
చిరంజీవి, బ్రహ్మానందంతో ముచ్చటిస్తున్న రాజమౌళి
వివిధ విభాగాల్లో రాణిస్తున్న కళాకారులు
మహబూబాబాద్ అర్బన్: మానుకోట జిల్లా అనగానే మొదట గుర్తుకువచ్చేది క్రీడలు.. అంతేనా.. విద్య, ఉద్యమాలు, పోరాటాల్లో.. పాటల రచయితలు, సంగీత దర్శకులు, ఫొటోగ్రాఫర్లు, కళాకారులుగా.. ఇలా ఎందరో సత్తా చాటుతున్నారు. మిర్చి, పసుపు, పత్తి పంటల్లో రాణిస్తున్నారు. కలెక్టర్, ఎస్పీ, పోలీస్, జవాన్, నేవీ తదితర అనేక రంగాల్లో వెలుగుతున్నారు. మానుకోట (Manukota) ముద్దుబిడ్డలుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
జిల్లా నుంచి సినీరంగంలోనూ గుర్తింపు తెచ్చుకున్న కళాకారులు కోకొల్లలు. చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ.. పాటలు పాడుతూ ఎదుగుతున్నారు. చిన్న సినిమాలకు తొలుత సంగీతం అందించి ప్రస్తుతం పెద్దపెద్ద హీరోల సినిమాలకు పనిచేస్తున్నారు. వీడియో, కెమెరామెన్, సినిమా ఫొటోగ్రఫీ, అసోసియేట్ డైరెక్టర్ వరకు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు.
దాశరథి నుంచి..
మానుకోట జిల్లా నుంచి మొదట సినిమారంగంలో చిన్నగూడూరుకు చెందిన దాశరథి కృష్ణమాచార్యులు ప్రవేశించారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’అని తెలంగాణ ఉద్యమానికి ప్రేరణ అందించిన కవి ఆయన. తెలుగు సినిమాలకు గేయ రచయితగా రాణించారు. ‘కన్నె వయసు’సినిమాలో ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో..’ పాట రాశారు. తోట రాముడు సినిమాలో ‘ఓ బంగరు రంగుల చిలకా పలకవే..’అనే పాట కూడా రాశారు.
మానుకోట జిల్లా (Manukota District) కేంద్రం గుమ్ముడూరుకు చెందిన గోడిశాల జయరాజు సినీగేయ రచయిత, కవి. ప్రకృతిపై కథలు, గేయాలు రాశారు. అవి తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కన్నడ సహా అనేక భాషల్లోకి అనువాదమై విస్తృత ప్రాచుర్యం పొందాయి. జయరాజు మొదట ‘అడవిలో అన్న’ సినిమాలో ‘వందనాలమ్మ’ పాట రాశారు. ‘దండోరా’ సినిమాలో ‘కొండల్లో కోయిల పాటలు పాడాలి’ అనే పాట రాశారు.
కేసముద్రం మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన జె.కె.భారవి (సుదర్శన భట్టాచార్య) తెలుగు సినీ రచయితగా, దర్శకుడు, పాటల రచయితగా పేరొందారు. కన్నడ సినీరంగంలోనూ పేరు తెచ్చుకున్నారు. అన్నమయ్య, లవ్‌స్టోరీ, శ్రీమంజునాథ, శ్రీరామదాసు, పాండురంగడు, శక్తి, ఓం నమో వేంకటేశాయ, చిటికెల పందిరి, జగద్గురు ఆదిశంకర తదితర సినిమాల్లో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పని చేశారు. ఆత్రేయ ప్రియశిష్య పురస్కారం అందుకున్నారు.
మానుకోట మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన సంగీత దర్శకుడు చక్రధర్ రచయితగా, గాయకుడిగా, నటుడిగా రాణించారు. మొదట ‘పండు వెన్నెల’ అనే మ్యూజిక్ ఆల్బమ్ చేశారు. చిరునవ్వుతో, ఇడియట్, శివమణి, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, సత్యం, దేశముదురు, నేనింతే, చక్రం, ఆంధ్రావాలా, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం తదితర 85 చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేసి నంది అవార్డు అందుకున్నారు.
బయ్యారం మండల గౌరారం గ్రామానికి చెందిన బొబ్బిలి సురేశ్ (Bobbili Suresh) సినీరంగంలో రాణిస్తున్నారు. నీదీ నాదీ ఒకే కథ, జార్జ్‌రెడ్డి, తోలుబొమ్మలాట, తిప్పర మీసం, గువ్వా గోరింక, విరాటపర్వం, చిల్‌బ్రో, టెన్త్‌క్లాస్ డైరీస్, మళ్లీ పెళ్లి తదితర సినిమాలకు సంగీత దర్శకుడిగా పని చేశారు.
చదవండి: రాజమౌళి- మహేశ్ సినిమా.. ఒక్క లీక్ ఎంతపని చేసింది
జిల్లా కేంద్రానికి చెందిన కందుకూరి అనిల్‌కుమార్ మొదట ప్రైవేట్ ఆల్బమ్ పాటలకు నృత్య దర్శకునిగా పని చేశారు. తరువాత పీపుల్స్‌వార్, పోలీస్ వెంకటరామయ్య, దండకారణ్యం సినిమాలకు నృత్య దర్శకత్వం వహించారు.
తొర్రూరు పట్టణ కేంద్రానికి చెందిన గిద్దె రాంనర్సయ్య.. తెలంగాణ ఉద్యమంలో పలు గీతాలు ఆలపించారు. ఉద్యమంలో ఎంతో మందిని తన పాటలతో ఉత్తేజ పరిచారు.

కంబాలపల్లి గ్రామానికి చెందిన గుర్రాల ఉదయ్ (Gurrala Uday) జేఎన్‌టీయూలో బ్యాచ్‌లర్ ఆఫ్ ఫొటోగ్రఫీ కోర్సు పూర్తి చేశారు. మొదట షార్ట్ ఫిలిమ్స్ తీశారు. ‘స్వేచ్ఛ’సినిమాతో సినీరంగంలోకి డైరెక్టర్‌గా అడుగుపెట్టారు. ఉత్తమ డైరెక్టర్ అవార్డు అందుకున్నారు.
జంగిలిగొండ గ్రామానికి చెందిన రాజమౌళి (Rajamouli) బుల్లితెర షోల్లో నటించారు. భోళాశంకర్, ధమాక, బంగారు బుల్లోడు, అనుభవించు రాజా, చోర్ బజార్, సిల్లి ఫెలోస్ తదితర సినిమాల్లోనూ నటించారు.
తెలంగాణ యాసపై సినిమాలు చేస్తా
నాకు మొదట సినిమాల్లో అవకాశం కల్పించింది ఆర్.నారాయణమూర్తి. ప్రకృతితో.. నాకూ ఉన్న అనుబంధాన్ని నా పాటల్లో వివరించా. భవిష్యత్‌లో సినిమాల్లో రచనలు చేసే అవకాశం వస్తే వదులుకోను. నా ప్రతిభను మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా గుర్తించి అవార్డు అందజేశారు. తెలంగాణ యాస, భాషపై మరిన్ని సినిమాలు చేస్తాను.
– గొడిశాల జయరాజ్, సినీ రచయిత
‘స్వేచ్ఛ’షార్ట్ ఫిలింతో ప్రవేశం
మొదట ‘స్వేచ్ఛ’షార్ట్ ఫిలింతో సినిమా రంగంలోకి అడుగు పెట్టాను. చిన్న చిన్న సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నాను. నేను రూపొందించిన ‘మేల్’సినిమా.. బెస్ట్ ఫిలిం స్క్రీన్‌ప్లే న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డుకు నామినేట్ అయింది.
– గుర్రాల ఉదయ్, డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్
ఆస్కార్ అవార్డు లక్ష్యం
సినీరంగంలో మొదటి సినిమాతోనే నాకు మంచి గుర్తింపు వచ్చింది. భవిష్యత్‌లో పెద్ద పెద్ద హీరోలకు మంచి సంగీతం అందించి గుర్తింపు తెచ్చుకుని ఆస్కార్ అవార్డు అందుకోవాలన్నది నా కోరిక. ఇప్పటి వరకు నాకు చేయూతనిచ్చిన దర్శకులు, నిర్మాతలకు రుణపడి ఉంటా.
– సురేష్ బొబ్బిలి, సంగీత దర్శకుడు
కొత్తవారికి అవకాశమిస్తా
టీవీ షోలు, సినీరంగంలో ఎంతో కష్టపడ్డాను. సినీ ప్రేక్షకులు, జిల్లా ప్రజల ఆశీస్సులతో ఇంతటి వాడినయ్యాను. నటనలో నైపుణ్యం ఉన్న వారికి కచ్చితంగా అవకాశం కల్పిస్తాను. పేద ప్రజలకు నా వంతుగా సేవ చేస్తున్నాను.
– రాజమౌళి, జబర్దస్త్ నటుడు
Comments
Please login to add a commentAdd a comment