ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతోంది. సాంకేతిక విప్లవంతో ప్రతి రంగం వేగం పుంజుకుంటోంది. మరి... మహిళాభివృద్ధి కూడా అంతే వేగంగా జరుగుతోందా? అభివృద్ధి పరుగులో మహిళ ఎక్కడో వెనుకబడుతోంది. చిత్రలేఖనంలో మహిళల వాటా ఐదు శాతమే. అందుకే ‘వరల్డ్ ఆఫ్ ఉమెన్’ (వావ్) పుట్టింది. వావ్ సీఓఓ షనన్ స్నో పరిచయం ఇది.
షనన్ స్నో... అమెరికా అమ్మాయి. మయామిలో ఉంటోంది. ప్రపంచంలోని మహిళలందరినీ ఎంపవర్‌మెంట్ అనే వేదిక మీదకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తోంది. యామ్ కర్‌కాయ్ అనే చిత్రకారిణి, మరికొంత మంది భావసారూప్యత కలిగిన వ్యక్తులతో కలిసి ‘వరల్డ్ ఆఫ్ ఉమెన్’ వేదికగా ఉమెన్ ఆర్టిస్టుల కోసం పని చేస్తోన్న షనన్ తెలుగింటి కోడలు. ఆమె కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కి వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడింది.
‘‘నా దృష్టిలో జీవితం అంటే సాటి వారికి మనవంతుగా తోడ్పడడమే. అలాగే ప్రపంచం అంతటినీ చుట్టి రావడం కూడా. టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. సమాజం కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందుతోందా అంటే సమాధానం కష్టమే. నిజానికి మహిళాభివృద్ధితోనే సమాజం సంపూర్ణాభివృద్ధిని సాధిస్తుంది. అలాంటిది మహిళ ఇంకా సాధికారత సాధన కోసం పోరాడుతూనే ఉంది. ఆ పోరాటంలో విజయం సాధించాలంటే మహిళలు ఒకరికొకరు చేయూతగా నిలవాలి. ఆ భావనతోనే 2021 జూలైలో వరల్డ్ ఆఫ్ ఉమెన్’ అనే అనే సంస్థను స్థాపించాం.
మా వరల్డ్ ఆఫ్ ఉమెన్ కమ్యూనిటీతో ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా 350 మంది మహిళా చిత్రకారులు అనుసంధానమయ్యారు. ఈ రెండేళ్లలో మేము దాదాపు 30 మీట్ అప్స్ ఏర్పాటు చేశాం. ముంబయిలో కశ్వీ పరేఖ్ మా కమ్యూనిటీ మేనేజర్. ఇలా మొత్తం ఇరవై మందిమి ఉన్నాం. కొత్తగా కుంచె పట్టుకున్న చిత్రకారిణుల చిత్రాలను అనతి కాలంలోనే ప్రపంచంలోని దేశాలన్నింటికీ పరిచయం చేస్తుంది ఈ వేదిక. ఒక విషయాన్ని చెప్పడానికి చిత్రలేఖనం ఒక అందమైన మాధ్యమం. అలాగే చిత్రలేఖనంలో ఎన్నో వైవిధ్యభరితమైన విధానాలుంటాయి. యామ్‌తో పాటు హాలీవుడ్ నటి ఎవా లాంగోరియా స్వచ్ఛందంగా ఆర్థిక సహకారం అందిస్తున్నారు.
అవకాశాల్లో సమానత్వం
మేము చేస్తున్న ఈ ప్రయత్నం మహిళ సాధికారత సాధన కోసమే. మహిళ తనంతట తానుగా నిలబడగలగాలి. అవకాశాలు అందరికీ సమానంగా ఉండాలి. కానీ సమాజం అలా లేదు. ప్రపంచంలో ఏ దేశాన్ని చూసినా మహిళ మనుగడ కోసం పోరాడుతూనే ఉంది. కొన్ని దేశాల్లో అస్థిత్వం కోసం పోరాటం, కొన్ని దేశాల్లో హక్కుల పోరాటం, మరికొన్ని దేశాల్లో స్వేచ్ఛాస్వాతంత్య్రాల కోసం పోరాడుతోంది. సంతోషంగా జీవించాలంటే పోరాటం తప్పని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ బాలికల విద్య ఇంకా ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన విషయంగానే ఉంది. వీటన్నింటి పరిష్కారం కోసం మా వరల్డ్ ఆఫ్ ఉమెన్ సర్వీసులను విస్తరిస్తున్నాం. మా చిత్రలేఖనాలు కూడా ‘మహిళ’ అనే అంశం మీదనే ఉంటాయి. బాల్యం నుంచి స్త్రీకి ఎదురయ్యే సవాళ్లు, ఆమె సాధించిన విజయాలు, ఆమె అధిరోహించిన శిఖరాలే ఇతివృత్తంగా ఉంటాయి. ఇది మహిళాభివృద్ధికి కొత్త ప్రారంభం వంటిది. ఈ పరంపరలో భాగస్వాములు కావడం సులభం. ఆన్‌లైన్‌లో లాగిన్ అయ్యి సభ్యత్వం తీసుకోవచ్చు. మహిళలు సాధించలేనిదంటూ ఏదీ లేదు. సంఘటితమై సాధించి చూపిద్దాం.
– షనన్ స్నో, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్,
వరల్డ్ ఆఫ్ ఉమెన్
ఇండియాతో బంధం
ఇండియాతో అనుబంధం 2007లో మొదలైంది. భారతీయ సంస్కృతిని తెలుసుకోవడానికి, స్వయంగా ఆస్వాదించాలని వచ్చాను. గూగుల్‌లో ఉద్యోగం చేస్తూ నాలుగైదేళ్లు ఇండియాలోనే ఉన్నాను. అయితే ఇండియన్స్‌తో అనుబంధం ఏర్పడి ఇరవై ఏళ్లయింది. ప్రతాప్ పెనుమల్లి నాకు అండర్ గ్రాడ్యుయేషన్‌లో పరిచయమయ్యాడు. యాభై ఏళ్ల కిందట యూఎస్‌కి వెళ్లి, అక్కడే స్థిరపడిన కుటుంబం వాళ్లది.
మామగారు రిటైర్ అయిన తర్వాత అత్తమ్మ, మామయ్య ఏటా కొంతకాలం ఇండియాలో ఉంటున్నారు. నేను కూడా వచ్చాను. మా అత్తగారి పుట్టిల్లు, మామగారి సొంత ఊరికి కూడా వెళ్లాను. బంధువులందరూ ఆత్మీయంగా పలకరిస్తుంటే ఇండియాలో కుటుంబ బంధాలు చాలా దృఢమైనవని తెలిసింది. మా అత్తమ్మ వంటతో తెలుగు రుచులన్నీ అలవాటయ్యాయి. దోశ, ఎగ్ బుర్జీ, రొయ్యల కూర ఇష్టం. నా పర్యటనల్లో భాగంగా ఇండియా అంతా చూసేశాను.
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చారిత్రక, సాంస్కృతిక, యాత్రా ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలన్నింటినీ చూశాను. ప్రతాప్‌తో కలిసి తిరుమల కొండను నడిచి ఎక్కాను తెలుసా’’ అంటూ ఆహ్లాదంగా నవ్వింది షనన్ స్నో. తిరుమలకొండకు నడిచి వెళ్లడం గొప్ప అనుభూతి. ప్రకృతిని ప్రేమించే వాళ్లకు ఎప్పటికీ చెరగని జ్ఞాపకం’ అందామె చిరునవ్వుతో.
– వాకా మంజులారెడ్డి
సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment