
ఢిల్లీ: భర్త నుంచి తాత్కాలిక భరణం కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉన్నత చదువులు చదువుకున్నారు. వివాహం కాకముందు ఉద్యోగం చేశారు. భారీ మొత్తంలో వేతనం తీసుకున్నారు. అలాంటి మీకు భరణం ఎందుకివ్వాలి? అని ప్రశ్నించింది. ఉద్యోగం చేసేందుకు అన్నీ అర్హతలు ఉన్న పిటిషినర్‌కు భరణం ఇచ్చే అంశాన్ని ప్రోత్సహించడం లేదని వ్యాఖ్యానించింది. వెంటనే, ఆమె అర్హతకు తగ్గ ఉద్యోగాన్ని చూసుకోవాలని సూచించింది.
కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే.. వాళ్లిద్దరూ భార్య, భర్తలు. 2019 డిసెంబర్‌లో వివాహం చేసుకున్నారు. అనంతరం సింగపూర్‌లో సెటిల్ అయ్యారు. అయితే, సింగపూర్‌కు వెళ్లిన తనని.. తన భర్త, అతని తల్లిదండ్రులు వేధిస్తున్నారనే కారణంతో భార్య ఫిబ్రవరి 2021లో భారత్‌కు తిరిగి వచ్చారు. తన బంగారాన్ని ఆమ్మి స్వదేశానికి వచ్చినట్లు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన బంధువులు ఇంట్లో నివాసం ఉంటున్నారు.
కాబట్టి, తన భర్త నుంచి భరణం కావాలని కోరుతూ జూన్ 2021లో ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ట్రయల్ కోర్టు ఆ పిటిషన్ కొట్టివేసింది. దీంతో మహిళ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌లో తన భర్త భారీ మొత్తంలో సంపాదిస్తూ లగ్జరీగా బతుకుతున్నారని, తనకు ఎలాంటి సొంత ఆదాయం లేదని, భర్త నుంచి తాత్కాలిక భరణం కోరుతున్నట్లు పేర్కొన్నారు.
ఆ పిటిషన్‌పై జస్టిస్ చంద్రదారి ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సమయంలో సీఆర్‌పీసీ సెక్షన్ 125 ను సమర్ధిస్తూనే ఉద్యోగం చేసేందుకు అన్నీ అర్హతలు ఉండి, ఖాళీగా ఉండే మహిళల విషయంలో ఇది వర్తించదు. అందుకే, మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు వ్యాఖ్యానించింది.
ఉన్నత విద్య, మంచి ఉద్యోగం చేసిన అనుభవం ఉన్న భార్య.. భర్త నుంచి భరణం పొంది ఖాళీగా ఉండడాన్ని సహించదు. కాబట్టి, కోర్టు ఈ కేసులో తాత్కాలిక భరణాన్ని ప్రోత్సహించడం లేదు. ఎందుకంటే పిటిషనర్ ఆస్ట్రేలియాలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసినట్లుగా, వివాహానికి ముందు దుబాయ్‌లో మంచి ఆదాయం సంపాదించినట్లు గుర్తించింది.
ఆమె చదివిన చదువుకు మంచి ఉద్యోగాలు, వేతనాలు వస్తాయని కోర్టు భావిస్తోంది. ఆమె.. తన భర్త ఇచ్చే తాత్కాలిక భరణం మీద ఆధారపడకుండా స్వయంగా సంపాదించుకునే అవకాశాలపై దృష్టి సారించాలని సూచించింది. అదే సమయంలో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
Comments
Please login to add a commentAdd a comment