న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఆప్ సీనియర్ నేత సత్యేందర్ జైన్‌కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ మాజీ మంత్రి అయిన సత్యేందర్ జైన్‌కు రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. కాగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద నమోదైన కేసులో ఆయన దాదాపు 18 నెల జైలులో ఉన్నారు.
బెయిల్ మంజూరు సందర్భంగా.. హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. పీఎంఎల్‌ఏ వంటి కఠినమైన కేసుల్లో వ్యక్తిగత స్వేచ్ఛ ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. విచారణలో జాప్యాన్ని ఎత్తిచూపుతూ.. సత్యేందర్ జైన్ సుధీర్ఘ కాలం నిర్బంధంలో ఉన్నారని పేర్కొంది. ఈమేరకు ఆప్ నేత మనీష్ సిసోడియా కేసులో సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ.. సత్వర విచారణ అనేది ప్రాథమిక హక్కుగా తెలిపింది. ట్రయల్ ప్రారంభించడానికి ఇంకా చాలా సమయం పడుతుందన్న న్యాయస్థానం వీలైనంత త్వరగా కేసును ముగించాలని దర్యాప్తు సంస్థకు సూచించింది.
కాగా జైన్‌ను రెండేళ్ల కిత్రం మే 2022లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. అయితే ఆరోగ్య కారణాలతో వైద్య కారణాలతో 2023 మేలో సుప్రీంకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం ఈ ఏడాది మార్చిలో సాధారణ బెయిల్ కోసం ఆయన చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో జైన్ ఢిల్లీలోని తీహార్ జైలుకు తిరిగి వచ్చారు.
ఇటీవల కాలంలో వివిధ కేసుల్లో బెయిల్ పొందిన మూడో ఆప్ నేత సత్యేందర్ జైన్. లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు గత నెలలో బెయిల్ మంజూరు అయిన సంగతి తెలిసిందే. ఇక ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఆగస్టులో బెయిల్ లభించింది.
Comments
Please login to add a commentAdd a comment