైలునెవరైనా ఎక్కుతారా? అని సందేహించకండి. పూర్తిగా తెలుసుకుంటే ఎప్పుడెప్పుడు వెళ్దామా అనుకుంటారు.మనదేశంలో విస్తృతమైన రైల్వే నెట్వర్క్ గురించి తెలిసిందే. కానీ అత్యంత నెమ్మదిగా వెళ్లడానికి ప్రసిద్ధి పొందిన ఈ రైలు తమిళనాడులోని నీలగిరి మౌంటైన్ రైల్వేలో ఉంది. ఇది అంత నెమ్మదిగా నడిచినా మీకు ఏమాత్రం బోర్ కొట్టదు. ఎందుకంటే ఈ ప్రయాణాన్ని అత్యద్భుతంగా మలుస్తుంది అక్కడి ప్రకృతి. మెట్టుపాలెం నుంచి ఊటీ వరకు.. దట్టమైన అడవులు, పచ్చని తేయాకు తోటలు, ఎప్పుడూ నిలువెల్లా తడిసి మెరిసే రాతి కొండలు అబ్బుర పరుస్తాయి. ఇదంతా ఓకే.. కానీ ఆలస్యానికి కారణం మాత్రం.. అక్కడ ఉన్న వంతెనలు, సొరంగాలు. 100కు పైగా వంతెనల మీదుగా, 16 సొరంగాలలోంచి వెళ్తుంది. అత్యంత తీవ్రమైన ములుపులు వందకు పైనే ఉన్నాయి. మధ్యలో ఐదు స్టేషన్లు కూడా ఉన్నాయి. అందుకే 46 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ఐదు గంటలు పడుతుంది. ఇది మనదేశంలో అత్యంత వేగవంతమైన రైలు కంటే సుమారు 16 రెట్లు నెమ్మది. కానీ మీరు దారి పొడవునా నీలగిరి కొండల అందాలను ఆస్వాదించవచ్చు. ఊటీ నుంచి తిరిగి వెళ్లేటప్పుడు మాత్రం గంట తక్కువ సమయం తీసుకుంటుంది.రైలు ప్రయాణానికే కాదు.. ఈ మార్గం నిర్మాణానికో చరిత్ర ఉంది. ఈ మార్గాన్ని 1854లో ప్రతిపాదించారు. కానీ ఎత్తైన పర్వతాలు ఉండటంతో ట్రాక్ నిర్మాణం చాలా కష్టమైంది. 1891లో మొదలుపెట్టి.. 1908లో పూర్తి చేశారు. ఇంతటి గొప్ప ట్రాక్‌మీద ప్రయాణించే రైలుకెంత ప్రత్యేకత ఉండాలో కదా! అందుకే ఈ రైలునూ అలాగే తయారు చేశారు. బోగీలన్నింటినీ కలపతో తయారు చేశారు. చదవండి: బాలపిట్టలూ బయటికెగరండిమేఘాలను ప్రతిబింబించే నీలి రంగు వేయడంతో వింటేజ్ భావన కలిగిస్తుంది. రైలులో నాలుగు బోగీలుంటాయి. ఫస్ట్ క్లాస్ బోగీలో 72 సీట్లు, సెకండ్ క్లాస్‌లో 100 సీట్లు ఉంటాయి. మొదట మూడు బోగీలే ఉండేవి. పర్యాటకులు పెరగడంతో అదనపు బోగీ ఏర్పాటు చేశారు. సెలవులు, వారాంతాల్లో బిజీగా ఉండే రైలులో ప్రయాణించాలంటే ముందే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నీలగిరి కొండల తొలి వెలుతురు
‘నీలగిరుల్లోని ప్రతి కొండ మాకు దేవునితో సమానం’ అంటుంది వాసమల్లి.నీలగిరిలో అంతరించిపోతున్న ‘తోడా’ తెగకు చెందిన వాసమల్లి ఆ తెగలో మొదటి గ్రాడ్యుయేట్. లిపిలేని తోడా భాషకు డిక్షనరీ తయారు చేసే పనిలో ఉంది. తోడా తెగ పాటలను సేకరిస్తే సాహిత్య అకాడెమీ ప్రచురించింది. ‘చంద్రునిలో ఉండే కుందేలు మా తెగదేనని మా విశ్వాసం’ అందామె.‘ఊటీ’ అని అందరూ పిలుచుకునే ‘టూరిస్ట్ కేంద్రం’లో తోడా తెగ విశిష్ట జీవనాన్ని నమోదు చేస్తున్న వాసమల్లి జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో మాట్లాడింది. ఆయుష్మంతులు తోడాలు కొండగొర్రెల్లా తిరుగుతూనే ఉంటారు. అడవి పళ్లు, ఆకుకూరలు తింటారు. ప్రశాంతంగా జీవిస్తారు. రోగాలు రావు. నూరేళ్లు సులువుగా బతుకుతారు. డబ్బు దాదాపుగా ఎవరి దగ్గరా ఉండదు. దానికి పెద్దగా విలువ లేదు. తోడాలు చేతి ఎంబ్రాయిడరీలో నిష్ణాతులు. తెలుపు, ఎరుపు, నలుపు రంగులు మాత్రమే వాడుతూ అందమైన ఎంబ్రాయిడరీ కంబళ్లు అల్లుతారు. తెలుపు బాల్యానికి, ఎరుపు యవ్వనానికి, నలుపు పరిణితికి గుర్తుగా భావిస్తారు. – వాసమల్లి ‘నీలగిరి కొండల్లో విహారానికి వచ్చేవాళ్లు మేం మాట్లాడుకునే భాష విని భలే ఉందే, ఇదేం భాష అనుకుంటారు. మా తర్వాతి తరాలు అలా అనుకోకూడదని తోడా భాషను కాపాడే ప్రయత్నం చేస్తున్నాను. మా భాషకు లిపి లేదు. కాని యాభైకి మించిన ధ్వన్యక్షరాలు ఉన్నాయి. వాటిని నమోదు చేస్తున్నాను. తోడా డిక్షనరీ తయారు చేస్తున్నాను. తోడాలు పాడుకునే పాటలు, చెప్పుకునే కథలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని సేకరించి పుస్తకం వేశాను’ అంటుంది వాసమల్లి.అరవై ఏళ్లు దాటిన వాసమల్లి కేవలం 1500 మంది మాత్రమే మిగిలిన తోడా తెగకు ప్రతినిధి.‘నీలగిరుల్లో మొత్తం ఆరు తెగలు ఉన్నాయి. అన్నీ అంతరించిపోయే ప్రమాదపు అంచున ఉన్నాయి’ అంటుందామె. జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో జానపదుల కథల గురించి మాట్లాడడానికి వచ్చిన వాసమల్లి ‘ఆదిమ తెగలు మానవ నాగరికతకు పాదముద్రలు. భాష మరణిస్తే సమూహం కూడా మరణిస్తుంది. మా తోడా భాష ఎంతో సుందరమైనది. మా తర్వాతి తరాలు దానిని కాపాడుకోవాలనేదే నా తపన’ అంది. బర్రెలే ఆస్తి ‘తోడాలకు బర్రెలే ఆస్తి. నీలగిరుల్లోని కొండ బర్రెలు ప్రత్యేకంగా ఉంటాయి. వాటిని ‘ఇర్ర్’ అంటారు. వాటి పాల నుంచి తీసిన నెయ్యితో మాత్రమే మేము దేవుని దీపాలను వెలిగించాలి. వాటిని మేము దైవాంశాలుగా చూస్తాం. తోడాలు శాకాహారులు. ఇర్ర్లను కోయడం, తినడం చేయం. మా తోడాల్లో ఎవరైనా చనిపోతే ఒక బర్రెను ఎంపిక చేసి పడమరవైపు తోలేస్తాం. అది కూడా ఏదో ఒక రోజున మరణించి ఆ చనిపోయిన వ్యక్తి దగ్గరకు తోడు కోసం వెళుతుందని మా నమ్మకం’ అని చెప్పిందామె. చంద్రుని పై కుందేలు ‘తోడాలు ఏది దొరికినా పంచుకుని తినాలి. ఒకసారి ఒక తోడా తేనె దొరికితే వెదురుబొంగులో తన కోసం దాచుకుని ఇంటికి బయలుదేరాడట. అతనిలోని దురాశ వెంటనే పాములా మారి వెంటబడింది. అతను పరిగెడుతూ చేతిలోని వెదురుబొంగును కింద పడేస్తే అది పగిలి తేనె కుందేలు మీద చిందింది. పాము ఆ కుందేలు వెంట పడింది. కుందేలు భయంతో సూర్యుడి వైపు పరిగెడితే నేను చాలా వేడి... చంద్రుడి దగ్గరకు వెళ్లి దాక్కో అన్నాడు. కుందేలు చటుక్కున చంద్రుడిలో వెళ్లి దాక్కుంది. అందుకని చంద్రుడిలోని కుందేలు మా పూర్వికురాలనుకుంటాం. చంద్రగ్రహణం రోజున చంద్రుణ్ణి రాహువు వదిలే