అందరిదీ అదే దారి
-
ఇండస్ట్రియల్ ఏరియాలో ఎన్నో అక్రమాలు
-
వాణిజ్య భవనాల నిర్మాణాలకే మొగ్గు
-
ఎక్కువ మంది ఇదే తరహా పనులు
-
సహకారం అందించిన అధికారులు
సాక్షిప్రతినిధి, వరంగల్ : పరిశ్రమల స్థాపన పేరిట భూములు తీసుకోవడం, వెంటనే వాటిని మూసివేసి వాణిజ్య భవనాలు నిర్మించిన వ్యవహారం కలకలం రేపుతోంది. పరిశ్రమల స్థాపన, మనుగడ కోసం పనిచేయాల్సిన రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ అధికారులే... వీటిని మూసివేయించేందుకు సహకరించినట్లు స్పష్టమవుతోంది. పరిశ్రమల స్థాపన కోసం భూములు తీసుకుని వాణిజ్య భవనం నిర్మించిన విషయంలో హైకోర్టు జోక్యంతో పరిశ్రమల శాఖ ఇటీవల తీసుకున్న తాజా నిర్ణయం సంచలనం కలిగిస్తోంది. పరిశ్రమల కోసం తీసుకున్న భూముల్లో నిర్మించిన వాణిజ్య భవనాల అనుమతులను రద్దు చేయాలని పరిశ్రమల శాఖ, ఇటీవల తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్‌ఐఐసీ)ని ఆదేశించింది. దీంతో వరంగల్ నగరం ములుగురోడ్డులోని పారిశ్రామిక ప్రాంతంలోని వారిలో ఆందోళన మొదలైంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వాణిజ్య భవనాల అనుమతులను రద్దు చేయాలని పరిశ్రమల శాఖ ఆదేశించడంతో ఆ ప్రాంతంలోని వారికి ఇబ్బందికరంగా మారింది.
వరంగల్ నగరంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడు దశాబ్దాల క్రితం చర్యలు చేపట్టింది. పరిశ్రమలు స్థాపించేందుకు ఆసక్తి ఉన్న 130 మందికి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్‌ఐఐసీ) భూములను కేటాయించింది. ములుగు రోడ్డులో సుమారు 50 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశ్రమల కోసం ఇచ్చింది. భూములు తీసుకున్న ఔత్సాహికులు చిన్న, మధ్యతరహా పరిశ్రమలు స్థాపించారు. మరోవైపు వరంగల్ నగరం విస్తరించడం మొదలైంది. దశాబ్ద కాలంగా ఇది వేగంగా జరుగుతోంది.
భూములకు డిమాండ్ పెరుగుతుండడంతో ధరలు సైతం ఇదే స్థాయిలో ఎగబాకాయి. పరిశ్రమల స్థాపన కోసం భూములు తీసుకున్న వారికి అది అనువుగా కనిపించింది. పరిశ్రమలను బంద్ చేసి తమకు కేటాయించిన భూముల్లో... నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య సముదాయాలను స్థాపించారు. నెలవారీగా లక్షల రూపాయల వచ్చేలా ప్రముఖ సంస్థలకు అద్దెకు ఇచ్చారు. పరిశ్రమల కోసం స్థాపించిన భూములను ఇలా వాణిజ్య అవసరాల కోసం వినియోగించకూడదని నిబంధనలను ఉన్నా పరిశ్రమల శాఖ అధికారులు పట్టించుకోలేదు. దీంతో ప్రభుత్వ లక్ష్యం పూర్తిగా నీరుగారిపోయింది. హైకోర్టు జోక్యంతో ఇప్పుడు పరిశ్రమల శాఖ చర్యలకు సన్నద్ధమైంది.