శిక్షణ పొందుతున్న పట్టణ స్వయం సహాయక సంఘాల సభ్యులు
సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల్లో ప్రతి మహిళ స్వయంశక్తితో ఎదిగేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) మరో అడుగు ముందుకేసింది. ప్రభుత్వం అందించిన వివిధ పథకాల నిధులతో స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించడంతో పాటు, వారు ఆర్థికంగా మరింత ఎదిగేందుకు ‘మహిళా పట్టణ ప్రగతి యూనిట్ల’ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.
స్వయం ఉపాధిపై ఆసక్తి గల 142 మంది పట్టణ మహిళా సంఘాల సభ్యుల(ఎస్‌హెచ్‌జీ)కు ఆసక్తి ఉన్న రంగాలలో పూర్తిస్థాయిలో శిక్షణనిచ్చింది. ఆయా పరిశ్రమలు పర్యావరణ హితమైనవిగా ఉండేలా ముందే జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందులో సూక్ష్మ పరిశ్రమల స్థాపన, వ్యాపార విధానాలు, ముడిసరుకు లభ్యత వంటి అంశాలపై తర్ఫీదునిచ్చారు.
ఒక్కో యూనిట్‌కు సగటున రూ.2.50 లక్షల చొప్పున దాదాపు రూ.4 కోట్ల నిధులను మెప్మా ఇందుకోసం వెచ్చించింది. ఇప్పటికే యంత్రాల కొనుగోలు ప్రక్రియ పూర్తవగా, మరో 10 రోజుల్లో యూనిట్లను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ చేపట్టారు. యూనిట్లు ఏర్పాటు తర్వాత స్థానికంగా ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు కూడా మెప్మా ఎండీ విజయలక్ష్మి ముందస్తు చర్యలు తీసుకున్నారు. శిక్షణ పొందిన ట్రేడ్స్‌లో నిపుణులతో అవసరమైన సహకారం అందించనున్నారు.
ఆరు ట్రేడ్లలో 142 మందికి శిక్షణ పూర్తి
నాలుగున్నర ఏళ్లలో వివిధ పథకాల ద్వారా రాష్ట్రంలో 25 లక్షల మంది పట్టణ పొదుపు సంఘాల మహిళలతో జగనన్న మహిళా మార్టులు, ఆహా క్యాంటీన్లు, అర్బన్ మార్కెట్లు ఏర్పాటు చేయించి మెప్మా విజయం సాధించింది. మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు విస్తత మార్కెట్ కల్పించేందుకు ఈ–కామర్స్ సంస్థలతోనూ ఒప్పందం చేసుకుంది.
ఇప్పుడు అదే మహిళలతో పరిశ్రమలు నెలకొల్పి, పర్యావరణ హితమైన సరికొత్త ఆలోచనలను ప్రోత్సహించేందుకు మహిళా ‘ప్రగతి యూనిట్లు’ ఏర్పాటుపై పూర్తిస్థాయి శిక్షణనిచ్చారు. అన్ని మునిసిపాలిటీల్లోని మహిళా సంఘాలు తీర్మానాలు చేసిన ప్రాజెక్టుల్లో కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ వర్క్, పేపర్ ప్లేట్ల తయారీ, క్లాత్ బ్యాగ్స్ తయారీ, స్క్రీన్ ప్రింటింగ్, ఆర్టీఫిషియల్ జ్యూవెలరీ, కర్పూరం, దీపం వత్తులు, సాంబ్రాణి తయారీ, కారం, మసాలా పొడులు, మిల్లెట్స్ ప్రాసెసింగ్‌లో శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన 142 మందికి ప్రభుత్వమే యంత్రాలు, ముడిసరుకును ఉచితంగా ఇచ్చి మొత్తం 111 యూనిట్లను పట్టణాల్లో ఏర్పాటు చేస్తున్నారు.
మెప్మాతో మెరుగైన జీవితం
టైలరింగ్‌లో అనుభవం ఉంది. ఇంట్లోనే కుట్టుపని ప్రారంభించా. వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటున్నా. ఎలా చేయాలో తెలియదు. పట్టణ మహిళా సంఘంలో సభ్యురాలిని కావడంతో మెప్మాను సంప్రదించాను. వారు కంప్యూటర్‌పై ఎంబ్రాయిడరీ వర్క్‌లో శిక్షణ ఇచ్చారు.
ఇది నాకెంతో ఉపయోగపడుతుంది. ముడిసరుకు సేకరణ, వ్యాపారం, మార్కెటింగ్ అంశాల్లో పూర్తి శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వమే ఉచితంగా యంత్రాలను అందించడం చాలా ఆనందంగా ఉంది. – టి.తనూజ స్రవంతి, విశాఖపట్నం
నాపై నమ్మకం పెరిగింది
సొంతంగా పరిశ్రమ పెట్టి కనీసం నలుగురికి ఉపాధి కల్పించాలన్న కోరిక ఉంది. కానీ ఎలా చేయాలో తెలియదు. ఇంట్లోనే క్లాత్ బ్యాగ్‌లు కుడుతుంటాను. వాటిపై అవసరమైన బ్రాండింగ్ కోసం మరో చోటకు వెళ్లాల్సి వస్తోంది. వ్యాపారంపైనా అవగాహన లేదు.
ఈ ఏడాది ఎస్‌హెచ్‌జీలో చేరాను. మెప్మా ‘మహిళా పట్టణ ప్రగతి యూనిట్ల’ ఉచిత శిక్షణలో స్క్రీన్ ప్రింటింగ్, జ్యూట్ బ్యాగ్‌ల తయారీ, వ్యాపార మెళకువలు తెలుసుకున్నాను. నేను పూర్తిస్థాయిలో వ్యాపారం చేయగలనన్న నమ్మకం లభించింది. – బి.రాజేశ్వరి, ఏలూరు
మహిళా ప్రగతి లక్ష్యంగా శిక్షణ
మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలనేది సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆశయం. అందుకు అనుగుణంగా మెప్మా ఆధ్వర్యంలో జగనన్న మహిళా మార్టులు, ఆహా క్యాంటీన్లు, అర్బన్ మార్కెట్లు వంటివి ఏర్పాటు చేసి విజయం సాధించాం. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి మహిళా ప్రగతి యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం. మహిళలు కోరుకున్న రంగాల్లో ఉచిత శిక్షణ ఇచ్చాం.
ఇంటిని చక్కదిద్దుకుంటూనే పిల్లల బాగోగులు చూసుకుంటున్న మహిళలకు మెప్మా అండగా ఉంటుంది. పరిశ్రమలు స్థాపించి నిర్వహించగల సామర్థ్యం మహిళలకు ఉంది. మార్కెటింగ్ విషయంలో మెప్మా వారికి అండగా నిలబడుతుంది. పదిరోజుల్లో 111 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం. యూనిట్లు ఏర్పాటు తర్వాత వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సహకారం అందిస్తాం. – వి.విజయలక్ష్మి, ఎండీ, మెప్మా
Comments
Please login to add a commentAdd a comment