women enterpreneurs
-
మహిళా పారిశ్రామివేత్తలకు అభినందనలు: యూఎస్ కాన్సులేట్ జనరల్
హైదరాబాద్: హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సులేట్ జనరల్, అలయన్స్ ఫర్ కమర్షియలైజేషన్ అండ్ ఇన్నోవేషన్ రీసెర్చ్ (ఎసిఐఆర్) భాగస్వామ్యంతో ఇంటెన్సివ్ అకాడమీని విజయవంతంగా పూర్తి చేసిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెందిన మహిళా పారిశ్రామికవేత్తలను యుఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ ప్రోగ్రామ్ గ్రాడ్యుయేట్లకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మహిళా వ్యాపారవేత్తలకు వ్యాపారాల అభివృద్ధికి వ్యూహాత్మక ప్రణాళిక, మార్కెటింగ్, ఆర్థిక నిర్వహణ నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చింది. ఆరు నెలల పాటుసాగిన ఈ శిక్షణా కార్యక్రమంలో తెలంగాణ, ఏపీకి చెందిన 60మంది మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. మహిళా నాయకత్వం, మహిళా ఔత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించడం అమెరికా ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి అని జెన్నిఫర్ తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తల అకాడమీ, వనరులు, కనెక్షన్లతో మహిళలను శక్తివంతం చేయడంతోపాటు, ఇండియాతో తమ భాగస్వామ్య లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళుతుందన్నారు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్ తమ క్యాంపస్‌లలో ఏడబ్ల్యూఈ కోహార్ట్‌లను నిర్వహిస్తున్నందుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో శుక్రవారం కాన్సులేట్ నిర్వహించిన అకాడమీ ఫర్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (ఏడబ్ల్యూఈ) కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమం శుక్రవారం (నవంబర్ 22) జరిగింది. ఈ నెల(నవంబర్) 26న విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో మరో ఈవెంట్ జరగనుంది. -
‘ప్రగతి’ పయనంలో మహిళా శక్తి
సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల్లో ప్రతి మహిళ స్వయంశక్తితో ఎదిగేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) మరో అడుగు ముందుకేసింది. ప్రభుత్వం అందించిన వివిధ పథకాల నిధులతో స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించడంతో పాటు, వారు ఆర్థికంగా మరింత ఎదిగేందుకు ‘మహిళా పట్టణ ప్రగతి యూనిట్ల’ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. స్వయం ఉపాధిపై ఆసక్తి గల 142 మంది పట్టణ మహిళా సంఘాల సభ్యుల(ఎస్‌హెచ్‌జీ)కు ఆసక్తి ఉన్న రంగాలలో పూర్తిస్థాయిలో శిక్షణనిచ్చింది. ఆయా పరిశ్రమలు పర్యావరణ హితమైనవిగా ఉండేలా ముందే జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందులో సూక్ష్మ పరిశ్రమల స్థాపన, వ్యాపార విధానాలు, ముడిసరుకు లభ్యత వంటి అంశాలపై తర్ఫీదునిచ్చారు. ఒక్కో యూనిట్‌కు సగటున రూ.2.50 లక్షల చొప్పున దాదాపు రూ.4 కోట్ల నిధులను మెప్మా ఇందుకోసం వెచ్చించింది. ఇప్పటికే యంత్రాల కొనుగోలు ప్రక్రియ పూర్తవగా, మరో 10 రోజుల్లో యూనిట్లను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ చేపట్టారు. యూనిట్లు ఏర్పాటు తర్వాత స్థానికంగా ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు కూడా మెప్మా ఎండీ విజయలక్ష్మి ముందస్తు చర్యలు తీసుకున్నారు. శిక్షణ పొందిన ట్రేడ్స్‌లో నిపుణులతో అవసరమైన సహకారం అందించనున్నారు. ఆరు ట్రేడ్లలో 142 మందికి శిక్షణ పూర్తి నాలుగున్నర ఏళ్లలో వివిధ పథకాల ద్వారా రాష్ట్రంలో 25 లక్షల మంది పట్టణ పొదుపు సంఘాల మహిళలతో జగనన్న మహిళా మార్టులు, ఆహా క్యాంటీన్లు, అర్బన్ మార్కెట్లు ఏర్పాటు చేయించి మెప్మా విజయం సాధించింది. మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు విస్తత మార్కెట్ కల్పించేందుకు ఈ–కామర్స్ సంస్థలతోనూ ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు అదే మహిళలతో పరిశ్రమలు నెలకొల్పి, పర్యావరణ హితమైన సరికొత్త ఆలోచనలను ప్రోత్సహించేందుకు మహిళా ‘ప్రగతి యూనిట్లు’ ఏర్పాటుపై పూర్తిస్థాయి శిక్షణనిచ్చారు. అన్ని మునిసిపాలిటీల్లోని మహిళా సంఘాలు తీర్మానాలు చేసిన ప్రాజెక్టుల్లో కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ వర్క్, పేపర్ ప్లేట్ల తయారీ, క్లాత్ బ్యాగ్స్ తయారీ, స్క్రీన్ ప్రింటింగ్, ఆర్టీఫిషియల్ జ్యూవెలరీ, కర్పూరం, దీపం వత్తులు, సాంబ్రాణి తయారీ, కారం, మసాలా పొడులు, మిల్లెట్స్ ప్రాసెసింగ్‌లో శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన 142 మందికి ప్రభుత్వమే యంత్రాలు, ముడిసరుకును ఉచితంగా ఇచ్చి మొత్తం 111 యూనిట్లను పట్టణాల్లో ఏర్పాటు చేస్తున్నారు. మెప్మాతో మెరుగైన జీవితం టైలరింగ్‌లో అనుభవం ఉంది. ఇంట్లోనే కుట్టుపని ప్రారంభించా. వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటున్నా. ఎలా చేయాలో తెలియదు. పట్టణ మహిళా సంఘంలో సభ్యురాలిని కావడంతో మెప్మాను సంప్రదించాను. వారు కంప్యూటర్‌పై ఎంబ్రాయిడరీ వర్క్‌లో శిక్షణ ఇచ్చారు. ఇది నాకెంతో ఉపయోగపడుతుంది. ముడిసరుకు సేకరణ, వ్యాపారం, మార్కెటింగ్ అంశాల్లో పూర్తి శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వమే ఉచితంగా యంత్రాలను అందించడం చాలా ఆనందంగా ఉంది. – టి.తనూజ స్రవంతి, విశాఖపట్నం నాపై నమ్మకం పెరిగింది సొంతంగా పరిశ్రమ పెట్టి కనీసం నలుగురికి ఉపాధి కల్పించాలన్న కోరిక ఉంది. కానీ ఎలా చేయాలో తెలియదు. ఇంట్లోనే క్లాత్ బ్యాగ్‌లు కుడుతుంటాను. వాటిపై అవసరమైన బ్రాండింగ్ కోసం మరో చోటకు వెళ్లాల్సి వస్తోంది. వ్యాపారంపైనా అవగాహన లేదు. ఈ ఏడాది ఎస్‌హెచ్‌జీలో చేరాను. మెప్మా ‘మహిళా పట్టణ ప్రగతి యూనిట్ల’ ఉచిత శిక్షణలో స్క్రీన్ ప్రింటింగ్, జ్యూట్ బ్యాగ్‌ల తయారీ, వ్యాపార మెళకువలు తెలుసుకున్నాను. నేను పూర్తిస్థాయిలో వ్యాపారం చేయగలనన్న నమ్మకం లభించింది. – బి.రాజేశ్వరి, ఏలూరు మహిళా ప్రగతి లక్ష్యంగా శిక్షణ మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలనేది సీఎం జగన్మోహన్రెడ్డి ఆశయం. అందుకు అనుగుణంగా మెప్మా ఆధ్వర్యంలో జగనన్న మహిళా మార్టులు, ఆహా క్యాంటీన్లు, అర్బన్ మార్కెట్లు వంటివి ఏర్పాటు చేసి విజయం సాధించాం. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి మహిళా ప్రగతి యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం. మహిళలు కోరుకున్న రంగాల్లో ఉచిత శిక్షణ ఇచ్చాం. ఇంటిని చక్కదిద్దుకుంటూనే పిల్లల బాగోగులు చూసుకుంటున్న మహిళలకు మెప్మా అండగా ఉంటుంది. పరిశ్రమలు స్థాపించి నిర్వహించగల సామర్థ్యం మహిళలకు ఉంది. మార్కెటింగ్ విషయంలో మెప్మా వారికి అండగా నిలబడుతుంది. పదిరోజుల్లో 111 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం. యూనిట్లు ఏర్పాటు తర్వాత వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సహకారం అందిస్తాం. – వి.విజయలక్ష్మి, ఎండీ, మెప్మా -
సుచరిత సుమధుర శ్రుతి
విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువును మాత్రమే కాదు... సమాజాన్ని కూడా లోతుగా చదివే వారే ఎంటర్ప్రెన్యూర్లుగా గెలుపు జెండా ఎగరేయగలరని నిరూపించారు ‘కలైడోఫిన్’ కో–ఫౌండర్, సీయివో సుచరిత ముఖర్జీ, ‘అప్నాక్లబ్’ సీయీవో శ్రుతి. తాజాగా... ఫోర్బ్స్ ఆసియా ‘100 టు వాచ్’ వార్షిక జాబితాలో ఆరు భారతీయ కంపెనీలు చోటు చేసుకున్నాయి. వాటిలో ‘కలైడోఫిన్’‘అప్నాక్లబ్’లు ఉన్నాయి.. అయిదుగురు కుటుంబ సభ్యుల పోషణ బాధ్యతను తలకెత్తుకున్న చెన్నైకి చెందిన రమణీ శేఖర్ దినసరి కూలీ. రోజుకు రెండు వందల రూపాయల వరకు సంపాదిస్తుంది. కంటిచూపు కోల్పోవడంతో భర్త ఇంటికే పరిమితం అయ్యాడు. కొడుకు, కూతురు కాస్తో కూస్తో చదువుకున్నారుగానీ ఏ ఉద్యోగమూ చేయడం లేదు. వీరితోపాటు తల్లి పోషణ భారం కూడా తనదే. ఒక విధంగా చెప్పాలంటే నెలాఖరుకు పైసా మిగలడం కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ‘కలైడోఫిన్’ పేరు మీద అయిదు వందల రూపాయలు పొదుపు చేయడం మానలేదు రమణి. ‘అత్యవసర పరిస్థితుల్లో వైద్య అవసరాల కోసం ఈ డబ్బును ఉపయోగిస్తాను’ అంటున్న రమణి కొంత డబ్బును సెల్ఫ్–హెల్ప్ గ్రూప్ సేవింగ్ స్కీమ్స్‌లో కూడా పెడుతుంది. ‘రమణిలాంటి ఎంతోమంది పేదవాళ్లకు కష్ట సమయంలో కలైడోఫిన్ అండగా ఉంది’ అంటుంది ఫిన్‌టెక్ కంపెనీ ‘కలైడోఫిన్’ కో–ఫొండర్, సీయీవో సుచరిత ముఖర్జీ. దీర్ఘకాల, మధ్యకాల, స్వల్పకాల లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని ఉదాన్, లక్ష్య, ఉమ్మిద్ అనే ప్యాకేజ్‌లను లాంచ్ చేసింది కలైడోఫిన్. ‘కలైడోఫిన్’ ప్యాకేజిలలో ఒకటైన ‘లక్ష్య’ను పేద ప్రజల ఆరోగ్యం, చదువు, వివాహాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు నుంచి నాలుగు సంవత్సరాల కాలపరిమితితో రూపొందించారు. ఈ ప్యాకేజీలో మరణం లేదా అంగవైకల్యానికి బీమా ఉంటుంది. ‘తమ ఆర్థిక స్థాయిని బట్టి ఎవరైనా సరే వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసులతో యాక్సెస్ కావచ్చు’ అంటూ దిగువ మధ్యతరగతి, పేదవర్గాలకు భరోసాతో బయలుదేరింది కలైడోఫిన్. చెన్నై కేంద్రంగా ప్రారంభమైన ఈ ఫిన్‌టెక్ కంపెనీ అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందింది. వ్యాపారవేత్తకు కేవలం వ్యాపార దృష్టి మాత్రమే కాదు సాధ్యసాధ్యాలకు సంబంధించి వినియోగదారుల దృష్టి నుంచి కూడా ఆలోచించాలి. ఈ విషయంలో తగిన అధ్యయనం చేసింది సుచరిత. దిల్లీ యూనివర్శిటీలో ఎకనామిక్స్‌లో డిగ్రీ, ఐఐఎం, అహ్మదాబాద్‌లో ఎంబీఎ చేసిన సుచరిత ఐఎఫ్ఎంఆర్ ట్రస్ట్ గ్రూప్ కంపెనీలలో ఉన్నత హోదాలలో పనిచేసింది. ఆ తరువాత ‘కలైడోఫిన్’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా ప్రయాణం ప్రారంభించింది. శ్రుతి తండ్రి ఐఏఎస్ అధికారి. అయినప్పటికీ ఆయనకు ఆడపిల్లల విషయంలో ‘అయ్యో!’లు తప్పలేదు. ‘పాపం ఆయనకు ముగ్గురూ ఆడపిల్లలే’ అని లేని బాధను కొని తెచ్చుకునేవారు చుట్టాలు, పక్కాలు. స్కూల్ నుంచి కాలేజీ రోజుల వరకు ఎన్నోసార్లు లింగవివక్షతను ఎదుర్కొంది శ్రుతి. ఆత్మవిశ్వాసం ఉన్నా తప్పే లేకున్నా తప్పే అన్నట్లుగా ఉండేది పరిస్థితి. ఆత్మవిశ్వాసం ఉంటే ‘అంత వోవర్ కాన్ఫిడెన్సా?’ అని వెక్కిరింపు. లేకపోతే‘అంత ఆత్మన్యూనతా!’ అని చిన్నచూపు. ఇలాంటి పరిస్థితులను తట్టుకొని పెద్ద ప్రయాణమే చేయాల్సి వచ్చింది శ్రుతి. అయితే ఆ ప్రయాణంలో ఆమె ఎప్పుడూ ఆగిపోలేదు. ఐఐటీ–దిల్లీలో ఎం.టెక్. పూర్తిచేసిన శ్రుతి ఉద్యోగం చేయాలనుకుంది. ఆ తరువాత ‘ఉద్యోగం చేయగలనా?’ అని కూడా అనుకుంది. దీనికి కారణం... తన స్వతంత్ర వ్యక్తిత్వం. ‘నీకు చాలా కోపం’ అనే మాట చాలాసార్లు విన్నది.‘ఆవేశంతో కనిపించే వాళ్లకు సాధించాలనే కసి ఎక్కువగా ఉంటుంది’ అనే మాట కూడా విన్నది. ‘అప్నాక్లబ్’ రూపంలో అది తన విషయంలో నిజమైంది. వ్యాపారంలో రాణించాలనుకున్న శ్రుతి హార్వర్డ్ బిజినెస్ స్కూల్(హెచ్‌బీఎస్)లో ఎంబీఏ చేసింది. ఇండియాకు తిరిగి వచ్చిన తరువాత ‘సైర్’ పేరుతో ట్రావెల్ స్టార్టప్‌కు శ్రీకారం చుట్టింది. అయితే అది తనకు చేదు అనునుభవాన్ని నేర్పించడమే కాకుండా తియ్యటి పాఠాలు నేర్పింది. చిన్న పట్టణాలకు చెందిన వాళ్లు ఎఫ్ఎంసీజీ(ఫాస్ట్–మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్) ప్రాడక్స్ కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారనే విషయం గ్రహించిన శ్రుతి ‘అప్నాక్లబ్’ పేరుతో ఎఫ్ఎంసీజీ హోల్‌సేల్ ప్లాట్‌ఫామ్‌ను మొదలు పెట్టింది. సెమీ–అర్బన్, గ్రామీణ ప్రాంతాల కస్టమర్ల నుంచి మంచి స్పందన వచ్చింది. ‘ఫరవాలేదు’ అనుకుంటున్న సమయంలో కంపెనీ వేగంగా దూసుకుపోవడం మొదలైంది. టైగర్ గ్లోబల్, ట్రూ స్కేల్ క్యాపిటల్, ఫ్లోరిష్ వెంచర్స్, వైట్‌బోర్డ్ క్యాపిటల్... బ్యాకర్స్గా ‘అప్నాక్లబ్’ శక్తిమంతంగా తయారైంది. అంతర్జాతీయ స్థాయిలో మెరిసిపోతోంది. ‘నీకున్న ఆవేశానికి ఉద్యోగం చేయడం కష్టం. వ్యాపారం చేయడం అంత కంటే కష్టం’ అనే మాటను ఎన్నోసార్లు విన్నది శ్రుతి. ఇప్పుడు అలాంటి మాటలు ముఖం చాటేశాయి. ‘ఏదో సాధించాలనే గట్టి తపన, సంకల్పబలం ఉన్న మహిళ’ అనే ప్రశంసపూర్వకమైన మాటలు ‘అప్నాక్లబ్’ సీయీవో శ్రుతి గురించి తరచు వినిపిస్తున్నాయి. -
ఆహాలో `నేను సూపర్ వుమెన్`షో: రూ.1.35 కోట్ల పెట్టుబడి: కమింగ్ సూన్!
హైదరాబాద్: 100 శాతం లోకల్ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా దక్షిణ భారత దేశంలోనే తొలిసారిగా మహిళా పారిశ్రామికవేత్తల కోసం ‘నేను సూపర్ వుమెన్’ అనే బిజినెస్ రియాలిటీ షోను తీసుకొస్తోంది. జూలై 21 నుంచి ప్రతి శుక్ర, శనివారాల్లో ఈ రియాలిటీ షో ప్రసారం కానుంది. ఈ రియాలిటీ షోకు శ్రీరామచంద్ర హోస్ట్ గా వ్యవహరిస్తారు. Our tributes to the incredible Soundarya garu.. Truly a Real Super Woman for the ages…!!#NenuSuperWoman coming soon!! @rsbrothersindia @ShaadiDotCom @continentalkofi @WEHubHyderabad pic.twitter.com/B1Z0f6LHsc — ahavideoin (@ahavideoIN) July 11, 2023 తొలివారంలోనే ‘నేను సూపర్ వుమెన్’ఏంజెల్స్ మహిళా స్టార్ట్ అప్ కంపెనీస్ లో రూ.1.35 కోట్లు పెట్టుబడులను పెట్టారు. ఇన్వెస్ట్మెంట్ మాత్రమే కాకుండా. ఏంజెల్స్ మెంటార్ షిప్ అండ్ కార్పస్ ఫండ్ కూడా అందించనుంది. షో కి వచ్చే 40 కంటెస్టెంట్స్ కూడా ఈ అవకాశాన్ని దక్కించుకోవచ్చు. ఈ ఏంజెల్స్ కమిటీలో డార్విన్ బాక్స్ సహ వ్యవస్థాపకుడు రోహిత్ చెన్నమనేని, క్వాంటేలా కంపెనీ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ శ్రీధర్ గాంధి, సిల్వర్ నీడిల్ వెంచర్స్ రేణుక బొడ్ల, అభి బస్ సీఈఓ, వ్యవస్థాపకుడు సుధాకర్ రెడ్డి, దొడ్ల డైరీ ఫౌండర్ దొడ్ల దీపా రెడ్డి, బజాజ్ ఎలక్ట్రానిక్ కరణ్ బజాజ్, నారాయణ గ్రూప్ సింధూర పొంగూరు ఉన్నారు. వ్యాపార రంగంలో రాణించాలనుకునే మహిళలకు ‘నేను సూపర్ వుమెన్’ ఓ గేమ్ చేంజర్ షో అని డార్విన్ బాక్స్ సహ వ్యవస్థాపకుడు రోహిత్ చెన్నమనేని తెలిపారు. కొత్త ఆలోచనలతో సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించటానికి ఇదొక వేదిక అన్నారు. దశాబ్దాల అనుభవాన్ని పంచుకోవటానికి వారికి గైడెన్స్ ఇవ్వటానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ కరణ్ బజాజ్ (బజాజ్ ఎలక్ట్రానిక్స్) సూపర్ ఉమెన్ ఎంటైర్ టీమ్‌ని అభినందించారు. Only one-word 'Checkmate'..!♟ గెలుపోటముల చదరంగంలో బలంగా నిలిచింది.. చెక్ మేట్ చెప్పి మరీ తన జైత్రయాత్రను సాగిస్తోంది... ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది....! Our nation pride @HarikaDronavali ...👩🏻💼#NenuSuperWoman coming soon!! @rsbrothersindia @ShaadiDotCom… pic.twitter.com/V1Kqe9I6db — ahavideoin (@ahavideoIN) July 12, 2023 మహిళవ్యాపారవేత్త ధైర్యంగా నిలబడగలగుతుందో, వ్యాపార నమూనాలను, ఆలోచనలను గొప్పగా ప్రదర్శిస్తుందో, అప్పుడే తనకు సంతోషంగా అనిపిస్తుందని సిల్వర్ నీడెల్ వెంచర్స్ పార్ట్నర్ రేణుక బొడ్ల అన్నారు. మహిళల్లోనే వ్యాపార స్ఫూర్తిని పెంపొందించే ఈ ప్రయాణంలో తాను భాగమవుతున్నందుకు థ్రిల్లింగ్‌గా ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కొత్త శకానికి ఇదొక నాంది. నేను సూపర్ వుమెన్, స్త్రీ సాధికారతను పెంపెందించే అసాధారణమైన వేదిక ఆని డైరెక్టర్ ఆఫ్ నారాయణ కాలేజెస్ సింధూర పొంగూరు కొనియాడారు. To create a history in Telugu reality shows 🔥 The show called 'Nenu Super Woman' coming on aha...!#NenuSuperWoman coming soon!! @renukabodla @sridhargadhi #sindhuranarayana @sudhakar_chirra @chennamaneni #deepadodla @Sreeram_singer @rsbrothersindia @ShaadiDotCom… pic.twitter.com/R4SeZ8brIt — ahavideoin (@ahavideoIN) July 12, 2023 క్వాంటెలా ఇన్క్ ఫౌండర్ చైర్మన్ శ్రీధర్ గాంధీ మాట్లాడుతూ, ‘‘నేను సూపర్ ఉమెన్ ప్రోగ్రాం వల్ల వ్యాపారంలో రాణించాలనుకుంటున్న మహిళలు, వారి ఆలోచనలు గురించి తెలుసుకునే గొప్ప అవకాశం దక్కిందనీ, మహిళా వ్యాపారవేత్తల సామర్థ్యానికి, సృజనాత్మకతతో ఓ సరికొత్త అర్థవంతమైన మార్పుని తీసుకు రావటంతో పాటు మరిన్ని కొత్త అవకాశాలకు మార్గాలను ఏర్పరుచుకున్నట్లే అన్నారు. వి-హబ్ సీఇఓ దీప్తి రావు, ఆహా కంటెంట్ హెడ్ వాసుదేవ్ కొప్పినేని ‘నేను సూపర్ ఉమెన్’ అనేది అందరిలోనూ ఓ సానుకూలా దృక్పథాన్ని ఏర్పరుస్తుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ‘ఓ వ్యాపారవేత్తగా మరీ ముఖ్యంగా మహిళా వ్యాపారవేత్తగా ఉండటానికి ధైర్యంతో పాటు పట్టుదల, సంకల్పం అవసరమన్నారు. తెలంగాణ ప్రభుత్వం చొరవతో వి-హబ్ రూపుదాల్చిందని దీప్తి రావుల తెలిపారు. వాసుదేవ్ మాట్లాడుతూ ఆహా ఈ షో చేస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. దీని ద్వారా మహిళల సామర్థ్యాన్ని బయట పెట్టటానికి ఓ వేదికను అందిస్తున్నామని పేర్కొన్నారు. -
సాధికార చిత్రాలు.. చిత్రలేఖనంలో మహిళల కోసం ‘వరల్డ్ ఆఫ్ ఉమెన్’
ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతోంది. సాంకేతిక విప్లవంతో ప్రతి రంగం వేగం పుంజుకుంటోంది. మరి... మహిళాభివృద్ధి కూడా అంతే వేగంగా జరుగుతోందా? అభివృద్ధి పరుగులో మహిళ ఎక్కడో వెనుకబడుతోంది. చిత్రలేఖనంలో మహిళల వాటా ఐదు శాతమే. అందుకే ‘వరల్డ్ ఆఫ్ ఉమెన్’ (వావ్) పుట్టింది. వావ్ సీఓఓ షనన్ స్నో పరిచయం ఇది. షనన్ స్నో... అమెరికా అమ్మాయి. మయామిలో ఉంటోంది. ప్రపంచంలోని మహిళలందరినీ ఎంపవర్మెంట్ అనే వేదిక మీదకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తోంది. యామ్ కర్కాయ్ అనే చిత్రకారిణి, మరికొంత మంది భావసారూప్యత కలిగిన వ్యక్తులతో కలిసి ‘వరల్డ్ ఆఫ్ ఉమెన్’ వేదికగా ఉమెన్ ఆర్టిస్టుల కోసం పని చేస్తోన్న షనన్ తెలుగింటి కోడలు. ఆమె కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కి వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడింది. ‘‘నా దృష్టిలో జీవితం అంటే సాటి వారికి మనవంతుగా తోడ్పడడమే. అలాగే ప్రపంచం అంతటినీ చుట్టి రావడం కూడా. టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. సమాజం కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందుతోందా అంటే సమాధానం కష్టమే. నిజానికి మహిళాభివృద్ధితోనే సమాజం సంపూర్ణాభివృద్ధిని సాధిస్తుంది. అలాంటిది మహిళ ఇంకా సాధికారత సాధన కోసం పోరాడుతూనే ఉంది. ఆ పోరాటంలో విజయం సాధించాలంటే మహిళలు ఒకరికొకరు చేయూతగా నిలవాలి. ఆ భావనతోనే 2021 జూలైలో వరల్డ్ ఆఫ్ ఉమెన్’ అనే అనే సంస్థను స్థాపించాం. మా వరల్డ్ ఆఫ్ ఉమెన్ కమ్యూనిటీతో ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా 350 మంది మహిళా చిత్రకారులు అనుసంధానమయ్యారు. ఈ రెండేళ్లలో మేము దాదాపు 30 మీట్ అప్స్ ఏర్పాటు చేశాం. ముంబయిలో కశ్వీ పరేఖ్ మా కమ్యూనిటీ మేనేజర్. ఇలా మొత్తం ఇరవై మందిమి ఉన్నాం. కొత్తగా కుంచె పట్టుకున్న చిత్రకారిణుల చిత్రాలను అనతి కాలంలోనే ప్రపంచంలోని దేశాలన్నింటికీ పరిచయం చేస్తుంది ఈ వేదిక. ఒక విషయాన్ని చెప్పడానికి చిత్రలేఖనం ఒక అందమైన మాధ్యమం. అలాగే చిత్రలేఖనంలో ఎన్నో వైవిధ్యభరితమైన విధానాలుంటాయి. యామ్‌తో పాటు హాలీవుడ్ నటి ఎవా లాంగోరియా స్వచ్ఛందంగా ఆర్థిక సహకారం అందిస్తున్నారు. అవకాశాల్లో సమానత్వం మేము చేస్తున్న ఈ ప్రయత్నం మహిళ సాధికారత సాధన కోసమే. మహిళ తనంతట తానుగా నిలబడగలగాలి. అవకాశాలు అందరికీ సమానంగా ఉండాలి. కానీ సమాజం అలా లేదు. ప్రపంచంలో ఏ దేశాన్ని చూసినా మహిళ మనుగడ కోసం పోరాడుతూనే ఉంది. కొన్ని దేశాల్లో అస్థిత్వం కోసం పోరాటం, కొన్ని దేశాల్లో హక్కుల పోరాటం, మరికొన్ని దేశాల్లో స్వేచ్ఛాస్వాతంత్య్రాల కోసం పోరాడుతోంది. సంతోషంగా జీవించాలంటే పోరాటం తప్పని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ బాలికల విద్య ఇంకా ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన విషయంగానే ఉంది. వీటన్నింటి పరిష్కారం కోసం మా వరల్డ్ ఆఫ్ ఉమెన్ సర్వీసులను విస్తరిస్తున్నాం. మా చిత్రలేఖనాలు కూడా ‘మహిళ’ అనే అంశం మీదనే ఉంటాయి. బాల్యం నుంచి స్త్రీకి ఎదురయ్యే సవాళ్లు, ఆమె సాధించిన విజయాలు, ఆమె అధిరోహించిన శిఖరాలే ఇతివృత్తంగా ఉంటాయి. ఇది మహిళాభివృద్ధికి కొత్త ప్రారంభం వంటిది. ఈ పరంపరలో భాగస్వాములు కావడం సులభం. ఆన్లైన్లో లాగిన్ అయ్యి సభ్యత్వం తీసుకోవచ్చు. మహిళలు సాధించలేనిదంటూ ఏదీ లేదు. సంఘటితమై సాధించి చూపిద్దాం. – షనన్ స్నో, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, వరల్డ్ ఆఫ్ ఉమెన్ ఇండియాతో బంధం ఇండియాతో అనుబంధం 2007లో మొదలైంది. భారతీయ సంస్కృతిని తెలుసుకోవడానికి, స్వయంగా ఆస్వాదించాలని వచ్చాను. గూగుల్‌లో ఉద్యోగం చేస్తూ నాలుగైదేళ్లు ఇండియాలోనే ఉన్నాను. అయితే ఇండియన్స్‌తో అనుబంధం ఏర్పడి ఇరవై ఏళ్లయింది. ప్రతాప్ పెనుమల్లి నాకు అండర్ గ్రాడ్యుయేషన్‌లో పరిచయమయ్యాడు. యాభై ఏళ్ల కిందట యూఎస్‌కి వెళ్లి, అక్కడే స్థిరపడిన కుటుంబం వాళ్లది. మామగారు రిటైర్ అయిన తర్వాత అత్తమ్మ, మామయ్య ఏటా కొంతకాలం ఇండియాలో ఉంటున్నారు. నేను కూడా వచ్చాను. మా అత్తగారి పుట్టిల్లు, మామగారి సొంత ఊరికి కూడా వెళ్లాను. బంధువులందరూ ఆత్మీయంగా పలకరిస్తుంటే ఇండియాలో కుటుంబ బంధాలు చాలా దృఢమైనవని తెలిసింది. మా అత్తమ్మ వంటతో తెలుగు రుచులన్నీ అలవాటయ్యాయి. దోశ, ఎగ్ బుర్జీ, రొయ్యల కూర ఇష్టం. నా పర్యటనల్లో భాగంగా ఇండియా అంతా చూసేశాను. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చారిత్రక, సాంస్కృతిక, యాత్రా ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలన్నింటినీ చూశాను. ప్రతాప్‌తో కలిసి తిరుమల కొండను నడిచి ఎక్కాను తెలుసా’’ అంటూ ఆహ్లాదంగా నవ్వింది షనన్ స్నో. తిరుమలకొండకు నడిచి వెళ్లడం గొప్ప అనుభూతి. ప్రకృతిని ప్రేమించే వాళ్లకు ఎప్పటికీ చెరగని జ్ఞాపకం’ అందామె చిరునవ్వుతో. – వాకా మంజులారెడ్డి సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
అందమైన ప్యాకింగ్‌తో ఆదాయం.. తొమ్మిదేళ్లుగా..
వేడుకల సందర్భాలలో బంధుమిత్రులకు ఏదైనా కానుక తీసుకెళుతుంటాం. ఎంపిక చేసే కానుక ప్రత్యేకంగా ఉండాలనుకోవడమే కాదు, దానిని అంతే ప్రత్యేకంగా ప్యాకింగ్ చేయించి, మన అభిమానాన్ని చాటుకుంటాం. ఈ విషయాన్ని గమనించిన కృతిక సబర్వాల్ ‘ది స్మార్ట్ ర్యాప్’ పేరుతో వ్యాపారవేత్తగా మారింది. వర్క్‌షాప్స్, వెబినార్ ద్వారా టీచర్ ప్రెన్యూర్గానూ తన సత్తా చాటుతోంది. న్యూ ఢిల్లీలో ఉండే కృతిక ఇప్పటివరకు 5000 మంది విద్యార్థులకు గిఫ్ట్ ప్యాకింగ్ తయారీలో శిక్షణ ఇచ్చింది. దేశవ్యాప్తంగా 1300 మంది మహిళలకు ఉచితంగా గిఫ్ట్ ర్యాపింగ్ క్రాఫ్ట్ నేర్పించి, తన అందమైన మనస్తత్వాన్నీ చాటుకుంటుంది. తొమ్మిదేళ్లుగా చేస్తున్న ఈ కృషిలో మహిళలు గిఫ్ట్ ర్యాపింగ్‌లో ప్రతిరోజూ ఇంటి నుంచే మూడు గంటల పాటు శిక్షణ తీసుకుంటున్నారు. వెబినార్ ద్వారా ఉచితంగా గిఫ్ట్ ర్యాప్ తయారీతో పాటు ఇంటి నుంచే సొంత సంపాదన ఎలా సృష్టించుకోవచ్చో అవగాహన కల్పిస్తోంది కృతిక సబర్వాల్. వీటికి సంబంధించిన వివరాలను ఎంతో ఆనందంగా పంచుకుంటుంది. ‘‘జీవితం అనేది ఒక వేడుక. ఇక్కడ మనం ఆనందం, ప్రేమతో ఎంపిక చేసుకున్న బహుమతులను ఆప్తులకు బహుకరిస్తూ ఉంటాం. మన ప్రియమైనవారికి మన విలువైన సమయాన్ని వెచ్చించి, ఖరీదైన వస్తువులను ఎంపిక చేసి బహుమతిగా ఇచ్చినప్పుడు ఆటోమ్యాటిగ్గా వాటిపైన ఉన్న అందమైన ప్యాక్‌పైన దృష్టి వెళుతుంది. ఆ బహుమతిని అందుకునేవారి మనసును ఆకట్టుకునేలా ప్యాకింగ్ సేవలను అందించాలనుకున్నాను. వెంటనే ‘మీ బహుమతులను మరింత ఆహ్లాదకరమైన రీతిలో అందించండి’ అనే థీమ్‌తో 2013లో ది స్మార్ట్ ర్యాప్ బిజినెస్‌లోకి ప్రవేశించాను. ఆ తర్వాత 2016లో ఇంటి నుంచే చిన్న గిఫ్ట్ ర్యాపింగ్ వర్క్‌షాప్ చేయాలనే ఆలోచన నన్ను టీచర్ప్రెన్యూర్గా మార్చింది. దీంతో కోర్సులు, వర్క్‌షాప్‌లను రూపొందించడం ప్రారంభించాను. చాలా మంది గిఫ్ట్ ప్యాకేజింగ్ డిజైనర్లుగా మారడానికి సహాయం చేశాను. నాకే కాదు, ఎంతోమంది మహిళలకు ఉపాధికి అందమైన మార్గం దొరికింది అనిపించింది. గత పదేళ్లుగా 200కు పైగా వర్క్‌షాప్స్, 600కు పైగా వర్చువల్ క్లాసులు నిర్వహించాను. ప్రపంచంలో ఎవరైనా గిఫ్ట్ ప్యాకింగ్ నేర్చుకోవాలనుకుంటే వారికి మొదట గుర్తుకు వచ్చే పేరు ‘ది స్మార్ట్ ర్యాప్’ అనేది ఉండేలా సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. ఇంటినుంచే వ్యాపారం ఎప్పటికప్పుడు మార్కెట్లోని తాజా ట్రెండ్లను అప్‌గ్రేడ్ చేయడం నా బిజినెస్ లక్ష్యం. గిఫ్ట్ ర్యాప్ వ్యాపారం ద్వారా ఇంటి నుంచే సంవత్సరానికి సుమారు తొమ్మిది లక్షల రూపాయలు సంపాదించవచ్చు. ఆన్లైన్ ఆర్డర్ల ద్వారా ఇంకా ఎక్కువే సంపాదించుకోవచ్చు. ఈవెంట్ నిర్వాహకులు, బేకర్లు, స్వీట్లు, గిఫ్టింగ్ కంపెనీలు, గృహాలంకరణ బ్రాండ్లు ఈ కళ పట్ల మొగ్గు చూపడానికి చాలా అవకాశాలున్నాయి. సందర్భానికి సరిపోయేలా గిఫ్ట్ ప్యాక్ ఎలా రూపొందించాలో తెలిసుండాలి. వాటిని నేను పరిచయం చేస్తాను. మంచి మాటలే కాదు మనం అందించే కానుక ప్యాకింగ్ కూడా చాలా కాలంపాటు అందుకున్నవారి మదిలో గుర్తుండిపోయేలా మనం చేయాలి. నిపుణులనూ తయారు చేయచ్చు ర్యాపింగ్ టెక్నిక్లను పంచుకోవడం, వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించాలన్నది నా లక్ష్యం. ఈ గిఫ్ట్ ర్యాప్ ప్యాక్ క్రాఫ్ట్ నుంచి మీ తోటివారితో వినూత్న ఆలోచనలను పంచుకోవచ్చు. ప్రొఫెషనల్ వెడ్డింగ్ ప్యాకర్‌గా మారడంలోనూ ఇది మీకు సహాయపడుతుంది. మీలాగే మరికొందరిని ఈ జాబితాలో చేర్చుకోవచ్చు. జట్టుగానూ విజయాలను సాధించవచ్చు. కార్పొరేట్ హ్యాంపర్లు, స్వీట్లు, డ్రై ఫ్రూట్స్, బేబీ బర్త్ ప్యాక్స్, కృత్రిమ పూలు, కలపతో తయారుచేసిన బాస్కెట్స్ అలంకరణలు దీనికి జోడించవచ్చు. అంతేకాదు, ఈ ర్యాప్స్ నుంచి ఈవెంట్ డెకరేటివ్ ఆలోచనలకు కావల్సిన సలహాలనూ ఇస్తుంటాను. ఇన్నేళ్లలో ఇది ఎంతోమంది మహిళలకు ఉపయుక్తంగా మారిపోవడం ఆనందాన్నిస్తుంది’’ అని వివరిస్తున్న కృతికను చూస్తుంటే, స్మార్ట్‌గా మెలకువలను అమలు చేయడం ఎంత అవసరమో అర్థం అవుతుంది. చదవండి: నాన్న కళ్లలో ఆనందం కోసం.. ‘కలాసీ కూతురు ఇంజినీర్’ అని చెప్పుకోవాలి -
మహిళలకు వ్యాపార పాఠాలు
బాధ్యతలను అధిగమిస్తూ.. సమాజంలో ఉన్నతిని సాధిస్తూ వేలాది మందికి ఉపాధినిచ్చే స్థితికి చేరుకోవడం నేటి మహిళ సాధికారతను తెలియజేస్తుంది. అయితే, మహిళలు వ్యాపార రంగంలో రాణించడం అంత సామాన్య విషయమేమీ కాదంటూనే ప్రపంచవ్యాప్తంగా 1990లలో మహిళా వ్యాపారుల సంఖ్య 6శాతం ఉంటే 2019లో 42 శాతానికి మించిందని అమెరికన్ ఎక్స్‌ప్రెస్ స్టేట్ ఆఫ్ ఉమెన్ ఓన్డ్ బిజినెస్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఈ సందర్భంగా వరల్డ్ టాప్ బిజినెస్ లీడర్స్‌గా పేరొందిన మహిళల అత్యంత విలువైన వ్యాపార పాఠాలను ఉమెన్ ప్రెసిడెంట్స్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూపిఓ) మన ముందుంచింది. మహిళల యాజమాన్యంలో ఉన్న సంస్థలు లాభదాయకంగా ఉంటున్నాయని, వ్యాపార ప్రపంచంలో ఇప్పటికే తమదైన ముద్ర వేసుకున్నాయి. మహిళలు వ్యాపారం చేసే విధానం, తమ బృందాలతో ఎలా వ్యవహరిస్తారు, తమ లక్ష్యాలను ఎలా కొనసాగిస్తారో తెలియజేసింది.. సంరక్షణ పాఠం నేర్చుకోవాల్సిందే! బలహీనతలను దాచడానికి గతంలో మహిళపైన చాలా ఒత్తిడి ఉండేది. పని ప్రదేశం నుంచి ఇంటికి వెళ్లడానికి ఉదయం 9 నుంచి సాయంత్రం 5 అనే టైమ్ తెరను ప్రపంచంలోని అన్ని చోట్లా కోవిడ్ మహమ్మారి తీసేసింది. బజ్బాల్జ్ ఫౌండర్, సీఇవో మెర్రిలీ కిక్ మాట్లాడుతూ ‘మన జీవితాల్లో సంరక్షణ అనేది చాలా ముఖ్యమైన పాఠం. సంరక్షణ ఇచ్చే వ్యక్తులు మన జీవితాల నుంచి ఏదో ఒక రోజు చాలా సాధారణంగా వెళ్లిపోవచ్చు. ఆ తర్వాత మన జీవితమేంటి?! ఈ ప్రశ్నకు మనమే సమాధానం వెతుక్కోవాలి. ఎప్పుడైతే మహిళలు తమ పనిని, తమ బాధ్యతను తామే చూసుకోవడం ఇష్టపడతారో అప్పుడు వారికై వారు సాధారణంగా ఉంటారు’ అని తెలియజేస్తారు. తమ బలహీనతలను సైతం బహిర్గతం చేసేటంత ధైర్యం ఉన్నవారు నాయకులు. నిజాయితీగా. ముక్కు సూటిగా వ్యవహించేవారు తమ టీమ్ గౌరవాన్ని పొందుతారు. తమ ఆలోచనల్లో అర్థవంతమైన మార్పు వచ్చి, సురక్షితమైన స్థలాన్ని వారే సృష్టిస్తారు. దీనివల్ల కొత్త ఆవిష్కరణ, ఉత్పాదకత, పురోగతి, విజయం కలుగుతాయి’ అంటారు. వైవిధ్యం తప్పనిసరి టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మహిళా సంస్థలు, బిజినెస్ లీడర్లను ఒకే వేదికమీదకు చేర్చుతున్నాయి. మహిళల వ్యాపారవృద్ధి నిర్ధారించడానికి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, డిజిటల్ సేవల ను అందించే మాస్ గ్లోబల్ కన్సల్టింగ్ హెడ్ మోనికా హెర్నాండెజ్ మాట్లాడుతూ– ‘సక్సెస్ సాధించిన సంస్థల ఫౌండర్లు సామాజిక బాధ్యతను కలిగి ఉంటారు. వారిలోని అద్భుతమైన ప్రతిభకు మూలమేంటో వారికి తెలుసు. కొంతవరకు సాంకేతిక ప్రతిభను కనుక్కోవడంలో కష్టపడుతూ కంపెనీలకు ప్రాతినిథ్యం వహిస్తుంటారు. టెక్నాలజీలో ఎప్పటికప్పుడు వైవిధ్యం తీసుకురావడమనేది వ్యాపార పరంగా తప్పనిసరి’ సూచిస్తారు. సిసలైన ప్రయోజనం ‘కాలానికి తగినట్టు ప్రతిదీ మారుతుందనే మాట మన అమ్మమ్మలూ చెప్పినదే. అది నిజం కూడా. ఒక ప్రయోజనంతో నడిచే కంపెనీలు లాభాలను పెంచుకోవడంపై మాత్రమే దృష్టి సారించే కంపెనీలను అధిగమించాయి. నాయకత్వం వహించడం నుండి నేను నేర్చుకున్న పాఠం కస్టమర్లు వారు శ్రద్ధ వహించే సమస్యలపై స్టాండ్ తీసుకునే నాయకులనే ఎప్పుడూ కోరుకుంటారు. ఒక డేటా ప్రకారం 74 శాతం మంది వినియోగదారులు వస్తువు ఎంపికచేసే సమయంలో ధర–నాణ్యతలో సారూప్యం చూపుతారు. దానికి తగినట్టుగానే ఉత్పత్తిని ఎంచుకుంటారు’ అని టెనరల్ సెల్లార్స్ కంపెనీ అధినేత జిల్ ఓసుర్ చెబుతారు. మహిళా యాజమాన్యంలో కంపెనీ వ్యాపార నమూనా పూర్తిగా నాణ్యమైన ప్రయోజనాన్ని అందించేలా లాభాపేక్ష కంపెనీలకు అనుకూలంగా మారిందనేది జిల్ మాట. టీమ్ భద్రత గతంలో కంపెనీలో మహిళా లీడర్లకు తక్కువ అవకాశాలు ఉండేవి. కొత్త వ్యూహాలు, వ్యాపార విజయాన్ని తీసుకురావడానికి సహకారం, మద్దతు, భాగస్వామ్యం వంటివి దశాబ్దాలుగా మార్పు చెందుతూ వచ్చాయి. పనిలో సమానత్వంపై దృష్టి సారించిన సామాజిక ప్రభావ సంస్థ అయిన ఫెక్సబిలిటీకి చెందిన నాన్సీ గీసెన్ మాట్లాడుతూ ‘టీమ్‌లోని సభ్యులందరికీ తమదే అనిపించేలా పనిలో మానసిక భద్రతను సృష్టించడం వల్ల ప్రయోజన స్థాయిలు పెరుగుతాయి. విభిన్న నాయకత్వం మెరుగైన నిర్ణయాలు తీసుకుంటుందని, పోటీదారులను అధిగమిస్తుందని పరిశోధనలూ నిరూపిస్తున్నాయి. ఈ విధానం వల్ల వాటాదారులకూ మరింత విలువ లభిస్తుంది’ అని చెబుతారు. వనరులు.. జాగ్రత్తలు సమస్యను చూస్తున్నప్పుడు విభిన్న దృక్కోణాలను పరిశీలించడం ఎప్పుడూ ఉత్తమమైదే. ఉదాహరణకు ‘వీడియో గేమ్‌ల తయారీలో ఒక థీమ్‌ని సృష్టించడం కష్టమని మీరు అనుకోవచ్చు. కానీ, వీడియో గేమ్‌లలో మన జీవన విధానాలను జోడిస్తే, వాస్తవ ప్రపంచ నైపుణ్యాలను నేర్పడం ద్వారా అవి మంచి ప్రభావాన్ని చూపుతాయి. మేం మా నిర్ణయాల కన్నా వైఫల్యాల ద్వారా నేర్చుకుంటాం. వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకోవడం, బృందంతో ఎలా కలిసి పనిచేయడం.. వంటివి చాలా ముఖ్యమైనవి. అప్పుడే సరైన ఉత్పత్తిని ఇవ్వగలం’ అంటారు మ్యాగ్జిమమ్ గేమ్స్ కంపెనీకి చెందిన క్రిస్టినా సిలీ. నచ్చిన వ్యక్తులతో కలిసి పనులు ప్రపంచం మునుపెన్నడూ లేనంత చిన్నదిగా మారిపోయింది. సక్సెస్ సాధించినవారు తమ వ్యాపారాలను విస్తృతం చేసేటప్పుడు దీనిని పరిగణనలోకి తీసుకుంటారు. దక్షిణాఫ్రికాకు చెందిన ఫుల్ సర్వీస్ మార్కెటింగ్, కమ్యూనికేషన్ కంపెనీ యజమాని తారా టర్కిగ్టన్ మాట్లాడుతూ ‘మేం కంపెనీ పనుల్లో ప్రతిదానికి కేంద్రంగా ప్రజలను ఉంచుతాం. మేం ఇష్టపడే పనిని నచ్చిన వ్యక్తులతో కలిసి చేయడాన్ని ఎంచుకుంటాం’ అని తెలిపింది. మహిళలు యజమానులుగా ఉన్నవి 42 శాతం వ్యాపారాలు. అయితే, ఆ వ్యాపారాలలోని ఆదాయం ఇంకా పెరగాల్సి ఉంది. మిలియన్ డాలర్లకు పైగా ఆదాయాన్ని పొందే కంపెనీలు 20 శాతం మాత్రమే మహిళల యాజమాన్యంలో ఉన్నాయి. మహిళల యాజమాన్యంలోని వ్యాపారాలు మిలియన్ డాలర్ల మార్క్‌కు చేరుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ అడ్డంకులు ఉన్నాయి. ఈ పారిశ్రామికవేత్తల పాఠాలు, విజయాలు మహిళలు నాయకత్వం వహించడానికి, అభివృద్ధి చెందడానికి మరిన్ని అవకాశాలకోసం మార్గాన్ని సులభం చేస్తాయని డబ్ల్యూపివో వెల్లడించింది. -
Asia Power Businesswomen List 2022: పవర్‌కు కేరాఫ్ అడ్రస్
‘అవకాశం అనేది మీ తలుపు తట్టకపోతే కొత్త తలుపు తయారు చేసుకోండి’ అనే మాట ఉంది. అవును. కొత్తగా ఆలోచించినప్పుడు మాత్రమే కొత్తశక్తి వస్తుంది. ఆ శక్తి ఈ ముగ్గురు మహిళలలో ఉంది. ‘ఆసియాస్ పవర్ బిజినెస్ ఉమెన్’ జాబితాలో చోటు సంపాదించిన గజల్ అలఘ్, నమితా థాపర్, సోమా మండల్ల గురించి... ఫోర్బ్స్ ‘ఆసియాస్ పవర్ బిజినెస్ ఉమెన్’ జాబితాలో మన దేశానికి చెందిన గజల్ అలఘ్, నమితా థాపర్, సోమా మండల్లు చోటు సంపాదించారు. కోవిడ్ కష్టాలు, నష్టాలను తట్టుకొని తమ వ్యాపార వ్యూహాలతో సంస్థను ముందుకు తీసుకెళ్లిన వారికి ఈ జాబితాలో చోటు కల్పించారు. ‘హొనాసా కన్జూమర్’ కో–ఫౌండర్ గజల్ అలఘ్ చండీగఢ్‌లోని ఉమ్మడి కుటుంబంలో పెరిగింది. ఆ పెద్ద కుటుంబంలో మహిళల నోట ఉద్యోగం అనే మాట ఎప్పుడూ వినిపించేది కాదు. అయితే తల్లి మాత్రం గజల్‌కు ఆర్థిక స్వాత్రంత్యం గురించి తరచు చెబుతుండేది. పదిహేడు సంవత్సరాల వయసులో కార్పోరేట్ ట్రైనర్‌గా తొలి ఉద్యోగం చేసిన గజల్ ఆ తరువాత కాలంలో సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్, ఇన్నోవేటర్ అండ్ ఇన్వెస్టర్‌గా పేరు తెచ్చుకుంది. ప్రణాళికాబద్ధంగా పని చేయడం తన విజయరహస్యం. మూడురోజుల తరువాత చేయాల్సిన పని అయినా సరే ఈ రోజే పక్కాగా ప్లాన్ చేసుకుంటుంది. ధ్యానంతో తన దినచర్య మొదవుతుంది. కోవిడ్ ఉధృతి సమయంలో వ్యాపారం కుప్పకూలిపోయింది. అందరిలో భయాలు. ఆ భయం ఆఫీసు దాటి ఇంట్లోకి కూడా వచ్చింది. తల్లిదండ్రుల మౌనం పిల్లలపై పడింది. దీంతో వెంటనే మేల్కొంది గజల్. సరదాగా భర్త, పిల్లలతో యూట్యూబ్ వీడియోలు చేయడం మొదలుపెట్టింది. అలా ఇంట్లో మళ్లీ సందడి మొదలైంది. ఆ ఉత్సాహవంతమైన సందడిలో విచారం మాయమై పోయింది. తన సరికొత్త వ్యూహాలతో వ్యాపారం పుంజుకుంది. ‘విచారంలో మునిగిపోతే ఉన్న కాస్తో కూస్తో ఆశ కూడా మాయమైపోతుంది. పరిస్థితులు మరింత దిగజారిపోతాయి. ఇలాంటి సమయంలోనే మానసికంగా గట్టిగా ఉండాలి’ అంటుంది గజల్. ‘ఎమ్క్యూర్ ఫార్మా’ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నమితా థాపర్ రచయిత్రి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోచ్, యూ ట్యూబ్ టాక్‌షో ‘అన్కండీషన్ యువర్సెల్ఫ్ విత్ నమితా థాపర్’ నిర్వాహకురాలు. సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణిస్తున్న నమితా ‘థాపర్ ఎంటర్ప్రెన్యూర్ అకాడమీ’ ద్వారా ఎంతోమంది ఔత్సాహికులకు విలువైన పాఠాలు చెబుతోంది. తన తాజా పుస్తకం ‘ది డాల్ఫిన్ అండ్ ది షార్క్: లెస్సెన్స్ ఇన్ ఎంటర్ప్రెన్యుర్షిప్’కు మంచి ఆదరణ లభించింది. ‘ప్రపంచం కోసం నువ్వు మారాలని ప్రయత్నించకు. నువ్వు నీలాగే ఉంటే ప్రపంచమే సర్దుబాటు చేసుకుంటుంది’ ‘నిన్ను నువ్వు ప్రేమించుకోవడం ద్వారా మాత్రమే నీలోని శక్తి నీకు కనిపిస్తుంది’...ఇలాంటి ఉత్తేజకరమైన వాక్యాలు ఈ పుస్తకంలో కనిపిస్తాయి. ‘మొదట్లో నాలో ఆత్మవిశ్వాసం ఉండేది కాదు. లావుగా ఉండడం వల్ల చిన్నప్పుడు తోటి పిల్లలు వెక్కిరించేవారు. వారి మాటలను సీరియస్‌గా తీసుకొని ఉంటే నిస్పృహ అనే చీకట్లోనే ఉండేదాన్ని. నన్ను నేను తెలుసుకోవడానికి సమయం పట్టింది. ఆ తరువాత మాత్రం ఆత్మ విశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోలేదు’ అంటుంది నమితా థాపర్. భువనేశ్వర్‌కు చెందిన సోమా మండల్ చదువులో ఎప్పుడూ ముందుండేది. తాను ఇంజనీరింగ్‌లో చేరడానికి తండ్రి ఒప్పుకోలేదు. ఇంజనీరింగ్‌లాంటి వృత్తులు అమ్మాయిలు చేయలేరు అని ఆయన అనుకోవడమే దీనికి కారణం. అయితే కుమార్తె పట్టుదలను చూసి తండ్రి తన నిర్ణయాన్ని మార్చుకోక తప్పలేదు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పట్టా తీసుకున్న సోమా మండల్ అల్యూమినియం తయారీ సంస్థ ‘నాల్కో’లో ట్రైనీగా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు తొలి మహిళా చైర్‌పర్సన్‌గా చరిత్ర సృష్టించింది. నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల బాట పట్టించి జేజేలు అందుకుంది. -
లాభాలు కావాలంటే...సారథ్య బాధ్యతల్లో మహిళలు పెరగాలి
ముంబై: మహిళా పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ లీడర్లు మరింత పెద్ద సంఖ్యలో సారథ్య బాధ్యతలను చేపట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ప్రస్తుతం కార్పొరేట్ ప్రపంచంలో మహిళా లీడర్ల సంఖ్య తగినంత స్థాయిలో లేదని ఆమె పేర్కొన్నారు. నాయకత్వం వహించడానికి తాము అర్హులమేనని మాటిమాటికి నిరూపించుకోవాల్సి వస్తుందనే అభిప్రాయం మహిళల్లో అంతర్గతంగా పేరుకుపోవడమే ఇందుకు కారణమని తెలిపారు. దీన్ని అధిగమించి, మరింత మంది స్త్రీలకు అవకాశాలు కల్పించేందుకు మహిళా పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ లీడర్లు మార్గదర్శకులుగా వ్యవహరించవలసి ఉన్నట్లు తెలియజేశారు. స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం బీఎస్ఈ ప్రధాన కార్యాలయంలో జరిగిన మహిళా డైరెక్టర్ల సదస్సులో మంత్రి ప్రసంగించారు. సంఖ్య చాలా తక్కువ.. గణాంకాల ప్రకారం దేశీ కంపెనీల బోర్డుల్లో సగటు మహిళల సంఖ్య 1.03కాగా .. వీరిలో 58 శాతం మంది స్వతంత్ర డైరెక్టర్లేనని సీతారామన్ పేర్కొన్నారు. మిగిలిన 42 శాతం స్వతంత్రేతర డైరక్టర్లుగా తెలియజేశారు. కార్పొరేట్లు తమ బోర్డుల్లో మరింతమంది మహిళలకు అవకాశాలివ్వవలసి ఉన్నట్లు సూచించారు. అంతర్జాతీయంగా బోర్డుల్లో స్త్రీల నాయకత్వం కలిగిన కంపెనీలు అత్యధిక లాభాలు, వృద్ధిని సాధిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు సహా ఇప్పటికీ పలు కంపెనీలు ఒక్క మహిళా డైరక్టరునూ నియమించుకోకపోవడంతో జరిమానాలు కడుతున్నట్లు తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాబోదని, కార్పొరేట్ ప్రపంచమే ముందడుగు వేయాలని స్పష్టం చేశారు. అయితే మహిళా కార్పొరేట్ లీడర్ల కొరత కారణంగా కొంతమందే పలు కంపెనీలలో బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. బ్యాంకుల మధ్య అనుసంధానత అవసరం బ్యాంకులు తమ వ్యవస్థల మధ్య సంప్రదింపులకు వీలుగా అనుసంధామై ఉండాలని, అప్పుడే కస్టమర్లకు మెరుగైన మార్గాల్లో సేవలు అందించడం సాధ్య పడుతుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. శుక్రవారం ముంబైలో జరిగిన ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) 75వ వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. చాలా సందర్భాల్లో కస్టమర్లు ఒకటికంటే ఎక్కువ బ్యాంకుల వద్ద లావాదేవీలు నిర్వహించాల్సి వస్తోందంటూ.. ఇందుకోసం బ్యాంకులు తమ మధ్య సంప్రదింపులకు వీలు కల్పించుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. బ్యాంకు ఉద్యోగులు స్థానిక బాషలో కస్టమర్లతో సంప్రదింపులు చేసేలా చూడాలని మంత్రి కోరారు. అప్పుడే కస్టమర్లకు మెరుగ్గా సేవలు అందించడం సాధ్యపడు తుందనీ, మోసాలను నివారించేందుకు బ్యాంకులు పెట్టుబడులు పెంచాలన్నారు. ఎంఎస్ఎంఈల బకాయిలను 45 రోజుల్లోగా చెల్లించండి ప్రయివేట్ రంగ కంపెనీలు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ(ఎంఎస్ఎంఈ)ల బకాయిలను 45 రోజుల్లోగా చెల్లించ వలసిందిగా ఆర్థికమంత్రి మరో కార్యక్రమంలో ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ కంపెనీలు సైతం ఎంఎస్ఎంఈలకు చెల్లింపులను సకాలంలో చేపట్టడంలేదంటూ విమర్శించారు. ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి చిన్న సంస్థలకు సకాలంలో బకాయిల చెల్లింపులపై హామీ లభించవలసి ఉన్నట్లు పేర్కొన్నారు. ఆర్వోసీకి ఖాతాలు దాఖలు చేశాక 45 రోజుల్లోగా ఎంఎస్ఎంఈ చెల్లింపులను పూర్తి చేయవలసిందిగా ప్రయివేట్ కంపెనీలకు సూచించారు. ఈ బాటలో ప్రభుత్వ శాఖలు, కంపెనీలు 90 రోజుల్లోగా చెల్లింపులు చేపట్టేందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకోనున్నట్లు లఘు ఉద్యోగ్ భారతీ నిర్వహించిన సదస్సు సందర్భంగా వెల్లడించారు. ఈ దిశలో రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తగిన విధంగా స్పందించవలసి ఉన్నట్లు చెప్పారు. -
నిలువెత్తు గెలుపు సంతకం
‘మర్యాద, సభ్యత, క్రమశిక్షణ అనేవి మనిషిని తీర్చిదిద్ది ఉత్తములుగా తయారుచేస్తాయి’ అనేది మంచిమాట. ఈ మాటకు తన వంతుగా మరో మాట చేర్చాడు ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ లారీ బేకర్... ‘మర్యాద, సభ్యత, క్రమశిక్షణ అనేవి అత్యుత్తమ నిర్మాణాలకు కారణం అవుతాయి’ ఆర్కిటెక్ట్‌గా దేశవిదేశాల్లో రాణిస్తున్న శ్వేతా దేశ్‌ముఖ్ లారీ బేకర్ చెప్పిన ప్రతి మాటను అక్షరాలా ఆచరించే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ది ఇండియన్ అలర్ట్ ‘టాప్ టెన్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్–2022’ జాబితాలో చోటు సంపాదించిన శ్వేతాదేశ్ముఖ్ గురించి... ముంబైకి చెందిన శ్వేతాదేశ్ముఖ్కు చిన్నప్పటి నుంచి స్కెచ్చింగ్, పెయింటింగ్ అంటే ఇష్టం. ఆ ఇష్టమే తనను ఆర్కిటెక్చర్ వైపు తీసుకువచ్చింది. నాగ్‌పుర్‌లో బీ.ఆర్క్, పుణెలో కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ పూర్తి చేసింది. ఆ తరువాత సొంతంగా ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఉద్యోగంలో చేరితే ఎలా ఉండేదో తెలియదుగానీ, సొంతంగా ప్రాక్టిస్ చేయడం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం వచ్చింది. వివాహం తరువాత ముంబైలోని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో సీనియర్ ఆర్కిటెక్ట్‌గా పనిచేసిన శ్వేత ఆ తరువాత ‘డిజైన్బాక్స్’ పేరుతో ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మొదలుపెట్టింది.‘డబ్బులు ఎక్కువ వచ్చినా సరే, తక్కువ క్రియేటివిటీ ఉండే ప్రాజెక్ట్‌లకు దూరంగా ఉండాలి’ అనే నిబంధన విధించుకుంది. క్లయింట్స్ నుంచి సైట్ ఫోటోలు, వీడియోలు, డ్రాయింగ్స్ తీసుకోవడమే కాదు డిజైన్ ప్రాసెస్‌లో కూడా వారిని భాగం చేస్తుంది. కలర్ కన్సల్టింగ్, ఫర్నిచర్ డిజైనింగ్, వాల్ డెకర్, లైటింగ్ ఐడియాస్... ఇలా ఎన్నో విషయాలలో ఎంతోమంది క్లయింట్స్‌కు సేవలు అందించిన ‘డిజైన్బాక్స్’ మోస్ట్ ఇన్నోవేటివ్ ఫర్మ్ అవార్డ్ గెలుచుకుంది. తన ఫేవరెట్ ప్రాజెక్ట్‌ల విషయానికి వస్తే ఇరవై అయిదు ఎకరాల పరిధిలోని భీమాశంకర్ హిల్స్(కర్జత్, మహారాష్ట్ర), పుదుచ్చేరిలోని మలీప్లె్లక్స్,గ్రీన్‌హౌజ్, చెంబూర్‌లోని ఏడు ఎకరాల కమర్షియల్ ఇంటీరియర్... ఇలా ఎన్నో ఉన్నాయి. ‘నాకంటూ ప్రత్యేకమైన స్టైల్ లేదు. క్లయింట్స్ అభిరుచి, అవసరాలను దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేస్తాను’ అంటున్న శ్వేత నిర్మాణ ప్రక్రియలో పర్యావరణ కోణానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఉదా: స్క్రాప్ మెటీరియల్‌ను రీసైకిలింగ్ కంపెనీలకు తరలించడం, వర్షపునీటి నిల్వ, స్థానిక వనరులను సమర్థవంతంగా వాడుకోవడం... మొదలైనవి. ‘నా డిజైనింగ్‌కు ప్రకృతే స్ఫూర్తి ఇస్తుంది’ అని చెబుతున్న శ్వేత బాగా అభిమానించే ఆర్కిటెక్ట్ లారీ బేకర్. బ్రిటన్‌లో పుట్టిన బేకర్ ఇండియాకు వచ్చి నిర్మాణరంగం లో అనేక ప్రయోగాలు చేసి ‘లెజెండ్’ అనిపించుకున్నాడు. సామాన్యుల ఆర్కిటెక్ట్‌గా పేరు తెచ్చుకున్నాడు. ‘ఇతర ఆర్కిటెక్ట్‌ల నుంచి స్ఫూర్తి పొందడం కంటే సామాన్యులు సృష్టించిన వాటిలో నుంచే ఎక్కువగా స్ఫూర్తి పొందుతాను’ అనే లారీ బేకర్ మాట తనకు ఇష్టమైనది. ఆయన చెప్పిన ‘లోకల్ విజ్డమ్’ను అనుసరిస్తుంది. ‘ఒక డిజైన్ చేసే ముందు ఆ పరిసరాలకు సంబంధించిన విషయాలపై అవగాహన పెంచుకోవాలి’ అని లారీ చెప్పిన మాటను ఆచరణలో చూపుతుంది శ్వేత. గౌతమ్ భాటియా రాసిన ‘లారీ బేకర్: లైఫ్, వర్క్ అండ్ రైటింగ్’ పుస్తకం అంటే ఇష్టం. ‘ప్రతి వృత్తిలో ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. అయితే ప్రతి సవాలు మన విజయానికి ఒక మెట్టులా ఉపయోగపడుతుంది. మొదట్లో మాకు కూడా రకరకాల సందేహాలు, సవాళ్లు ఎదురయ్యాయి. ఇలా స్టార్ట్ చేశాం. ఇలాగే ఉంటాం... అన్నట్లు కాకుండా ఎప్పటికప్పుడు మా ప్రణాళికలో మార్పు చేసుకుంటూ వచ్చాం’ అంటుంది శ్వేతాదేశ్ముఖ్. చదువుకునే రోజుల్లో, వృత్తిలోకి వచ్చిన తొలిరోజుల్లో మూర్ఛవ్యాధి సమస్యతో సతమతమయ్యేది శ్వేత. అలా అని ఎప్పుడూ ఆగిపోలేదు. ఇంటికి పరిమితం కాలేదు. పనిలో దొరికే ఉత్సాహన్నే ఔషధంగా చేసుకొని ముందుకు కదులుతుంది. -
మహిళల కోసం ప్రత్యేకంగా ఉన్న ఈ పథకం గురించి మీకు తెలుసా?
ఇంటికే పరిమితం.. భర్త, పిల్లలు, కుటుంబ పోషణ మాత్రమే ఆమె విధి..అంటూ కొన్నేళ్ల క్రితం మహిళలకు సంబంధించి పరిచయ వాక్యాలు ఉండేవి. కానీ ఇప్పుడు.. ఇంటా మేమే, బయటా మేమే అన్నట్లుగా అన్ని రంగాల్లోనూ మహిళలు ప్రతిభ కనబరుస్తున్నారు. శాస్త్ర, సాంకేతిక, ఉద్యోగ రంగాల్లోనే కాదు..వృత్తి, వ్యాపారాల్లోనూ మహిళలు సాధిస్తున్న విజయాలు అన్నీ ఇన్నీ కావు. అలాంటి మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల్ని అందుబాటులోకి తెచ్చింది. అందులో స్టాండప్ మిత్రా స్కీం (స్టాండప్ ఇండియా) ఒకటి. చాలా మంది మహిళలు తమకాళ్లపై తాము నిలబడాలని ప్రయత్నిస్తుంటారు. అవకాశాలు లేని చోట అవకాశాల్ని క్రియేట్ చేసుకోవాలని భావిస్తుంటారు. కానీ ఆర్ధిక ఇబ్బందుల వల్ల వంటింటికే పరిమితం అవుతుంటారు. అలాంటి వారు ఈ స్టాండప్ మిత్రా స్కీం ను వినియోగించుకోవాలని కేంద్రం చెబుతోంది. 2016లో ప్రధాని మోదీ ఈ స్టాండప్ మిత్రా పథకాన్ని ప్రారంభించారు. ఇందులో ఎస్సీ లేదా ఎస్టీ, పరిశ్రమలు స్థాపించాలనుకునే మహిళలకు రూ.10లక్షల నుంచి రూ.కోటి వరకు రుణాల్ని మంజూరు చేస్తుంది. ప్రత్యేకంగా మ్యానిఫ్యాక్చరింగ్, సర్వీస్,అగ్రి కల్చర్ సంబంధిత వ్యాపారలకు రుణాలిస్తుంది. అర్హతలు, అప్లయ్ చేసే విధానం ఇందులో 18సంవత్సారాలు నిండి నలుగురికి ఉపాధి కల్పిస్తే చాలు. సంబంధిత https://www.standupmitra.in/Home/SUISchemes వెబ్సైట్లోకి వెళ్లి అప్లయ్ చేసుకోవాలి. దీంతో కేంద్రం అర్హత ఆధారంగా వారికి బ్యాంక్ ఇంట్రస్ట్ రేట్లకే రుణాల్ని మంజూరు చేస్తుంది. అర్హతలకు అనుగుణంగా 18 నెలల నుండి 7 సంవత్సరాల వరకు రుణాల్ని చెల్లించే అవకాశం కల్పించ్చింది. చదవండి: 'డొనేట్-ఏ-పెన్షన్' కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి -
మహిళా సర్వోదయంస్త్రీ శక్తి
సాధారణంగా స్వయం సహాయ సంఘాల మహిళలంటే తాము పొదుపు చేసుకున్న మొత్తానికి తోడు, బ్యాంకు లింకేజీ కింద వచ్చే రుణాలతో కిరాణాషాపులు.. పాడి పశువుల పెంపకం వంటి పనులకు పరిమితమవుతుంటారు. అయితే సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గంగ్లూర్ గ్రామానికి చెందిన మహిళలు ఓ అడుగు ముందుకేశారు. ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో గ్రామంలోని 126 మంది మహిళలు సంఘటితమై మూడు కుటీర పరిశ్రమలను స్థాపించారు. సర్వోదయ ఉమెన్ ఎంటర్పైజెస్ పేరుతో కంపెనీని రిజిస్ట్రేషన్ చేయించారు. త్వరలోనే స్వయం సహాయక బృంగాల మహిళలు కాస్తా మహిళా పారిశ్రామిక వేత్తలుగా ఎదిగారు. ‘సర్వోదయ మంజీరా’ బ్రాండ్ పేరుతో చేతితో చేసిన 15 రకాల సబ్బులు తయారు చేస్తున్నారు. 20కిపైగా రసాయనాలతో తయారయ్యే సాధారణ సబ్బులకు భిన్నంగా ఇవన్నీ బొప్పాయి, టమాట వంటి సహజ వనరులతో తయారు చేసినవే కావడం గమనార్హం. ఈ పరిశ్రమల్లో కోల్డ్‌ప్రెస్ వంటనూనెలను కూడా ఉత్పత్తి చేస్తున్నారు. పల్లి, పొద్దుతిరుగుడు, నువ్వుల నూనె, కొబ్బరినూనెలను తయారు చేస్తున్నారు. ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్ కూడా చేస్తున్నారు. స్థానికంగా పండే పప్పుదినుసుల ప్రాసెసింగ్, ప్యాకింగ్ చేస్తున్నారు. జాతీయ స్థాయి నాణ్యత ప్రమాణాలు.. బహుళ జాతి సంస్థల ఉత్పత్తులకు ఏమాత్రం తీసిపోని విధంగా నాణ్యత విషయంలో రాజీ పడటం లేదు. ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా), జీఎంపీ (గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రొడక్ట్) వంటి జాతీయ సంస్థల లైసెన్సులు తీసుకున్నారు. హ్యాండ్‌మేడ్ సబ్బులు వంటి కాస్మోటిక్స్ ఉత్పత్తుల కోసం ఆయుష్ విభాగం నుంచి అనుమతి పొందారు. త్వరలో మార్కెట్లోకి ఉత్పత్తులు.. సర్వోదయ ఉత్పత్తులు మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 2022 జనవరిలోనే ఈ ఉత్పత్తుల మార్కెటింగ్ ప్రారంభించాలని భావించినప్పటికీ కరోనా థర్డ్‌వేవ్ ప్రభావం కారణంగా మరో పక్షం రోజులు వాయిదా వేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ ఉత్పత్తుల కోసం వినియోగదారుల అభిరుచుల సేకరణ ప్రక్రియను కూడా చేపట్టారు. వారి అభిరుచుల మేరకు తమ ఉత్పత్తుల్లో మార్పు చేర్పులు కూడా చేసినట్లు మహిళలు చెబుతున్నారు. బాధ్యతగా పనిచేస్తున్నాం... ‘సర్వోదయ’లో పనిచేసే మేము అందరం ఈ పరిశ్రమలకు ఓనర్లమే. అందరికీ యాజమాన్య వాటా ఉంది. వచ్చే లాభాల్లో డివిడెండ్ వస్తుంది. అందువల్ల బాధ్యతగా పనిచేస్తున్నాం. ఇప్పుడు మేమందరం పప్పుల ప్రాసెసింగ్, నూనెలు తయారు చేయడం నేర్చుకుంటున్నాము. గ్రామంలోనే మా సొంత పరిశ్రమ లో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. – అంకమ్మగారి చిట్టెమ్మ, ‘సర్వోదయ’ సభ్యురాలు సొంతూరులోనే పని దొరుకుతోంది... ఇప్పటివరకు ఇంటిపనికే పరిమితమైన మాకు ఈ పరిశ్రమ వల్ల సొంత ఊరిలోనే పని దొరుకుతోంది. ఈ పరిశ్రమలో మా కుటుంబం పెట్టుబడి ఉండటంతో అందులో పనిచేస్తున్న నేను కార్మికురాలిగా కాకుండా యజమానురాలిగా భావిస్తున్నాను. ప్రస్తుతం నేను సబ్బుల తయారీలో పనిచేస్తున్నాను. – జంగం శిరీష, ‘సర్వోదయ’ సభ్యురాలు గ్రామీణాభివృద్ధి సేవలందిస్తున్నాం... సర్వోదయ సంస్థ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలు విద్యా, వైద్యం, ఉపాధి, పర్యావరణం వంటి విషయాల్లో ముందుకు సాగేలా ప్రోత్సహిస్తున్నాము. ఐఆర్ఎస్ అధికారులం కలిసి ఇప్పటి వరకు జిల్లాలో ఆరు గ్రామాల్లో కార్యకలాపాలను ప్రారంభించాం. కరస్‌గుత్తి, ఎద్దుమైలారం, మునిపల్లి, మైనంపల్లి, హన్మంతరావుపేట్‌లలో కూడా సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అందరూ బాగుంటేనే మనం బాగుంటాము.. అనే నినాదం తో ముందుకెళుతున్నాం. – డాక్టర్ సుధాకర్ నాయక్, సర్వోదయ సంస్థ ఐఆర్ఎస్ అధికారుల సహకారం.. ఆదాయపు పన్ను శాఖ డైరెక్టర్‌గా పనిచేసిన ఆర్కే పాలివాల్ అనే ఉన్నతాధికారి ఈ గంగ్లూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆయన స్ఫూర్తితో మరికొందరు ఐఆర్ఎస్ ఉన్నతాధికారులు సర్వోదయ సంస్థను స్థాపించి ఈ గ్రామంలోని మహిళలను సంఘటితం చేస్తున్నారు. ప్రతిష్ఠాత్మక ఐఐటీ హైదరాబాద్‌తో కలిసి సంయుక్తంగా మహిళలకు పారిశ్రామిక ఉత్పత్తిలో ఉన్నత స్థాయి శిక్షణ ఇప్పించారు. ఈ సంస్థ సహకారంతో మహిళలు ముందడుగు వేస్తున్నారు. – పాత బాలప్రసాద్, సాక్షిప్రతినిధి, సంగారెడ్డి ఫొటోలు: బగిలి శివప్రసాద్ సర్వోదయ ఉమెన్ ఎంటర్ప్రైజెస్ మహిళలు గొంగ్లూర్‌లో ఏర్పాటు చేసుకున్న పరిశ్రమ యూనిట్లు. హైదరాబాద్ ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తితో సమావేశమైన గొంగ్లూర్ మహిళలు -
జామ్ తయారీలో ప్రధానమైనది అదే..!
వండడం వస్తే... వంటశాలను మించిన ప్రయోగశాల మరొకటి ఉండదు. ఫుడ్ బిజినెస్‌ను మించిన ఉపాధి మరెక్కడా ఉండదు. హర్యానాలోని కురుక్షేత్రలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ చేసి, ఆ తర్వాత గుజరాత్‌లోని ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఇన్ ఆనంద్’ లో ఎంబీఏ చేసిన సౌమీ ఇదే విషయాన్ని నిరూపించింది. చదువు పూర్తయిన తర్వాత సౌమీ హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకుల్లో ఉద్యోగం చేసింది. ఐదేళ్ల కిందట బ్యాంకు ఉద్యోగాన్ని వదిలేసి పూర్తి స్థాయి ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారింది. తనను ఎంటర్‌ప్రెన్యూర్‌గా మార్చిన ఘనత కూతురికే దక్కుతుందని కూడా చెబుతోంది సౌమీ. సౌమీకి ఉద్యోగం, ఇల్లు, పాపాయిని చూసుకోవడంలో రోజంతా సరిపోయేది. పాపాయికి చిరుతిండి కోసం మార్కెట్లో దొరికే జామ్‌ల మీదనే ఆధారపడక తప్పేది కాదు. ప్యాక్ చేసిన ఆహారంలో, అవి నిల్వ ఉండడం కోసం తయారీదారులు ప్రిజర్వేటివ్‌లు వాడతారు. ఆకర్షణీయంగా కనిపించడం కోసం ఫుడ్‌కలర్స్ కూడా వాడుతారు. అవన్నీ ప్రభుత్వ ఆహార నియంత్రణ విభాగాలు నిర్దేశించిన మోతాదులోనే ఉంటాయి. కానీ సౌమీ పాపాయి ఆ మేరకు కృత్రిమత్వాన్ని కూడా భరించలేకపోయేది. ఆ జామ్‌లను తింటే అలర్జీ వచ్చేసేది. పైగా పాపాయి జామ్‌లను ఇష్టంగా తినేది. ఇంట్లో జామ్ లేకపోతే మరొకటి ఏదైనా తింటుందని ఒక ప్రయత్నం చేసింది సౌమీ. జామ్ కోసం పాపాయి మంకుపట్టు పడుతోంది తప్ప మరొకటి తినడం లేదు. దాంతో సౌమీ తనే జామ్ తయారు చేసింది. ఇల్లంతా జామ్ బాటిళ్లే! జామ్ ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి కృత్రిమమైన ప్రిజర్వేటివ్‌లను, రంగులను కలపకుండా సహజమైన జామ్‌ను చేసింది సౌమీ. మొదటిసారి ఆమె చేసింది స్ట్రాబెర్రీ జామ్. ఆ ప్రయత్నం సక్సెస్ అయింది. పాపాయి ఇష్టంగా తింటోంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆరోగ్యంగా ఉంటోంది. దాంతో సౌమీ ఇంటర్నెట్లో రకరకాల పండ్లతో జామ్‌లను ఎలా చేయాలో నేర్చుకుంది. ఇంట్లో జామ్ బాటిళ్లు వరుసగా బారులు తీరాయి. ఇంటికి వచ్చిన వాళ్లకు గర్వంగా రుచి చూపించేది సౌమీ. రుచి చూసి ప్రశంసించిన వారికి ఒక్కో బాటిల్ ఇచ్చి పంపేది. ప్రతిసారీ ఫ్రీగా తీసుకోవడానికి మొహమాట పడిన స్నేహితులు, బంధువులు ‘ఏదో ఒక ధర నిర్ణయించ’మని సౌమీ మీద ఒత్తిడి తెచ్చారు. ఇదంతా ఆరేళ్ల నాటి సంగతి. 2015లో బ్యాంకు ఉద్యోగాన్ని వదిలేసి సౌమీ సొంత స్టార్టప్ మొదలుపెట్టింది. తన ఉత్పత్తులకు ‘యమ్మీయమ్’ అనే పేరు పెట్టింది. జామ్‌లతోపాటు పచ్చళ్ల తయారీ కూడా మొదలు పెట్టింది. ఇప్పుడామె ‘స్మాల్ బిజినెస్, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్’గా విజయవంతమైన పారిశ్రామిక వేత్తల జాబితాలోకి చేరింది. జామ్‌తో పాటు పచ్చళ్లూ ‘‘రెడీ మేడ్ ఫుడ్‌తో నా పాపాయికి అలర్జీ వస్తున్న కారణంగా నేనీ ప్రయత్నాన్ని మొదలు పెట్టాను. జామ్ తయారీని పరిశ్రమగా మలుచుకున్నప్పటికీ నాలో తల్లి అలాగే ఉంటుంది. పిల్లల సున్నితమైన కడుపుకు ఇబ్బంది కలిగించే ఏ పదార్థాలనూ దగ్గరకు కూడా చేరనివ్వను. జామ్ తయారీలో ప్రధానమైన పని పండ్లను శుభ్రం చేయడం, తరగడమే. రాత్రంతా చక్కెరలో నానపెట్టిన తర్వాత మరుసటి రోజు ఆ పండ్లను అరగంట నుంచి ముప్పావు గంట సేపు ఉడికించాలి. ఇలా చేస్తే ఇక వాటిని నిల్వ చేయడం కోసం కృత్రిమ ప్రిజర్వేటివ్‌ల మీద ఆధారపడాల్సిన అవసరమే ఉండదు’’ అని తన విజయరహస్యాన్ని తెలియచేసింది సౌమీ. ‘‘యమ్మీమమ్ జామ్, పచ్చళ్ల పరిశ్రమలో నా ప్రయత్నం సక్సెస్‌బాట పట్టిన తర్వాత నా భర్త గోపాల్ కూడా తన ఉద్యోగాన్ని వదిలేసి మార్కెటింగ్ పనులు చూసుకుంటున్నారు. సాధారణ ఉద్యోగులుగా ఉన్న మమ్మల్ని వ్యాపారవేత్తలుగా మార్చేసింది మా అమ్మాయి’’ అంటూ నవ్వుతోంది సౌమీ. – మంజీర -
మహిళా స్టార్టప్స్.. ఇదీ మన పరిస్థితి!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్ కంపెనీలు పెరుగుతున్నా.. మహిళా వ్యాపారులు మాత్రం వాటిల్లో పెద్దగా రాణించడం లేదు. స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేయడంలో ప్రపంచవ్యాప్తంగా మహిళా వ్యాపారులకు అనువైన 50 ఉత్తమ నగరాల జాబితాలో భారత్‌కు చెందిన రెండు నగరాలకు మాత్రమే చోటులభించింది. భారత్ సిలికాన్ వ్యాలీగా గణతికెక్కిన బెంగళూరు నగరానికి 40వస్థానం లభించగా, ఢిల్లీ నగరానికి 49వ స్థానం లభించింది. మొదటి పది నగరాల జాబితాలో న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, లండన్, బోస్టన్, స్టాక్ హోమ్, లాస్ ఏంజిలెస్, వాషింగ్టన్ డీసీ, సింగపూర్, టొరాంటో, సియాటిల్, సిడ్నీ నగరాలు ఆక్రమించాయి. బెంగళూరు, ఢిల్లీ నగరంతోపాటు ఆసియా నగరాల్లో సింగపూర్ 8వ స్థానాన్ని, హాంకాంగ్ 16, థైపీ 22, బీజింగ్ 38, టోక్యో 39, కౌలాలంపూర్ 41, శాంఘై 44వ స్థానాన్ని లేదా ర్యాంక్‌ను సాధించాయి. ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ కలిగిన దేశాల్లో బెంగళూరుకు పదవ స్థానం లభించినప్పటికీ మహిళా స్టార్టప్ కంపెనీల్లో వెనకబడి పోవడం విచారకరం. మహిళా వ్యాపారులు, విధాన నిర్ణేతలు, వెంచర్స్ క్యాపిటలిస్టులు, మీడియా ప్రతినిధులు, విద్యావేత్తల అభిప్రాయాలను సేకరించడం ద్వారా ఈ నగరాల జాబితాను డెల్ టెక్నాలజీ కంపెనీ, ఐహెచ్ఎస్ మార్కెట్ కన్సల్టెనీ రూపొందించింది. -
మహిళా పారిశ్రామికవేత్తలకు స్థలాల్లో 10% కోటా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 140కు పైగా పెద్ద పారిశ్రామికవాడలున్నాయని, అందులో 10 శాతం స్థలాలను మహిళా పారిశ్రామికవేత్తలకు కేటాయిస్తామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. సుల్తాన్ పూర్లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఫిక్కి లేడీస్ ఆర్గనైజేషన్ పారిశ్రామికవాడలో 18 మంది మహిళా పారిశ్రామికవేత్తలకు శుక్రవారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో స్థల కేటాయింపుల పత్రాలను మంత్రి అందజేశారు. ఈ పారిశ్రామిక వాడను తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ) నిర్మించింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ప్రభుత్వం నుంచి ప్రత్యేక రాయితీ, సదుపాయాల అవసరం లేకుండానే సమర్థవంతంగా పనిచేయగలమనే సందేశాన్ని మహిళా పారిశ్రామికవేత్తలు సమాజానికి పంపాలని సూచించారు. వీరి కోసం 200 ఎకరాల్లో మూడు పారిశ్రామికవాడలు ఏర్పాటు చేశామన్నారు. సుల్తాన్‌పూర్‌లో 50 ఎకరాలు, 30 ఎకరాల్లో కొవే, 120 ఎకరాల్లో ఎలీప్ పారిశ్రామికవాడలను నెలకొల్పగా, అన్ని చోట్లా స్థలాలు పూర్తిగా అమ్ముడుపోవడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. అవసరమైతే మహిళా పారిశ్రామికవేత్తల కోసం మరో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి మరో రెండు ప్రాంతాల్లో స్థలాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఫిక్కి మహిళా పారిశ్రామికవేత్తల పార్కులో ప్రభుత్వ ఖర్చులతోనే రోడ్లు, విద్యుత్, నీటి సరఫరా లాంటి మౌలిక సదుపాయాలు కల్పించామని, సాధారణంగా ఈ వ్యయాన్ని పారిశ్రామికవేత్తల నుంచి టీఎస్ఐఐసీ వసూలు చేస్తుందన్నారు. 1,500 మందికి ఉద్యోగాలు.. సుల్తాన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన పారిశ్రామికవాడలో 1,500 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని, పురుషులకు సైతం ఉద్యోగాలివ్వాలని మంత్రి కేటీఆర్ కోరారు. హైదరాబాద్‌ను రెండో ఇంటిగా ఏర్పాటు చేసుకుని, ఇక్కడ మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఫిక్కి ఇండియా అధ్యక్షుడు రాశేష్ షాను కోరారు. ఫిక్కి లేడిస్ ఆర్గనేషన్ ఇండియా అధ్యక్షురాలు పింకీరెడ్డిపై ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంశలు కురిపించారు. ఆమె శక్తి సామర్థ్యాలు, ఉత్సాహాన్ని చూస్తుంటే భారత దేశానికి సైతం అధ్యక్షురాలు కాగలదు అని చమత్కరించారు. ఫిక్కి ఇండియా అధ్యక్షుడు రశేష్ షా మాట్లాడుతూ, బ్యాంకు కుంభకోణాలు, ఎన్పీఏలకు సంబంధించిన ఉదంతాలు బయటపడిన ప్రతిసారి ప్రభుత్వం, పారిశ్రామికవేత్తల మధ్య సంబంధాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితిలో పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, ఎండీ నర్సింహారెడ్డి, ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ ఇండియా అధ్యక్షురాలు పింకీరెడ్డి, జ్యోత్స అంగార, యూఎస్ కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డా, బిట్రిష్ హైకమిషనర్ ఆండ్రు ఫ్లెమింగ్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళా వ్యాపారవేత్తల్లో ఆ రాష్ట్రమే ఫస్ట్
న్యూఢిల్లీ: దేశంలోని తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర.. ఈ ఐదు రాష్ట్రాల్లోనే ఎక్కువ మంది మహిళా వ్యాపారవేత్తలు ఉన్నారు. అక్షరాస్యతకు, వ్యాపారానికి ప్రత్యక్ష సంబంధం లేకపోయినప్పటికీ ఈ ఐదు రాష్ట్రాల్లో అక్షరాస్యత కూడా ఎక్కువగా ఉంది. 73.4 శాతం అక్షరాస్యత కలిగిన తమిళనాడులోనే దేశంలోకెల్లా ఎక్కువ మంది మహిళా వ్యాపారవేత్తలు ఉన్నారు. ఆ రాష్ట్రంలో పది లక్షల వ్యాపార సంస్థలను అంటే 13.5 శాతం వ్యాపార సంస్థలను మహిళలే నిర్వహిస్తున్నారు. 92 శాతం అక్షరాస్యత కలిగిన కేరళలో 11.3 శాతం వ్యాపార సంస్థలను మహిళలే నిర్వహిస్తున్నారు. 59.1 శాతం అక్షరాస్యత కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10.5 శాతం వ్యాపార సంస్థలను, 70.5 అక్షరాస్యత కలిగిన పశ్చిమ బెంగాల్ రాష్ర్టంలో 10.3 శాతం వ్యాపార సంస్థలను, 75.9 శాతం అక్షరాస్యత కలిగిన మహారాష్ట్రలో 8.2 శాతం వ్యాపార సంస్థలను మహిళలు నిర్వహిస్తున్నారు. దేశంలో మహిళా వ్యాపారుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ మహిళల కార్మిక శక్తి మాత్రం తగ్గుతోందని ‘ఇండియా స్పెండ్’ అనే సంస్థ వెల్లడించింది. దేశవ్యాప్తంగా సరాసరి అక్షరాస్యత 65.5 శాతం ఉండగా, మహిళల కార్మిక శక్తి మాత్రం సరాసరి 25.5 శాతం మాత్రమే ఉంది. ఈ శక్తి 1999లో 34 శాతం ఉండగా, 2014 నాటికి అది 27 శాతానికి పడిపోయి ఇప్పుడు 25.5 శాతానికి చేరుకుంది. మహిళల కార్మిక శక్తి నేపాల్‌లో 79.9 శాతం ఉండగా, బంగ్లాదేశ్‌లో 57.4 శాతం, శ్రీలంకలో 35.1 శాతం ఉంది. పదవ తరగతికి పైగా చదువుకున్న మహిళల సంఖ్య కూడా ఈ ఐదు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలో 77.4 శాతం మంది మహిళలు పదవ తరగతికన్నా పైగా చదువుకున్నారు.