వరకూ కుందేలు క్షేమం కోసం భోరున విలపిస్తాం’ అని తెలిపిందామె. మొదటి గ్రాడ్యుయేట్ నీలగిరి కొండల్లో గిరిజనవాడలను ‘మండ్’ అంటారు. అలాంటి మండ్‌లో పుట్టిన వాసమల్లి చిన్నప్పటి నుంచి చదువు మీద ఆసక్తితో హైస్కూల్ వరకూ చదువుకుంది. చిన్న వయసు పెళ్లి తప్పించుకోవడానికి ఇంటర్, డిగ్రీ చదివింది. తర్వాత ఊటీలోని ‘హిందూస్థాన్ ఫొటో ఫిల్మ్ ఫ్యాక్టరీ’లో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యింది. ఆ సంస్థ ఉద్యోగినే పెళ్లి చేసుకుంది. ఆమెకు ఇద్దరు కొడుకులు. ఒక కొడుకు ఉద్యోగం చేస్తుంటే, మరో కొడుకు ఊటీలో గైడ్‌గా పని చేస్తున్నాడు. ‘నా పరిశోధనకు పెద్దగా సపోర్ట్ ఏమీ దొరకడం లేదు. మా నీలగిరుల్లో యాభై కొండలకు యాభై కథలు ఉన్నాయి. సేకరిస్తున్నాను. ఎలా ప్రచురించాలో ఏమిటో’ అంటున్న ఆమె ఒక తొలి వెలుగుగా అనిపించింది. ఆ దీపం నుంచి మరో దీపం వెలుగుతూ వెళ్లాలని కోరుకుందాం. - ఇంటర్వ్యూ: జైపూర్ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి -
గడ్డ కడుతున్న హిల్ స్టేషన్స్, వణుకుతున్న జనం: నిపుణుల ఆందోళన
తమిళనాడులోని కొన్ని జిల్లాలు, పర్వత ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల సెల్సియస్‌కు చేరడానికి చేరువలో ఉన్నాయి. ముఖ్యంగా ప్రధాన హిల్ స్టేషన్ ఊటీలో 2.3 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా , నీలగిరిలోని శాండినాళ్ల రిజర్వాయర్ ప్రాంతంలో ఉష్ణోగ్రత జీరో డిగ్రీలకు పడిపోయింది. ఫలితంగా ఉదయం భారీ మంచు కప్పేయడంతో సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. ఊటీ, నీలగిరి కొండ ప్రాంత వాసులు విపరీతమైన చలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో పాటు దట్టమైన పొగమంచుతో స్థానికులు ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఇంతకుముందెన్నడూ చూడలేదని వాపోతున్నారు. మరోవైపు పర్యావరణ వేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులోని ఈ ప్రాంతం మరికొన్ని రోజుల్లో గట్టకట్టుకు పోతుందంటూ హెచ్చరిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్, ఎల్-నినో ప్రభావం వల్ల ఈ మార్పు వచ్చిందని నీలగిరి ఎన్వైర్ మెంట్ సోషల్ ట్రస్ట్ (NEST)కి చెందిన వి శివదాస్ చెబుతున్నారు.చలి తీవ్రత ముదురుతోందని ఇలాంటి వాతావరణ మార్పు నీలగిరికి పెద్ద సవాల్ అని, దీనిపై అధ్యయనం జరగాలని అన్నారు.అంతేకాదు ఈ వాతావరణ పరిస్థితి పెద్ద ఎత్తున చేపట్టిన టీ ప్లాంటేషన్‌కు కూడా సవాల్‌గా మారింది. అధికారిక సమాచారం ప్రకారం, ఉదగమండలంలోని కాంతల్, తలైకుంటలో ఒక డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది, బొటానికల్ గార్డెన్లో 2 డిగ్రీల సెల్సియస్ , శాండినాళ్లలో 3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో చాలా చోట్ల, ప్రజలు చలి మంటలు వేసుకుంటూ వెచ్చగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే రాబోయే నెలల్లో వ్యవసాయం ఇతర ఉత్పత్తిపై ప్రభావం చూపుతుందని భయాందోళన వ్యక్తం చేశారు స్థానిక రైతులు. ముఖ్యంగా క్యాబేజీలపై వాతావరణం ప్రభావం చూపిందని కూరగాయల రైతులంటున్నారు. అటు చలిగాలుల కారణంగా పని నిమిత్తం త్వరగా ఇంటి నుంచి బయటకు వెళ్లడం కష్టంగా ఉందని ప్రభుత్వ ఉద్యోగి ఎన్ రవిచంద్రన్ తెలిపారు. దట్టమైన పొగమంచు కమ్ముకున్న దృశ్యాలు పర్యాటకులను అబ్బుర పరుస్తున్నప్పటికీ గతకొన్ని రోజులుగా పాటు, విపరీతమైన చలితో ప్రజలు ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్వాసలో ఇబ్బందులు, తీవ్రమైన తలనొప్పి, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలతో అక్కడి జనం అల్లాడిపోతున్నారు. #WATCH | Tamil Nadu: Temperature dips to 0°C in the Sandynalla reservoir area in Tamil Nadu's Nilgiris. Hill station Ooty recorded 2.3°C resulting in heavy frost in the morning. pic.twitter.com/MBqR7c6B9z — ANI (@ANI) January 18, 2024 -
'అరుదైన జంతువును దగ్గర్నుంచి చూశాను'
-
'అరుదైన జంతువును దగ్గర్నుంచి చూశాను'
ముంబై : సోషల్ మీడియాలో కొన్నిసార్లు మనం చూసే వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. మనకు కనిపించని కొన్ని వింత జంతువులు, పక్షులను ఫోటోలను తీసి షేర్ చేయగానే వైరల్‌గా మారుతుంటాయి. తాజాగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుధా రామెన్ షేర్ చేసిన వీడియో ఈ కోవకు చెందిందే. స్వతహాగా దక్షిణ భారతంలో పశ్చిమ కనుమల్లో అత్యంత అరుదుగా కనిపించే మాట్రెన్ జాతికి చెందిన నీలగిరి పిల్లిని షేర్ చేశారు. 'మీరు అనుకున్నట్లు ఇది బ్లాక్ పాంథర్ కాదు.. అంతరించిపోతున్న జంతువుల్లో ఒకటిగా ఉన్న నీలగిరి పిల్లి. భారత్‌లో దక్షిణ భాగంలో ఉన్న పశ్చిమ కనుమల్లో నివసించే ఈ జంతువు అరుదుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ జంతువు అంతరించే దశలో ఉంది. ఇవాళ నా కంటికి ఇది చిక్కడంతో మీతో షేర్ చేసుకున్నా' అంటూ చెప్పుకొచ్చారు. అయితే చూడడానికి బ్లాక్ పాంథర్‌లా కనిపించే నీలగిరి పిల్లి మెడ కింది బాగం పసుపు, నలుపు రంగులో మిలితమై ఉంటుంది. నీలగిరి పిల్లి.. 2.1 కేజీల బరువు, 40-45 సెం.మీ పొడవు తోకతో ఉంటుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జీవ జాతుల ప్రపంచ పరిరక్షణ స్థితిని అధ్యయనం చేసే ఐయుసిఎన్ (ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్) రెడ్ లిస్ట్‌లో(ప్రమాదకర స్థితి) నీలగిరి పిల్లిని ఒకటిగా చేర్చారు. -
నీలగిరి కొండల్లో కార్చిచ్చు
-
ప్రెగ్నెన్సీ వస్తేనే పెళ్లి!
చెన్నై: అడవుల్లో నివసించే ఆదివాసీల సంప్రదాయాలు ఆధునికులకు వింతగా ఉంటాయి. ఒక్కో తెగ పద్దతులు ఒక్కోలా ఉంటాయి. అలాగే తమిళనాడు అడవుల్లో నివసించే టోడ అనే గిరిజన తెగ సంప్రదాయాలు చూడటానికి, వినడానికి విచిత్రంగా ఉంటాయి. నీలగిరి అడవుల్లో ఉండే ఈ తెగ పెళ్లి విషయంలో వింత ఆచారాన్ని పాటిస్తారు. ఆ పెళ్లి స్పెషాలిటీ ఏమిటంటే.... టోడ గిరిజన తెగలో పెళ్లివేడుక సాధారణంగా నిర్వహిస్తారు. పెళ్లి తర్వాత వధువు, వరుడితో గడుపుతుంది. అనంతరం వధువు తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోతుంది. ఆ సమయంలో పెళ్లి కూతురు కచ్ఛితంగా నెల తప్పాల్సిందే. గర్భం ధరించకపోతే ఆ వివాహం చెల్లదు. నెల తప్పితే ఏడో నెలకు భర్త అడవికి వెళ్ళి పవిత్రంగా భావించే చెట్టు కాండంతో విల్లు, బాణం తయారు చేసి భార్యకు ఇస్తారు. ఆవస్తువులు భార్యకు నచ్చి తీసుకొంటే అతడిని భర్తగా అంగీకరించినట్లు. అంతేకాదు కడుపులో ఉన్న బిడ్డకు తండ్రిగా కూడా ఒప్పుకొంటుంది. ఈకార్యక్రమం అనంతరం విల్లు, బాణం వేడుకలు భారీ ఎత్తున జరుపుతారు. సంప్రదాయ నృత్యాలు పాటలతో ఘనంగా సంబరాలు చేసుకొంటారు. ఈ వేడుకలు అనంతరం ఇరువురు పెద్దల ఆశీర్వాదంతో అప్పటి నుంచి భార్యాభర్తల్లా జీవితాంతం కలిసి ఉంటారు. -
వివేకం: ఆడు! ఆటలాడు!!
శరీరారోగ్యానికి ముఖ్యమైనవి ఆటలు. స్కూల్లో చదువుకునే రోజుల్లో, నేను ఆడని ఆట లేదనే చెప్పాలి. తాడు పట్టుకుని పైకి పాకడం, శరీరాన్ని వంపులు తిప్పుతూ చేసే విన్యాసం, బాక్సింగ్, కబడ్డీ, బ్యాడ్మింటన్ దేన్నీ వదిలిపెట్టలేదు. నా చిన్నవయసులో ఎవరు క్రికెట్ ఆడుతున్నా వెళ్లేవాణ్ని. బ్యాటింగ్ లభించేది కాదు, ఫీల్డింగ్ దొరికేది. దాంతోనే ఎంతో సంతోషం. ఈ రోజుల్లో కూడా పిల్లలెవరైనా ఆటలాడుతుంటే, నాకు నేనే వెళ్లి వారి ఆటల్లో పాల్గొంటాను. కాలేజీలో చేరిన తర్వాత హాకీ జట్టులో చోటు దొరికింది. ఆ వయసులో మిగతా ఆటల్లో కన్నా, మోటర్‌బైక్ నడపడంలో, ఆకాశంలో ఎగరడంలో ఉత్సాహం ఉండేది. కొన్ని నిమిషాల పాటు గాలిలో ఎగరాలంటే, ఎన్నో గంటలు శిక్షణ అవసరమయ్యేది. నాకప్పుడు ఇరవై రెండేళ్ల వయసు. ఒకసారి, నీలగిరి కొండల మీద గ్లైడర్‌తో ఎగిరాను. ఎక్కడో, చాలా దూరాన దిగాను. సూర్యుణ్ని చూసి దిశను నిర్ణయించుకుని నడవడం మొదలుపెట్టాను. నడుస్తూ ఉన్నాను. రాత్రి, పగలు చూడకుండా నడుస్తూనే ఉన్నా. వెంట తెచ్చుకున్న ఒకే ఒక శాండ్విచ్ తినేశాను. ఆకలి తీరలేదు. అక్కడక్కడా ఒకటి రెండు గ్రామాలు కనిపించాయి. అక్కడి ప్రజలకు తమిళం తప్పించి మరో భాష తెలియదు. అప్పుడు నాకు తమిళం మాట్లాడ్డం రాదు. ఎలాగో, ఒక టీ కొట్టు కనిపించింది. వేడి వేడి ఇడ్లీలు కనిపించాయి. నా ఆకలికి పాతిక ఇడ్లీలు లాగించేద్దాం అనిపించింది. పర్సు చూసుకున్నాను.ఇలా ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. అంత డబ్బూ ఖర్చు చేయలేక, రూపాయిన్నర ఖర్చుతో, రెండే రెండు ఇడ్లీలు తిని సరిపెట్టుకున్నాను. నా జట్టు మనుషులు, రెండున్నర రోజుల తర్వాత నన్ను కలిశారు. ఇంత జరిగినా, నాలో ఎగరాలనే ఆశ కొంచెం కూడా తగ్గలేదు. కరకు హృదయాలతో కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను కూడా ఆటలు సహజమైన స్థితికి తీసుకురావడం కళ్లారా చూశాను. మొదటిసారి ఖైదీలను కలవడానికి పర్మిషన్ దొరికింది. చెరసాలలో అడుగిడగానే అక్కడి వాతావరణంలో తీరని శోకం ఉన్నట్లు తోచింది. దాదాపు 200 మందిని ఆటలాడుకునే మైదానానికి రమ్మని ఆహ్వానించాను. ‘‘పాఠాలు వినడానికి మిమ్మల్ని పిలవడం లేదు. మీతో బంతాట ఆడుకోవడానికే పిలిచాను’’ అన్నాను. వారి మొహాల్లో కొద్దిగా మార్పు గోచరించింది. ఆట ప్రారంభమైంది. మొదట తటపటాయించినా, పది పదిహేను నిమిషాల్లో వారు తమను తాము మర్చిపోయారు. పూర్తిగా ఆటలో లీనమైపోయారు. అరుస్తూ, ఒకరినొకరు తగులుకుంటూ, తోసుకుంటూ చిన్నపిల్లల్లా ఆటలో మునిగిపోయారు. ఆట ముగిసిన తర్వాత, నేను బయల్దేరే సమయంలో ‘వెళ్లకండి’ అంటూ, కొందరు నా చేతులు పట్టుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఆట మహాత్మ్యం అది. - జగ్గీ వాసుదేవ్ సమస్య - పరిష్కారం వృత్తిపరంగా నేను మరీ మంచిగా ఉంటే పనులు జరగడం లేదు. అందువల్ల కోపం నాకు మంచి మార్గమా? - ఎస్.గోపాల్, హైదరాబాద్ సద్గురు: మీరు ప్రపంచంలో చేసేవి వృత్తిలాగా చేయడం కన్నా ఔత్సాహికునిలా చేయడం, అంటే చేయడంలోని ఆనందం తెలియడం వల్ల చేసేవానిగా చేయడం మంచిది. ఔత్సాహికునిగా చేసేవాడు, చేయడంలోని అంతరార్థం తెలిసినవాడు. వృత్తిపరంగా చేసేవాడికి దాని విలువ తెలియదు. అతను అది చేయడానికి కారణం, ఆ చేయడం వల్ల అతనికేదో లాభం ఉంది కాబట్టే. అటువంటి జీవితం చాలా రసహీనమైంది. మీలో నిమగ్నత ఉంటే మీద్వారా సహజంగానే కొన్ని పనులు జరుగుతాయి. అది ఎంతో మనోహరంగా ఉంటుంది. నిమగ్నత లేకుండా చేసే పనులు వికృతంగా ఉంటాయి. అంటే మీరు వృత్తిలాగా చేస్తే, జీవితం వికారంగా ఉంటుంది. అదే ఔత్సాహికునిగా చేస్తే ఫరవాలేదు. అదే లాభాపేక్ష లేకుండా, స్వేచ్ఛగా చేస్తే, మీరు ఎంతో ఉత్సాహంగా చేయొచ్చు. అది మరింత అద్భుతం. మీరు వృత్తిపరంగా చేయడమే కాక, కోపం కూడా అదనపు చిక్కు. ఈ కోపం పాత్ర ఏమిటి? మీరు అలా చెబితే మనుషులు వినరు. వినాలంటే, దానికి నిమగ్నత కావాలి. మీరు ఎంతో నిమగ్నతతో, ఉత్సాహంతో చెబితే చుట్టూ ఉన్నవారందరూ స్పందిస్తారు.