ప్రతీకాత్మక చిత్రం : చీరలను విసిరి ప్రాణాలను కాపాడారు
అమ్మ చీర ఉయ్యాల అవుతుంది. ఆడించే ఒడి అవుతుంది. చినుకులకు గొడుగు అవుతుంది. ఉక్కపోతకు వింజామర అవుతుంది. చలిలో వెచ్చదనం అవుతుంది. తల్లీబిడ్డల బొడ్డుతాడు బంధమది. ఈ ముగ్గురమ్మల చీర.. వరదకు ‘ఒడ్డుతాడు’ అయింది!
రేపటికి సరిగ్గా వారం. ఆగస్టు 6న కొట్టారై ఆనకట్ట దగ్గర ఇది జరిగింది. పన్నెండు మంది యువకులు క్రికెట్ ఆడటం కోసం ఆ సమీపంలోని సిరువచ్చూరు గ్రామం నుంచి కొట్టారై వచ్చారు. ఆడారు. ఆనకట్ట దగ్గరకు వెళ్లారు. వర్షాలకు మరుదైయారు నది కళ్ల నిండుగా ఉంది. స్నానానికి ఉబలాటపడ్డారు పిల్లలు. అంతా పదిహేనూ ఇరవై ఏళ్లలోపు వాళ్లు. నీటి మట్టం కూడా వాళ్లకు ఈడూ జోడుగా 1520 అడుగుల లోతున ఉంది. ఉద్ధృతంగా ఉంది. ఊపును, ఉత్సాహాన్నీ ఇస్తోంది.
‘‘ఆంటీ ఇక్కడ దిగొచ్చా.. స్నానానికి?!’’
వర్షాలు పడుతూ వరద మట్టం పెరుగుతుండ బట్టి ఆ ప్రశ్న అయినా అడిగారు. లేకుంటే ఆ వయసు వాళ్లను ఆపేదెవరు?
‘‘వద్దు బాబూ.. ఈ చివర్నే ఉండంyì ’’ అని చెప్పారు సెంతమిళ్ సెల్వి, ముత్తమ్మాళ్, అనంతవల్లి. ఒడ్డున బట్టలు ఉతుక్కుని వెళుతుండగా ఈ ముగ్గురికీ ఆ గుంపు కనిపించింది. అప్పటికే వాళ్లలో కొందరు కిట్‌లు పక్కన పడేసి చొక్కాలు తీసి నీళ్లలో మునిగేందుకు సిద్దమయ్యారు. ఆలోపే నలుగురు నదిలోకి దూకే శారు!!
క్షణాల్లో అరుపులు మొదలయ్యాయి. నదిలోకి దూకిన వారివీ, ఒడ్డున ఉన్నవారివీ ఆ అరుపులు. వీళ్లను దాటుకుని వెళ్లిన ఆ ముగ్గురు మహిళలూ పరుగున వెనక్కు వచ్చారు. నీళ్లలోంచి ఎనిమిది చేతులు కొట్టుకుంటూ కనిపిస్తున్నాయి.. చిన్న ఆధారం దొరికితే పట్టుకుందామని. వాళ్లను బయటకి లాగేందుకు గజ ఈతగాళ్లే వెళ్లినా చేతులు ఎత్తేసే పరిస్థితి! ‘‘ఆంటీ.. ఆంటీ.. ’’ అంటూ.. ఒడ్డున ఉన్న పిల్లలు.. నదిలో కొట్టుకుపోతున్న స్నేహితుల్ని కాపాడమని పెద్దగా కేకలు వేస్తున్నారు. గ్రామీణులు కాబట్టి ఆ మహిళలకు ఈత వచ్చి ఉంటుందని వాళ్ల ఆశ. కానీ సెంతమిళ్ సెల్వి, ముత్తమ్మాళ్, అనంతవల్లి ఈత తెలిసినవాళ్లు కాదు. అలాగని వాళ్లను వదిలేసి వెళ్లినవాళ్లూ అవలేదు. తెగించి నీళ్లలోకి దూకారు.
చేతికి అందుబాటులో ఉంటే చెయ్యిచ్చి లాగే ప్రయత్నం చేసేవారేమో! అప్పటికే చేయిదాటి పోతున్నారు వీళ్లింకేమీ ఆలోచించలేదు. సంశయించలేదు. సంకోచించలేదు. ఒంటి మీద చీరలను తీసి ఆ మునిగిపోతున్న వారివైపు విసిరారు. భయపడ్డ పిల్లాడు అమ్మ కొంగును ఇక జన్మలో వదలకూడదన్నంత గట్టిగా పట్టుకున్నట్లు గుప్పెట్లు బిగించి నలుగురిలో ఇద్దరు ఒడ్డుకు రాగలిగారు. మిగతా ఇద్దరు పెరంబలూరు జిల్లా కేంద్రం నుంచి వచ్చిన గాలింపు సిబ్బందికి విగతజీవులై దొరికారు. బతికినవాళ్లు కార్తీక్, సెంథిల్వేలన్. చనిపోయినవారు పవిత్రన్, రంజిత్.
చనిపోయిన వాళ్లు ఎలా చనిపోయారన్న వార్త వెంటనే బయటికి వచ్చేసింది. బతికినవాళ్లు ఎలా బతికారన్నది ఆ టీమ్‌లోని వాళ్లు చెప్పుకుంటుంటే ఇన్నాళ్లకు ప్రపంచానికి తెలిసింది. స్నేహితుల మరణంతో వాళ్లెంత దుఃఖంలో ఉన్నారో, మిగతా ఇద్దరు పిల్లల్ని రక్షించలేకపోయామే అనే దుఃఖంలో ఆ ముగ్గురు తల్లులూ ఉన్నారు. వాళ్లది కొట్టారై దగ్గరి అదనురై. అక్కడికిప్పుడు ఎవరెవరో వచ్చి వాళ్లను ప్రశంసించి వెళుతున్నారు. కొందరైతే వాళ్లకు నమస్కరించడానికే వెళ్లి వస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment