NIMZ
-
నిమ్జ్ నిర్వాసితులపై లాఠీ
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి/ఝరాసంగం: తమ భూములకు పరిహారం చెల్లించే వరకు, రైతు కూలీలకు న్యాయం చేసేవరకు నిమ్జ్ (జాతీయ పెట్టుబడులు ఉత్పాదక మండలి)లో నిర్మాణాలు చేపట్టవద్దంటూ నిర్వాసితులు బుధవారం చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మామిడిగిలో నిర్వహించిన ర్యాలీని మంగళవారం రాత్రి నుంచే మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో జరిగిన వాగ్వాదం తోపులాటకు దారితీయడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఇదే గ్రామానికి చెందిన పద్మమ్మ అనే మహిళ ముఖానికి గాయం కావడంతో స్పృహ కోల్పోయింది. దీంతో పోలీసులు ఆమెను జహీరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. పదుల సంఖ్యలో నిర్వాసితులను అదుపులోకి తీసుకొని చిరాగ్పల్లి పీఎస్‌కు తరలించారు. లాఠీచార్జిపై మండిపడ్డ కొందరు ఆందోళనకారులు పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వారు. నిమ్జ్ గోబ్యాక్ .. సేవ్ ఫార్మర్ ఝరాసంఘం మండలం చీలపల్లి వద్ద నిమ్జ్‌లో వెమ్ టెక్నాలజీస్‌కు ప్రభుత్వం 512 ఎకరాల భూమిని కేటాయించింది. ఆ స్థలంలో సమీకృత రక్షణ వ్యవస్థ పరిశ్రమ నిర్మాణానికి సంస్థ భూమి పూజ నిర్వహించింది. ఈ నేపథ్యంలో నిర్వాసితులు ‘గోబ్యాక్ నిమ్జ్.. సేవ్ ఫార్మర్, జై జవాన్.. జై కిసాన్, సారవంతమైన భూములు లాక్కోవద్దు’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. 2013 చట్టం ప్రకారం పరిహారమివ్వాలి నిమ్జ్ కోసం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లోని 17 గ్రామాల పరిధిలో మొత్తం 12,635 ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తొలి విడతలో 3,100 ఎకరాలను సేకరించింది. అయితే ప్రభుత్వం నామమాత్రంగా పరిహారం చెల్లించిందని.. తమకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. -
నిమ్జ్‌కు పర్యావరణ అనుమతులు!
సాక్షి, హైదరాబాద్: జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి (నిమ్జ్) ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ పర్యావరణ అనుమతులు ఇవ్వాలని నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. గత నెల 24, 25 తేదీల్లో సమావేశమైన ఈఏసీ నిమ్జ్ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించింది. పర్యావరణ అనుమతుల జారీలో పలు షరతులు విధిస్తూ సమావేశానికి సంబంధించిన మినిట్స్‌ను కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తాజాగా వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. ఈఏసీ సూచనలను పరిగణనలోకి తీసుకుంటూ త్వరలో కేంద్ర పర్యావరణ శాఖ త్వరలో నిమ్జ్‌కు పర్యావరణ అనుమతులు ఇస్తూ ఆదేశాలు జారీచేస్తుంది. రెడ్ కేటగిరీ పరిశ్రమలన్నీ ఒకేచోట ఏర్పాటు చేయడం, పారిశ్రామిక వాడలు జనావాసాలకు నడుమ 500–700 మీటర్ల దూరం పాటించడం వంటి నిబంధనలు పాటించాలని ఈఏసీ సూచించింది. నిమ్జ్ సరిహద్దు వెంట గ్రీన్‌బెల్ట్ ఏర్పాటు, పర్యావరణ నిర్వహణ ప్రణాళిక అమలు, కాలుష్య జలాల శుద్దీకరణ, ప్రాజెక్టు విస్తీర్ణంలో 33 శాతం గ్రీన్‌బెల్ట్ వంటి నిబంధనలు పాటించాలని పేర్కొంది. ముంగి, చీలపల్లి తండాలను ప్రాజెక్టు పరిధి నుంచి మినహాయించాలని స్పష్టం చేసింది. భూ సేకరణే అసలు సవాలు... రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని వేగవంతం చేసేందుకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఝరాసంగం, న్యాలకల్ మండలాల్లోని 17 గ్రామాల్లో భారీ పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. 2016లో ఈ పారిశ్రామిక వాడకు కేంద్రం నిమ్జ్ హోదా కల్పించింది. నిమ్జ్ ఏర్పాటుకు 12,635 ఎకరాలు అవసరం కాగా, భూ సేకరణకు రూ.2450 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. తొలి విడతలో 3,501 ఎకరాలను సేకరిం చాల్సి ఉండగా, 2,925 ఎకరాల సేకరణ పూర్తయింది. మరో రెండు విడతల్లో 9వేల ఎకరాలకు పైగా సేకరించాల్సి ఉండగా, రెండో విడత భూ సేకరణకు నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ప్రస్తుతం భూ ముల ధరలు భారీగా పెరగడంతో ప్రభుత్వం ఇచ్చే పరిహారం తమకు సరిపోదని ఆందోళనకు దిగుతున్నారు. దీంతో భూ సేకరణ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఇదిలాఉంటే 2022–23 బడ్జెట్లో నిమ్జ్ భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్లు మాత్రమే కేటాయించడం గమనార్హం. మౌలిక వసతులకు నిధులేవీ? నిమ్జ్‌కు తొలి విడతలో సేకరించిన భూమిని మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన అభివృద్ధి సంస్థ (టీఎస్ఐఐసీ)కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. మౌలిక వసతుల కల్పనకు రూ.13వేల కోట్లు అవసరమని అంచనా వేయగా, తొలిదశలో కనీసం రూ.2వేల కోట్లు ఇవ్వాలని పరిశ్రమల మంత్రి కేటీఆర్ పలుమార్లు కేంద్రానికి లేఖ రాశారు. అయితే కేంద్రం కేవలం రూ.3 కోట్లు మాత్రమే ఇచ్చింది. నిమ్జ్‌లో ఏర్పాటయ్యే పరిశ్రమలు ఎలక్ట్రికల్ మెషినరీ, మెటల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, నాన్ మెటాలిక్ మినరల్స్, ఆటోమొబైల్స్, ట్రాన్స్పోర్ట్ ఎక్విప్మెంట్ పెట్టుబడులు అంచనా: రూ.60వేల కోట్లు ఉద్యోగ అవకాశాలు: 2.77 లక్షలు -
ఈవీ రంగంలో రూ.2,100 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహన(ఈవీ)రంగంలో ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ కంపెనీలకు పోటీనిస్తున్న ‘ట్రైటాన్– ఈవీ’ రాష్ట్రంలో భారీ పెట్టుబడిని పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. రూ.2,100 కోట్ల పెట్టుబడితో జహీరాబాద్‌లోని జాతీయ పారిశ్రామిక పెట్టుబడులు, ఉత్పత్తుల మండలి (నిమ్జ్) తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటిం చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సమక్షంలో ‘ట్రైటాన్ ఈవీ’గురువారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ తయారీ యూనిట్ ద్వారా రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి జరుగుతుంది. కంపెనీ ప్రణాళిక ప్రకారం తొలి ఐదేళ్లలో 50వేలకు పైగా సెడాన్లు, లగ్జరీ కార్లు, ఇతర ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. భారీ పెట్టుబడితో ఏర్పాటయ్యే ట్రైటాన్ ఈవీ ద్వారా 25 వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. తమ తయారీ ప్లాంటును భారత్‌లో ఏర్పాటు చేసేందుకు వివిధ రాష్ట్రాలను పరిశీలించిన తర్వాత తెలంగాణకు ఉన్న సానుకూలతలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ నుంచే కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించినట్లు సంస్థ సీఈఓ హిమాన్షు పటేల్ వెల్లడించారు. కంపెనీ పెట్టుబడికి సంబంధించిన వివరాలను ఆయన కేటీఆర్‌కు అందించారు. పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానం: మంత్రి కేటీఆర్ ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) రంగంలో పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం ఆకర్షణీయ గమ్యస్థానంగా మారుతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్‌లో భాగంగా ట్రైటాన్ ఈవీకి ప్రభుత్వపరంగా మెగా ప్రాజెక్టుకు లభించే ప్రయోజనాలన్నీ అందిస్తామని సంస్థ ప్రతినిధులకు కేటీఆర్ హామీనిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఈవీ పాలసీ దేశంలోనే అత్యుత్తమైనదిగా ప్రశంసలు అందుకుంటోందని, ఈ రంగంలో పేరొందిన పలు కంపెనీలు తెలంగాణలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నాయని కేటీఆర్ చెప్పారు. కార్యక్రమంలో ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ట్రైటాన్ ఈవీ ఇండియా డెవలప్మెంట్ హెడ్ మహమ్మద్ మన్సూర్ తదితరులు పాల్గొన్నారు. Delighted to announce that Triton EV - a leading US based Electric Vehicle company will be investing ₹ 2,100 Crores to establish an ultra-modern EV manufacturing unit at NIMZ, Zaheerabad in Sangareddy district An MoU is signed between Triton EV & Govt of Telangana today pic.twitter.com/HeHG6wHdw3 — KTR (@KTRTRS) June 24, 2021 చదవండి : ఎలక్ట్రిక్ వాహన విప్లవం రాబోతుంది: భవిష్ అగర్వాల్ -
నిధులిస్తేనే మందికి ఉపాధి అవకాశాలు
సాక్షి, హైదరాబాద్ : అవి పేరున్న వివిధ రంగాల పెద్ద ప్రాజెక్టులు.. అందులో ఏ ఒక్కటి పూర్తయినా ఎంతో మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది.. కావాల్సిందల్లా నిధుల సాయమే.. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన వివిధ ప్రాజెక్టులను నిధుల కొరత వెంటాడుతోంది.. కేంద్రం కనుక వచ్చే బడ్జెట్లో నిధులను కేటాయిస్తే అవి గట్టెక్కుతాయి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ వ్యాప్తంగా సుమారు 28 వేల ఎకరాల విస్తీర్ణంలో 147 పారిశ్రామిక వాడలు ఏర్పాటయ్యాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నూతన పారిశ్రామిక విధానం(టీఎస్ఐపాస్)లో భాగంగా 14 రంగాలకు సంబంధించి పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 59 పారిశ్రామిక పార్కుల ఏర్పాటు కోసం ఇప్పటివరకు 49 వేల ఎకరాలను గుర్తించగా, సుమారు 39 వేల ఎకరాల భూసేకరణ ప్రక్రియ పూర్తయింది. మౌలిక సదుపాయాలు కల్పించేందుకు టీఎస్ఐఐసీ ఇప్పటివరకు సుమారు రూ.2 వేల కోట్లు ఖర్చు చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ ఫార్మా సిటీ, నిమ్జ్ (జహీరాబాద్), కాకతీయ టెక్స్టైల్ పార్కులో మౌలిక వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం సాయాన్ని కోరుతోంది. ఈ ఏడాది వీటిలో మౌలిక వసతుల కల్పన పూర్తయితే వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు దక్కుతాయి. హైదరాబాద్ ఫార్మా సిటీ.. ప్రపంచంలోనే అతిపెద్ద సింగి ల్ ఫార్మా క్లస్టర్ ‘హైదరాబాద్ ఫార్మా సిటీ’ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణ యించింది. 19,333 ఎకరాల్లో ఏర్పాటయ్యే ఫార్మాసిటీ ప్రా జెక్టు వ్యయం రూ.28,700 కోట్లుగా అంచనా వేశారు. జీరో లిక్విడ్ డిశ్చార్జి, కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్, ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లాజిస్టిక్ పార్క్, గ్లోబల్ ఫార్మా యూనివర్సిటీ, కామన్ డ్రగ్ డెవలప్మెంట్, టెస్టింగ్ లేబొరే టరీ, స్టార్టప్‌ల కోసం ప్రత్యేక హబ్ తదితరాలను ఫార్మాసిటీ ప్రణాళికలో చేర్చారు. దీనికి కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణి జ్య శాఖ జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి (నిమ్జ్) హోదాను ఇచ్చింది. ఫార్మాసిటీని శ్రీశైలం ప్రధాన రహదారితో అనుసంధానం చేస్తూ వంద ఫీట్ల రోడ్డును నిర్మించారు. ఫార్మా సిటీలో అంతర్గత మౌలిక సదుపాయాల కోసం రూ.4,992 కోట్లను ఆశిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్లో కనీసం రూ.870 కోట్లు కేటాయించాలని కేంద్రాన్ని కోరుతోంది. ఇప్పటికే ఫార్మా రంగానికి చిరునామాగా ఉన్న తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ ఫార్మాసిటీ పూర్తయితే ఔషధ తయారీలో ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుతుంది. జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి (నిమ్జ్) భవన నిర్మాణాలు, సాగునీటి ప్రాజెక్టు లు, మైనింగ్ తదితర రంగాల్లో మౌలిక వసతుల పనుల కోసం ఉపయోగించే యంత్రాల తయారీకి దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక పారిశ్రామిక పార్కు తెలంగాణలో ఏర్పాటు కానున్నది. ఒరిజినల్ ఎక్విప్మెంట్ మేకర్స్ (ఓఈఎం) ఈ పార్కులో తమ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిసరాల్లో ఏర్పాటయ్యే పారిశ్రామిక పార్కుకు నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యా క్చరింగ్ జోన్ (నిమ్జ్) హోదాను 2016 జనవరి 7న కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. 12,635 ఎకరాల్లో ఏర్పాటయ్యే నిమ్జ్‌కు రూ.13,300 కోట్లు ప్రాజెక్టు అంచనా వ్యయం కాగా, రూ.60 వేల కోట్ల పెట్టుబడులు, 2.77 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. ఈ పార్కులో మౌలిక వసతుల కోసం తొలి దశలో రూ.500 కోట్లు ఇవ్వాలని రాష్ట్రం కేంద్రాన్ని కోరుతోంది. మౌలిక వసతుల కల్పన జరిగితే పరిశ్రమల స్థాపన ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశముంటుంది. నేషనల్ డిజైన్ సెంటర్.. కేంద్ర వాణిజ్య శాఖకు అనుబంధంగా ఉండే పారిశ్రామిక ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగంగా రాష్ట్రంలో నేషనల్ డిజైన్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతోంది. నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన సవివర నివేదిక (డీపీఆర్) ను కూడా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆవరణలో 30 ఎకరాల స్థలాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. దేశంలో డిజైనింగ్ పరిశ్రమ సుమారు రూ.19 వేల కోట్లకు చేరుకుంటుందనే అంచనాతో ఈ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు సాగిస్తోంది. సెంటర్ ఏర్పాటు కోసం రూ.200 కోట్ల ప్రాథమిక మూలధనం అవసరమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. నేషనల్ డిజైన్ సెంటర్.. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ఉపాధి వేటలో పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన నేత కార్మికులను తిరిగి స్వస్థలాలకు రప్పించి ఉపాధి కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ రూరల్ జిల్లాలో సుమారు 2 వేల ఎకరాల్లో ‘కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు’ను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటివరకు 1,190 ఎకరాలను టెక్స్టైల్ పార్కు కోసం సేకరించారు. ఐఎల్ఎఫ్ఎస్ అనే సంస్థను ప్రాజెక్టు అభివృద్ధి కోసం కన్సల్టెంట్‌గా నియమించారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,150.47 కోట్లు కాగా, రూ.11,546 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేశారు. పూర్తిస్థాయిలో పెట్టుబడులొస్తే 1.13 లక్షల మందికి ఉపాధి దక్కే అవకాశముంది. పార్కులో మౌలిక వసతులకు అవసరమయ్యే వ్యయంలో సుమారు రూ.500 కోట్ల మేర కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన ‘మెగా టెక్స్టైల్ పార్కు పథకం’కింద అందించే అవకాశముంది. ఇందులో కనీసం రూ.300 కోట్లు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో మౌలిక సదుపాయాల కోసం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. 10 వేల మందికి ఉపాధి కల్పించేందుకు రూ.700 కోట్లు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో పెట్టుబడులకు యంగ్వన్ అనే కొరియా కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. మెగా టెక్స్టైల్ పార్కు పట్టాలెక్కితే పొరుగు రాష్ట్రాలకు ఉపాధి వేటకు వెళ్లిన నేత కార్మికులు తిరిగి వచ్చే అవకాశముంది. మెడికల్ డివైజెస్ పార్కు వైద్య పరికరాల తయారీ కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలోనే తొలిసారిగా సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ డివైజెస్ పార్క్‌ను ఏర్పాటుచేసింది. 250 ఎకరాల్లో ఇప్పటికే మౌలిక వసతుల కల్పన పనులు పూర్తి కాగా, రెండో దశ పనులు కూడా పురోగతిలో ఉన్నాయి. సుమారు రూ.వేయి కోట్ల పెట్టుబడితో 4 వేల మందికి ఉపాధి దక్కుతుందని అంచనా. ఎంఎస్టీ, విర్చో, ప్రోమియో, ప్లస్ ఆక్టివ్ స్టేషన్ వంటి సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. అయితే అనుమతులు పొందిన పరిశ్రమల్లో చాలా వరకు ఇంకా పనులు ప్రారంభించలేదు. ఇండస్ట్రియల్ కారిడార్లకు ప్రాధాన్యత.. రాష్ట్రం మీదుగా వెళ్తున్న ముఖ్యమైన జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట ఉన్న వనరులు, అవకాశాలను జోడించి పారిశ్రామిక అభివృద్ధి సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2014 నాటి నూతన పారిశ్రామిక విధానం టీఎస్‌ఐపాస్‌లో 6 ఇండస్ట్రియల్ కారిడార్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. వీటిలో ఇండస్ట్రియల్ క్లస్టర్లు ఏర్పాటు చేయడం ద్వారా పెట్టుబడులు ఆకర్షించి, జిల్లాల్లోనూ ఉపాధి అవకాశాలు పెంచాలనే ప్రభుత్వ ఉద్దేశం. టీఎస్‌ఐపాస్‌లో భాగంగా హైదరాబాద్–వరంగల్, హైదరాబాద్–నాగ్‌పూర్, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–మంచిర్యాల, హైదరాబాద్ నల్లగొండ, హైదరాబాద్–ఖమ్మం ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. తొలి దశలో హైదరాబాద్–వరంగల్, హైదరాబాద్–నాగ్‌పూర్, హైదరాబాద్–బెంగళూరు కారిడార్లు, రెండో దశలో మరో మూడు కారిడార్ల అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ‘హైదరాబాద్–వరంగల్’ కారిడార్‌కు రూ.3 వేల కోట్లు, ‘హైదరాబాద్–నాగ్‌పూర్’ కారిడార్‌కు రూ.2 వేల కోట్లు మొత్తంగా 2021–22 కేంద్ర బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేంద్రం నుంచి ఆశిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్‌ప్లాన్‌పై కసరత్తు చేస్తోంది. -
నిమ్జ్ భూ సేకరణ చేయొద్దు
సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో జాతీయ పెట్టుబడులు, మౌలిక వనరుల ప్రాజెక్టు (నిమ్జ్) కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణ ప్రక్రియను నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నిమ్జ్ కోసం 12,635 ఎకరాలను సేకరించేందుకు శుక్రవారం జరగబోయే ప్రజాభిప్రాయ సేకరణను ఆపాలని గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. భూ సేకరణకు కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన నోటిఫికేషన్‌ను నయాల్కల్ గ్రామానికి చెందిన ఎం.రాజిరెడ్డి, మరో నలుగురు హైకోర్టులో సవాల్ చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో గ్రామసభ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేయకూడదని పిటిషనర్ న్యాయవాది అర్జున్‌కుమార్ వాదించారు. రూ.4వేల కోట్లతో ఏర్పాటు చేసే నిమ్జ్ వల్ల 10వేల మందిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రతికూల ప్రభావం పడనుందని తెలిపారు. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చేయకూడదని, కేంద్రం మార్గదర్శకాలు ఇచ్చిన తర్వాతే చేయాలని హైకోర్టు పేర్కొంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నందున ప్రజాభిప్రాయ సేకరణ చేయడం వల్ల తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపింది. సంగారెడ్డిలో కూడా పాజిటివ్ కేసులున్నాయని చెప్పింది. నిమ్జ్ ప్రాజెక్టు వల్ల 2.44 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ఏజీ బీఎస్ ప్రసాద్ తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం, కేంద్రం మార్గదర్శకాలు జారీ వరకు ప్రజాభిప్రాయ సేకరణ చేయవద్దంటూ రిట్‌పై విచారణను ముగించింది. -
నత్తనడకన ‘నిమ్జ్’ భూసేకరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని వేగవంతం చేసేందుకు జాతీయ పెట్టుబడులు, ఉత్పత్తుల మండలి ‘నిమ్జ్’ ఏర్పాటుకోసం రాష్ట్రం ప్రభుత్వం చేస్తోన్న భూసేకరణ యత్నాలు ముందుకు సాగడంలేదు. మూడేళ్ల క్రితం ఈ నిమ్జ్ ఏర్పాటుకు 50 చదరపు కిలోమీటర్ల పరిధిలో కచ్చితంగా ఐదువేల హెక్టార్లు (సుమారు 12,500 ఎకరాలు) సేకరించాలని కేంద్రం నిర్దేశించింది. దీనిలో భాగంగా 2016 మార్చి లోగా భారీ పారిశ్రామికవాడ స్థాపనకు అవసరమైన తొలి విడత భూమి ని సేకరిస్తేనే ‘నిమ్జ్’ హోదా దక్కుతుందని షరతు విధించింది. దీంతో నిమ్జ్ స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతాన్ని ఎంపిక చేసి భూ సేకరణ ప్రారంభించింది. రాష్ట్రంలో వరుస ఎన్నికలు ఓవైపు, మరోవైపు ప్రభుత్వం చెల్లించే ధర తమకు ఆమోదయో గ్యం కాదంటూ రైతులు చెబుతుండటంతో తొలి విడత భూసేకరణ ప్రక్రియ కొలిక్కి రావట్లేదు. 12,635 ఎకరాలకు గానూ తొలి విడతలో న్యాలకల్ పరిధిలోని ముంగి, రుక్మాపూర్‌తో పాటు, ఝరాసంగం మండల పరిధిలో బర్దీపూర్, చీలపల్లి, ఎల్గో యి గ్రామాల పరిధిలో 3,501 ఎకరాలు సేకరించాలని రెవెన్యూ విభాగానికి లక్ష్యం విధించారు. 