dandu malkapuram
-
తెలంగాణ ఇండస్ట్రియల్ ఫెడరేషన్‌ను ప్రారంభించిన కేటీఆర్
-
తెలంగాణలో అతిపెద్ద స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్.. ఎక్కడో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ యువతకు ఉపాధి లక్ష్యంగా నగరానికి ఆనుకుని యాదాద్రి జిల్లా పరిధిలోని దండుమల్కాపురం (ఎన్‌హెచ్– 65) వద్ద టీఎస్ఐఐసీ, తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్ ఫెడరేషన్ నిర్మిస్తోన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ (ఎస్డీసీ) డిసెంబరులో అందుబాటులోకి రానుంది. ఈ ప్రాంతంలో సుమారు 547 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నెలకొల్పిన ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పరిశ్రమల పార్క్‌కు ఎస్డీసీ తలమాణికం కానుంది. ఈపార్క్‌లో దశలవారీగా ప్రత్యక్ష, పరోక్షంగా సుమారు 20–30 వేల మందికి ఉపాధి కల్పించనున్నట్లు టీఎస్ఐఐసీ వర్గాలు తెలిపాయి. ఎస్‌డీసీపై కేటీఆర్ ట్వీట్.. ఇటీవల మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి కేటీఆర్ సైతం ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుపై సామాజిక మాధ్యమం ట్విటర్లో ట్వీట్ చేశారు. టీఎస్ఐఐసీ, తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన.. రాష్ట్రంలోనే అతిపెద్ద స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్, ఇండస్ట్రియల్ పార్క్ ఇదేనని పేర్కొన్నారు. దండుమల్కాపురం పార్క్‌లో సుమారు 589 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కొలువుదీరనున్నాయన్నారు. సుమారు 20–30 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పనే లక్ష్యంగా ఈ పార్క్‌ను ఏర్పాటు చేశామన్నారు. స్థానిక పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా నైపుణ్యం కలిగిన కార్మికులు, టెక్నీషియన్లు, ఉద్యోగులను తీర్చిదిద్దేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అవసరమైన శిక్షణనిస్తుందన్నారు. ఇటీవల హర్యానా స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు సైతం తమ స్టడీటూర్‌లో భాగంగా ఈ కేంద్రాన్ని, పార్క్‌ను సందర్శించి స్ఫూర్తి పొందినట్లు తెలిపారు. కాగా ఈపార్క్‌లో సుమారు 60 శాతం స్థలాన్ని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించారు. ఈ పార్క్‌లో టౌన్షిప్ ఏర్పాటు ద్వారా వాక్‌టు వర్క్ కాన్సెప్ట్‌ను అమలు చేయనున్నారు. ఇప్పటికే ఈ పార్క్‌లో సుమారు 200 పరిశ్రమలు తమ కంపెనీలు నెలకొల్పే పనులు చేపట్టడం విశేషం. వచ్చే ఏడాది జూన్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆయాసంస్థలు చర్యలు చేపట్టాయి. ఇప్పటికే 30 పరిశ్రమలు ఈ పార్క్‌లో ఉత్పత్తులకు శ్రీకారం చుట్టాయి. మిగతా పరిశ్రమలు కూడా తమ కంపెనీల స్థాపనకు చర్యలు తీసుకుంటున్నాయి. పలు పారిశ్రామిక పార్క్‌ల పరిశీలన తర్వాతే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం దేశవ్యాప్తంగా పలు పారిశ్రామిక వాడలను పరిశీలించిన అనంతరమే టీఎస్ఐఐసీ, టీఐఎఫ్ సంస్థలు ఈ పార్క్‌ను అభివృద్ధి చేశాయి. దక్షిణాది రాష్ట్రాల్లో అతిపెద్ద ఎంఎస్ఎంఈ పార్క్ ఇదేనని తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్ ఫెడరేషన్ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. రూ.236 కోట్ల అంచనా వ్యయంతో విద్యుత్, మంచినీరు, రహదారులు, మురుగు నీటి పారుదల వ్యవస్థలను ఏర్పాటు చేశామన్నారు. ఈ పార్క్‌లో అంతర్భాగంగా 194 ఎకరాల్లో టౌన్షిప్ ఏర్పాటు చేయడంతోపాటు ఇందులో పాఠశాలలు, కమర్షియల్ మార్కెట్లు, ఎంటర్టైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ పార్క్‌కు డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ సంస్థనుంచి పలు అంశాల్లో ప్రశంసలు దక్కినట్లు పేర్కొన్నాయి. ఈ పార్క్‌లో సుమారు 40 వేల మొక్కలు నాటి హరితహారానికి చర్యలు తీసుకున్నామన్నాయి. (క్లిక్ చేయండి: ఇది బెంగళూరు కాదు సార్.. హైదరాబాదే!) -
యువతకు ఉపాధే లక్ష్యం
సాక్షి, యాదాద్రి: యువతకు ఉపాధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో టీఎస్ఐఐసీ–టీఐఎఫ్–ఎంఎస్ఎంఈ–గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌ను సహచర మంత్రి జి. జగదీశ్‌రెడ్డితో కలసి ఆయన ప్రారంభించారు. అనంతరం పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన ముఖాముఖిలో కేటీఆర్ మాట్లాడారు. రూ.1,552 కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో 450 యూనిట్ల స్థాపనకు వీలుగా ఏర్పాటు చేసిన ఈ పార్కు ద్వారా ప్రత్యక్షంగా 19 వేల మందికి, పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. వాక్–టు–వర్క్ విధానంలో భాగంగా పార్కులోనే 192 ఎకరాల్లో హౌసింగ్ కాలనీ నిర్మిస్తున్నట్లు చెప్పారు. టీఎస్ ఐపాస్ ద్వారా 12 లక్షల ఉద్యోగాలను సృష్టించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణ నాయకులకు పాలన వచ్చా? అని ఎగ తాళి చేసిన వాళ్లే ఇవాళ రాష్ట్ర విధానాలను అనుసరిస్తున్నారని గుర్తుచేశారు. టీఎస్ ఐపాస్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఢిల్లీలో జరిగిన పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రుల సమావేశంలో తెలంగాణ పరిశ్రమల విధానాన్ని ఇతర రాష్ట్రాలు కోరుకుంటున్నాయని చెప్పారు. ‘మాది తెలంగాణ’అని గర్వంగా చెప్పుకునే స్థాయికి వచ్చామన్నారు. పక్షం రోజుల్లోనే అనుమతులు... సింగిల్ విండో విధానం ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని, 15 రోజుల్లో అనుమతులు రాకుంటే డీమ్డ్ అఫ్రూవల్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణయేనని కేటీఆర్ తెలిపారు. పరిశ్రమలకు అనుమతులివ్వడంలో జాప్యం చేసిన అధికారులకు రోజుకు రూ. వెయ్యి జరిమానా విధిస్తున్నామన్నారు. ప్రస్తుతం దేశంలో అన్ని రంగాలకు 24 గంటల కరెం ట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సూక్ష్మ, స్థూల, మధ్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వం అండగా నిలబడుతోందన్నారు. పెద్ద పరిశ్రమల్లో యాంత్రీ కరణ ఎక్కువగా ఉండి ఉపాధి అవకాశాలు తక్కువగా ఉంటాయని, ఎంఎస్ఎంఈ పరిశ్రమల్లోనే 70 శాతం ఉద్యోగాలు వస్తాయన్నారు. భవిష్యత్తులో 2 వేల ఎకరాలకు విస్తరణ... గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌ను ప్రస్తుతం 440 ఎకరాల్లో ప్రారంభించినా భవిష్యత్తులో 2 వేల ఎకరాలకు విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తామని కేటీఆర్ తెలిపారు. 440 ఎకరాల్లో పార్క్ ఏర్పాటు చేసినా మరింత స్థలం కావాలని పారిశ్రామికవేత్తలు కోరుతున్నారని, పార్క్ విస్తరణకు అవసరమైన భూసేకరణ కోసం వెంటనే చర్యలు చేపట్టాలని కలెక్టర్ అనితా రామచంద్రన్‌ను ఆదేశించారు. గ్రీన్ ఇండస్ట్రీకి మాత్రమే ఇందులో పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం 33/11 కేవీ సబ్‌స్టేషన్ ప్రారంభించుకున్నామని, పెరిగే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ దగ్గర 132 కేవీ సబ్ స్టేషన్ ప్రారంభిస్తామన్నారు. వరంగల్‌లో దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్క్‌ను, సంగారెడ్డి జిల్లా లో దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైజెస్ పార్క్ ఏర్పాటు చేశామన్నారు. ప్లాస్టిక్ పార్క్, మైక్రో ప్రాసెసింగ్ పార్క్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేశామన్నారు. ఏ పరిశ్రమ ఏర్పాటైన మహిళలు, ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులకు ప్రత్యేక కోటా కేటాయిస్తున్నట్లు చెప్పా రు. చౌటుప్పల్ ప్రాంతంలో 40 కాలుష్యకారక పరిశ్రమలు పనిచేస్తున్నాయన్నారు. కాలుష్య నివారణకు ఎఫ్లు్యయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందన్నారు. మరో 3 చోట్లా ఇండస్ట్రియల్ పార్క్‌లు... నిజామాబాద్, కరీంనగర్, వరంగల్‌లలోనూ ఇండస్ట్రియల్ పార్క్‌లు ఏర్పాటు చేయబోతున్నామని కేటీఆర్ తెలిపారు. త్వరలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు డ్రైపోర్టు రాబోతుందన్నారు. ఖాయిలా పరిశ్రమలను ఆదుకోవడానికి ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్‌ను తీసుకురానున్నట్లు వివరించారు. పార్క్‌కు భూములిచ్చిన వారికి కుటుంబానికో ఉద్యోగమివ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి 10 ఎకరాల్లో వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక యువతకు పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. రాష్ట్రానికి అన్నీ చిన్న పరిశ్రమలే వస్తున్నాయని, భారీ పరిశ్రమలను తీసుకురావాల్సిన అవ సరం ఉందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ సమావేశానికి స్థానిక శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అధ్యక్షత వహించారు. స్థానిక యువతకు ప్రాధాన్యత: మంత్రి జగదీశ్‌రెడ్డి మల్కాపురం గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ దేశానికే ఆదర్శంగా ఉంటుందని, ఇందులో స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యతిస్తా మని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. మంత్రి కేటీఆర్ తన ప్రతిభతో రాష్ట్రాన్ని పరిశ్రమలు, ఐటీకి కేరాఫ్ అడ్రస్‌గా మార్చివేశారన్నారు. -
గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ పనులు వడివడిగా..!
సాక్షి, చౌటుప్పల్: తెలంగాణకే తలమానికమైన చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామంలో చేపట్టిన గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ పనులు వడివడిగా సాగుతున్నాయి. ప్రధాన రహదారి మధ్యన సెంట్రల్ లైటింగ్ సైతం ఏర్పాటు చేశారు. అంతర్గత రహదారులు, ప్రధాన డ్రెయినేజీ నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. పార్క్‌లో ఏర్పాటయ్యే పరిశ్రమలకు విద్యుత్ సరఫరాకు అవసరమైన సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు సైతం పూర్తి కావొచ్చాయి. అయితే పార్క్ శంకుస్థాపన ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడడంతో ఈ సారి అలాంటి పరిస్థితి రాకుండా అధికారులు పక్కా ప్రణాళికతో పనులు చేపడుతున్నారు. చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ పనులు వేగవంతమయ్యాయి. తెలంగాణలోనే ప్రప్రథమ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఇదే కావడం విశేషంగా చెప్పవచ్చు. ఇప్పటికే వివిధ రకాల కారణాలతో రెండు పర్యాయాలు శంకుస్థాపన కార్యక్రమం వాయిదా పడింది. ఈ నేపథ్యంలో మరోసారి కూడా వాయిదా పడొద్దన్న లక్ష్యంతో అధికార యంత్రాంగం పనులను ముమ్మరం చేసింది. ఇప్పటికే 60శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులను వీలైనంత త్వరలో పూర్తి చేసేందుకు రేయింబవళ్లు పనులను కొనసాగిస్తున్నారు. పార్క్ కోసం 1,144 ఎకరాల భూసేకరణ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం 1.144ఎకరాల భూమిని సేకరించారు. సీలింగ్, అసైన్డ్, పట్టా భూములకు సంబంధించి మూడు దఫాలుగా భూసేకరణ చేశారు. మొదటి విడతలో 682, 693, 695, 697, 699, 701, 702, 704, 705, 706, 707, 708, 709, 711, 712, 713, 714, 715, 716, 717 సర్వే నంబర్లలోని 128మంది రైతుల వద్ద 377ఎకరాల సీలింగ్ అసైన్డ్ భూమిని సేకరించారు. రెండో విడతలో 644 సర్వేనంబర్‌లో 98మంది రైతుల నుంచి 194.04ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూమిని సేకరించారు. మూడో విడతలో 727, 735, 736, 737, 753, 755, 756, 757, 765, 758, 754 సర్వేనంబర్లలోని 207మంది రైతుల వద్ద 472 ఎకరాల సీలింగ్, పట్టా భూములను సేకరించి పరిహారం అందజేశారు. అదే విధంగా 698, 701, 703, 704, 705, 710 సర్వేనంబర్లలోని 24మంది రైతుల వద్ద 101.19ఎకరాల పట్టా భూమిని సైతం సేకరించగా పరిహారం విషయంలో రైతులు కోర్టుకు వెళ్లారు. గత ఏడా ది ఆగస్టు నెలలో, ఈ ఏడాది ఏప్రిల్‌లో శంకుస్థాపన జరగాల్సి ఉండగా ఎన్నికల కారణంగా వాయిదా పడింది. కాగా త్వరలోనే పార్క్ శంకుస్థాపన జరిగే అవకాశాలు ఉన్నాయి. ముమ్మరంగా నిర్మాణ పనులు ఇండస్ట్రియల్ పార్క్‌లో ప్రధాన రహదారితో పాటు అంతర్గత రోడ్లు, ఇతర వసతుల కోసం ప్రభుత్వం గత ఏడాది రూ.36కోట్ల నిధులను మంజూరు చేసింది. ప్రధానంగా 65వ నంబరు జాతీయ రహదారి నుంచి రెండు కిలోమీటర్ల దూరం వరకు రోడ్డు నిర్మాణానికి రూ.18కోట్లు కేటాయించగా ఇప్పటికే పనులు పూర్తయ్యాయి. ప్రధాన రహదారి మధ్యన సెంట్రల్ లైటింగ్ సైతం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పార్క్‌లోని అంతర్గత రహదారులు, ప్రధాన డ్రెయినేజీ నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. పార్క్‌లో ఏర్పాటయ్యే పరిశ్రమలకు విద్యుత్ సరఫరాకు అవసరమైన సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు సైతం పూర్తి కావొచ్చాయి. అలాగే పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా పార్క్‌లోని భూమిని చదును చేస్తున్నారు. రూ.12వేల కోట్ల పెట్టుబడులు ఇండస్ట్రియల్ పార్క్‌లో సేకరించిన భూమిలో ఇప్పటికే 377ఎకరాల్లో పరిశ్రమల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా 396మంది పారిశ్రామికవేత్తలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చారు. ఆ మేరకు వారికి అవసరమైన స్థలాల కేటాయింపు సైతం జరిగింది. ఈ పరిశ్రమల ఏర్పాటుతో ప్రభుత్వానికి 12వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయి. ప్రత్యక్షంగా 20వేలు, పరోక్షంగా మరో 20వేల మందికి ఉపాధి లభించనుంది. -
డిసెంబర్లో దండుమల్కాపూర్ పార్క్‌కు శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: దండుమల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును మోడల్ హౌసింగ్ టౌన్‌షిప్‌గా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. తెలంగాణలో తొలిసారిగా 450 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ ఇండస్ట్రియల్ పార్కు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమని, అందుకు తగ్గట్టుగా అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పిస్తామని పేర్కొన్నారు. పార్కు ఏర్పాటుకు సమగ్ర ప్రణాళిక, రోడ్లు, ఇతర ప్రాథ మిక మౌలిక వసతులను వీలైనంత త్వరగా కల్పిస్తే.. డిసెంబర్ తొలి వారంలో సీఎం కేసీఆర్ చేతుల మీదు గా శంకుస్థాపన చేయిస్తామని వెల్లడించారు. శనివారం హైదరాబాద్ బషీర్‌బాగ్ పరిశ్రమ భవన్‌లోని టీఎస్ఐఐసీ కార్యాలయంలో యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్‌లో ఏర్పాటు చేస్తున్న ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు కార్యాచరణ ప్రణాళికతోపాటు ఇతర టీఎస్ఐఐసీ ప్రాజెక్టులపై అధికారులతో సమావేశం నిర్వహించా రు. దండుమల్కాపూర్ పార్కు భూ సేకరణ, అభివృద్ధి పనుల ప్రతిపాదనలను టీఎస్ఐఐసీ అధికారు లను అడిగి తెలుసుకున్నారు. ఈ పార్కుకు ఇప్పటివరకు రూ.45 కోట్లు ఖర్చు చేసి 377 ఎకరాలను సేకరించామని, మరో 80 ఎకరాల సేకరణకు రైతులకు నోటీసులు జారీ చేశామని టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు వివరించారు. భూమిని టీఐఎఫ్‌కు కేటాయిం చామని, పార్కు నిర్వహణ టీఎస్ఐఐసీ పర్యవేక్షణలో ఉంటుందని చెప్పారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రత్యేకం కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో దండుమల్కా పూర్ పార్కు మొదటిదని, దీన్ని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కాలుష్య రహిత ఇండస్ట్రియల్ పార్కుగా అభివృద్ధి చేసి ఆ కేటగిరీ పరిశ్రమలనే ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పారు. 400 పరిశ్రమల యూనిట్లను ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారా రూ.1000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయని, 12 వేల మందికి ప్రత్యక్షంగా, 20 వేల మందికి పరోక్షంగా ఉపాధి కలుగుతుందని వివరించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే పారిశ్రామికవాడలకు సమీపంలోనే ఉద్యోగులు, కార్మికులు నివాసం ఉండేలా రెసిడెన్షియల్ టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయాలన్నది సీఎం లక్ష్యమని తెలి పారు. సీఎం ఆలోచనలకు అనుగుణంగానే దండుమల్కాపూర్ పారిశ్రామికవాడను రెసిడెన్షియల్ మోడల్ టౌన్‌షిప్‌గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఇందుకు ఇక్కడ మరో 100 ఎకరాల్లో 30 వేల మందికి నివాస వసతి ఉండేలా రెసిడెన్షియల్ టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించాలని టీఎస్ఐఐసీ అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఈ టౌన్‌షిప్‌ను మున్సిపాలి టీగా అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పారు. మరో 25 ఎకరాల్లో పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆటస్థలం, కమ్యూనిటీ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. రూ.25 కోట్లతో పనులు విజయవాడ జాతీయ రహదారి నుంచి దండుమల్కాపూర్ పార్కు వరకు రూ.15 కోట్లతో ఫార్మేషన్ రోడ్డును, రూ.5 కోట్లతో విద్యుత్, రూ.5 కోట్లతో నీటి వసతులను కల్పించేందుకు రూ.25 కోట్ల టీఎస్ఐఐసీ నిధులతో త్వరలో పనులు ప్రారంభిస్తామని కేటీఆర్ తెలిపారు. ఇండస్ట్రియల్ పార్కు లో అంతర్గత అభివృద్ధి పనులు, మౌలిక వసతుల ను టీఐఎఫ్ నిధులతో చేపడతామన్నారు. టెక్నాలజీకి అనుగుణంగా నాణ్యత ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని టీఐఎఫ్ అధ్యక్షుడు సుధీర్‌రెడ్డిని ఆదేశించారు. నిబంధనల మేరకు పరిశ్రమల యూనిట్లకు ప్లాట్లు కేటాయించాలని, ఈ వ్యవహారంలో పారదర్శకమైన విధానాన్ని రూపొందించాలని టీఎస్ఐఐసీ ఎండీని ఆదేశించారు. దండుమల్కాపూర్ పార్కు భూ వినియోగ మార్పిడి, లేఅవుట్ అనుమతులను త్వరితగతిన ఇవ్వాలని హెచ్ఎండీ ఏ అధికారులను ఆదేశించారు. పాశమైలారం ఇండస్ట్రియల్ పార్కులో రూ.2 కోట్లతో మౌలిక వసతులు సిద్ధంగా ఉన్నాయని, ప్రారంభించడానికి, సిబ్బంది నియామకానికి ప్రభుత్వం నుంచి పరిపాలనా అనుమతులు ఇప్పిస్తామని టీఐఎఫ్ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. సమావేశంలో భువనగిరి ఎంపీ నర్సయ్యగౌడ్, పరిశ్రమల శాఖ ముఖ్యకా ర్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, సీఈ లక్ష్మీకాంత్‌రెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడు రఘు పాల్గొన్నారు. -
కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
నల్లగొండ : నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం దండుమాల్కాపురంలోని జయ కెమికల్ ఫ్యాక్టరీ స్టోర్‌రూంలో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పరిశ్రమలోని స్టోర్ రూంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. భద్రత సిబ్బంది వెంటనే స్పందించి... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. ఈ అగ్నిప్రమాదంలో స్టోరు రూం సమీపంలో ఉన్న డీసీఎం వ్యాను పూర్తిగా కాలిపోయింది. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... ఈ ప్రమాదానికి గల కారణంపై భద్రత సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.