భవిష్యత్‌లో 40 శాతం జనాభా పట్టణాల్లోనే..
2036 నాటికి దేశ పట్టణ జనాభా 60 కోట్లు
2047 నాటికి 80 కోట్లకు చేరుతుందని అంచనా
పట్టణీకరణపై కేంద్రానికి కేశవ్ వర్మ కమిటీ సిఫారసు
జనాభాకు తగ్గట్టు స్థానికంగానే నిధులు సమకూర్చుకోవాలని సూచన
సాక్షి, అమరావతి: నగరాలు నిండిపోతున్నాయి. సమీప గ్రామాలు సైతం పట్టణాల్లో విలీనమవుతున్నాయి. మరో పదేళ్లల్లో దేశజనాభాలో 40 శాతం పట్టణాల్లోనే స్థిర నివాసం ఏర్పరచుకుంటారని కేంద్రం అంచనా వేస్తోంది. దీనికి తగ్గట్టుగా చర్యలు తీసుకోకపోతే ప్రమాదమని కేంద్రం భావిస్తోంది. దీంతో పట్టణీకరణపైనా, మౌలిక సదుపాయాల కల్పన పైనా కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టి పెట్టింది.
పట్టణీకరణపై అధ్యయనం కోసం ప్రత్యేకంగా కమిటీని వేయడంతో పాటు వచ్చే ఐదు దశాబ్దాలు మన నగరాలు ఎలా అభివృద్ధి చెందాలనే అంశంపై ప్రణాళిక సిద్ధం చేస్తోంది. 2022లో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఇటీవల తన నివేదికను కేంద్రానికి సమర్పించింది. దీనిప్రకారం 2036 నాటికి దేశంలో పట్టణ జనాభా 60 కోట్లకు చేరుతుందని, 2047 నాటికి 80 కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది. ఈ క్రమంలో పట్టణీకరణ సమీప భవిష్యత్‌లో అత్యవసరమని నివేదిక పేర్కొంది. అంతేకాకుండా భవిష్యత్ నగరీకరణ ప్రణాళిక, సంస్కరణలను సిఫారసు చేసింది.
ఆలిండియా అర్బన్ ప్లానింగ్ సర్వీస్ అవశ్యం
పట్టణ ప్రణాళికను పర్యవేక్షిస్తున్న శిక్షణ పొందిన నిపుణులకు ప్రాధాన్యతనిస్తూ, టౌన్ ప్లానింగ్‌లో అర్హత కలిగిన ప్లానర్‌లను నియమించుకోవడానికి ‘ఆలిండియా అర్బన్ ప్లానింగ్ సర్వీస్’ అవసరాన్ని నివేదిక పునరుద్ఘాటించింది. ఇది ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్, ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్ తరహాలో ఉండాలని పేర్కొంది. దీంతోపాటు నేషనల్ అర్బన్ అండ్ రీజినల్ ప్లానింగ్ అథారిటీని రూపొందించడానికి, బలోపేతం చేయడానికి టౌన్ అండ్ కంట్రీ ప్లానర్స్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని సూచించింది.
పట్టణాలకు ఆర్థిక స్థిరత్వం
పట్టణ స్థానిక సంస్థలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనేది సిఫార్సుల ముఖ్యాంశాల్లో ఒకటి. ఒక నగరం బడ్జెట్ మొత్తం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 1 శాతం కంటే తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. నగరాలు, పట్టణాల్లో వసూలు చేసే ఆక్ట్రాయ్ పన్నుల ద్వారా ఆదాయం సమకూరే అవకాశం లేనందున నగరాల్లో చేపట్టే ప్రాజెక్ట్‌లకు ఆర్థిక వనరులను మల్టీ లేటరల్ లోన్లు, దేశీయ టర్మ్‌లోన్లు, పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యం, మునిసిపల్ బాండ్‌లు, ఇతర ఆదాయ మార్గాల ద్వారా నిధులు సమకూర్చుకోవాలని సూచించింది. తమిళనాడు తరహాలో పట్టణాభివృద్ధికి నిధులు సమకూర్చుకోవాలని తెలిపింది.
అలాగే పట్టణ స్థానిక సంస్థలు (యూఎల్బీ)లు సమర్థవంతమైన పనితీరుతో స్వతహాగా ఆర్థిక వనరులను పెంచుకోవాలని, జీఎస్టీ రాబడిలో కొంత భాగాన్ని పంచుకోవడం తప్పదని కమిటీ సిఫారసు చేసింది. ఉదాహరణకు... మహారాష్ట్రలో వసూలు చేసే జీఎస్టీలో స్థానిక సంస్థల పన్నులు కూడా ఉన్నాయని, ఆ మొత్తాన్ని యూఎల్బీలకు ఇస్తున్నట్టు పేర్కొంది. వీటితో పాటు 10 లక్షల జనాభా ఉన్న నగరాల్లో ‘నగర ఆర్థిక అభివృద్ధి కౌన్సిళ్లు’ ఏర్పాటు చేయాలని కమిటీ సిఫారసు చేసింది. స్థానిక వ్యాపారాలు, పరిశ్రమలకు చెందిన నిపుణులతో ఈ స్టాండింగ్ కమిటీ ఉండాలని పేర్కొంది.
ఇది కేవలం సలహా సంఘంగా మాత్రమే కాకుండా పట్టణ స్థానిక సంస్థల్లో నైపుణ్యాలు, సామర్థ్యాల కొరతను పూరించడానికి వాటితో సంఘటితం కావాలని సూచించింది. ఈ సూచనలను అసోం, గుజరాత్, హరియాణా, జమ్మూ–కశ్మీర్, కేరళ, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో పరిస్థితుల అధ్యయనం తర్వాత చేసినట్టు నివేదికలో పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో ఇదే తరహా విధివిధానాలను అనుసరిస్తున్నట్లు తెలిపింది.
పెరుగుతున్న జనాభా.. తగ్గుతున్న సాగుభూమి
పట్టణ జనాభా 1961లో 79 మిలియన్ల నుంచి 2011లో 388 మిలియన్లకు పెరిగింది, 2030 నాటికి 630 మిలియన్లకు చేరుతుందని అంచనా. ఈ సమయంలో తలసరి సాగు భూమి 1950–51లో 0.83 హెక్టార్లు ఉండగా, ఇది 2015–16 నాటికి 0.12 హెక్టార్లకు తగ్గిపోయింది. 2030 నాటికి ఇది మరింత క్షీణించి 0.08 హెక్టార్లకు తగ్గుతుందని అంచనా. ఈ పరిస్థితి చాలా ప్రమాదకరమని నివేదిక హెచ్చరించింది. ఈ క్షీణత ఆహార భద్రత, స్థిర వ్యవసాయం, గ్రామీణ జీవనోపాధికి గణనీయ సవాళ్లను విసురుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.
చాలా దేశాల్లో నగరాలు బహుళజాతి సంస్థల్లా నడుస్తూ, సొంతంగా నిధులు సమకూర్చుకుంటుంటే, మన దేశంలో ఇంకా నిధుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడుతున్నాయని పేర్కొంది. ప్రస్తుతం నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 75 శాతానికి పైగా నిధులు సమకూరుస్తుండగా, యూఎల్బీలు తమ రాబడి నుంచి 15 శాతం మాత్రమే ఖర్చు చేస్తున్నాయి. నగరాల మౌలిక సదుపాయాల అవసరాల్లో 5%మాత్రమే ప్రైవేట్ వనరుల ద్వారా నిధులు వస్తున్నాయని.. వీటిని మరింత పెంచాల్సిన అవసరముందని పేర్కొంది.
పట్టణీకరణను నివారించాలని సూచన
పరిశ్రమలు, వ్యాపార ప్రాంతాల (బ్రౌన్‌ఫిల్డ్) కోసం వ్యవసాయ క్షేత్రాలను అభివృద్ధి చేయాలనే రియల్టర్ల ఆశ పట్టణ విస్తరణలకు దారితీసింది. ఫలితంగా పర్యావరణం క్షీణించడం, వ్యవసాయ యోగ్యమైన భూమిని కోల్పోవడంతో పాటు పట్టణీకరణ విపరీతంగా పెరుగుతోందని నివేదిక పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment