'పాస్‌పోర్ట్ లేని అతిథులు పక్షులు. అవి మనల్ని ఫుడ్ అడగవు. వెచ్చటి బెడ్‌రూమ్‌లూ అడగవు. తొణికిసలాడే నీటి తావూ, వాలడానికి విస్తారంగా చెట్లు ఉంటే చాలు. కాని అవి వచ్చినప్పుడు వాటిని నమిలి మింగుదామనుకుంటే?.. కుదరదు అంటున్నారు స్త్రీలు. కేవలం డజన్ మందే. ఒడిశాలోని అరాచండిలో ప్రతి శీతాకాలం వచ్చే అరుదైన పక్షులను కాపాడి తిరిగి ఇళ్లకు పంపుతారు.'
అంతా కలిపి ఒకటిన్నర చదరపు కిలోమీటర్లు. తేమ మైదానాలు. భువనేశ్వర్ నుంచి గంటన్నర దూరంలో ఉన్న ‘బంకి’ అనే ఊళ్లో ఉంటాయి. వాటిని ‘అరాచండి మైదానాలు’ అని పిలుస్తారు. అక్కడకు ప్రతి సంవత్సరం చలికాలంలో చలి దేశాల నుంచి వలస పక్షులు వస్తాయి. బూడిద కొంగలు, వల్లంకి పిట్టలు, పెయింటెడ్ స్టార్క్స్, చక్రవాకాలు (రడీ షెల్‌డక్)... ఇంకా డజను రకాల పక్షులు వస్తాయి. సెప్టెంబర్ – అక్టోబర్ నెలల్లో ఇవి వలస వచ్చి ఫిబ్రవరి–మార్చి నాటికి తిరిగి సొంత ప్రాంతాలకు మూట ముల్లె సర్దుకుని వెళ్లిపోతాయి. దేశం కాని దేశం ఎందుకు వస్తాయవి? మనుషుల్ని నమ్మి. ఆ నమ్మకం అందరూ నిలబెట్టుకోరు. కొందరు నిలబెట్టేందుకు నడుం కడతారు.
ఆ పన్నెండు మంది
ఈ మైదానాల పక్కనే ఉండే నిస్తిపూర్ అనే గ్రామంలో నివసించే సూర్యకాంతి మొహంతి అనే గృహిణి ఒకరోజు ఈ తేమ మైదానాల వైపు వచ్చింది. అక్కడ కొంతమంది వేటగాళ్లు ఈ అందమైన పక్షులు, వలస వచ్చిన అతిథులను వేటాడుతూ కనిపించారు. ఆమె మనసు వికలమైపోయింది. తమ ఊరిని ఈ పక్షులు క్షమిస్తాయా అనిపించింది. వెంటనే ఊళ్లో ఉన్న ఇతర గృహిణులకు ఈ విషయం చెప్పడం మొదలుపెట్టింది. ‘అందరం కలిసి పక్షులను కాపాడదాం’ అంది. చాలామంది పట్టించుకోలేదు. ‘లగాన్’ సినిమాలో ఒక్కొక్కరూ దొరికినట్టు కేవలం 12 మంది గృహిణులు అంగీకరించారు. వీరంతా తమ భర్తలకు విషయాన్ని చెప్పి ఒప్పించారు. భర్తలు అంగీకరించాక 12 మంది కలిసి ‘అరాచండి పక్షి సురక్షా సమితి’ గా ఏర్పడ్డారు. ఆ తర్వాత ఆ పక్షులకు వారే తల్లిదండ్రులు, కాపలాదారులు, సైనికులుగా మారారు.
పక్షుల కోసమని..
‘ఈ పక్షులు ఎంతో సున్నితమైనవి. కాలుష్యం బారిన పడితే చచ్చిపోతాయి. అందుకే పక్షులను చూడటానికి వచ్చే వారిని ఇక్కడ చెత్త వేయకుండా అడ్డుపడ్డారు. అలాగే పిక్నిక్‌ల పేరుతో వచ్చి హారన్‌లు కొట్టడం, పాటలు పెట్టి సౌండ్లు చేయడం కూడా నిరోధించాం. ఈ పక్షులు చుట్టుపక్కల పొలాల నుంచే ఆహారాన్ని పొందుతాయి. అందుకే రైతుల దగ్గరకు వెళ్లి క్రిమిసంహారక మందులు ఉపయోగించని సేంద్రియ పంటలే పండించమన్నాం. రైతులు మా వేడుకోలును మన్నించారు. పక్షులు ఉన్నంత కాలం ప్రతి రోజూ మేము ఈ ప్రాంతానికి వచ్చి కాపలా కాస్తాం. ప్లకార్డులు ప్రదర్శిస్తాం. చెత్త లేకుండా చూస్తాం’ అంటారు ఈ పన్నెండు మంది గృహిణులు.
మొసళ్లు తోడయ్యాయి..
అయితే ఈ స్త్రీలకు మొసళ్లు కూడా తోడయ్యాయి. ఇక్కడి నీటిమడుగుల్లో మొసళ్లు ఉంటాయి. వేటగాళ్లు నీటి లోపలికి చొచ్చుకొచ్చి పక్షులను వేటాడకుండా ఈ మొసళ్ల భయం అడ్డుకుంటోంది. ‘మొసళ్లు పక్షులకు కాపలా ఉన్నప్పుడు మనుషులు ఉండటానికేమి?’ అంటారు ఈ స్త్రీలు. వీరి కృషి మెల్లగా పత్రికల ద్వారా ప్రభుత్వానికి తెలిసింది. అయినా సరే ప్రభుత్వం చేసే పని కన్నా ప్రజలు చేసే పనే ఎక్కువ ఫలితాన్ని ఇస్తోంది. ‘ఈ పక్షులను గమనిస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి. చక్రవాకాలు గొప్ప ప్రేమతో ఉంటాయి. ఒంటరి చక్రవాకాలను చూద్దామన్నా కనిపించవు. జంటగా ఉండాల్సిందే’ అంటారు ఈ స్త్రీలు. వీరి సేవకు ప్రభుత్వ మెచ్చుకోలుకన్నా ప్రకృతి ఆశీస్సులు తప్పక దొరుకుతాయి.
ఇవి కూడా చదవండి: పక్షులు మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయా? అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Comments
Please login to add a commentAdd a comment