సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో జాతీయ పెట్టుబడులు, మౌలిక వనరుల ప్రాజెక్టు (నిమ్జ్) కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణ ప్రక్రియను నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నిమ్జ్ కోసం 12,635 ఎకరాలను సేకరించేందుకు శుక్రవారం జరగబోయే ప్రజాభిప్రాయ సేకరణను ఆపాలని గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
భూ సేకరణకు కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన నోటిఫికేషన్‌ను నయాల్‌కల్ గ్రామానికి చెందిన ఎం.రాజిరెడ్డి, మరో నలుగురు హైకోర్టులో సవాల్ చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో గ్రామసభ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేయకూడదని పిటిషనర్ న్యాయవాది అర్జున్‌కుమార్ వాదించారు. రూ.4వేల కోట్లతో ఏర్పాటు చేసే నిమ్జ్ వల్ల 10వేల మందిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రతికూల ప్రభావం పడనుందని తెలిపారు.
కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చేయకూడదని, కేంద్రం మార్గదర్శకాలు ఇచ్చిన తర్వాతే చేయాలని హైకోర్టు పేర్కొంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నందున ప్రజాభిప్రాయ సేకరణ చేయడం వల్ల తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపింది. సంగారెడ్డిలో కూడా పాజిటివ్ కేసులున్నాయని చెప్పింది. నిమ్జ్ ప్రాజెక్టు వల్ల 2.44 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ఏజీ బీఎస్ ప్రసాద్ తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం, కేంద్రం మార్గదర్శకాలు జారీ వరకు ప్రజాభిప్రాయ సేకరణ చేయవద్దంటూ రిట్‌పై విచారణను ముగించింది.
Comments
Please login to add a commentAdd a comment