
సాక్షి, తిరుపతి: ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు ధరించిన వైఎస్ జగన్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా స్వామివారి దర్శనానికి వెళ్లారు. ఇతర భక్తులకు ఇబ్బంది కలుగకుండా సామాన్య భక్తుడిలా క్యూలైన్‌లో వెళ్లి ఆయన శ్రీవారి దర్శించుకున్నారు. వైఎస్ జగన్ వెంట వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలు ఉన్నారు.
శ్రీవారిని దర్శించుకున్న తర్వాత వైఎస్ జగన్ తిరుమలలోని విశాఖ శారదా పీఠం చేరుకున్నారు. అక్కడ పండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వైఎస్ జగన్ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. రాత్రికి తిరుమలలో బస చేయనున్న ఆయన.. శుక్రవారం ఉదయం ఇడుపులపాయకు వెళ్లనున్నారు.
సుదీర్ఘమైన ప్రజాసంకల్పయాత్రను పూర్తిచేసి చరిత్ర సృష్టించిన ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ గురువారం ఉదయం తిరుపతికి చేరుకున్నారు. పద్మావతి గెస్ట్‌హౌస్ నుంచి అలిపిరి చేరుకున్న వైఎస్ జగన్.. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో అలిపిరి పాదాల మండపం నుంచి కాలినడకన బయలుదేరారు. అలిపిరి పాదాల మండపం దగ్గర తొలిమెట్టుకు నమస్కరించిన ఆయన.. శ్రీనివాసుడి దర్శనం కోసం నడక ప్రారంభించారు. పెద్దసంఖ్యలో అభిమానులు ఆయన వెంట కదిలారు. ఈ సందర్భంగా గోవిందనామస్మరణతో కాలినడక మార్గమంతా మార్మోగిపోయింది.
దారిపొడువునా భక్తులకు అభివాదం చేస్తూ.. సామాన్య భక్తుడిలా ముందుకుసాగిన జననేత.. మార్గమధ్యలో ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ జననేత కొబ్బరికాయ కొట్టారు. తర్వాత నరసింహస్వామి ఆలయంలో వైఎస్ జగన్ పూజలు చేశారు. వడివడిగా మెట్లు ఎక్కిన ఆయన ఎక్కడా ఆగకుండా ముందుకు కదిలారు. అలుపులేకుండా పాదయాత్ర నిర్వహించిన జననేత.. తిరుమల మెట్లు ఎక్కడంలోనూ అదే ఉత్సాహాన్ని ప్రదర్శించారు. మెట్ల దారిలో సాటి భక్తులను పలుకరిస్తూ.. వారికి ఆత్మీయంగా అభివాదం చేస్తూ ముందుకు కదిలిన వైఎస్ జగన్.. మర్గమధ్యలో నరసింహా ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం మోకాళ్ల పర్వతం నుంచి తిరుమల చేరుకున్నారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో తిరుమలలోని శ్రీకృష్ణ అతిథి గృహానికి వైఎస్ జగన్ చేరుకున్నారు.
వైఎస్ జగన్ రాకపై భక్తులు, తిరుపతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు వైఎస్ జగన్‌కు, ఆయన కుటుంబానికి ఎల్లవేళలా ఉంటాయని అంటున్నారు. చిన్న వయస్సులోనే ఎన్నో బాధలు ఎదుర్కొని తండ్రి చూపిన బాటలో ప్రజాశ్రేయస్సు కోసం వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టారని అన్నారు. ఆరోగ్యం సహకరించకపోయినా ప్రజలను కుటుంబంగా భావించి వారి కష్టాను తీర్చాడానికి ముందుకు సాగుతూనే ఉన్నారని తెలిపారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తేనే ప్రజలకు మెరుగైన పాలన అందుతుందని అన్నారు. వైఎస్ జగన్‌తో కలిసి పది అడుగులు వేసిన తమ అదృష్టంగా భావిస్తామన్నారు.
రేణిగుంటలో...
వైఎస్ జగన్ ఈ ఉదయం 10 గంటల ప్రాంతంలో రేణిగుంట చేరుకున్నారు. దురంతో ఎక్స్‌ప్రెస్ రైలులో ఇక్కడికి వచ్చిన జననేతకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు తరలివచ్చిన జనంతో రేణిగుంట రైల్వే స్టేషన్ కిక్కిరిసింది. వారందరికీ అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగారు. జై జగన్ నినాదాలతో రైల్వే స్టేషన్ ప్రాంగణం మార్మోగింది. సీఎం జగన్ అంటూ రైల్వేస్టేషన్‌లో ఉన్న వారితో పాటు, రైలులో ఉన్న ప్రయాణికులు నినదించడం విశేషం.