
బీహార్, ఉత్తర్‌ప్రదేశ్ విధానాన్ని అందరూ అనుసరించాల
రిపబ్లిక్ టీవీ ‘లిమిట్‌లెస్ ఇండియా’ సదస్సులో సీఎం చంద్రబాబు
సాక్షి, న్యూఢిల్లీ : జనాభా నియంత్రణ విషయంలో తన ఆలోచన విధానం పూర్తిగా మారిపోయిందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గురువారం సాయంత్రం ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన రిపబ్లిక్ టీవీ ‘లిమిట్‌లెస్ ఇండియా’ సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో జనాభా నిర్వహణ భారత్‌కు చాలా ముఖ్యమైనదని చెప్పారు. ప్రస్తుతం చైనా, జపాన్, యూరప్‌లలో జనాభా పెరుగుదల తగ్గిపోయిందని అన్నారు.
2047 కల్లా దేశంలో 65% మంది ప్రజలు 35 ఏళ్లలోపు వారు ఉంటారన్నారు. కుటుంబ నియంత్రణ విధానాన్ని సక్రమంగా నిర్వహించినందుకు దక్షిణ భారత దేశంలో జనాభా తగ్గిందన్నారు. ఇప్పుడు జనాభా నియంత్రణ విషయంలో దక్షిణాదిలో ఆలోచనా విధానం మారాలని సూచించారు. బీహార్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలు ఎక్కువ మంది జనాభాతో దేశాన్ని కాపాడుతున్నాయని, ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాలూ అనుసరించాలని చెప్పారు.
మెట్రో ప్రాజెక్టులకు వందశాతం సహాయం చేయండి
విశాఖపట్నం, విజయవాడ నగరాలకు మెట్రో ప్రాజెక్టుల అనుమతులను త్వరితగతిన ఇవ్వాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. ఈ ప్రాజెక్టులకు వంద శాతం ఖర్చును కేంద్రమే భరించాలని విన్నవించారు. చంద్రబాబు గురువారం ఢిల్లీలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి, విద్యుత్తు శాఖల మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో సమావేశమై ఈమేరకు విజ్ఞప్తి చేశారు.
ఈ భేటీ వివరాలను సీఎం ఎక్స్ ద్వారా వెల్లడించారు. విశాఖపట్నంలో ట్రాఫిక్ రద్దీ పెరుగుతోందని తెలిపారు. భోగాపురం విమానాశ్రయం వచ్చే ఏడాది జూన్‌కి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నందున జాతీయ రహదారులకు మెట్రోను అనుసంధానించడం ఎంతో ముఖ్యమని తెలిపారు.
విజయవాడ మెట్రో ప్రాజెక్టు అమరావతి ప్రవేశ ద్వారంగా ప్రాంతీయ కనెక్టివిటీని బలోపేతం చేయడానికి, ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుందన్నారు. విజయవాడలో పెరుగుతున్న రవాణా అవసరాలను తీర్చడానికి ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ భేటీలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు.
లూథ్రాతో చంద్రబాబు రహస్య భేటీ?
ఎలాగైనా కేసులన్నీ క్లోజ్ అయ్యేలా చూడాలని వినతి!
సాక్షి, న్యూఢిల్లీః సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్థార్థ లూథ్రాతో సీఎం చంద్రబాబు రహస్యంగా సమావేశమైనట్లు తెలిసింది. ఈ భేటీలో గతంలో చంద్రబాబుపై నమోదైన కేసులను ఎత్తివేసే అంశంపై చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. గురువారం రాత్రి ఢిల్లీ వచ్చిన చంద్రబాబు రిపబ్లికన్ టీవీ నిర్వహించిన ‘లిమిట్ లెస్ ఇండియా’ సదస్సుకు హాజరయ్యారు.
సదస్సు అనంతరం ఆయన నేరుగా డిఫెన్స్ కాలనీలోని లూథ్రా నివాసానికి వెళ్లారు. దాదాపు 40 నిమిషాలు వీరిద్దరూ పలు విషయాలపై చర్చించినట్లు తెలిసింది. ఏం చేసైనా సరే తనపై ఉన్న కేసులన్నీ త్వరితగతిన క్లోజ్ అయ్యేలా చూడాలని లూథ్రాను చంద్రబాబు కోరినట్లు విశ్వసనీయ సమచారం.
ఆ కేసులన్నీ మూసేద్దాం
2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు చేసిన దోపిడీని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆధారాలతో సహా నిగ్గు తేల్చిన విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం, అసైన్డ్ భూముల దోపిడీ, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ కుంభకోణం, ఫైబర్‌నెట్ కుంభకోణాల కుట్రదారు, లబ్ధిదారు చంద్రబాబే అనే విషయాన్ని సిట్ ఆధారాలతో సహా బట్టబయలు చేసింది.
నిబంధనలకు విరుద్ధమని చెప్పినా సరే సీఎం హెూదాలో చంద్రబాబు ఆదేశించడంతోనే అక్రమాలకు పాల్పడాల్సి వచ్చిందని ఉన్నతాధికారులు, ఇతరులు వాంగ్మూలాలు కూడా ఇచ్చారు. అక్రమ నిధులు హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి, టీడీపీ బ్యాంకు ఖాతాలకు చేరినట్టు ఆధారాలను సిట్ సేకరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ కేసుల నుంచి చంద్రబాబు పేరు తప్పించేందుకు కుట్ర పన్నుతోంది.
చంద్రబాబు అవినీతి కేసుల్లో గతంలో సిట్ సేకరించిన డాక్యుమెంటరీ ఆధారాలను తారుమారు చేసే విషయాలపై లూథ్రాతో చంద్రబాబు చర్చించినట్లు తెలిసింది. ఈ కేసులన్నింటి నుంచి త్వరితగతిన ఉపశమనం కలిగేలా మార్గాలను చూడాలని లూథ్రాను సీఎం కోరినట్లు సమాచారం. దేశంలో తానే సీనియర్ ముఖ్యమంత్రినని, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కక్షగట్టి తనని జైలుపాలు చేసిందని చంద్రబాబు అన్నట్లు తెలిసింది.
వైఎస్సార్సీపీ పదే పదే ఆ కేసులను ప్రస్తావించడం, ప్రజల్లోకి తీసికెళ్లడం వల్ల తనపై ప్రజల్లో నమ్మకం పోతుందని, అందుకే ఆ కేసుల నుంచి వీలైనంత త్వరగా ఉపశమనం కలిగేలా చూడాలని లూథ్రాను కోరినట్లు సమాచారం. గురువారం రాత్రి చంద్రబాబు ఢిల్లీలోని అధికార నివాసంలో బస చేశారు. శుక్రవారం ఉదయం విజయవాడకు వెళ్లనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment