‘నీలగిరుల్లోని ప్రతి కొండ మాకు దేవునితో సమానం’ అంటుంది వాసమల్లి.నీలగిరిలో అంతరించిపోతున్న ‘తోడా’ తెగకు చెందిన వాసమల్లి ఆ తెగలో మొదటి గ్రాడ్యుయేట్. లిపిలేని తోడా భాషకు డిక్షనరీ తయారు చేసే పనిలో ఉంది. తోడా తెగ పాటలను సేకరిస్తే సాహిత్య అకాడెమీ ప్రచురించింది. ‘చంద్రునిలో ఉండే కుందేలు మా తెగదేనని మా విశ్వాసం’ అందామె.‘ఊటీ’ అని అందరూ పిలుచుకునే ‘టూరిస్ట్ కేంద్రం’లో తోడా తెగ విశిష్ట జీవనాన్ని నమోదు చేస్తున్న వాసమల్లి జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌లో మాట్లాడింది.
ఆయుష్మంతులు
తోడాలు కొండగొర్రెల్లా తిరుగుతూనే ఉంటారు. అడవి పళ్లు, ఆకుకూరలు తింటారు. ప్రశాంతంగా జీవిస్తారు. రోగాలు రావు. నూరేళ్లు సులువుగా బతుకుతారు. డబ్బు దాదాపుగా ఎవరి దగ్గరా ఉండదు. దానికి పెద్దగా విలువ లేదు. తోడాలు చేతి ఎంబ్రాయిడరీలో నిష్ణాతులు. తెలుపు, ఎరుపు, నలుపు రంగులు మాత్రమే వాడుతూ అందమైన ఎంబ్రాయిడరీ కంబళ్లు అల్లుతారు. తెలుపు బాల్యానికి, ఎరుపు యవ్వనానికి, నలుపు పరిణితికి గుర్తుగా భావిస్తారు. – వాసమల్లి
‘నీలగిరి కొండల్లో విహారానికి వచ్చేవాళ్లు మేం మాట్లాడుకునే భాష విని భలే ఉందే, ఇదేం భాష అనుకుంటారు. మా తర్వాతి తరాలు అలా అనుకోకూడదని తోడా భాషను కాపాడే ప్రయత్నం చేస్తున్నాను. మా భాషకు లిపి లేదు. కాని యాభైకి మించిన ధ్వన్యక్షరాలు ఉన్నాయి. వాటిని నమోదు చేస్తున్నాను. తోడా డిక్షనరీ తయారు చేస్తున్నాను. తోడాలు పాడుకునే పాటలు, చెప్పుకునే కథలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని సేకరించి పుస్తకం వేశాను’ అంటుంది వాసమల్లి.అరవై ఏళ్లు దాటిన వాసమల్లి కేవలం 1500 మంది మాత్రమే మిగిలిన తోడా తెగకు ప్రతినిధి.‘నీలగిరుల్లో మొత్తం ఆరు తెగలు ఉన్నాయి. అన్నీ అంతరించిపోయే ప్రమాదపు అంచున ఉన్నాయి’ అంటుందామె.
జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌లో జానపదుల కథల గురించి మాట్లాడడానికి వచ్చిన వాసమల్లి ‘ఆదిమ తెగలు మానవ నాగరికతకు పాదముద్రలు. భాష మరణిస్తే సమూహం కూడా మరణిస్తుంది. మా తోడా భాష ఎంతో సుందరమైనది. మా తర్వాతి తరాలు దానిని కాపాడుకోవాలనేదే నా తపన’ అంది.
బర్రెలే ఆస్తి
‘తోడాలకు బర్రెలే ఆస్తి. నీలగిరుల్లోని కొండ బర్రెలు ప్రత్యేకంగా ఉంటాయి. వాటిని ‘ఇర్ర్’ అంటారు. వాటి పాల నుంచి తీసిన నెయ్యితో మాత్రమే మేము దేవుని దీపాలను వెలిగించాలి. వాటిని మేము దైవాంశాలుగా చూస్తాం. తోడాలు శాకాహారులు. ఇర్ర్‌లను కోయడం, తినడం చేయం. మా తోడాల్లో ఎవరైనా చనిపోతే ఒక బర్రెను ఎంపిక చేసి పడమరవైపు తోలేస్తాం. అది కూడా ఏదో ఒక రోజున మరణించి ఆ చనిపోయిన వ్యక్తి దగ్గరకు తోడు కోసం వెళుతుందని మా నమ్మకం’ అని చెప్పిందామె.
చంద్రుని పై కుందేలు
‘తోడాలు ఏది దొరికినా పంచుకుని తినాలి. ఒకసారి ఒక తోడా తేనె దొరికితే వెదురుబొంగులో తన కోసం దాచుకుని ఇంటికి బయలుదేరాడట. అతనిలోని దురాశ వెంటనే పాములా మారి వెంటబడింది. అతను పరిగెడుతూ చేతిలోని వెదురుబొంగును కింద పడేస్తే అది పగిలి తేనె కుందేలు మీద చిందింది. పాము ఆ కుందేలు వెంట పడింది. కుందేలు భయంతో సూర్యుడి వైపు పరిగెడితే నేను చాలా వేడి... చంద్రుడి దగ్గరకు వెళ్లి దాక్కో అన్నాడు. కుందేలు చటుక్కున చంద్రుడిలో వెళ్లి దాక్కుంది. అందుకని చంద్రుడిలోని కుందేలు మా పూర్వికురాలనుకుంటాం. చంద్రగ్రహణం రోజున చంద్రుణ్ణి రాహువు వదిలే వరకూ కుందేలు క్షేమం కోసం భోరున విలపిస్తాం’ అని తెలిపిందామె.
మొదటి గ్రాడ్యుయేట్
నీలగిరి కొండల్లో గిరిజనవాడలను ‘మండ్’ అంటారు. అలాంటి మండ్‌లో పుట్టిన వాసమల్లి చిన్నప్పటి నుంచి చదువు మీద ఆసక్తితో హైస్కూల్ వరకూ చదువుకుంది. చిన్న వయసు పెళ్లి తప్పించుకోవడానికి ఇంటర్, డిగ్రీ చదివింది. తర్వాత ఊటీలోని ‘హిందూస్థాన్ ఫొటో ఫిల్మ్ ఫ్యాక్టరీ’లో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యింది. ఆ సంస్థ ఉద్యోగినే పెళ్లి చేసుకుంది. ఆమెకు ఇద్దరు కొడుకులు. ఒక కొడుకు ఉద్యోగం చేస్తుంటే, మరో కొడుకు ఊటీలో గైడ్‌గా పని చేస్తున్నాడు. ‘నా పరిశోధనకు పెద్దగా సపోర్ట్ ఏమీ దొరకడం లేదు. మా నీలగిరుల్లో యాభై కొండలకు యాభై కథలు ఉన్నాయి. సేకరిస్తున్నాను. ఎలా ప్రచురించాలో ఏమిటో’ అంటున్న ఆమె ఒక తొలి వెలుగుగా అనిపించింది. ఆ దీపం నుంచి మరో దీపం వెలుగుతూ వెళ్లాలని కోరుకుందాం. - ఇంటర్వ్యూ: జైపూర్ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment