
భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన అలా ముగించి ఇలా వచ్చారో లేదో.. భారత్‌కు ట్రంప్ భారీ షాకిచ్చారు. భారత్, బంగ్లాదేశ్‌తో పాటు ప్రపంచంలోని పలు దేశాలకు అందించే మిలియన్ డాలర్ల నిధుల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ(DOSE) శాఖ బాధ్యతలను ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ నిర్వహిస్తున్నారు. ఎలోన్ మస్క్ సూచన మేరకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రధాని మోదీ గతవారం అమెరికాలో పర్యటించారు. పర్యటన సమయంలో ఇద్దరు నేతలు అమెరికా-భారత్ సంబంధాలను బలోపేతం చేసేలా ముఖ్యమైన ప్రకటనలు చేశారు. ఈ తరుణంలో ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం భారత్‌లో ఓటర్ల సంఖ్యను పెంచడానికి కేటాయించే 21 మిలియన్ల డాలర్లను, బంగ్లాదేశ్ రాజకీయాల్ని బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన 29 మిలియన్ల డాలర్ల మొత్తాన్ని తగ్గించాలని అమెరికా నిర్ణయించినట్లు ఎలోన్ మస్క్ ప్రభుత్వ సామర్థ్య విభాగం డోజ్ ఆదివారం ప్రకటించింది. ఇదే విషయాన్ని డోజ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. కాగా, డొనాల్డ్ ట్రంప్‌ని ప్రధాని మోదీని కలిసిన కొద్ది రోజులకే ఈ ప్రకటన రావడం గమనార్హం.
మరోవైపు బంగ్లాదేశ్‌లో, రాజకీయ స్థిరత్వాన్ని పెంపొందించడానికి, ప్రజాస్వామ్య పాలనను మెరుగుపరచడానికి రూపొందించిన కార్యక్రమంలో భాగంగా అమెరికా ఆదేశానికి 29 మిలియన్ డాలర్లను కేటాయిస్తుండేది. తాజాగా ఆ నిధుల కేటాయింపుల్ని ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది.
హింసాత్మక నిరసనల మధ్య షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వాన్ని సైన్యం గద్దె దించడంతో దేశం రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. హసీనా భారత్‌కు వచ్చిన తర్వాత మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఇప్పుడు దేశాన్ని పాలిస్తున్నప్పటికీ, రాజకీయ అస్థిరత కొనసాగుతోంది.
అమెరికా ప్రభుత్వం తన విదేశాంగ విధాన వ్యూహాల్లో భాగంగా వివిధ దేశాలలో ప్రజాస్వామ్యం, పాలన కార్యక్రమాలకు తరచుగా నిధులు సమకూరుస్తుంది. అలా భారత్‌లో ఓటింగ్ శాతం పెరగడానికి డబ్బు ఖర్చు చేస్తుంది. తద్వారా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకుంటుంది. భారత్‌లాంటి ప్రజాస్వామ్య దేశాల్ని ప్రోత్సహించడం ద్వారా చైనా వంటి దేశాల ప్రభావాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment