
స్వామివారి దర్శనం చేసుకుందామని బెంగుళూరుకు చెందిన ఒక యువ సాఫ్ట్ వేర్ ఉద్యోగి తిరుపతి బయలుదేరాడు. నేరుగా అలిపిరి చేరుకున్నాడు. తల పైకెత్తి శేషాచలం కొండలవైపు చూశాడు. గుండెల్లో దడ మొదలయ్యింది. ‘నేను 3550 మెట్లు ఎక్కగలనా?’ అన్న అనుమానం పట్టుకుంది.
‘ముచ్చట గా మూడు మైళ్లు కూడా నడవలేనే, ఈ పన్నెండు కిలోమీటర్ల దూరం నడవటం నా వల్ల అయ్యే పనేనా’ అని దిక్కులు చూడసాగాడు. అక్కడే ఇద్దరు యువతులు ప్రతి మెట్టుకూ పసుపు కుంకుమలు పెట్టి కర్పూరం వెలిగిస్తూ ఉన్నారు.
‘‘మీరు చాలాసార్లు కాలినడకన కొండ ఎక్కినట్లు ఉన్నారు. నేను నడవగలనా?’’అని వారిని అడిగాడు. ‘‘కొంచెం కష్టపడాలి. అక్కడక్కడ కూర్చుని వెళ్ళండి’’ అని సలహా ఇచ్చి వెళ్ళిపోయారు. అయినా అతడికి ధైర్యం రాలేదు. ఎప్పుడో వచ్చిన మోకాళ్ళ నొప్పులు గుర్తుకు తెచ్చుకుని కాలినడక విరమించుకున్నాడు. బస్సుకెళ్దామని నిర్ణయించుకుని పక్కకి తిరిగాడు.
అప్పుడే ఓ పండు వృద్ధురాలు కట్టె చేతపెట్టుకుని, నెత్తిన సంచి ఉంచుకొని కొండ ఎక్కడానికి వచ్చింది.ఆ యువ ఇంజినీరు ఆశ్చర్యంగా ‘‘ఇన్ని మెట్లు నువ్వు ఎక్కగలవా అవ్వా?’’ అని అడిగాడు. ఆమె బోసినోటితో ‘‘ఎక్కించే వాడు పైన ఉన్నాడు నాయనా, నన్ను ఎలాగోలా ఎక్కిస్తాడులే’’ అని సమాధానమిచ్చింది.‘‘ఆయన ఎలా ఎక్కిస్తాడు? నువ్వుకదా కొండ ఎక్కాల్సింది!’’ అన్నాడు.
‘‘నడవాలని అనుకోవడమే నా వంతు నాయనా. మిగతాది అంతా ఆయన చూసుకుంటాడు. ఏదో ఒకవిధంగా తోడుగా వచ్చి నన్ను కొండ చేరుస్తాడు’’ అని మెట్లు ఎక్కసాగింది. ‘ఈ పెద్దామే ఎక్కుతోందే... మనం ఎందుకు ఎక్కలేము?’ అని మనసులో అనుకున్నాడు. చిన్నగా ఆ అవ్వతో కలిసి నడవటం ప్రారంభించాడు. అక్కడక్కడా నిలుస్తూ అవీ ఇవీ మాట్లాడుకుంటూ ఇద్దరూ కొండపైకి చేరారు.
చివరి మెట్టు మీద నిలబడుకొని ఆ యువకుడు ‘‘అవ్వా... మీ దేవుడు వచ్చి నిన్ను కొండ ఎక్కిస్తాడని చెప్పావే... ఎక్కడా కనిపించడేమి?’’ అని కొంచెం వెటకారంగా అడిగాడు. ఆ ముసలామె నవ్వుతూ ‘‘నువ్వు ఎవరనుకున్నావు నాయనా... దేవుడు తోడు చేసి పంపితే వచ్చినవాడివి కదా’’ అని చెప్పి హుషారుగా వైకుంఠం వైపు నడవసాగింది. ‘ఆ’ అని నోరు తెరవడం ఆ యువకుడి వంతు
అయ్యింది.
– ఆర్.సి.కృష్ణస్వామి రాజు
(చదవండి: