పుస్తకాలు మా ఇంటి సభ్యులు | Sudha Murty and daughter Akshata discuss parenting at Jaipur Literature festival | Sakshi
Sakshi News home page

పుస్తకాలు మా ఇంటి సభ్యులు

Published Wed, Feb 5 2025 12:04 AM | Last Updated on Wed, Feb 5 2025 12:04 AM

Sudha Murty and daughter Akshata discuss parenting at Jaipur Literature festival

తల్లీ కుమార్తె కూచుంటే ఏం మాట్లాడుకుంటారు? మెట్టినింటి విషయాలో.. నగలో, చీరలో... అనుకోవచ్చు కొందరు. కానీ వారు పుస్తకాల గురించి మాట్లాడుకుంటారని తెలుసా? సుధామూర్తి, ఆమె కుమార్తె అక్షతా మూర్తి ‘జైపూర్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌’లో తల్లి కుమార్తె చేత ఎందుకు పుస్తకాలు చదివించాలో, తామెలాంటి పుస్తకాలు చదివారో మాట్లాడుకున్నారు. ప్రేక్షకుల్లో నారాయణమూర్తి, బ్రిటన్  మాజీ ప్రధాని రిషి సునక్‌  కూచుని విన్నారు. ‘పవర్‌ ఆఫ్‌ బుక్‌’... తమిద్దరి దగ్గరా న్నదని సుధా, అక్షత అన్నారు. వివరాలు..

‘అమ్మా... నువ్వు పుస్తకాలు మా చేత ఎందుకు చదివించాలని పట్టుబట్టావ్‌? పుస్తకాలు నీ జీవితంలోకి ఎలా ప్రవేశించాయి?’ అని ప్రశ్నించారు అక్షతా మూర్తి.

‘జైపూర్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌ 2025’ లో రెండు రోజుల క్రితం జరిగిన ‘మై మదర్‌ మైసెల్ఫ్‌’ అనే సెషన్‌లో అక్షతా మూర్తి తన తల్లి సుధామూర్తిని పుస్తకాలు, పెంపకం, వ్యక్తిత్వం వంటి అంశాలపై ప్రశ్నలు అడుగుతూ తల్లీకూతుళ్లుగా తాము నడిచి వచ్చిన జీవితాన్ని మననం చేసుకున్నారు. కిక్కిరిసిన వేలాది ప్రేక్షకులతో పాటు అక్షత తండ్రి ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి, భర్త బ్రిటన్‌ మాజీ ప్రధాని రిషి సునాక్‌లు ముందు వరుసలో కూచుని ఈ సెషన్‌ విన్నారు. సెషన్‌కు ముందు రిషి సునాక్‌ లేచి నిలబడి ప్రేక్షకుల వైపు చూస్తూ ‘నమస్తే’ అని అభివాదం చేయడం అందరినీ ఆకట్టుకుంది. 

ఇక కూతురి ప్రశ్నకు సుధామూర్తి సమాధానం చెప్తూ–
సుధామూర్తి: మాది టీచర్ల ఫ్యామిలీ. మా తాత టీచర్‌. మా నాన్న మెడికల్‌ కాలేజీలోప్రోఫెసర్‌. అమ్మ టీచర్‌. నేనూ ఆ తర్వాత టీచర్‌నయ్యాను. మామగారు కూడా టీచరే. మా ఇంట్లో టీచరు కానిది నా భర్తగా వచ్చిన నారాయణమూర్తి ఒక్కడే. కాబట్టి అనివార్యంగా నేను చిన్నప్పటి నుంచి డబ్బుతో కాకుండా పుస్తకాలతో పెరిగాను. మా ఇంట్లో ఎవరి బర్త్‌డేకైనా ఇచ్చే గిఫ్ట్‌ పుస్తకమే. అలా పుస్తకాలు అలవాటు చేశారు. పుస్తకాలంటే అజ్ఞానంతో పడిన తలుపులను తెరిచే తాళం చెవులు. అవి మనకు ఎన్నో నేర్పిస్తాయి. పుస్తకాలు చదవడం లేదా నేర్చుకోవడం ఎప్పుడైతే మానేస్తామో ఆ రోజు నుంచి జీవించడం మానేసినట్టు. అందుకే నా పిల్లలు కూడా పుస్తకాలు చదవాలని నేను పట్టుబట్టాను....

సుధామూర్తిని అక్షత ఇంటర్వ్యూ చేస్తుండగా బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్, నారాయణమూర్తి ప్రేక్షకుల్లో కూర్చుని వింటున్న దృశ్యం 

అక్షత: నువ్వు పట్టుబట్టడం వల్ల నేను, రోహన్‌ (సోదరుడు) నేటికీ లాభపడుతున్నాం. నీకు గుర్తుందా అమ్మా... మనింట్లో నీదో లైబ్రరీ ఉండేది. అందులో సాహిత్యం, చరిత్ర పుస్తకాలుండేవి. నాన్నదో లైబ్రరీ ఉండేది. అందులో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పుస్తకాలుండేవి. మీ ఇద్దరి లైబ్రరీలు– ఆ రోజుల్లో ఇంటర్నెట్‌ లేదు కనుక నా చదువులో పెద్ద రిఫరెన్సుగా ఉండేవి. స్కూల్లో ఏ ్రపాజెక్టు చేయాల్సి వచ్చినా ఉద్వేగంగా ఇంటికి వచ్చి పుస్తకాలు తిరగేస్తూ కూరుకుపోయేదాన్ని. అన్నట్టు నీకు సేవాభావం పుస్తకాల నుంచే వచ్చిందా?

సుధామూర్తి: మా నానమ్మ ఊళ్లో మంత్రసానిగా ఉండేది. డబ్బుకు కాదు. సేవకోసం. కులం, మతం, జాతి.. పట్టింపు ఉండేది కాదు. వెళ్లి పురుడుబోసి వచ్చి తలస్నానం చేసి ఇంట్లోకి వచ్చేది. తగిన వైద్యం లేక స్త్రీలు పడే వేదన ఆమె చెప్తుంటే విని విని నాన్న గైనకాలజిస్ట్‌ అయ్యారు. మా చెల్లెలు (నంద) కూడా గైనకాలజిస్ట్‌ అయ్యింది. సేవ చేస్తే ఎంత తృప్తి ఉంటుందో నాకు తెలిసింది. మా నానమ్మకు 62 ఏళ్లు ఉన్నప్పుడు నాకు 12 ఏళ్లు. కన్నడ నేర్చుకోవాలని అంటే మూడు నెలలు స్ట్రిక్ట్‌ టీచర్‌గా పాఠాలు చెప్పాను. ఏ రోజైతే ఆమె తనకు తానుగా కన్నడం చదవడం నేర్చుకుందో వచ్చి నా కాళ్లకు ప్రణామం చేసింది గురువుగా. నేను షాక్‌ అయ్యాను. జ్ఞానం పంచినవారు గురువే చిన్నైనా పెద్దయినా. చాలా సంతోషం అనిపించింది. జ్ఞానం పంచడం కూడా సేవే అని తెలుసుకున్నాను.

అక్షత: మీ నానమ్మ పేరు ఏమిటి?
సుధామూర్తి: కృష్ణ

అక్షత: నా చిన్న కూతురి పేరు అదేగా. కృష్ణ. (పెద్ద కూతురు అనుష్క). అమ్మా... నువ్వు మమ్మల్ని ఆదర్శంగా ఉండమని కూడా చెప్పేదానివి.
సుధామూర్తి: ఒక మాటుంది.. ఇరవై ఏళ్ల వయసులో ఆదర్శంగా లేకపోతే హృదయం లేనట్టు. నలభై ఏళ్ల వయసులో ఆదర్శంగా ఉంటే బుర్ర లేనట్టు. కాని నేను ఈ వయసులో కూడా ఆదర్శంగానే ఉన్నాను. జీవితంలో ఆదర్శాలు ముఖ్యం. మీకు చిన్నప్పటి నుంచి ఒకటే చెప్పేదాన్ని– జీవితంలో ఏదైనా  కాకపోయినా ఆదర్శవంతంగా మాత్రం ఉండండి అని. ఆదర్శంగా ఉండటం అంటే. పార్శీ వారు చెబుతారు... ఏది ఆలోచిస్తామో అదే మాట్లాడటం... ఏది మాట్లాడతామో అదే చేయడం. బుద్ధికీ, వాక్కుకీ, చేతకీ సారూప్యతే ఆదర్శం. ఒకటి చెప్పి ఒకటి చేయడం కపటం.

అక్షత: నీకు ఇష్టమైన పుస్తకం ఏది?
సుధామూర్తి: ముందు నువ్వు చెప్పు. 

అక్షత: నాకు సుఖాంతాలున్న పుస్తకాలు ఇష్టమే కాని పాత్రలు ఎన్ని విషమ పరీక్షలు ఎదురైనా తట్టుకుని నిలబడేట్టుగా ఉంటే ఇంకా ఇష్టం. చారిత్రక ఘట్టాలు, వ్యక్తులను తీసుకుని రాసే పుస్తకాలు ఇష్టం. నీకు?
సుధామూర్తి: నా పుస్తకమే చెబుతాను– ‘మహాశ్వేత’. అది రాసినప్పుడు నేనుప్రోఫెసర్‌గా చేస్తున్నాను. ఒకరోజు ఎవరిదో పెళ్లికి నన్ను తప్పనిసరిగా ఆహ్వానించారు. ఆశ్చర్యంతో వెళ్లాను. భోజనం చేయాలని పట్టుబట్టారు. కారణం అడిగితే పెళ్లికొడుకు నా మహాశ్వేత నవలను చదివాడట. పెళ్లికూతురుగా తెల్లమచ్చలు ఉన్న అమ్మాయిని ఎంపిక చేసుకున్నాడట. మీ నవల వల్లే తెల్లమచ్చలు ఉన్న అమ్మాయిల వ్యధ అర్థం చేసుకుని ఈ పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. ఒక సింపుల్‌ పెన్‌ ఎంత మార్పు తేగలదో చూడటం. పవర్‌ ఆఫ్‌ బుక్‌ అంటే అది.

అక్షత: పవర్‌ ఆఫ్‌ బుక్‌ ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. జీవితంలో ఉపయోగించడానికి పనికి వచ్చే ఆయుధం పుస్తకమే. సుధామూర్తి: కచ్చితంగా.
అక్షత: థ్యాంక్యూ అమ్మా... ఇలా కూచుని మనం మాట్లాడుకున్నందుకు. సుధామూర్తి: అందరికీ థ్యాంక్స్‌. 

                                                                                                                        – జైపూర్‌ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement