ఏడేళ్లుగా పలు ప్రాంతాల్లో స్కెచ్ంగ్ ట్రిప్స్
విభిన్న రంగాల సిటిజనుల ‘కళ’యిక
వారాంతాల్లో వైవిధ్యభరిత ఆర్ట్ జర్నీ
300కు చేరిన ఈవెంట్లతో ఫుల్‌జోష్
నగరవ్యాప్తంగా అర్బన్ స్కెచ్చర్ల ఈవెంట్లు
లైవ్ స్కెచ్‌లతో జీవనశైలికి చిత్రరూపం
హబ్సిగూడలోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ శాస్త్రవేత్తలకు గత నవంబరు 9న ఓ వైవిధ్యభరిత అనుభవం ఎదురైంది.. తమ ప్రాంగణంలోకి వచి్చన కొందరు ఔత్సాహిక చిత్రకారులు తమ ల్యాబ్స్ సహా పరిసరాలను బొమ్మలుగా గీస్తుంటే ఆసక్తిగా గమనించడం అంతకు ముందెన్నడూ ఎరుగని అనుభూతి. ‘ఇది మా 298వ స్కెచ్ంగ్ ట్రిప్. శాస్త్రవేత్తల పని చూసినప్పుడు ఎంతో అబ్బురం అనిపించింది. ఆ పని, పరిసరాలు మా కళకు స్ఫూర్తిని అందించాయి’ అంటూ అర్బన్ స్కెచ్చర్స్ ప్రాంతీయ అడ్మిన్స్‌లో ఒకరైన సయ్యద్ జీషన్ అహమద్ చెప్పారు.
నగరాన్నే తమ కాన్వాస్‌గా మార్చుకుని వారాంతాల్లో లైవ్‌స్కెచ్ డ్రైవ్ నిర్వహిస్తున్న అర్బన్ స్కెచ్చర్స్ ఈ నెలలో 300వ మైలురాయిని చేరుకుంది. ఈ అరుదైన సందర్భాన్ని వీరు నెల రోజుల వేడుకగా మార్చారు. ‘ఒక రోజులో ఒకే ఈవెంట్ జరుపుకునే బదులు, నెల అంతటా నిర్వహించాలని అనుకున్నాం’ అని అర్బన్ స్కెచర్స్ సహ వ్యవస్థాపకుడు సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్ ఫరాజ్ ఫర్షోరి చెప్పారు.
స్కెచ్ వేద్దాం రా..
బొమ్మలు వేద్దాం రా.. అంటూ ఆహా్వనించే ఈ అర్బన్ స్కెచ్చర్స్ అనే గ్రూప్ అమెరికాలో గాబ్రియేల్ క్యాంపెనారియో అనే వ్యక్తి వాషింగ్టన్‌లో ప్రారంభించిన ఒక అంతర్జాతీయ వేదిక. నగరాల్లో తమకు నచి్చన ప్రదేశాన్ని ఎంచుకుని లైవ్ స్కెచ్ వేసే ఔత్సాహిక చిత్రకారుల నెలవు. నగరంలో ఈ గ్రూపు నవంబర్ 2017లో ట్యాంక్ బండ్‌లోని బోట్ క్లబ్‌ను స్కెచ్ చేయడంతో దాని మొదటి ఈవెంట్ నిర్వహించింది. అప్పటి నుంచి వివిధ ప్రదేశాల్లో వారానికో రెండు గంటల సెషన్ చొప్పున దాదాపు 30–60 మంది సభ్యులు నగర విశేషాలను కాగితంపై బంధిస్తున్నారు.
వీరంతా బొమ్మలు గీశాక వాటిని ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తారు. అలా వీరి అభిరుచి వివిధ రంగాలకు చెందిన వ్యక్తులను ఒకచోట చేర్చింది. ‘మాలో చాలా మంది ప్రొఫెషనల్స్ కాదు, దీనిని వారాంతపు అభిరుచిగా కొనసాగిస్తున్నవారు మాత్రమే’ అని ఫరాజ్ చెప్పారు. అర్బన్ స్కెచ్చర్స్‌కు చెందిన జీషన్ అహ్మద్ మాట్లాడుతూ.. ‘ఇషాక్, ఫరాజ్ ఫర్షోరీ ఆధ్వర్యంలో హైదరాబాద్ చాప్టర్ ఒక ఐదుగురు మాత్రమే హాజరైన చిన్న స్కెచ్ మీట్‌తో ప్రారంభమైంది, ఇప్పుడు 7–70 సంవత్సరాల వయసు గల ఎందరో సభ్యులకు విస్తరించింది’ అన్నారు. ‘ఇది కళ ద్వారా హైదరాబాద్ ఆత్మను సంగ్రహించే’ ప్రయత్నంగా ఫరాజ్ అభివరి్ణంచారు.
కళాత్మక అనుబంధం..
‘నా పరిసరాలను శ్రద్ధగా గమనించడానికి రికార్డ్ చేయడానికి ఇది గొప్ప మార్గం’ అన్నారు అమెరిగో ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ డీ హు. తాను 2021లో వాషింగ్టన్‌లో ఉన్నప్పుడు అర్బన్ స్కెచ్చర్స్‌లో చేరారు. ప్రస్తుతం నగరంలో నివసిస్తున్న డీ హు కేఫ్‌లు, డాక్టర్ అపాయింట్‌మెంట్‌లకు కూడా తన స్కెచ్‌బుక్ తీసుకెళతారు. తాను స్కెచ్ గీసిన ప్రతి ప్రదేశం తన జీవితంలో భాగమే. ఇది ఫొటో తీయడం కంటే గాఢంగా అనిపిస్తుంది’ అంటూ చెప్పారామె.
గత వారం అర్బన్ స్కెచ్చర్స్ వర్క్‌షాప్‌లో భాగమైన నరేష్ మాట్లాడుతూ, ‘నేను కళ ద్వారా ప్రపంచ సౌందర్యాన్ని కనుగొనాలని అనుకుంటున్నాను’ అని అన్నారు. ‘నాలాంటి ఆసక్తిగల కొత్త వ్యక్తులను కలవడం ద్వారా కొందరు స్నేహితులను సంపాదించుకున్నాను. ఇది నా దినచర్యకు భిన్నం.. ప్రశాంతతని అందించే కళాత్మక థెరపీలా అనిపిస్తుంది’ అన్నారు సుజిత. తన 12 ఏళ్ల కూతురితో ఈ ఈవెంట్‌కు హాజరైన మరో గృహిణి మాట్లాడుతూ.. ‘నా బిడ్డ కేవలం సోషల్ మీడియాతో మమేకం అయిపోవడం నాకు ఇష్టం లేదు. తను స్క్రీన్‌లకు మించిన జ్ఞాపకాలను పొందాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
ట్రిపుల్ సెంచురీ.. ఈవెంట్ల సందడి..
ఈ నెల తమ ఈవెంట్ల సంఖ్య 300కి చేరుకున్న సందర్భంగా వీరు మరింత తరచూ స్కెచి్చంగ్ ట్రిప్స్ ఏర్పాటు చేస్తున్నారు. గత ఆదివారం అబిడ్స్‌లో ఈ గ్లోబల్ కమ్యూనిటీ ఆఫ్ ఆరి్టస్ట్స్ సభ్యులు సండే బుక్ ఫెయిర్, తాజ్ మహల్ హోటల్, మొజామ్‌జాహి మార్కెట్‌లను స్కెచ్‌గా వేశారు. గత డిసెంబర్ 8న బంజారాహిల్స్‌లో జరిగిన స్కెచ్చింగ్ సెషన్‌లో లామకాన్, జీవీకే మాల్, సిటీ సెంటర్ షాపింగ్ ఏరియా కవర్ చేశారు. ఇక డిసెంబర్ 22లోపు.. ఓల్డ్ సిటీలో బారా గల్లి, హుస్సేనీ ఆలం, చారి్మనార్.. వీరి మెనూలో ఉన్నాయి.
ఎవరైనా సరే వెల్‌కమ్..
‘సమూహంలో చేరడానికి నైపుణ్యం స్థాయి ఏదీ అడ్డంకి కాదు. ప్రొఫెషనల్ ఆరి్టస్ట్ కానవసరం లేదు. అయితే ఇందులో పాల్గొనేవారు తమ సొంత స్టేషనరీని తీసుకురావాలని, ఎంచుకున్న ప్రదేశంలో కనిపించిన దేనినైనా సరే స్కెచ్‌గా గీయవచ్చు’ అని జీషన్ వివరించారు. వర్ధమాన చిత్రకారులు రాణించడంలో సహాయపడుతూ వాటర్ కలర్స్, స్కెచి్చంగ్, చార్క్‌కోల్ డ్రాయింగ్ వంటి ప్రాథమిక విషయాలపై ఉచిత వర్క్‌షాప్‌లను కూడా అర్బన్ స్కెచ్చర్స్ నిర్వహిస్తోంది. వారాంతాల్లో ఈ సెషన్‌లకు హాజరు కావాలనిఇ అనుకున్నవారు సోషల్ మీడియా పేజీల ద్వారా మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment