ఢిల్లీలో ట్రక్‌లు నడిపేవాణ్ణి | Kailash Kher launches debut book Teri Deewani at Jaipur Literature Festival | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో ట్రక్‌లు నడిపేవాణ్ణి

Published Fri, Feb 7 2025 3:01 AM | Last Updated on Fri, Feb 7 2025 3:01 AM

Kailash Kher launches debut book Teri Deewani at Jaipur Literature Festival

జైపూర్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌లో కైలాష్‌ ఖేర్‌ 

తన పుస్తకం ‘తేరి దీవాని’ ఆవిష్కరణ

‘పద్నాలుగేళ్ల వయసులో ఇంటి నుంచిపారిపోయాను. ఢిల్లీలో ఎన్నో విషాద అనుభవాలు చవిచూశాను. ఎంతగా అంటే నేను యువకుడిగా ఎదిగే వరకూ నవ్వు మర్చిపోయాను. నేనసలు నవ్వేవాణ్ణి కాదు’ అని గుర్తు చేసుకున్నాడు గాయకుడు కైలాష్‌ ఖేర్‌. అతను సొంతగా రాసి, బాణి కట్టి హిట్‌ చేసినపాటల వెనుక ఉన్న కథలను వివరిస్తూ, ఏ జీవితానుభవాల నుంచి ఆపాటలు పుట్టాయో చెప్పిన ‘తేరి దీవాని’ పుస్తకాన్ని జైపూర్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌లో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కైలాష్‌ ఖేర్‌ తన గతాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

‘నాకు చదువు లేదు. అందరూ గురువుల దగ్గర చదువుకుంటారు. నేను పరిస్థితుల దగ్గర చదువుకున్నాను. ఇంటి నుంచిపారిపోయాక ఢిల్లీలో నానా అగచాట్లు పడ్డాను. నెలకు వంద రూపాయలకు సంగీతంపాఠాలు చెప్పాను. లెటర్‌ ప్రెస్‌లో అక్షరాలు కూర్చే పని చేశాను. చిన్న పత్రికల్లో పని చేశాను. ఇంకా ఆశ్చర్యం ఏమంటే నాది చిన్న ఆకారం. ఇంత చిన్న ఆకారంతో భారీ ట్రక్కులు నడిపాను. అడుగడుగున రిజెక్షన్సే ఎదురు చూశాను. అవమానం ఎదురైన ప్రతిసారి... ఇదేం పెద్ద అవమానం... ఇంకా ముందు ముందు పెద్ద అవమానాలను చూస్తాను అనుకుంటూ ముందడుగు వేసేవాణ్ణి’ అన్నారు.

‘నేను ప్రకృతిని విశ్వసిస్తాను. ప్రకృతిని నడిపే శక్తిని విశ్వసిస్తాను. ఆ శక్తి మనకు ఏదో ఒక అండ చూపిస్తుంది. ముంబై చేరాక నా పరిస్థితి ఏం మారలేదు. పెద్ద పెద్ద ఆడియో సంస్థలకు వెళితే నా గొంతు విని పనికి రాదని పంపించేసేవారు. మన దేశంలో కళను తక్కువగా చూస్తారు. ఎంపిసి, బైపిసి చదివే పిల్లలకు ఉండే గౌరవంపాట నేర్చుకుంటున్నాను, బొమ్మలు గీస్తున్నాను అనే పిల్లలకు ఉండదు. గుర్తింపు వచ్చే వరకు మన దేశంలో కళాకారులకు గౌరవం ఇవ్వరు. ఇది దురదృష్టకరం. నాకు ముందు ఎంత విద్య వచ్చో గుర్తింపు వచ్చాక కూడా అంతే విద్య వచ్చు. కాని గుర్తింపు రావడంతోనే హఠాత్తుగా గౌరవం వచ్చేస్తుంది. ఇదేమిటో అర్థం కాదు’ అన్నారాయన.

‘అడ్వర్‌టైజ్‌మెంట్లలో మొదటిసారి జింగిల్‌పాడటం నా దశను మార్చింది. నక్షత్ర డైమండ్స్‌ యాడ్‌కు మొదటి జింగిల్‌పాడాను. ఐదు వేలు ఇచ్చారు. ఆరు నెలల్లోనే బాగా స్థిరపడ్డాను. ఇంతకు ముందు రిజెక్ట్‌ చేసిన వారందరూ ఇప్పుడు యాక్సెప్ట్‌ చేయడానికి ముందుకు వచ్చారు. జీవితం అంటే అదే. రిజెక్షన్స్‌కు వెరవకుండా ముందుకు సాగితే యాక్సెప్టెన్స్‌ వస్తాయి. ‘వైసాభీ హోతాహై–2’ సినిమాలో నా మొదటిపాట ‘అల్లాకే బందే’ రావడంతో ఇక నేను వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది’ అన్నాడు కైలాష్‌ ఖేర్‌.

‘మీరు ఏ రంగంలో ప్రవేశించాలనుకున్నా ఆ రంగానికి సంబంధించిన మీ నైపుణ్యాల వేర్లను పటిష్టంగా ఉండేలా చూసుకోండి. వేర్లు పట్టిష్టంగా ఉండే ఏ చెట్టయినా కల్పతరువే’ అని ముగించాడాయన. – సాక్షి ప్రత్యేక ప్రతినిధి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement