సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 140కు పైగా పెద్ద పారిశ్రామికవాడలున్నాయని, అందులో 10 శాతం స్థలాలను మహిళా పారిశ్రామికవేత్తలకు కేటాయిస్తామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. సుల్తాన్ పూర్‌లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఫిక్కి లేడీస్ ఆర్గనైజేషన్ పారిశ్రామికవాడలో 18 మంది మహిళా పారిశ్రామికవేత్తలకు శుక్రవారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో స్థల కేటాయింపుల పత్రాలను మంత్రి అందజేశారు. ఈ పారిశ్రామిక వాడను తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) నిర్మించింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ప్రభుత్వం నుంచి ప్రత్యేక రాయితీ, సదుపాయాల అవసరం లేకుండానే సమర్థవంతంగా పనిచేయగలమనే సందేశాన్ని మహిళా పారిశ్రామికవేత్తలు సమాజానికి పంపాలని సూచించారు.
వీరి కోసం 200 ఎకరాల్లో మూడు పారిశ్రామికవాడలు ఏర్పాటు చేశామన్నారు. సుల్తాన్‌పూర్‌లో 50 ఎకరాలు, 30 ఎకరాల్లో కొవే, 120 ఎకరాల్లో ఎలీప్ పారిశ్రామికవాడలను నెలకొల్పగా, అన్ని చోట్లా స్థలాలు పూర్తిగా అమ్ముడుపోవడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. అవసరమైతే మహిళా పారిశ్రామికవేత్తల కోసం మరో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి మరో రెండు ప్రాంతాల్లో స్థలాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఫిక్కి మహిళా పారిశ్రామికవేత్తల పార్కులో ప్రభుత్వ ఖర్చులతోనే రోడ్లు, విద్యుత్, నీటి సరఫరా లాంటి మౌలిక సదుపాయాలు కల్పించామని, సాధారణంగా ఈ వ్యయాన్ని పారిశ్రామికవేత్తల నుంచి టీఎస్‌ఐఐసీ వసూలు చేస్తుందన్నారు.
1,500 మందికి ఉద్యోగాలు..
సుల్తాన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన పారిశ్రామికవాడలో 1,500 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని, పురుషులకు సైతం ఉద్యోగాలివ్వాలని మంత్రి కేటీఆర్ కోరారు. హైదరాబాద్‌ను రెండో ఇంటిగా ఏర్పాటు చేసుకుని, ఇక్కడ మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఫిక్కి ఇండియా అధ్యక్షుడు రాశేష్ షాను కోరారు. ఫిక్కి లేడిస్ ఆర్గనేషన్ ఇండియా అధ్యక్షురాలు పింకీరెడ్డిపై ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంశలు కురిపించారు. ఆమె శక్తి సామర్థ్యాలు, ఉత్సాహాన్ని చూస్తుంటే భారత దేశానికి సైతం అధ్యక్షురాలు కాగలదు అని చమత్కరించారు. ఫిక్కి ఇండియా అధ్యక్షుడు రశేష్ షా మాట్లాడుతూ, బ్యాంకు కుంభకోణాలు, ఎన్పీఏలకు సంబంధించిన ఉదంతాలు బయటపడిన ప్రతిసారి ప్రభుత్వం, పారిశ్రామికవేత్తల మధ్య సంబంధాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయన్నారు.
ఇలాంటి పరిస్థితిలో పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, టీఎస్‌ఐఐసీ చైర్మన్ బాలమల్లు, ఎండీ నర్సింహారెడ్డి, ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ ఇండియా అధ్యక్షురాలు పింకీరెడ్డి, జ్యోత్స అంగార, యూఎస్ కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డా, బిట్రిష్ హైకమిషనర్ ఆండ్రు ఫ్లెమింగ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment