
మొబైల్ పాలసీకి పచ్చజెండా
రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ‘మొబైల్ పాలసీ’ని ప్రకటించింది...
- టీఎస్‌ఐఐసీ ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం
- మైక్రోమాక్స్‌కు 18.66 ఎకరాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ‘మొబైల్ పాలసీ’ని ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మొబైల్ పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలపై టి-స్విప్ట్ బోర్డు (పెట్టుబడుల ఆహ్వాన సంస్థ) ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. మౌలిక సౌకర్యాల కల్పనకయ్యే వ్యయంతో సంబంధం లేకుండా టీఎస్‌ఐఐసీ సేకరించిన ధరకే మొబైల్ తయారీ పరిశ్రమలకు భూమిని కేటాయిస్తారు. అనుబంధ పరిశ్రమలతోసహా రూ.10 కోట్లకు మించకుండా పెట్టుబడిలో 20 శాతం సబ్సిడీ ఇస్తారు. ఈ నూతన విధానం ప్రకారం పెట్టుబడిలో సగం మొత్తానికి ఐదేళ్లలో 5.25 శాతం వార్షిక వడ్డీ కోటి రూపాయలకు మించకుండా ఉండాలి.
వంద శాతం స్టాంపు డ్యూటీని పరిశ్రమలకు తిరిగి చెల్లించడం, ఉత్పత్తులపై 5 శాతం వ్యాట్ విధింపు, సీఎస్‌టీని (కేంద్ర అమ్మకపు పన్ను) 2 శాతం తగ్గించడం వంటి అంశాలను నూతన మొబైల్ పాలసీలో పేర్కొన్నారు. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ(టీఎస్‌ఈఆర్‌సీ) నిర్ణయించిన ధరలకు అనుగుణంగా మొబైల్ తయారీ పరిశ్రమలకు 25 శాతం లేదా గరిష్టంగా రూ.30 లక్షలకు మించకుండా రాయితీ, నిరంతరాయంగా విద్యుత్ ఇస్తారు. నియామకాల్లో 80 శాతం ఉద్యోగ అవకాశాలు స్థానికులకు ఇవ్వాలనే షరతు విధించారు. రాయితీలు పొందాలంటే ఉత్పత్తి ప్రారంభించిన మొదటి రెండేళ్లలో కనీసం వేయి మందికి ఉపాధి కల్పించాల్సి ఉంటుంది.
మైక్రోమాక్స్‌కు తాయిలాలు
రాష్ట్రంలో తొలిసారిగా మొబైల్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చిన మైక్రోమాక్స్ సంస్థకు మొబైల్ పాలసీ నిబంధనలకు లోబడి రాయితీలు, ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తొలి దశలో రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో రూ.80 కోట్ల పెట్టుబడితో 1,250 మందికి ఉపాధి కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మైక్రోమాక్స్ సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించింది. ఈ ప్రతిపాదనను పరిశీలించిన రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పన సంస్థ(టీఎస్‌ఐఐసీ) రాయితీలు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి సిఫారసు చేసింది. రావిర్యాలలో ఎకరానికి రూ.30 లక్షల చొప్పున 18.66 ఎకరాలు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.