2016లో భూ సేకరణ ప్రక్రియ ప్రారంభం కాగా, ఇప్పటి వరకు రూ.132.85 కోట్లు వెచ్చించి 2,925 ఎకరాలుసేకరించారు. తొలి విడతలో సేకరించాల్సిన మిగతా 566 ఎకరాల భూమిలో గ్రామ కంఠం, చెరువులు, కుంటలతో పాటు కొన్ని భూములపై కోర్టు కేసులతో భూ సేకరణ ముందుకు సాగడం లేదు. ధర చెల్లింపుపై రైతుల అసంతృప్తి రాష్ట్ర భూ సేకరణ చట్టం 2017లోని జీవో 123 నిబంధనలకు అనుగుణంగా తొలి విడతలో 2,925 ఎకరాల పట్టా, అసైన్మెంట్, ప్రభుత్వ భూములను రెవెన్యూ యంత్రాంగం సేకరించింది. ఎకరాకు అసైన్డ్ భూములకు రూ.3.25 లక్షలు, పట్టా భూములకు రూ.5.65లక్షల చొప్పున చెల్లించారు. అసైన్డ్ భూములకు సంబంధించి కొన్ని చోట్ల రైతులు కబ్జా లో ఉన్నా.. సాంకేతిక అంశాలను కారణంగా చూపు తూ పరిహారం చెల్లించేందుకు అధికారులు నిరాకరించారు. నిమ్జ్ ఏర్పాటు ప్రకటనతో స్థానికంగా ఎకరా భూమి ధర రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల పైనే పలుకుతోంది. దీంతో రైతులు, రైతు కూలీలు ఆందో ళన చెందుతున్నారు. తమకు భూసేకరణపై అవగాహన కల్పించకుండా, హడావుడిగా భూములు తీసుకున్నారని తొలి విడతలో భూములు కోల్పోయిన రైతులు ఆరోపిస్తున్నారు. తమకు చెల్లించాల్సిన పరిహారం పెంచాలని డిమాండు చేస్తున్నారు. ధర పెంచాలంటూ రైతుల ఒత్తిడి రెండు, మూడు విడతల్లో సేకరించే భూముల్లో ఎక్కు వ శాతం పట్టా భూములే ఉన్నాయి. రెండో విడతలో 1,269 ఎకరాల సేకరణ ప్రతిపాదనలను నిమ్జ్ వర్గా లు రెవెన్యూ శాఖకు పంపించాయి. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. దీంతో భూములు అప్పగించాల్సిందిగా కోరుతూ సంబంధిత గ్రామాల్లో జహీరాబాద్ ఆర్డీఓ, రెవెన్యూ అధికారులు సదస్సులు నిర్వహించారు. ఎకరాకు రూ.7 లక్షలు చెల్లిస్తామని రెవెన్యూ అధికారులు చెప్తుండగా, రైతులు మాత్రం భూమి ధరను పెంచాలని డిమాండ్ చేస్తుండటంతో భూ సేకరణ సవాలుగా మారింది. నిమ్జ్ ఏర్పాటైతే కేంద్రం నుంచి వచ్చేవి ఇవి... నిమ్జ్‌ను జాతీయ రహదారులతో అనుసంధానం, మౌలిక సదుపాయాల కల్పనకు అయ్యే వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం వంద శాతం గ్రాంటు రూపంలో ఇస్తుంది. ఆ తర్వాత పారిశ్రామిక పార్కులో ఏర్పాటయ్యే పరిశ్రమలకు విడిగా ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తుంది. ఈ లెక్కన జహీరాబాద్ నిమ్జ్‌లో మౌలిక సదుపాయాలకు రూ.3వేల కోట్లు గ్రాంటు రూపంలోనూ.. అందులో ఏర్పాటయ్యే పరిశ్రమలకు రూ.4వేల కోట్ల మేర ప్రోత్సాహకాలు, రాయితీ రూపంలో అందే వీలుంది. -
రియల్ జోరు
సాక్షి, జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ నియోజకవర్గంలో ‘రియల్’ జోరు కొనసాగుతోంది. పట్టణం నుంచి పల్లెటూళ్ల వరకు ఎక్కడ చూసినా కొత్త వెంచర్లు వెలుస్తున్నాయి. పచ్చని పొలాలు ప్లాట్లుగా మారుతున్నాయి. నియోజకవర్గానికి నిమ్జ్ రాబోతుండడంతో భూముల రేట్లకుఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతుండడంతో వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అయితే కొత్తగా వెలుస్తున్న వెంచర్లలో అనుమతులు లేనివే అధికంగా ఉంటున్నాయని, అక్రమంగా లేఅవుట్లు వేసి ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారని, సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. జహీరాబాద్ పట్టణం మీదుగా జాతీయ రహదారి వెళ్తుంది. పట్టణానికి హైదరాబాద్ వంద కిలో మీటర్ల దూరంలో ఉంది. మహీంద్ర అండ్ మహీంద్రతో పాటు చక్కెర కర్మాగారం, ఇతర పరిశ్రమలు ఉన్నాయి. నియోజకవర్గంలోని ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో (జాతీయ పరిశ్రమల ఉత్పాదక మండలి) నిమ్జ్ రాబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో ఇప్పటికే నిమ్జ్ కోసం 3 వేల ఎకరాల భూమిని సేకరించింది. మరో 9 వేల ఎకరాలు సేకరించనుంది. ఈ మేరకు పనులు జరుగుతున్నాయి. రెండు మూడేళ్ల క్రితం ఈ ప్రాంతంలో ఎకరా రూ. 5లక్షల నుంచి రూ.8 లక్షలు పలకగా ప్రస్తుతం రూ.10లక్షల నుంచి రూ.25 లక్షలు పలుకుతోంది. జాతీయ రహదారి పక్కన ఉన్న భూములు రూ.కోటికి పైనే పలుకుతున్నాయి. హైదరాబాద్ తదితర ప్రాంతాల వ్యాపారులు అధిక ధర చెల్లించి ఇక్కడ భూములను కొంటున్నారు. రియల్ వ్యాపారంపై ఆసక్తి వ్యాపారులు జహీరాబాద్ ప్రాంతంలో వెంచర్ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రధాన రహదారి, బైపాస్ రోడ్డులోని భూముల్లో ప్లాట్లు చేసి విక్రయాలు చేపడుతున్నారు. జహీరాబాద్ పట్టణం చుట్టుపక్కల ఎక్కడ చూసినా వెంచర్లు దర్శనమిస్తున్నాయి. చిన్నహైదరాబాద్, హోతి(కె), కాసీంపూర్, పస్తాపూర్, రంజోల్, అల్లీపూర్, దిడ్గి తదితర గ్రామాల పరిధిలో జహీరాబాద్– హైదరాబాద్, జహీరాబాద్–బీదర్, జహీరాబాద్ బైపాస్, అల్లానా రోడ్లలో వెంచర్లు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్నాయి. ప్లాట్లు చేసే పనులు జోరుగా కొనసాగుతున్నాయి. నిబంధనలు ఇలా.. పంటలు పండే భూముల్లో ప్లాట్లు చేయడానికి వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఈమేరకు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. భూమి రిజిస్ట్రేషన్ విలువల్లో పది శాతం నాలా రుసుము కింది చెల్లించాలి. ఆ తరువాత ఫైల్‌ను తహసీల్దార్ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయానికి పంపిస్తారు. ఆర్డీఓ కార్యాలయం అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వ్యవసాయేతర భూమిగా మార్పు చేస్తున్నట్లు పత్రం జారీ చేస్తారు. సంబంధిత భూ యజమాని వెంచర్ కోసం 40 ఫీట్స్‌తో ప్రధాన రోడ్డు, 33 ఫీట్స్‌తో అంతర్గత రోడ్లు, మురికి కాలువలు, విద్యుత్ దీపాలు, తాగునీటి వసతులు కల్పించాలి. పార్కు, డంపింగ్ యార్డు, అంగన్వాడి కేంద్రాల కోసం మున్సిపల్, పంచాయతీల పేరున భూమిలో 10 శాతం రిజిస్ట్రేషన్ చేయించాలి. మున్సిపల్, పంచాయతీలు, డీటీసీపీ నుంచి అనుమతులు తీసుకుని ప్లాట్ల పనులు చేపట్టాల్సి ఉంటుంది. అనుమతులు లేకుండానే.. జహీరాబాద్ ప్రాంతంలో వెలుస్తున్న వెంచర్లలో అధికశాతం అనుమతులు లేకుండానే పనులు చేపడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జహీరాబాద్– హైదరాబాద్ రహదారిలోని అనేక వెంచర్లు పంట పొలాల్లోనే వెలిశాయి. పెద్ద పెద్ద వెంచర్లు మాత్రం అనుమతులు తీసుకుని నిర్మాణాలు చేపడుతుండగా చిన్న చిన్న వెంచర్లు నామమాత్రపు అనుమతులు తీసుకుని పొలాలను ప్లాట్లుగా చేసి అమ్ముకుంటున్నారు. అనుమతులు లేకుండా చేసిన వెంచర్లలో ప్లాట్లు కొన్నవారు ఆ తరువాత ఇబ్బందులు పడుతున్నారు. అక్రమ వెంచర్లతో మున్సిపల్, పంచాయతీ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడుతోంది. సంబంధిత శాఖ అధికారులు స్పందించి అక్రమ వెంచర్లపై చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
ఫార్మాసిటీకి ‘నిమ్జ్’ హోదా!
సాక్షి, హైదరాబాద్: ఫార్మాసిటీ ప్రాజెక్టుకు త్వరలో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ జోన్ (నిమ్జ్) హోదా లభించనుంది. దేశంలో ఉత్పాదక రంగ పరిశ్రమల క్లస్టర్ల ఏర్పాటును ప్రోత్సహించేందుకు కేంద్రం 2013లో నేషనల్ మాన్యుఫాక్చరింగ్ పాలసీని తీసుకొచ్చింది. దీని కింద నిమ్జ్‌లు ఏర్పాటు చేసే రాష్ట్రాలకు ఆర్థిక సహకారం అందిస్తోంది. రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలా ల్లోని 19,333.20 ఎకరాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఔషధ రంగ పారిశ్రామికవాడగా రూపుదిద్దుకోనున్న ఫార్మాసిటీకి త్వరలో నిమ్జ్హోదా జారీ విషయంలో కేంద్రం నుంచి సానుకూల స్పందన లభించనుంది. సానుకూలంగా నివేదికలు.. నేషనల్ మాన్యుఫాక్చరింగ్ పాలసీ ప్రకారం కనీసం 12,500 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఉత్పాదక రంగ పరిశ్రమల క్లస్టర్లు.. రోడ్డు, రైల్వే రవాణా సదు పాయం కలిగి ఉంటే కేంద్రం నిమ్జ్ హోదా జారీ చేస్తుంది. నిమ్జ్ హోదా కల్పించేందుకు ఫార్మాసిటీ అన్ని అర్హతలు కలిగి ఉందని కేంద్ర ఔషధ, జాతీయ రహదారులు, రైల్వే మంత్రిత్వ శాఖలు సానుకూ లంగా నివేదికలు అందించాయి. దీంతో ఈ ప్రాజెక్టుకు నిమ్జ్ హోదా జారీ చేస్తూ కేంద్ర వాణిజ్య శాఖ నేతృత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డీఐపీపీ) ఉత్తర్వులు జారీ చేయడమే మిగిలిందని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ) అధికార వర్గాలు తెలిపాయి. ఎలక్ట్రిక్ పరికరాలు, మెటల్స్, ఫుడ్ అండ్ ఆగ్రో ప్రాసెసింగ్, ఆటోమొబైల్స్, ట్రాన్స్పోర్ట్ ఎక్విప్మెంట్స్ తదితర ఉత్పత్తుల పరిశ్రమల ఏర్పాటు కోసం రాష్ట్రానికి కేంద్రం జహీరాబాద్ నిమ్జ్ ప్రాజెక్టును ఇప్పటికే మంజూరు చేసింది. ఫార్మాసిటీ ప్రాజెక్టుకు నిమ్జ్ హోదా కల్పిస్తే దేశంలో రెండు నిమ్జ్ ప్రాజెక్టులు కలిగిన తొలిరాష్ట్రంగా తెలంగాణ అవత రించనుంది. ఫార్మాసిటీ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 5.56 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. ప్రాజెక్టు కోసం 19,333 ఎకరాలను సేకరించాల్సి ఉం డగా 8 వేల ఎకరాలను సేకరించింది. పర్యావరణ అనుమతుల జారీ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. కేంద్ర నిధులు, రుణ సహాయం బల్క్ డ్రగ్స్, వ్యాక్సిన్ల పరిశ్రమల స్థాపన కోసం రూ.16,784 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీకి నిమ్జ్ హోదా లభిస్తే కేంద్రం నుంచి భారీ మొత్తం లో నిధులు, ఇతర రాయితీ, ప్రోత్సాహకాలు లభించనున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో రూ.4 వేల కోట్ల ఆర్థిక సహాయాన్ని కేంద్రం అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడులవాటా పోగా మిగిలిన పెట్టుబడి వ్యయాన్ని రుణాల రూపంలో సమీకరించేందుకు కేంద్ర వాణిజ్య శాఖ సహకారం అందించనుంది. -
నిమ్జ్‌కు పర్యావరణ అనుమతులివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ ఫార్మాసిటీ నిమ్జ్‌కు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్‌ను మంత్రి కె.తారకరామారావు కోరారు. జాతీయ ఆరోగ్య భద్రతకు దోహదపడే ఈ ప్రాజెక్టు తెలంగాణతోపాటు యావత్ దేశానికి ఉపయోగపడుతుందని వివరించారు. గురువారం కేంద్ర మంత్రిని పార్లమెంటులో కలుసుకున్న కేటీఆర్.. నిమ్జ్ లక్ష్యాలను వివరించారు. ప్రాణాంతక వ్యాధుల నివారణకు అవసరమైన యాంటిబయోటిక్స్‌ను 84 శాతం వరకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, వ్యాధి నిరోధక మందుల కోసం భారీ స్థాయిలో ఇతర దేశాలపై ఆధారపడటం దేశానికి తీవ్రమైన సమస్య అన్నారు. ఇతర దేశాలపై ఆధారపడకుండా దేశ ఫార్మా రంగానికి ఉత్తమిచ్చేలా నిమ్జ్‌ను ఏర్పాటు చేయనున్నామని, దీని ఏర్పాటుకు అవసరమైన ఈఐఏ నివేదికను ఇటీవల కేంద్రానికి పంపామని చెప్పారు. హైదరాబాద్ హైటెక్స్‌లో మైనింగ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్, ఎఫ్ఐసీసీఐ ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి 17 వరకు జరగనున్న మైనింగ్ టుడే–2018 సదస్సు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేయాలని హర్షవర్ధన్, మరో మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌లను కేటీఆర్ ఆహ్వానించారు. హైదరాబాద్‌లో ‘డీఐపీ’ఏర్పాటు చేయండి కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన రెండు డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ (డీఐపీ) కారిడార్లలో ఒకటి హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను మంత్రి కేటీఆర్ కోరారు. రక్షణ రంగంతో హైదరాబాద్‌కు అనుబంధం ఉందని.. రక్షణ రంగ సంస్థలు, పరికరాల తయారీలో ముందు వరుసలో ఉందని వివరించారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తోనూ రాత్రి సమావేశమైన కేటీఆర్ పలు అంశాలపై చర్చించారు. శుక్రవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ కానున్నారు. - ఢిల్లీలో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమైన కేటీఆర్ -
జహీరాబాద్ నిమ్జ్‌కు ‘పచ్చ’ జెండా!
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక జహీరాబాద్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ జోన్ (నిమ్జ్) ప్రాజెక్టు నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. ఈ మెగా పారిశ్రామికవాడ నిర్మాణంలో అనుసరించాల్సిన నియమ నిబంధనల (టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్)కు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ఎక్స్పర్ట్స్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) ఆమోదం తెలిపింది. తొలి దశ పర్యావరణ అనుమతులుగా భావించే ‘టీఓఆర్’కు ఆమోదం లభించడంతో.. తుది అనుమతులు కోరేందుకు మార్గం సుగమమమైంది. నిమ్జ్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం బహిరంగ విచారణ జరిపి తుది దశ అనుమతుల కోసం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసుకోనుంది. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ) ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా న్యాల్కల్, ఝరాసంఘం మండలాల్లో 12,635 ఎకరాల భారీ విస్తీర్ణంలో నిమ్జ్‌ను ప్రభుత్వం నిర్మిస్తోంది. ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2.44 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. రూ.37,740 కోట్ల పెట్టుబడులతో వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలు ఈ పారిశ్రామికవాడలో ఏర్పాటవనున్నాయి. 2040 సంవత్సరం నాటికి రూ.96,778 కోట్లు విలువ చేసే ఉత్పత్తులు జరగనున్నాయి. 2030 నాటికి పూర్తి.. నిమ్జ్ నిర్మాణానికి రూ.4,500 కోట్ల అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. సైట్ అభివృద్ధి, అంతర్గత రోడ్లు, నీరు, విద్యుత్ సరఫరా, వరద, మురుగు నీటి కాల్వలు, భవనాలు, వీధి దీపాలు, పచ్చదనం అభివృద్ధికి ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. ప్రాజెక్టుకు వెలుపల మౌలిక సదుపాయాల కోసం మరో రూ.6,100 కోట్ల వ్యయం కానుంది. 2020 నాటికి ప్రాజెక్టు తొలి దశ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని, 2030 నాటికి మొత్తం పూర్తవుతుందని ప్రభుత్వం పేర్కొంటోంది. నిమ్జ్ పరిధిలో 17 గ్రామాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. 12,635 ఎకరాలకు గాను 2,884 ఎకరాలు టీఎస్ఐఐసీ ఇప్పటికే సేకరించింది. హైదరాబాద్ నుంచి 65 కి.మీ. పరిశ్రమల స్థాపన, పెట్టుబడులు ఆకర్షించేందుకు నిమ్జ్ ప్రతిపాదిత ప్రాంతం అనుకూలమని ప్రభుత్వం చెబుతోంది. ప్రాజెక్టు సమీపంలో ఇప్పటికే మహీంద్ర, ఎంఆర్ఎఫ్ టైర్స్, అరబిందో ఫార్మా, స్పార్శ్ ఫార్మా, కావేరీ ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్, బీహెచ్ఈఎల్, ఆర్డాన్స్ ఫ్యాక్టరీ మెదక్, భారత్ డైనమిక్స్(బీడీఎల్), ట్రైడెంట్ షుగర్స్ లాంటి మెగా పరిశ్రమలున్నాయంది. హైదరాబాద్ నుంచి 65 కి.మీ., ఓఆర్ఆర్ నుంచి 50 కి.మీ, దూరంలోని ఈ ప్రాజెక్టుకు రహదారులు, విమానాశ్రయం, రైల్వే స్టేషన్, సీ పోర్టు (కృష్ణపట్నం, జవహర్లాల్ పోర్ట్ ట్రస్ట్) సదుపాయాలతో పాటు నీరు, విద్యుత్ సదుపాయాలున్నాయని పేర్కొంది. కాగా, నిమ్జ్‌లో ప్రధానంగా ఎలక్ట్రిక్ పరికరాలు, ఫుడ్ అండ్ ఆగ్రో ప్రాసెసింగ్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ట్రాన్స్పోర్ట్ ఎక్విప్మెంట్ రంగాల పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. జోన్ల వారీగా ప్రాజెక్టు అభివృద్ధి ఇలా.. జోన్ స్థలం (ఎకరాల్లో) ఉత్పత్తి పరిశ్రమలు 7,107 సాంకేతిక సదుపాయాలు 550 మౌలిక వసతులు 883 గృహ నిర్మాణం 638 లాజిస్టిక్స్ 899 పచ్చదనం 1,603 రహదారులు 955 మొత్తం 12,635 నోట్: కామన్ ఫోల్డర్లో నీమ్జ్ జహీరాబాద్ పేరుతో ప్రాజెక్టు సైట్ మ్యాప్ ఫోటోలు ఉన్నాయి. పరిశీలించగలరు. 12,635 - ఎకరాల్లో మెగా పారిశ్రామిక వాడ నిర్మాణం 4,500 - కోట్లు అంచనా వ్యయం 6,100- కోట్లు ప్రాజెక్టు వెలుపల మౌలిక వసతులకు.. 2,40,000- మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి -
నిమ్జ్‌లో ‘మౌలిక వసతుల పరికరాల’ పార్కు
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ‘మౌలిక సదుపాయాల యంత్ర పరికరాల తయారీ పార్కు (ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్ మెంట్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ పార్క్)’ ఏర్పాటు కానుంది. జహీరాబాద్‌లోని ‘నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యాన్యుఫాక్చరింగ్ జోన్ (నిమ్జ్)’లో 500 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భవనాలు, ప్రాజెక్టుల నిర్మాణాలు, గనుల తవ్వకాల్లో ఉపయోగించే యంత్ర పరికరాలు తయారుకానున్నాయి. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో బుధవారం బెంగళూరులో శ్రేయీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఫైనాన్స్ లిమిటెడ్ అనుబంధ కంపెనీ అట్టివో ఎకనామిక్ జోన్స్ ప్రైవేటు లిమిటెడ్–ప్రభుత్వం మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. 10 వేల మందికి ఉద్యోగాలు.. మౌలిక సదుపాయాల యంత్ర పరికరాల రంగంలో పేరొందిన సంస్థలు ఈ పార్కులో యూనిట్లు ఏర్పాటు చేస్తాయని ఒప్పందం సందర్భంగా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. భూసేకరణ పూర్తయిందని, త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. ఈ పార్కు ద్వారా వచ్చే పదేళ్లలో 10 వేల ఉద్యోగాలు లభిస్తాయ ని తెలిపారు. ఈ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని, మరిన్ని కంపెనీలు రాష్ట్రానికి తరలివస్తాయని అన్నారు. రెండున్నర దశాబ్దాలుగా తమ కంపెనీ మౌలిక వసతుల రంగంలో పెట్టుబడులు పెడుతోందని శ్రేయీ ఇన్ఫ్రాస్టక్చర్ సంస్థ ఉపాధ్యక్షుడు సునీల్ కనోరియా చెప్పారు. మౌలిక రంగంలో కీలక సంస్థ ‘శ్రేయీ’: దేశంలోని అతిపెద్ద సమగ్ర మౌలిక సదుపాయాల రంగ సంస్థల్లో శ్రేయీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ లిమిటెడ్ ఒకటి. 1989లో ఈ కంపెనీ ప్రారంభమైంది. మౌలి క సదుపాయాల రంగంలో పెట్టుబ డులకు అవకాశాలు లేని పరిస్థితిలో.. వినూత్న పరిష్కారాలతో మార్కెట్లో సుస్థిర స్థానాన్ని సాధించింది. ప్రస్తుతం వేల కోట్ల రూపాయల సంస్థగా ఎదిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఫైనాన్స్, అడ్వైజరీ అండ్ డెవలప్ మెంట్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సేవలను ఈ సంస్థ అందిస్తోంది. పరిశ్రమల స్థాపనకు ఎంతో అనుకూలం విప్లవాత్మక సంస్కరణలు, పారిశ్రామిక విధానాలతో తెలంగాణ పెట్టుబడులను ఆకర్షిస్తోందని.. పరిశ్రమల స్థాపనకు రాష్ట్రం ఎంతో అనుకూలమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బుధవారం బెంగళూరులో మౌలిక వసతుల యంత్ర పరికరాల ఉత్పత్తిదారులతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం జరిగిన ఎక్స్‌కాన్ ఎక్స్‌పోలో ‘నెక్ట్స్‌జెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్’అంశంపై ప్రసంగించారు. మౌలిక వసతుల కల్పన ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, మిషన్ భగీరథ ప్రారంభించారన్నారు. తెలంగాణలో మౌలిక వసతుల యంత్రాల తయారీ చేపట్టాలని కోరారు. పెట్టుబడులు పెట్టండి: కేటీఆర్ సాక్షి, న్యూఢిల్లీ: వృద్ధి రేటులో దేశంలోనే మెరుగైన స్థానంలో ఉన్న తెలంగాణలో పెట్టుబడుల స్థాపనకు ముందుకురావాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన ఢిల్లీలో జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ చైర్మన్, సీఈవో జాన్ ప్లానరీ, వాన్చూ సంస్థ అధ్యక్షుడు, సీఈవో విశాల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడుల స్థాపనకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను వారికి వివరించారు. పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలపై వారు హర్షం వ్యక్తం చేశారని.. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారని అనంతరం కేటీఆర్ తెలిపారు. -
‘నిమ్జ్’కు లైన్ క్లియర్
భూముల కొనుగోలు చేసుకోవచ్చన్న హైకోర్టు రిజిస్ట్రేషన్లకూ ఓకే.. అంతా తుది తీర్పునకు లోబడే తదుపరి ఉత్తర్వులదాకా ఎవరినీ ఖాళీ చేయించొద్దు మాకిచ్చిన హామీలు అమలు చేసి నివేదిక ఇవ్వండి నివేదికపై మేం సంతృప్తి చెందితేనే ఖాళీ ప్రక్రియ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లాలో తలపెట్టిన నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్)కు భూముల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో లైన్‌క్లియర్ అయింది. 123 జీవో కింద భూముల కొనుగోలుకు, రిజిస్ట్రేషన్లకు కోర్టు అనుమతినిచ్చింది. అయితే కొనుగోళ్లన్నీ తుది తీర్పునకు లోబడి ఉంటాయని పేర్కొంది. ‘‘తదుపరి ఉత్తర్వుల దాకా భూ యజమానులను గానీ, ఇతరులను గానీ ఖాళీ చేయించరాదు. 2013 భూ సేకరణ చట్టం షెడ్యూల్ 2లో ఉన్న ప్రయోజనాలన్నింటినీ బాధితులకు వర్తింపజేస్తామంటూ ఇచ్చిన హామీని అమలు చేసి, సంబంధిత నివేదికను మా ముందుంచండి’’ అని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాన్ని తాము పరిశీలించి, సంతృప్తి చెందాకే భూముల నుంచి ఖాళీ చేయించే ప్రక్రియ మొదలుపెట్టాలని పేర్కొంటూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సవరణ జీవో ఇదిగో... గత విచారణ సమయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 190లో ధర్మాసనం కొన్నింటిపై స్పష్టత కోరిన నేపథ్యంలో దానికి సవరణలు చేస్తూ జీవో 191 జారీ చేశామని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి వివరించారు. జీవో కాపీని ధర్మాసనం ముందుంచారు. ‘‘ఉమ్మడి కుటుంబమన్న పదంపై అభ్యంతరం నేపథ్యంలో దాన్ని తొలగించి కుటుంబం అన్న పదం చేర్చాం. ఎస్సీ, ఎస్టీలకు నెలకు రూ.3 వేలు, ఇతరులకు రూ.2,500 చొప్పున 20 ఏళ్ల పాటు చెల్లిస్తామని జీవో 190లో పేర్కొన్నగా, ఆ మొత్తాలను ధరల సూచీకి అనుగుణంగా చెల్లిస్తామని తాజాగా చేర్చాం’’ అని చెప్పారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం కుటుంబమంటే వితంతువు, భార్య చనిపోయిన వ్యక్తి, విడిగా ఉంటున్న మేజర్లు కూడానని పిటిషనర్ల తరఫు న్యాయవాది మూర్తి గుర్తు చేశారు. వితంతువు విడిగా ఉంటే రూ.1.5 లక్షలు చెల్లిస్తామని, ఉద్యోగాల్లో బాధితులకు ప్రాధాన్యమిస్తామని ధర్మాసనం ప్రశ్నలకు బదులుగా ఏజీ చెప్పారు. 2014 పారిశ్రామిక విధానం ప్రకారం స్థానికులకు ఉద్యోగాలిస్తామన్నారు. అలా జరగడం లేదని, మెదక్ జిల్లాలో విడ్మిల్ కంపెనీలో ఛత్తీస్‌గఢ్ వారికే అత్యధిక ఉద్యోగాలు దక్కాయని మూర్తి అన్నారు. రేపు నిమ్జ్ విషయంలోనూ ఇదే జరగవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాజ్యం ప్రాథమిక దశలో ఉన్న ఈ సమయంలో ఇలాంటి చర్చ సరికాదని ఏజీ అన్నారు. ఉద్యోగం, కుటుంబం పదాల్లో 191 జీవోలో సందిగ్ధత ఉండటం నిజమేనన్న ధర్మాసనం, వీటిపై స్పష్టతనిచ్చేదాకా భూముల నుంచి ఎవరినీ ఖాళీ చేయించొద్దంది. జీవో 123 ద్వారా సాగునీటి ప్రాజెక్టులకు భూ కొనుగోళ్లపై దాఖలైన వ్యాజ్యాలపై ఇప్పటికిప్పుడు విచారణకు ధర్మాసనం నిరాకరించింది. వచ్చే వారం విచారిస్తామని, బాధితులెవరైనా కోర్టును ఆశ్రయించవచ్చని చెప్పింది. పార్టీల పిటిషన్లను మాత్రం అనుమతించబోమంది. విస్తృత ప్రజా ప్రయోజనాలు ముడిపడ్డందున ప్రతి అంశాన్నీ లోతుగా పరిశీలిస్తామంది. -
123 జీవో రద్దుపై స్టే
-
123 జీవో రద్దుపై స్టే
► సర్కారుకు హైకోర్టు ధర్మాసనం ఊరట ► భూసేకరణ చట్టం షెడ్యూల్ 2లో ఉన్న ప్రయోజనాలు కల్పించాలి ► ఆ మేరకు జీవో జారీ చేసి.. మా ముందుంచండి ► అప్పటి వరకు ఎవరినీ ఖాళీ చేయించవద్దు ► వ్యవసాయ కార్యకలాపాలకు ఆటంకం కలిగించొద్దు ► కొత్త జీవోను పరిశీలించాకే రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తాం ► తుది తీర్పునకు లోబడే భూముల కొనుగోళ్లు ఉంటాయని స్పష్టీకరణ ► మధ్యంతర ఉత్తర్వులు జారీ.. విచారణ గురువారానికి వాయిదా సాక్షి, హైదరాబాద్ సాగునీటి ప్రాజెక్టులు, పారిశ్రామిక అవసరాలకు భూముల సేకరణ కోసం జారీ చేసిన జీవో 123 అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం ఊరటనిచ్చింది. ఈ జీవో 123ను కొట్టివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును నిలిపివేసింది. ఈ జీవో కింద చేసిన భూముల కొనుగోళ్లన్నీ తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. అయితే ఆయా భూములపై ఆధారపడి జీవిస్తున్న వారికి కల్పిస్తామన్ని చెబుతున్న ప్రయోజనాలన్నింటిని పేర్కొంటూ మరో జీవో జారీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. భూసేకరణ చట్టం-2013లోని షెడ్యూల్ 2లో ఉన్న ప్రయోజనాలు లేదా వాటి కన్నా ఎక్కువ ప్రయోజనాలను కల్పించాలని స్పష్టం చేసింది. ఆ జీవోను జారీ చేశాక దానిని తమకు అందజేయాలని.. అది సంతృప్తికరంగా ఉంటేనే రైతుల నుంచి కొన్న భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతినిస్తామని పేర్కొంది. నిమ్జ్‌కు అవసరమైన మొత్తం 12,600 ఎకరాల భూమి సమకూరి, బాధితులందరికీ చట్ట ప్రకారం వర్తింప చేయాల్సిన ప్రయోజనాలన్నీ అందే వరకూ వారి భూముల నుంచి ఖాళీ చేయించవద్దని.. వ్యవసాయ కార్యకలాపాలకు కూడా ఆటంకం కలిగించవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఉద్యోగాలివ్వాలని చట్టం చెబుతోంది మెదక్ జిల్లాలో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్) కోసం అవసరమైన భూములను రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు వీలుగా జారీ చేసిన జీవో 123ను ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి కొట్టివేసిన విషయం తెలిసిందే. ఆ తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం అప్పీలు దాఖలు చేసింది. దీనిని ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం దానిని మరోసారి విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది మూర్తి వాదనలు వినిపిస్తూ... బాధితులకు వర్తింప చేస్తున్న ప్రయోజనాలపై ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై తన క్లయింట్లతో చర్చించానని, వారు తమ ఉద్యోగావకాశాల గురించి ప్రశ్నించారని ధర్మాసనానికి తెలిపారు. భూములను సేకరించి స్థాపిస్తున్న పరిశ్రమల్లో బాధిత కుటుంబాలకు ఉద్యోగం కల్పించాలని భూసేకరణ చట్టం షెడ్యూల్ 2 స్పష్టం చేస్తోందని విన్నవించారు. పిటిషనర్లు నిర్వాసితులు కాదని.. కానీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లో నిర్వాసితులకు చెల్లించే పరిహారం గురించి మాత్రమే ప్రస్తావన ఉందన్నారు. పిటిషనర్లలో ఇద్దరు వితంతువులున్నారని, వారికి జీవిత భాగస్వామి లేనందున ప్రభుత్వ అఫిడవిట్ ప్రకారం కేవలం రూ.1.25 లక్షల చొప్పున మాత్రమే పొందగలుగుతారని వివరించారు. ఇక భూసేకరణ చట్టంలో వన్‌టైం సెటిల్మెంట్ కింద ఎటువంటి షరతులూ లేవని... ప్రభుత్వ ప్రతిపాదనల్లో మాత్రం షరతులు ఉన్నాయని వివరించారు. భవిష్యత్తులో మరిన్ని షరతులు చేర్చే అవకాశముందని, దాని వల్ల బాధితులకు ఇబ్బందులు తప్పవని నివేదించారు. ఉద్యోగాలిస్తాం.. తరువాత అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. ఇప్పటికిప్పుడు భూముల నుంచి ఎవరినీ ఖాళీ చేయించడం లేదని ధర్మాసనానికి తెలిపారు. భూములు ఖాళీ చేసి వెళతామంటే నిబంధనల మేరకు చెల్లింపులు చేస్తామన్నారు. ఈ సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ... భూములు అమ్ముకున్న వాళ్లు ఊరు విడిచి వెళ్లిపోతారని, కూలీలు అక్కడే ఉంటారని పేర్కొన్నారు. చిన్న విస్తీర్ణంలో భూములున్న వాళ్లు భూమిని విక్రయించడం లేదన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ... స్వచ్ఛందంగా భూములు విక్రయించని వారి జోలికి వెళ్లబోమని ప్రభుత్వం చెబుతోందని, ప్రభుత్వంపై అంత అపనమ్మకం ఎందుకని పేర్కొంది. ఇక కోర్టు ముందుంచిన అఫిడవిట్లో షెడ్యూల్ 2లోని అంశాల ప్రస్తావన లేదని, బాధితులకు ఉద్యోగం కల్పించే సంగతేమిటని ఏజీని ప్రశ్నించింది. దీంతో కోర్టులోనే ఉన్న ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్రతో మాట్లాడిన ఏజీ.. ఉద్యోగాలు కల్పిస్తామని ధర్మాసనానికి చెప్పారు. ఈ నేపథ్యంలో బాధితులకు ప్రయోజనాలు వర్తింప జేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చిన నేపథ్యంలో... దానిని జీవో ద్వారా అమలు చేయాల్సిన అవసరముందని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. జీవో రద్దు చేస్తే పరిస్థితేమిటని ఆందోళన వ్యక్తం చేశారు. రద్దు చేస్తే ఎవరి భూములు వారికి అప్పగిస్తారని ధర్మాసనం పేర్కొంది. నిమ్జ్‌కే వర్తింప చేయడం సరికాదు బాధితులకు ప్రయోజనాల కోసం జారీ చేసే జీవోను నిమ్జ్‌కు మాత్రమే వర్తింప చేయవద్దని, అన్ని ప్రాజెక్టులకు వర్తింపజేయాలని ఈ కేసులో వాదనలు వినిపిస్తున్న పలువురు సీనియర్ న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు. దాంతోపాటు సింగిల్ జడ్జి తీర్పుపై స్టేను నిమ్జ్‌కే వర్తింపజేయాలని, లేకపోతే జీవో అమల్లోకి వచ్చిందంటూ తిరిగి భూములను తీసుకునే అవకాశముందని పేర్కొన్నారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించలేదు. ఈ రెండు రోజుల్లోనే ఏమీ కాదని పేర్కొంటూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి దాఖలైన వ్యాజ్యాలపై ఆ రోజే విచారణ జరుపుతామని పేర్కొంది. ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ తమ తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. -
ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా మెదక్ నిమ్జ్!
* టీఎస్ఐఐసీకి అనుబంధంగా ఏర్పాటు * పారిశ్రామిక పార్కు అభివృద్ధి బాధ్యత నూతన కంపెనీకి.. * 18 నెలల్లో 12,635 ఎకరాలు నూతన కంపెనీకి బదిలీ సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లాలో జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి (నిమ్జ్) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం తుది ఆమోదం తెలిపిన నేపథ్యంలో... భారీ పారిశ్రామిక పార్కు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో మౌలిక వసతుల కల్పన, ప్లాట్ల కేటాయింపును పర్యవేక్షించేందుకు ప్రత్యేక సంస్థ (స్పెషల్ పర్పస్ వెహికిల్)ను ఏర్పాటు చేసింది. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ)కి అనుబంధంగా మెదక్ నిమ్జ్ జోన్ లిమిటెడ్ పేరిట ఈ కంపెనీ ఏర్పాటైంది. ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా ఏర్పాటైనా.. మాతృసంస్థ టీఎస్ఐఐసీ వంద శాతం ప్రభుత్వ సంస్థ కావడంతో నూతన కంపెనీ కార్యకలాపాలన్నీ ప్రభుత్వ పర్యవేక్షణలోనే కొనసాగుతాయి. భూమి అప్పగింతకు సన్నాహాలు నిమ్జ్ ఏర్పాటుకు మెదక్ జిల్లా జహీరాబాద్, న్యాలకల్ మండలాల్లో 12,635 ఎకరాలను గుర్తించారు. మూడు దశల్లో 18 నెలల వ్యవధిలో భూసేకరణ పూర్తి చేయాలని... తొలి దశలో కనీసం మూడు వేల ఎకరాలు అప్పగిస్తేనే నిమ్జ్ హోదా దక్కుతుందని కేంద్ర పారిశ్రామిక పెట్టుబడులు, ప్రోత్సాహక విభాగం (డిప్) స్పష్టీకరించింది. మొత్తం భూసేకరణకు రూ.2,450 కోట్లు అవసరమని అంచనా వేయగా.. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.134 కోట్ల మేర విడుదల చేసింది. తొలి విడతకు సంబంధించి మూడు వేల ఎకరాల భూసేకరణ పూర్తి కావడంతో... దానిని మెదక్ నిమ్జ్ జోన్ లిమిటెడ్‌కు అప్పగించేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. ఇక పనులు వేగవంతం రాష్ట్రంలో పారిశ్రామిక పార్కుల్లో మౌలిక సౌకర్యాల కల్పన, నిర్వహణ తదితరాలు టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో జరుగుతాయి. కానీ నిమ్జ్ వంటి భారీ పారిశ్రామిక పార్కు అభివృద్ధి సవాలుతో కూడుకున్నది కావడంతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని డిప్ షరతు విధించింది. ఈ మేరకు ‘మెదక్ నిమ్జ్ లిమిటెడ్’ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నుంచి టీఎస్ఐఐసీకి భూ బదిలీ జరిగిన వెంటనే పార్కు అభివృద్ధికి సంబంధించిన సంపూర్ణ నివేదిక తయారీ, పర్యావరణ అనుమతులు, లే ఔట్ రూపకల్పన, కాంట్రాక్టు సంస్థల ఎంపిక తదితర కార్యకలాపాలన్నీ మెదక్ నిమ్జ్ జోన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరుగుతాయి. అయితే పాలనా వ్యవహారాలను పర్యవేక్షించేందుకు టీఎస్ఐఐసీ అధికారులనే కేటాయిస్తారా, లేక ప్రత్యేక అధికారులను నియమిస్తారా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఎన్నో ప్రయోజనాలు నిమ్జ్ హోదా దక్కే పారిశ్రామిక వాడలకు కేంద్రం భారీ ఎత్తున రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఆ పారిశ్రామిక వాడకు ప్రధాన మార్గాలతో అనుసంధానం, మౌలిక సౌకర్యాల కల్పనకు అయ్యే వ్యయాన్ని కేంద్రం వంద శాతం గ్రాంటు రూపంలో అందిస్తుంది. దీంతోపాటు అక్కడ ఏర్పాటయ్యే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తుంది. మెదక్ నిమ్జ్‌ను ఉదాహరణగా తీసుకుంటే మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.3వేల కోట్లు గ్రాంటు రూపంలో, అందులో ఏర్పాటయ్యే పరిశ్రమలకు రూ.4వేల కోట్ల మేర ప్రోత్సాహకాలు, రాయితీ రూపంలో అందే వీలుంది. ఈ నిమ్జ్‌తో 2022 నాటికి సుమారు రూ.40వేల కోట్ల పెట్టుబడులతో మూడు లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని అంచనా. కేంద్ర నిబంధనల మేరకు ఏదైనా పారిశ్రామిక వాడకు నిమ్జ్ హోదా దక్కాలంటే 50 చదరపు కిలోమీటర్ల పరిధిలో కచ్చితంగా 5 వేల హెక్టార్ల (సుమారు 12,500 ఎకరాల) స్థలం ఉండాలి. -
తెలంగాణకు మరో రెండు వరాలు!
న్యూఢిల్లీ: తెలంగాణలో జాతీయ పెట్టుబడులు, ఉత్పత్తి జోన్ (నిమ్జ్)ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఈ జోన్ లను ఏర్పాటు చేసేందుకు అనుమతిచ్చినట్లు ఆమె గురువారం తెలిపారు. దీంతో ప్రత్యక్షంగా 75వేల మంది, పరోక్షంగా 1.5 లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని నిర్మలా సీతారామన్ ట్విట్ చేశారు. ఈ జోన్లు ముఖ్యంగా ఔషద పరిశ్రమలపై దృష్టి కేంద్రీకరించేలా ఉంటాయని పేర్కొన్నారు. 2011లో రూపొందించిన పారిశ్రామిక విధానం ఆధారంగా దేశవ్యాప్తంగా ఈ తరహా జోన్లు ఏర్పాటు చేస్తున్నారు. కాగా మెదక్ జిల్లా జరాసంగం మండలం న్యాల్కల్ లో ఏర్పాటు చేయనున్న నిమ్జ్‌కు కేంద్రం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. -
మెదక్‌లో ఎన్ఐఎంజెడ్
* ఏపీలోని చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లోనూ.. సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం మంజూరు చేసిన 17 ఎన్ఐఎంజెడ్ (జాతీయ పెట్టుబడులు, మాన్యుఫాక్చరింగ్ జోన్)లను సూత్రప్రాయంగా ఆమోదించిందని, వీటిలో 9 ఎన్ఐఎంజెడ్లు ఢిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడార్ (డీఎంఐసీ) రీజియన్‌కు బయట ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కేంద్రం మంజూరు చేసిన ఎన్ఐఎంజెడ్, పారిశ్రామిక కారిడార్లు, మెగా పారిశ్రామిక హబ్‌ల ఏర్పాటుకు ఏపీ, తెలంగాణ, తమిళనాడు నుంచి అందిన ప్రతిపాదనల వివరాలను అందచేయాలని రాజ్యసభలో శుక్రవారం ఎంపీలు నంది ఎల్లయ్య, మురళీమోహన్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కంభంపాటి హరిబాబు అడిగిన ప్రశ్నకు మంత్రి నిర్మలా సీతారామన్ బదులిచ్చారు. ఏపీలోని చిత్తూరు, ప్రకా శం, తెలంగాణలోని మెదక్, మహారాష్ట్రలోని నాగపూర్, కర్ణాటకలోని తుమ్కూర్, కోలార్, బీదర్, గుల్బర్గా, ఒడిశాలోని కళింగనగర్‌లో ఎన్ఐఎంజెడ్లకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని వివరించారు. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, చెన్నైలో విస్తరణ అయ్యేలా చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్, వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్, అమృత్సర్- కోల్‌కతా పారిశ్రామిక కారిడార్, బెంగళూరు-ముంబై ఆర్థిక కారిడార్ల నిర్మాణానికి కేంద్రం సంకల్పించిందని తెలిపారు.