సాక్షి, హైదరాబాద్: ఓ భూ వివాదానికి సంబంధించి సింగిల్ జడ్జి ఉత్తర్వులను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్‌డీవో ఎస్.శ్రీను, తహసీల్దార్ యు.ఉమాదేవిలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ పిటిషన్లపై అప్పీల్ దాఖలు చేసిన కేసుల్లో సదరు అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించినా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించింది. ఈ రోజు విచారణకు హాజరై ఉంటే.. ఇటు నుంచి ఇటే ఈ ముగ్గురిని జైలుకు పంపేవాళ్లమని హెచ్చరించింది.
ఓ భూ వివాదం వ్యవహారంలో ఈ ముగ్గురు అధికారులకు 2 నెలల జైలు, రూ.2 వేలు జరిమానా విధిస్తూ 2020 డిసెంబర్ 15న సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన అప్పీళ్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా సదరు అధికారులు హాజరయ్యారా అని ధర్మాసనం ప్రశ్నించగా.. లేదని ప్రభుత్వ న్యాయవాది చెప్ప డంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘సింగిల్ జడ్జి ఆదేశాల్లో లోపం ఎక్కడ ఉందో చెప్పకుండా ఆదేశాలను అమలు చేయలే దు. పైగా కోర్టు ఆదేశాలను తమకు అనుకూలంగా మల్చుకు నే ప్రయత్నం చేశారు. పిటిషనర్లకు పట్టాదార్ పాస్‌పుస్తకాలు ఇవ్వాలని ఆదేశించినా.. ఇవ్వకపోగా రుజువు చేయకుండా పిటిషనర్ ఆక్రమణదారుడు అని ఎలా అంటారు? సింగిల్ జడ్జి ఉత్తర్వులపై అభ్యంతరముంటే ఆ ఉత్తర్వులను ఎత్తేయా లని కోరాలి. ఇవేమీ చేయకుండా నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ చేయాల్సిందంతా చేసి బేషరతు క్షమాపణలు కోరితే అంగీకరించం’అని కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణకు ఈ ముగ్గురు అధికారులు హాజరుకావాలని స్పష్టం చేస్తూ విచారణను ఏప్రిల్ 7కు వాయిదా వేసింది.
సింగిల్ జడ్జి ఏమన్నారంటే..
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఈజె డేవిడ్.. ఎనిమిదేళ్ల క్రితం సంగారెడ్డి రెడ్డి జిల్లా కంది సమీపంలోని చిమ్నాపూర్‌లో ఐదెకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమికి పట్టాదార్ పాస్‌బుక్ ఇవ్వాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా.. అది ప్రభుత్వ భూమి అని రెవెన్యూ అధికారులు అభ్యర్థనను తిరస్కరించారు. దీంతో డేవిడ్ హైకోర్టును ఆశ్రయించగా.. రెవెన్యూ అధికారులు పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జి ఆదేశించారు.
అయితే.. ఈ భూమికి సంబంధించి విలేజ్ మ్యాప్, టిప్పన్, వసూల్ బక్వాయి, సేత్వా ర్ తదితర రికార్డులు లేవని, ఇవి ‘ఖిల్లాదాఖ్లా’భూములంటూ డేవిడ్ దరఖాస్తును తహసీల్దార్ తిరస్కరించారు. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ ఆర్‌డీవో, తర్వాత అదనపు కలెక్టర్ ముందు అప్పీల్ దాఖలు చేయగా.. తహసీల్దార్ ఆదేశాలను సమర్థిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ నేపథ్యంలో కోర్టు ధిక్కరణ కింద డేవిడ్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సింగిల్ జడ్జి జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు.. అధికారులు ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ ముగ్గురికి రెండు నెలల జైలు, రూ.2 వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment