జగ్గీ వాసుదేవ్‌కు తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు
కోయంబత్తూరులోని పాఠశాలలపై రాజమండ్రికి చెందిన దంపతుల తీవ్ర ఆరోపణలు
మా కుమారుడిపై మరో విద్యార్థి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు
త్వరలో పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వెల్లడి..
తమ కుమార్తెపై రెండేళ్లపాటు అత్యాచారం జరిగిందని మరో మహిళ ఆరోపణ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఈషా ఫౌండేషన్ ఆధ్యాత్మికత ముసుగులో చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడే వారికి కేంద్రంగా మారిందని ఈషా ఫౌండేషన్ పాఠశాల మాజీ ఉపాధ్యాయురాలు యామిని రాగాని, ఆమె భర్త సత్య ఎన్ రాగాని ఆరోపించారు. తమ కుమారుడిని తమిళనాడు కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌కు చెందిన పాఠశాలలో చదివించామని, ఆ సమయంలో అతడిపై తోటి విద్యార్థి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని వెల్లడించారు. ఇటీవల అక్కడి ఈషా హోమ్‌స్కూల్‌లోనూ విద్యార్థులపై ఈ తరహా ఉదంతాలు కొనసాగుతున్నాయని చెప్పారు.
అలాగే ఈషా యోగా కేంద్రంలో విద్యా కార్య క్రమాల పేరుతో ఈషా సంస్కృతికి చెందిన బాలికలతో అర్ధనగ్నంగా ఆధ్యాత్మిక దీక్షలు చేయిస్తున్నారని ఆరోపించారు. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ (సద్గురు)కు అన్ని విషయాలు తెలిసినా ఎందుకు పట్టించుకోవడం లేదని వారు ప్రశ్నించారు. రాజమండ్రికి చెందిన ఈ దంపతులు కొంతకాలంగా హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈషా ఫౌండేషన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.
ఎన్నో దురాగతాలు
యామిని రాగాణి మాట్లాడుతూ.. ఈషా ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలు ఈషా విద్య, ఈషా సంస్కృతి, ఈషా హెూమ్ స్కూళ్లలో 8 వేల మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తు న్నట్లు తెలిపారు. ఈషా పాఠశాలలో 8 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారం జరిగిన విషయాన్ని బయటికి రానివ్వలేదన్నారు. అదేవిధంగా 13 ఏళ్ల బాలుడిని 3 సంవత్సరాల పాటు వేధించినట్టు ఆరోపణలు వచ్చాయని, యాజమాన్యం నిర్లక్ష్యంతో 12వ తరగతి విద్యార్థి ఒకరు ఈ ఏడాది జూన్ 21న మృతి చెందాడని చెప్పారు. ఇలా వరుస ఘటనలు చోటు చేసుకోవడం, తమ కుమారుడు సైతం లైంగిక వేధింపులకు గురికావడంతో కలత చెందిన తాము ధైర్యం చేసి మీడియా ముందుకు వచ్చామని వెల్లడించారు.
సద్గురుపై ఉన్న భక్తి, విశ్వాసంతో తాము కూడా తమ కుమారుడిని ఈషా పాఠశాలలో చదివించామని వివరించారు. లైంగిక వేధింపుల విషయం యాజమాన్యం దృష్టికి, తద్వారా జగ్గీ వాసుదేవ్ దృష్టికి తీసుకెళ్లినా నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పారు. అంతర్గతంగా ఈ పాఠశాలల్లో జరుగుతున్న విషయాలు వెలుగులోకి తెచ్చేందుకు తాను వలంటీర్ టీచర్‌గా ఫౌండేషన్‌లో రెండేళ్లు పనిచేసినట్టు యామిని రాగాని తెలిపారు. విద్యార్థులను బూతులు తిట్టడం, మానసికంగా, శారీరకంగా హింసించడం తాను ప్రత్యక్షంగా చూసి నట్టు చెప్పారు. తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకు హిందుత్వం అనే పదాన్ని వాడుతున్నారని ఆరోపించారు.
బాధితులను నిర్వాహకులు బెదిరిస్తున్నారు
‘తెల్లవారుజామున యోగా పేరిట బాలికలను సైతం అర్ధనగ్నంగా కూర్చోబెడుతున్నారు. ఈ విషయం గురించి ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్, మరో ఇద్దరు ముఖ్యుల మధ్య ఈమెయిల్స్ నడిచాయి..’ అని యామిని, సత్య వెల్లడించారు. దీనిపై త్వరలోనే పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఇప్పటివరకు ఏడు బాధిత కుటుంబాలు తమ వెంట వచ్చాయని, మిగిలిన బాధితులతో కూడా కలిసి ముందుకు వెళతామన్నారు. అయితే ఫౌండేషన్ నిర్వాహకులు బాధితుల ను బెదిరిస్తున్నారని, స్థానిక పోలీసులను మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు. వీటిపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, జగ్గీ వాసుదేవ్ వ్యవహారాలన్నింటిపైనా సమగ్ర దర్యాప్తు చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మాకు ప్రాణహాని ఉంది
ఈషా పాఠశాలలో చదువుతున్న తన ఏడేళ్ల కూతురుపై ఆ పాఠశాలలో పీఈటీ రెండేళ్ల పా టు అత్యాచారానికి పాల్పడ్డాడని సదరు బాలిక తల్లి ఫోన్‌కాల్‌లో మీడియాకు తెలిపారు. ‘మేం ఎంతో మనోవేదన అనుభవించాం. ఈషా ఫౌండేషన్‌లో దుర్మార్గాలు బయట పెట్టాలంటే భయంగా ఉంది. మాకు ప్రాణహాని ఉంది. అందుకే నా వివరాలు చెప్పలేకపోతున్నాను. కానీ త్వరలోనే నేను కూడా మీడియా ముందుకు వస్తా..’ అని పేరు, వివరాలు చెప్పడానికి ఇష్టపడని ఆ బాధిత మహిళ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment