సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్ కంపెనీలు పెరుగుతున్నా.. మహిళా వ్యాపారులు మాత్రం వాటిల్లో పెద్దగా రాణించడం లేదు. స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేయడంలో ప్రపంచవ్యాప్తంగా మహిళా వ్యాపారులకు అనువైన 50 ఉత్తమ నగరాల జాబితాలో భారత్‌కు చెందిన రెండు నగరాలకు మాత్రమే చోటులభించింది. భారత్ సిలికాన్ వ్యాలీగా గణతికెక్కిన బెంగళూరు నగరానికి 40వస్థానం లభించగా, ఢిల్లీ నగరానికి 49వ స్థానం లభించింది.
మొదటి పది నగరాల జాబితాలో న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, లండన్, బోస్టన్, స్టాక్ హోమ్, లాస్ ఏంజిలెస్, వాషింగ్టన్ డీసీ, సింగపూర్, టొరాంటో, సియాటిల్, సిడ్నీ నగరాలు ఆక్రమించాయి. బెంగళూరు, ఢిల్లీ నగరంతోపాటు ఆసియా నగరాల్లో సింగపూర్ 8వ స్థానాన్ని, హాంకాంగ్ 16, థైపీ 22, బీజింగ్ 38, టోక్యో 39, కౌలాలంపూర్ 41, శాంఘై 44వ స్థానాన్ని లేదా ర్యాంక్‌ను సాధించాయి. ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ కలిగిన దేశాల్లో బెంగళూరుకు పదవ స్థానం లభించినప్పటికీ మహిళా స్టార్టప్ కంపెనీల్లో వెనకబడి పోవడం విచారకరం.
మహిళా వ్యాపారులు, విధాన నిర్ణేతలు, వెంచర్స్ క్యాపిటలిస్టులు, మీడియా ప్రతినిధులు, విద్యావేత్తల అభిప్రాయాలను సేకరించడం ద్వారా ఈ నగరాల జాబితాను డెల్ టెక్నాలజీ కంపెనీ, ఐహెచ్‌ఎస్ మార్కెట్ కన్సల్టెనీ రూపొందించింది.
Comments
Please login to add a commentAdd a comment