సోషల్ ఇన్ ఫ్లుయెన్సర్ కీ రోల్ | The key role of social influencers | Sakshi
Sakshi News home page

సోషల్ ఇన్ ఫ్లుయెన్సర్ కీ రోల్

Published Thu, Jan 16 2025 5:04 AM | Last Updated on Thu, Jan 16 2025 2:00 PM

The key role of social influencers

వివిధ రకాల వస్తువుల కొనుగోళ్లలో 82 శాతం మందిపై వీరి ప్రభావం  

సోషల్‌ మీడియా, ఇతర మాధ్యమాల్లో వారు పెట్టే పోస్ట్‌లు, వారు సిఫార్సు చేసే వస్తువులకు పెరుగుతున్న డిమాండ్‌  

సాక్షి, హైదరాబాద్‌ : కొత్త టెక్నాలజీ సర్వత్రా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ‘సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు’ (social influencers) వివిధ అంశాల్లో కీలక భూమిక పోషిస్తున్నారు. ప్రతిరోజూ ఒక కొత్త ఆవిష్కరణలు, కొత్త వస్తువులు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ ఉత్పత్తుల విక్రయాలు పెంచుకునేందుకు ఉత్పత్తి, మార్కెటింగ్‌ సంస్థలు కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నాయి. 

కొత్త ఉత్పత్తులు కొనుగోలు చేసేలా వినియోగదారుల దృష్టిని ఆకర్షించేందుకు నూతన పంథాను అనుసరిస్తున్నాయి. ప్రస్తుతం సోషల్, డిజిటల్‌ మీడియా (Digital Media) ఇతర మాధ్యమాల ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, (Instagram) ఎక్స్‌ (ట్విట్టర్‌).. ఇలా వివిధ రకాల ప్లాట్‌ఫామ్స్‌పై యువతరంతోపాటు వివిధ వయసుల వారు అధిక సమయమే గడుపుతున్నారు. 

ఈ నేపథ్యంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, వారి కొనుగోలు చేస్తున్న వస్తువులు, వివిధ కంపెనీల వస్తువులకు వారు చేస్తున్న ‘ఎండార్స్‌మెంట్స్‌’కు ఎక్కడ లేని ప్రాధాన్యం ఏర్పడింది. కొందరైతే సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్స్‌నే తమ వృత్తిగానూ ఎంచుకొని ముందుకు సాగుతున్నారు. నేటి ఆధునిక సమాజంలో మారుతున్న ప్రజల అభిరుచులకు అనుగుణంగా...కంపెనీలు కూడా మార్కెటింగ్‌ వ్యూహాలను మార్చేస్తున్నాయి. గతంలో ఏదైనా ఒక యాడ్‌ ఏజెన్సీ ద్వారానో, మరో రూపంలోనో తమ ఉత్పత్తులను ప్రచారం చేసి ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నాలు చేసేవి.  

ఎవరెంత...?
మెగా ఇన్‌ఫ్లుయెన్సర్లు :  సోషల్‌ మీడియా, ఇతర మాధ్యమాల్లో 10 లక్షలు.. ఆపై ఫాలోవర్లు కలిగి ఉన్నవారు

మాక్రో ఇన్‌ఫ్లుయెన్సర్లు : సామాజిక మాధ్యమాల్లో 5 లక్షలు.. ఆపై ఫాలోవర్లు కలిగిన వారు

మిడ్‌టైర్‌–ఇన్‌ఫ్లుయెన్సర్లు :  50 వేల నుంచి 5లక్షల  దాకా ఫాలోవర్లు  ఉన్నవారు

మైక్రో ఇన్‌ఫ్లుయెన్సర్లు :  10 వేల నుంచి 50 వేల వరకు ఫాలోవర్లు కలిగి ఉన్నవారు

నానో–ఇన్‌ఫ్లుయెన్సర్లు :   10 వేల వరకు ఫాలోవర్లు కలిగిన వారు

వేగంగా విస్తరిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్‌ మార్కెటింగ్‌
గతానికి పూర్తి భిన్నంగా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ప్రముఖుల ద్వారా వినూత్న పద్ధతుల్లో ప్రచారానికి దిగుతున్నాయి. ప్రజాసంబంధాల వ్యవస్థకు కొత్త భాష్యం చెప్పేలా ఇన్‌ఫ్లుయెన్సర్‌ మార్కెటింగ్‌ అనేది వేగంగా విస్తరిస్తోంది. వివిధ బ్రాండ్‌లకు సంబంధించి టార్గెట్‌ వినియోగదారులను చేరుకునేందుకు ఇన్‌ఫ్లుయెన్సర్ల ద్వారా కంపెనీలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. 

డిజిటల్, సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, లక్షలాది మంది ఫాలోవర్లు కలిగిన వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు, ప్రముఖుల ద్వారా వివిధ కస్టమర్లను చేరుకునే ప్రయత్నాలను ఇప్పుడు తీవ్రతరం చేశాయి. సామాజిక మాధ్యమాల్లో డిజిటల్‌ పర్సనాలిటీలుగా పేరుగాంచిన వ్యక్తుల ద్వారా వినియోగదారులకు ఆకర్షించడం ద్వారా పబ్లిక్‌ రిలేషన్స్‌ క్యాంపెయిన్‌ను ఉధృతం చేస్తున్నాయి. 

వివిధ ప్రముఖ బ్రాండ్ల వస్తువులను ఈ సెలబ్రిటీలు ప్రచారం చేస్తున్నారనే భావన వారి ఫాలోవర్లలో కలగని విధంగా చాప కింద నీరులా తమ లక్ష్యాన్ని సాధించేస్తున్నాయి. వివిధ రంగాల ప్రముఖులు ఇచ్చే ప్రకటనలు, ఆయా సందర్భాల్లో ఇచ్చే సందేశాల ద్వారా ఆయా వస్తువుల కొనుగోలుకు సంబంధించి ‘బ్రాండ్‌ మేసేజ్‌’లను ఇచ్చేస్తున్నారు. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్లు నేరుగా ఆయా ఉత్పత్తులను ఎండార్స్‌ చేయడం ఒక పద్ధతి కాగా, వాటి ప్రస్తావన లేకుండా ఏదైనా ఒక సామాజిక అంశం, ప్రాధాన్యం సంతరించుకున్న పరిణామం లేదా ఇతర అంశాలపై తమ అభిప్రాయాలను వెలిబుచ్చడం ద్వారా వారు తమ ఫాలోవర్లను ప్రభావితం చేస్తున్నారు. 

ఇలా ప్రత్యక్ష, పరోక్ష పద్ధతుల్లో ఆయా వస్తువులకు సంబంధించిన ప్రచారం చేయడం ద్వారా...వాటిని కొనుగోలు చేస్తే మంచిదని, ఫలానా వస్తువును సెలబ్రిటీ వాడుతున్నాడు కాబట్టి అది నాణ్యమైనది, మిగతా వాటి కంటే మెరుగైనదనే భావన కస్టమర్లలో ఏర్పడేలా వారి ఉవాచలు, వ్యాఖ్యలు, ప్రకటనలు వంటివి ఉపయోగపడుతున్నాయి. వివిధ రూపాల్లో ప్రచారం, ఆయా వస్తువుల గురించి ప్రస్తావన వంటి ద్వారా ప్రజాభిప్రాయం రూపుదిద్దుకునేలా ఇన్‌ఫ్లుయెన్సర్లు చేయగలుగుతున్నారు.

భారత్‌లోనే ఎక్కువ
భారత్‌లో మధ్యతరగతి జనాభా అధికంగా ఉండడంతోపాటు ఈ తరగతి ప్రజలు ఎక్కువగా డిజిటలైజేషన్‌ వైపు మొగ్గు చూపుతుండడంతో ఇన్‌ఫ్లుయెన్సర్‌ మార్కెటింగ్‌కు అవకాశాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇండియన్‌ రిటైల్‌ మార్కెట్‌ అనేది అనేక రెట్లు పెరుగుతుండడంతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు వేగంగా విస్తరించింది. 

ఈ పరిస్థితుల్లో ఆయా ప్రాంతాల్లోని వినియోగదారులను చేరుకునేందుకు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ అనేవి అందివచ్చిన అవకాశాలుగా కలిసొస్తున్నాయి. ఈ కస్టమర్లను చేరుకొని, ఆయా వస్తువులు కొనుగోలు చేసేలా ఆకర్షించేందుకు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతోపాటు స్థానిక మైక్రో ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా తమ వంతు పాత్రను చురుగ్గా పోషిస్తున్నారు.

వార్తలకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించే తీరు, అందుకు అనుగుణంగా వీడియో ఫుటేజీ, సోషియో–పొలిటికల్‌ డేటా విశ్లేషణ వంటి వాటితో ప్రజలకు దగ్గర అయ్యారు. యువతను నేరుగా చేరుకునేలా చేసే వ్యాఖ్యానాలు, ఆయా అంశాలపై విషయ పరిజ్ఞానం ఆకట్టుకుంటోంది. తన పనితీరుతో తన మెయిన్‌ చానల్‌కు లక్షలాది మంది ఫాలోవర్లతోపాటుపెద్దసంఖ్యలో యూజర్లతో రికార్డు సృష్టించాడు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా 6 నెలల కాలంలోనే 60 లక్షల ఫాలోవర్లు పెరిగారు. రాఠీ వైరల్‌ వీడియోలను తమిళం, తెలుగు, బెంగాలి, కన్నడ, మరాఠీలోకి కూడా డబ్‌ చేస్తున్నారు 
– ధృవ్‌ రాఠీ (యూట్యూబర్, ఎడ్యుకేటర్‌)

పర్యావరణం, నదులు, మన నేల వంటివాటిపై ప్రజల్లో చైతన్యం పెంచేలా ప్రయత్నిస్తున్నారు. ‘సేవ్‌ ద సాయిల్‌’పేరిట ప్రజా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన నిర్వహించే టాక్‌షోలు లక్షలాది మందిని చేరుకుంటున్నాయి. సంస్కృతి పేరిట సంప్రదాయక కళలు, సంగీత రీతులను జనసామాన్యం చెంతకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. 
–  సద్గురు జగ్గీవాసుదేవ్‌ (ఇషా హెడ్‌)

ఓ ప్రముఖ జాతీయ న్యూస్‌చానల్‌లో పనిచేసి బయటకు వచ్చిన ఈయనకు లెక్కకు మించి అభిమానులున్నారు. ఆయన నిర్వహిస్తున్న యూట్యూబ్‌ చానళ్లు బాగా పాపులర్‌ అయ్యాయి. ప్రస్తుతం వాటికి 11 లక్షల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. తన చానల్‌ ద్వారా నిజాలను వెల్లడించడంతోపాటు, అధికారంలో ఉన్న వారి పనితీరుపైనా విమర్శల వర్షం కురిపించడం ఫాలోవర్లను ఆకట్టుకుంటోంది.
– రవీశ్‌కుమార్‌ (జర్నలిస్ట్‌)

తాను నిర్వహిస్తున్న పాడ్‌కాస్ట్‌ల ద్వారా ఫాలోవర్లకు, ముఖ్యంగా యువతకు చేరువయ్యారు. రన్వీర్‌ షో అకా టీఆర్‌ఎస్‌ పేరిట నిర్వహించిన షోలకు ఆర్నాల్డ్‌ షావర్జనిగ్గర్,. ఇస్రో చైర్మన్‌ డా. సోమ్‌నాథ్, ఆధ్యాత్మిక గురువు గౌర్‌ గోపాల్‌దాస్, మహారాష్ట్ర మాజీ సీఎం ఏక్‌నాథ్‌ షిండే వంటి వారు హాజరయ్యారు. తాను నిర్వహిస్తున్న 9 యూట్యూబ్‌ చానళ్ల ద్వారా 2.2కోట్ల మందిని చేరుకుంటున్నట్టుగా ఆయనే చెబుతుంటారు. ఇన్‌ఫ్లుయెన్సర్‌ సంస్కృతిని బాగా ప్రచారంలోకి తెచ్చేందుకు దోహదపడుతున్నారు. మాంక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కోఫౌండర్‌గా ఓ కొత్త మీడియా కంపెనీని ప్రారంభించి, ఇన్‌ఫ్లుయెన్సర్‌ మార్కెటింగ్‌ను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు.
–  రన్వీర్‌ అల్లాబాడియా అలియాస్‌ బీఆర్‌బైసెప్స్‌ (యూట్యూబర్‌)    

భారత్‌లోనే అత్యధికంగా పేరుగాంచిన కమేడియన్లలో ఒకడిగా నిలిచారు. తన హ్యుమర్‌తో కథలు చెప్పే విధానం, కవిత్వంతో కలగలిపి వివిధ అంశాలను వివరించడం, పూర్తి ప్రామాణికంగా వ్యవహరించడం ఆయన్ను అభిమానులకు దగ్గర చేసింది. ఇప్పటిదాకా వెయ్యికి పైగా షోలు చేశారు. లండన్‌ రాయల్‌ అల్బర్ట్‌ హాల్‌లో షో నిర్వహించిన ఆసియాకు చెందిన కమేడియన్‌గా పేరు సాధించారు. న్యూయార్క్‌లోని మాడిసన్‌ స్కేర్‌ గార్డెన్‌లోనూ షో నిర్వహించారు. చాచా విదాయక్‌ హై హమారే...వెబ్‌ సిరిస్‌ను అమెజాన్‌ ప్రైమ్‌ కోసం రూపొందించారు.  
–  జకీర్‌ఖాన్‌ (బాద్‌షా ఆఫ్‌ కామెడీ)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement