సుచరిత సుమధుర శ్రుతి | Six Indian companies on Forbes Asia 100 to watch list | Sakshi
Sakshi News home page

సుచరిత సుమధుర శ్రుతి

Published Fri, Sep 1 2023 3:55 AM | Last Updated on Fri, Sep 1 2023 6:32 AM

Six Indian companies on Forbes Asia 100 to watch list - Sakshi

‘కలైడోఫిన్‌’ కో–ఫౌండర్, సీయీవో సుచరిత, ‘అప్నా క్లబ్‌’ సీయీవో శృతి

విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువును మాత్రమే కాదు... సమాజాన్ని కూడా లోతుగా చదివే వారే ఎంటర్‌ప్రెన్యూర్‌లుగా గెలుపు జెండా ఎగరేయగలరని నిరూపించారు ‘కలైడోఫిన్‌’ కో–ఫౌండర్, సీయివో సుచరిత ముఖర్జీ, ‘అప్నాక్లబ్‌’ సీయీవో శ్రుతి. తాజాగా... ఫోర్బ్స్‌ ఆసియా ‘100 టు వాచ్‌’ వార్షిక జాబితాలో ఆరు భారతీయ కంపెనీలు చోటు చేసుకున్నాయి. వాటిలో ‘కలైడోఫిన్‌’‘అప్నాక్లబ్‌’లు ఉన్నాయి..

అయిదుగురు కుటుంబ సభ్యుల పోషణ బాధ్యతను తలకెత్తుకున్న  చెన్నైకి చెందిన రమణీ శేఖర్‌ దినసరి కూలీ. రోజుకు రెండు వందల రూపాయల వరకు సంపాదిస్తుంది. కంటిచూపు కోల్పోవడంతో భర్త ఇంటికే పరిమితం అయ్యాడు. కొడుకు, కూతురు కాస్తో కూస్తో చదువుకున్నారుగానీ ఏ ఉద్యోగమూ చేయడం లేదు. వీరితోపాటు తల్లి పోషణ భారం కూడా తనదే. 

ఒక విధంగా చెప్పాలంటే నెలాఖరుకు పైసా మిగలడం కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ‘కలైడోఫిన్‌’ పేరు మీద అయిదు వందల రూపాయలు పొదుపు చేయడం మానలేదు రమణి.
‘అత్యవసర పరిస్థితుల్లో వైద్య అవసరాల కోసం ఈ డబ్బును ఉపయోగిస్తాను’ అంటున్న రమణి కొంత డబ్బును సెల్ఫ్‌–హెల్ప్‌ గ్రూప్‌ సేవింగ్‌ స్కీమ్స్‌లో కూడా పెడుతుంది.

‘రమణిలాంటి ఎంతోమంది పేదవాళ్లకు కష్ట సమయంలో కలైడోఫిన్‌ అండగా ఉంది’ అంటుంది ఫిన్‌టెక్‌ కంపెనీ ‘కలైడోఫిన్‌’ కో–ఫొండర్, సీయీవో సుచరిత ముఖర్జీ.
దీర్ఘకాల, మధ్యకాల, స్వల్పకాల లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని ఉదాన్, లక్ష్య, ఉమ్మిద్‌ అనే ప్యాకేజ్‌లను లాంచ్‌ చేసింది కలైడోఫిన్‌.
‘కలైడోఫిన్‌’ ప్యాకేజిలలో ఒకటైన ‘లక్ష్య’ను పేద ప్రజల ఆరోగ్యం, చదువు, వివాహాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు నుంచి నాలుగు సంవత్సరాల కాలపరిమితితో రూపొందించారు. ఈ ప్యాకేజీలో మరణం లేదా అంగవైకల్యానికి బీమా ఉంటుంది.

‘తమ ఆర్థిక స్థాయిని బట్టి ఎవరైనా సరే వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసులతో యాక్సెస్‌ కావచ్చు’ అంటూ దిగువ మధ్యతరగతి, పేదవర్గాలకు భరోసాతో బయలుదేరింది కలైడోఫిన్‌. చెన్నై కేంద్రంగా ప్రారంభమైన ఈ ఫిన్‌టెక్‌ కంపెనీ అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందింది.

వ్యాపారవేత్తకు కేవలం వ్యాపార దృష్టి మాత్రమే కాదు సాధ్యసాధ్యాలకు సంబంధించి వినియోగదారుల దృష్టి నుంచి కూడా ఆలోచించాలి. ఈ విషయంలో తగిన అధ్యయనం చేసింది సుచరిత.
దిల్లీ యూనివర్శిటీలో ఎకనామిక్స్‌లో డిగ్రీ, ఐఐఎం, అహ్మదాబాద్‌లో ఎంబీఎ చేసిన సుచరిత ఐఎఫ్‌ఎంఆర్‌ ట్రస్ట్‌ గ్రూప్‌ కంపెనీలలో ఉన్నత హోదాలలో పనిచేసింది. ఆ తరువాత ‘కలైడోఫిన్‌’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా ప్రయాణం ప్రారంభించింది.
                                    
శ్రుతి తండ్రి ఐఏఎస్‌ అధికారి. అయినప్పటికీ ఆయనకు ఆడపిల్లల విషయంలో ‘అయ్యో!’లు తప్పలేదు. ‘పాపం ఆయనకు ముగ్గురూ ఆడపిల్లలే’ అని లేని బాధను కొని తెచ్చుకునేవారు చుట్టాలు, పక్కాలు. స్కూల్‌ నుంచి కాలేజీ రోజుల వరకు ఎన్నోసార్లు లింగవివక్షతను ఎదుర్కొంది శ్రుతి.

ఆత్మవిశ్వాసం ఉన్నా తప్పే లేకున్నా తప్పే అన్నట్లుగా ఉండేది పరిస్థితి. ఆత్మవిశ్వాసం ఉంటే ‘అంత వోవర్‌ కాన్ఫిడెన్సా?’ అని వెక్కిరింపు. లేకపోతే‘అంత ఆత్మన్యూనతా!’ అని చిన్నచూపు. ఇలాంటి పరిస్థితులను తట్టుకొని పెద్ద ప్రయాణమే చేయాల్సి వచ్చింది శ్రుతి. అయితే ఆ ప్రయాణంలో ఆమె ఎప్పుడూ ఆగిపోలేదు. ఐఐటీ–దిల్లీలో ఎం.టెక్‌. పూర్తిచేసిన
శ్రుతి ఉద్యోగం చేయాలనుకుంది. ఆ తరువాత ‘ఉద్యోగం చేయగలనా?’ అని కూడా అనుకుంది. దీనికి కారణం... తన స్వతంత్ర వ్యక్తిత్వం.

‘నీకు చాలా కోపం’ అనే మాట చాలాసార్లు విన్నది.‘ఆవేశంతో కనిపించే వాళ్లకు సాధించాలనే కసి ఎక్కువగా ఉంటుంది’ అనే మాట కూడా విన్నది. ‘అప్నాక్లబ్‌’ రూపంలో అది తన విషయంలో నిజమైంది. వ్యాపారంలో రాణించాలనుకున్న శ్రుతి హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌(హెచ్‌బీఎస్‌)లో ఎంబీఏ చేసింది. ఇండియాకు తిరిగి వచ్చిన తరువాత ‘సైర్‌’ పేరుతో ట్రావెల్‌ స్టార్టప్‌కు శ్రీకారం చుట్టింది. అయితే అది తనకు చేదు అనునుభవాన్ని నేర్పించడమే కాకుండా తియ్యటి పాఠాలు నేర్పింది.

చిన్న పట్టణాలకు చెందిన వాళ్లు ఎఫ్‌ఎంసీజీ(ఫాస్ట్‌–మూవింగ్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌) ప్రాడక్స్‌ కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారనే విషయం గ్రహించిన శ్రుతి ‘అప్నాక్లబ్‌’ పేరుతో ఎఫ్‌ఎంసీజీ హోల్‌సేల్‌ ప్లాట్‌ఫామ్‌ను మొదలు పెట్టింది. సెమీ–అర్బన్, గ్రామీణ ప్రాంతాల కస్టమర్‌ల నుంచి మంచి స్పందన వచ్చింది. ‘ఫరవాలేదు’ అనుకుంటున్న సమయంలో కంపెనీ వేగంగా దూసుకుపోవడం మొదలైంది. టైగర్‌ గ్లోబల్, ట్రూ స్కేల్‌ క్యాపిటల్, ఫ్లోరిష్‌ వెంచర్స్, వైట్‌బోర్డ్‌ క్యాపిటల్‌... బ్యాకర్స్‌గా ‘అప్నాక్లబ్‌’ శక్తిమంతంగా తయారైంది.

అంతర్జాతీయ స్థాయిలో మెరిసిపోతోంది. ‘నీకున్న ఆవేశానికి ఉద్యోగం చేయడం కష్టం. వ్యాపారం చేయడం అంత కంటే కష్టం’ అనే మాటను ఎన్నోసార్లు విన్నది శ్రుతి. ఇప్పుడు అలాంటి మాటలు ముఖం చాటేశాయి. ‘ఏదో సాధించాలనే గట్టి తపన, సంకల్పబలం ఉన్న మహిళ’ అనే ప్రశంసపూర్వకమైన మాటలు ‘అప్నాక్లబ్‌’ సీయీవో శ్రుతి గురించి తరచు వినిపిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement