సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక జహీరాబాద్ నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ జోన్ (నిమ్జ్) ప్రాజెక్టు నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. ఈ మెగా పారిశ్రామికవాడ నిర్మాణంలో అనుసరించాల్సిన నియమ నిబంధనల (టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్)కు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ఎక్స్‌పర్ట్స్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) ఆమోదం తెలిపింది. తొలి దశ పర్యావరణ అనుమతులుగా భావించే ‘టీఓఆర్’కు ఆమోదం లభించడంతో.. తుది అనుమతులు కోరేందుకు మార్గం సుగమమమైంది.
నిమ్జ్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం బహిరంగ విచారణ జరిపి తుది దశ అనుమతుల కోసం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసుకోనుంది. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా న్యాల్కల్, ఝరాసంఘం మండలాల్లో 12,635 ఎకరాల భారీ విస్తీర్ణంలో నిమ్జ్‌ను ప్రభుత్వం నిర్మిస్తోంది. ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2.44 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. రూ.37,740 కోట్ల పెట్టుబడులతో వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలు ఈ పారిశ్రామికవాడలో ఏర్పాటవనున్నాయి. 2040 సంవత్సరం నాటికి రూ.96,778 కోట్లు విలువ చేసే ఉత్పత్తులు జరగనున్నాయి.
2030 నాటికి పూర్తి..
నిమ్జ్ నిర్మాణానికి రూ.4,500 కోట్ల అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. సైట్ అభివృద్ధి, అంతర్గత రోడ్లు, నీరు, విద్యుత్ సరఫరా, వరద, మురుగు నీటి కాల్వలు, భవనాలు, వీధి దీపాలు, పచ్చదనం అభివృద్ధికి ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. ప్రాజెక్టుకు వెలుపల మౌలిక సదుపాయాల కోసం మరో రూ.6,100 కోట్ల వ్యయం కానుంది. 2020 నాటికి ప్రాజెక్టు తొలి దశ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని, 2030 నాటికి మొత్తం పూర్తవుతుందని ప్రభుత్వం పేర్కొంటోంది. నిమ్జ్ పరిధిలో 17 గ్రామాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. 12,635 ఎకరాలకు గాను 2,884 ఎకరాలు టీఎస్‌ఐఐసీ ఇప్పటికే సేకరించింది.
హైదరాబాద్ నుంచి 65 కి.మీ.
పరిశ్రమల స్థాపన, పెట్టుబడులు ఆకర్షించేందుకు నిమ్జ్ ప్రతిపాదిత ప్రాంతం అనుకూలమని ప్రభుత్వం చెబుతోంది. ప్రాజెక్టు సమీపంలో ఇప్పటికే మహీంద్ర, ఎంఆర్‌ఎఫ్ టైర్స్, అరబిందో ఫార్మా, స్పార్శ్ ఫార్మా, కావేరీ ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్, బీహెచ్‌ఈఎల్, ఆర్డాన్స్ ఫ్యాక్టరీ మెదక్, భారత్ డైనమిక్స్(బీడీఎల్), ట్రైడెంట్ షుగర్స్ లాంటి మెగా పరిశ్రమలున్నాయంది. హైదరాబాద్ నుంచి 65 కి.మీ., ఓఆర్‌ఆర్ నుంచి 50 కి.మీ, దూరంలోని ఈ ప్రాజెక్టుకు రహదారులు, విమానాశ్రయం, రైల్వే స్టేషన్, సీ పోర్టు (కృష్ణపట్నం, జవహర్‌లాల్ పోర్ట్ ట్రస్ట్) సదుపాయాలతో పాటు నీరు, విద్యుత్ సదుపాయాలున్నాయని పేర్కొంది. కాగా, నిమ్జ్‌లో ప్రధానంగా ఎలక్ట్రిక్ పరికరాలు, ఫుడ్ అండ్ ఆగ్రో ప్రాసెసింగ్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ట్రాన్స్‌పోర్ట్ ఎక్విప్‌మెంట్ రంగాల పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి.
జోన్ల వారీగా ప్రాజెక్టు అభివృద్ధి ఇలా..
జోన్ స్థలం (ఎకరాల్లో)
ఉత్పత్తి పరిశ్రమలు 7,107
సాంకేతిక సదుపాయాలు 550
మౌలిక వసతులు 883
గృహ నిర్మాణం 638
లాజిస్టిక్స్ 899
పచ్చదనం 1,603
రహదారులు 955
మొత్తం 12,635
నోట్: కామన్ ఫోల్డర్‌లో నీమ్జ్ జహీరాబాద్ పేరుతో ప్రాజెక్టు సైట్ మ్యాప్ ఫోటోలు ఉన్నాయి. పరిశీలించగలరు.
12,635 - ఎకరాల్లో మెగా పారిశ్రామిక వాడ నిర్మాణం
4,500 - కోట్లు అంచనా వ్యయం
6,100- కోట్లు ప్రాజెక్టు వెలుపల మౌలిక వసతులకు..
2,40,000- మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి
Comments
Please login to add a commentAdd a comment