సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిర్మల్ కొయ్యబొమ్మలు వంటి హస్తకళాకృతులు మినహా చెప్పుకోదగిన స్థాయిలో ఆధునిక పిల్లల ఆటవస్తువులు, బొమ్మల తయారీ యూనిట్లు లేవు. పిల్లల బొమ్మలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని తెలంగాణను టాయ్స్‌హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం సంకల్పించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 20 బొమ్మల తయారీ యూనిట్లు ఉన్నట్లు టీఎస్‌ఐఐసీ అంచనా.
ఈ నేపథ్యంలో బొమ్మల తయారీ రంగంలో ఉన్న అవకాశాలను మరింతగా ఉపయోగించుకోవాలని సర్కారు భావిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్‌లో బొమ్మల తయారీ యూనిట్ల ఏర్పాటుకు వీలుగా ‘టాయ్స్ పార్క్’ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే దండుమల్కాపూర్‌లో తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టిఫ్) ఏర్పాటు చేసిన ఎంఎస్‌ఎంఈ పార్కు కార్యకలాపాలు ప్రారంభించింది.
ఇతర పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా ప్రభుత్వం మరో రెండు వేల ఎకరాలను సేకరించి మౌలిక వసతులపై దృష్టి సారించింది. ఇక్కడే టాయ్స్ పార్కు కోసం డిమాండ్‌ను బట్టి 70 నుంచి 100 ఎకరాల వరకు కేటాయించేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇందులో బొమ్మల మ్యూజియం, కామన్ ఫెసిలిటీ సెంటర్, చిల్డ్రన్ అమ్యూజ్‌మెంట్ పార్కు తదితరాలను ఏర్పాటు చేస్తారు.
ఏటా 10–15 శాతం పెరుగుదల
పిల్లలకు వినోదంతోపాటు విజ్ఞానం పంచే ఆట వస్తువులు, బొమ్మల తయారీ పరిశ్రమ దేశంలో శైశవ దశలో ఉంది. అయితే ఆటబొమ్మలకు ఏటా భారత్‌లో 10 నుంచి 15శాతం డిమాండ్ పెరుగుతోంది. భారత్‌లో చిన్నారులు ఉపయోగించే ఆట వస్తువులు, బొమ్మల్లో 80శాతం చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. వీటిలో ఎక్కువగా ప్లాస్టిక్, విషపూరిత రసాయనాలతో తయారైనవే ఉంటుండటంతో కొన్ని రకాల బొమ్మలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది.
దీంతో పెరుగుతున్న డిమాండ్‌ను దేశంలోని తయారీ యూనిట్లు తట్టుకోలేకపోతున్నాయి. గ్రేటర్ నోయిడా, ఢిల్లీ, ముంబైలో మాత్రమే ఈ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. భారత్‌లో పిల్లల బొమ్మల వాణిజ్యం విలువ రూ.12వేల కోట్లు ఉన్నట్లు అంచనా.
అన్ని వసతులు హైదరాబాద్‌లోనే
పిల్లల ఆట వస్తువులు, బొమ్మల తయారీ యూనిట్లు స్థానికంగా లేకపోవడంతో ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. బొమ్మల తయారీ పరిశ్రమను ప్రోత్సహిస్తే దక్షిణాది రాష్ట్రాల మార్కెట్ అవసరాలకు సరిపడా ఇక్కడే ఉత్పత్తి చేయొచ్చు. తెలంగాణలో తయారీ యూనిట్ల ఏర్పాటుకు దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ఉత్పత్తిదారులు ఆసక్తి చూపుతున్నారు. ఎలక్ట్రానిక్ ఆట బొమ్మలు, సాఫ్ట్ టాయ్స్ పరిశ్రమకు హైదరాబాద్ హబ్‌గా మారేందుకు అవసరమైన అన్ని వసతులు దండుమల్కాపూర్‌లో అందుబాటులోకి వస్తాయి.
– ఆకారం జనార్దన్ గుప్తా, అధ్యక్షుడు, టాయ్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ
తయారీదారులను ఏకతాటిపైకి తెస్తున్నాం
దండుమల్కాపూర్‌లో ఏర్పాటు చేసే టాయ్స్ పార్క్ ప్రత్యేకతలు, అందుబాటులో ఉండే మౌలిక వసతులు, బొమ్మల తయారీ, మార్కెటింగ్‌కు తెలంగాణలో ఉన్న అవకాశాలపై ప్రచార వీడియోను రూపొందిస్తున్నాం. ఇటీవల రాష్ట్రంలో బొమ్మల తయారీదారులు, పంపిణీదారులతో సమావేశం ఏర్పాటు చేశాం.
ఇక్కడి వసతులపై విస్తృత ప్రచారం కల్పిస్తున్నాం. బొమ్మల తయారీదారులను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సాఫ్ట్, ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్, కొయ్య బొమ్మల వంటి హస్తకళాకృతుల తయారీదారుల నుంచి యూనిట్ ఏర్పాటుపై ఆసక్తి వ్యక్తీకరణ కోరుతున్నాం.
–శ్రీహా రెడ్డి, నోడల్ ఆఫీసర్, తెలంగాణ టాయ్స్ విభాగం
Comments
Please login to add a commentAdd a comment