డిసెంబర్‌లో దండుమల్కాపూర్‌ పార్క్‌కు శంకుస్థాపన | Foundation for Dandu Malkapur Park before December | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌లో దండుమల్కాపూర్‌ పార్క్‌కు శంకుస్థాపన

Published Sun, Oct 8 2017 3:26 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

Foundation for Dandu Malkapur Park before December - Sakshi

శనివారం హైదరాబాద్‌లో టీఎస్‌ఐఐసీ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి కేటీఆర్‌. చిత్రంలో ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: దండుమల్కాపూర్‌ గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కును మోడల్‌ హౌసింగ్‌ టౌన్‌షిప్‌గా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. తెలంగాణలో తొలిసారిగా 450 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ ఇండస్ట్రియల్‌ పార్కు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమని,  అందుకు తగ్గట్టుగా అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పిస్తామని పేర్కొన్నారు. పార్కు ఏర్పాటుకు సమగ్ర ప్రణాళిక,  రోడ్లు,  ఇతర ప్రాథ మిక మౌలిక వసతులను వీలైనంత త్వరగా కల్పిస్తే.. డిసెంబర్‌ తొలి వారంలో సీఎం కేసీఆర్‌ చేతుల మీదు గా శంకుస్థాపన చేయిస్తామని వెల్లడించారు.

శనివారం హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌ పరిశ్రమ భవన్‌లోని టీఎస్‌ఐఐసీ కార్యాలయంలో యాదాద్రి జిల్లా  చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపూర్‌లో ఏర్పాటు చేస్తున్న ఎంఎస్‌ఎంఈ గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కు కార్యాచరణ ప్రణాళికతోపాటు ఇతర టీఎస్‌ఐఐసీ ప్రాజెక్టులపై అధికారులతో సమావేశం నిర్వహించా రు. దండుమల్కాపూర్‌ పార్కు భూ సేకరణ,  అభివృద్ధి పనుల ప్రతిపాదనలను టీఎస్‌ఐఐసీ అధికారు లను అడిగి తెలుసుకున్నారు. ఈ పార్కుకు ఇప్పటివరకు రూ.45 కోట్లు ఖర్చు చేసి 377 ఎకరాలను సేకరించామని, మరో 80 ఎకరాల సేకరణకు రైతులకు నోటీసులు జారీ చేశామని టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ బాలమల్లు వివరించారు. భూమిని టీఐఎఫ్‌కు కేటాయిం చామని, పార్కు నిర్వహణ టీఎస్‌ఐఐసీ పర్యవేక్షణలో ఉంటుందని చెప్పారు.

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రత్యేకం 
కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో దండుమల్కా పూర్‌ పార్కు మొదటిదని, దీన్ని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కాలుష్య రహిత ఇండస్ట్రియల్‌ పార్కుగా అభివృద్ధి చేసి ఆ కేటగిరీ పరిశ్రమలనే ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పారు. 400 పరిశ్రమల యూనిట్లను ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారా రూ.1000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయని, 12 వేల మందికి ప్రత్యక్షంగా,  20 వేల మందికి పరోక్షంగా ఉపాధి కలుగుతుందని వివరించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే పారిశ్రామికవాడలకు సమీపంలోనే ఉద్యోగులు, కార్మికులు నివాసం ఉండేలా రెసిడెన్షియల్‌ టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయాలన్నది సీఎం లక్ష్యమని తెలి పారు.

సీఎం ఆలోచనలకు అనుగుణంగానే దండుమల్కాపూర్‌ పారిశ్రామికవాడను రెసిడెన్షియల్‌ మోడల్‌ టౌన్‌షిప్‌గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఇందుకు ఇక్కడ మరో 100 ఎకరాల్లో 30 వేల మందికి నివాస వసతి ఉండేలా రెసిడెన్షియల్‌ టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేయడానికి  ప్రణాళికలు రూపొందించాలని టీఎస్‌ఐఐసీ అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఈ టౌన్‌షిప్‌ను మున్సిపాలి టీగా అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పారు. మరో 25 ఎకరాల్లో పాఠశాల,  అంగన్‌వాడీ కేంద్రం,  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,  ఆటస్థలం,  కమ్యూనిటీ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.

రూ.25 కోట్లతో పనులు 
విజయవాడ జాతీయ రహదారి నుంచి దండుమల్కాపూర్‌ పార్కు వరకు రూ.15 కోట్లతో ఫార్మేషన్‌ రోడ్డును, రూ.5 కోట్లతో విద్యుత్, రూ.5 కోట్లతో నీటి వసతులను కల్పించేందుకు రూ.25 కోట్ల టీఎస్‌ఐఐసీ నిధులతో త్వరలో పనులు ప్రారంభిస్తామని కేటీఆర్‌ తెలిపారు. ఇండస్ట్రియల్‌ పార్కు లో అంతర్గత అభివృద్ధి పనులు,  మౌలిక వసతుల ను టీఐఎఫ్‌ నిధులతో చేపడతామన్నారు. టెక్నాలజీకి అనుగుణంగా నాణ్యత ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని టీఐఎఫ్‌ అధ్యక్షుడు సుధీర్‌రెడ్డిని ఆదేశించారు. నిబంధనల మేరకు పరిశ్రమల యూనిట్లకు ప్లాట్లు కేటాయించాలని,  ఈ వ్యవహారంలో పారదర్శకమైన విధానాన్ని రూపొందించాలని టీఎస్‌ఐఐసీ ఎండీని ఆదేశించారు.

దండుమల్కాపూర్‌ పార్కు భూ వినియోగ మార్పిడి, లేఅవుట్‌ అనుమతులను త్వరితగతిన ఇవ్వాలని హెచ్‌ఎండీ ఏ అధికారులను ఆదేశించారు. పాశమైలారం ఇండస్ట్రియల్‌ పార్కులో రూ.2 కోట్లతో మౌలిక వసతులు సిద్ధంగా ఉన్నాయని, ప్రారంభించడానికి,  సిబ్బంది నియామకానికి ప్రభుత్వం నుంచి పరిపాలనా అనుమతులు ఇప్పిస్తామని టీఐఎఫ్‌ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. సమావేశంలో భువనగిరి ఎంపీ నర్సయ్యగౌడ్,  పరిశ్రమల శాఖ ముఖ్యకా ర్యదర్శి జయేశ్‌ రంజన్, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, సీఈ లక్ష్మీకాంత్‌రెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడు రఘు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement