వివేకం: ఆడు! ఆటలాడు!!
శరీరారోగ్యానికి ముఖ్యమైనవి ఆటలు. స్కూల్లో చదువుకునే రోజుల్లో, నేను ఆడని ఆట లేదనే చెప్పాలి. తాడు పట్టుకుని పైకి పాకడం, శరీరాన్ని వంపులు తిప్పుతూ చేసే విన్యాసం, బాక్సింగ్, కబడ్డీ, బ్యాడ్మింటన్ దేన్నీ వదిలిపెట్టలేదు. నా చిన్నవయసులో ఎవరు క్రికెట్ ఆడుతున్నా వెళ్లేవాణ్ని. బ్యాటింగ్ లభించేది కాదు, ఫీల్డింగ్ దొరికేది. దాంతోనే ఎంతో సంతోషం. ఈ రోజుల్లో కూడా పిల్లలెవరైనా ఆటలాడుతుంటే, నాకు నేనే వెళ్లి వారి ఆటల్లో పాల్గొంటాను. కాలేజీలో చేరిన తర్వాత హాకీ జట్టులో చోటు దొరికింది. ఆ వయసులో మిగతా ఆటల్లో కన్నా, మోటర్‌బైక్ నడపడంలో, ఆకాశంలో ఎగరడంలో ఉత్సాహం ఉండేది. కొన్ని నిమిషాల పాటు గాలిలో ఎగరాలంటే, ఎన్నో గంటలు శిక్షణ అవసరమయ్యేది.
నాకప్పుడు ఇరవై రెండేళ్ల వయసు. ఒకసారి, నీలగిరి కొండల మీద గ్లైడర్‌తో ఎగిరాను. ఎక్కడో, చాలా దూరాన దిగాను. సూర్యుణ్ని చూసి దిశను నిర్ణయించుకుని నడవడం మొదలుపెట్టాను. నడుస్తూ ఉన్నాను. రాత్రి, పగలు చూడకుండా నడుస్తూనే ఉన్నా. వెంట తెచ్చుకున్న ఒకే ఒక శాండ్‌విచ్ తినేశాను. ఆకలి తీరలేదు. అక్కడక్కడా ఒకటి రెండు గ్రామాలు కనిపించాయి. అక్కడి ప్రజలకు తమిళం తప్పించి మరో భాష తెలియదు. అప్పుడు నాకు తమిళం మాట్లాడ్డం రాదు.
ఎలాగో, ఒక టీ కొట్టు కనిపించింది. వేడి వేడి ఇడ్లీలు కనిపించాయి. నా ఆకలికి పాతిక ఇడ్లీలు లాగించేద్దాం అనిపించింది. పర్సు చూసుకున్నాను.ఇలా ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. అంత డబ్బూ ఖర్చు చేయలేక, రూపాయిన్నర ఖర్చుతో, రెండే రెండు ఇడ్లీలు తిని సరిపెట్టుకున్నాను. నా జట్టు మనుషులు, రెండున్నర రోజుల తర్వాత నన్ను కలిశారు. ఇంత జరిగినా, నాలో ఎగరాలనే ఆశ కొంచెం కూడా తగ్గలేదు. కరకు హృదయాలతో కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను కూడా ఆటలు సహజమైన స్థితికి తీసుకురావడం కళ్లారా చూశాను. మొదటిసారి ఖైదీలను కలవడానికి పర్మిషన్ దొరికింది. చెరసాలలో అడుగిడగానే అక్కడి వాతావరణంలో తీరని శోకం ఉన్నట్లు తోచింది. దాదాపు 200 మందిని ఆటలాడుకునే మైదానానికి రమ్మని ఆహ్వానించాను.
‘‘పాఠాలు వినడానికి మిమ్మల్ని పిలవడం లేదు. మీతో బంతాట ఆడుకోవడానికే పిలిచాను’’ అన్నాను. వారి మొహాల్లో కొద్దిగా మార్పు గోచరించింది. ఆట ప్రారంభమైంది. మొదట తటపటాయించినా, పది పదిహేను నిమిషాల్లో వారు తమను తాము మర్చిపోయారు. పూర్తిగా ఆటలో లీనమైపోయారు. అరుస్తూ, ఒకరినొకరు తగులుకుంటూ, తోసుకుంటూ చిన్నపిల్లల్లా ఆటలో మునిగిపోయారు. ఆట ముగిసిన తర్వాత, నేను బయల్దేరే సమయంలో ‘వెళ్లకండి’ అంటూ, కొందరు నా చేతులు పట్టుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఆట మహాత్మ్యం అది.
- జగ్గీ వాసుదేవ్
సమస్య - పరిష్కారం
వృత్తిపరంగా నేను మరీ మంచిగా ఉంటే పనులు జరగడం లేదు. అందువల్ల కోపం నాకు మంచి మార్గమా?
- ఎస్.గోపాల్, హైదరాబాద్
సద్గురు: మీరు ప్రపంచంలో చేసేవి వృత్తిలాగా చేయడం కన్నా ఔత్సాహికునిలా చేయడం, అంటే చేయడంలోని ఆనందం తెలియడం వల్ల చేసేవానిగా చేయడం మంచిది. ఔత్సాహికునిగా చేసేవాడు, చేయడంలోని అంతరార్థం తెలిసినవాడు. వృత్తిపరంగా చేసేవాడికి దాని విలువ తెలియదు. అతను అది చేయడానికి కారణం, ఆ చేయడం వల్ల అతనికేదో లాభం ఉంది కాబట్టే. అటువంటి జీవితం చాలా రసహీనమైంది. మీలో నిమగ్నత ఉంటే మీద్వారా సహజంగానే కొన్ని పనులు జరుగుతాయి. అది ఎంతో మనోహరంగా ఉంటుంది. నిమగ్నత లేకుండా చేసే పనులు వికృతంగా ఉంటాయి.
అంటే మీరు వృత్తిలాగా చేస్తే, జీవితం వికారంగా ఉంటుంది. అదే ఔత్సాహికునిగా చేస్తే ఫరవాలేదు. అదే లాభాపేక్ష లేకుండా, స్వేచ్ఛగా చేస్తే, మీరు ఎంతో ఉత్సాహంగా చేయొచ్చు. అది మరింత అద్భుతం. మీరు వృత్తిపరంగా చేయడమే కాక, కోపం కూడా అదనపు చిక్కు. ఈ కోపం పాత్ర ఏమిటి? మీరు అలా చెబితే మనుషులు వినరు. వినాలంటే, దానికి నిమగ్నత కావాలి. మీరు ఎంతో నిమగ్నతతో, ఉత్సాహంతో చెబితే చుట్టూ ఉన్నవారందరూ స్పందిస్తారు.