Veera reddy
-
డామిట్.. కథ అడ్డం తిరిగింది..!
సాక్షి ప్రతినిధి, కడప: 2024 డిసెంబర్ 6వతేదీ సమయం అర్ధరాత్రి ఒంటిగంట. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో ఖాళీగా ఉన్న మంచంపై నిద్రిస్తున్న 75 ఏళ్ల వృద్ధుడిని టీడీపీ కార్యకర్తలైన ఇద్దరు యువకులు ఊపిరి ఆడకుండా తలపై దిండు అదిమిపెట్టి హత్య చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి జారుకున్నారు. వృద్ధుడు అనారోగ్యంతో చనిపోయాడని గ్రామస్తులు, బంధువులు భావించి, అంత్యక్రియలు చేశారు. ఆ తర్వాత సీసీ టీవీ ఫుటేజిలో ఆ యువకుల దాష్టీకం బయటపడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. వైఎస్సార్ జిల్లా మైదుకూరు మున్సిపాలిటీలోని శెట్టివారిపల్లె గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో అల్లాడుపల్లె వీరారెడ్డి (75) డిసెంబర్ 6న మృతి చెందాడు. మరునాడు ఉదయం మంచంపైనే వీరారెడ్డి మరణించినట్లు గమనించిన భవనం యజమాని అతని బంధువులకు తెలిపారు. అనారోగ్యంతో చనిపోయినట్లు బంధువులు, గ్రామస్తులు భావించారు. అంత్యక్రియలు చేశారు. రెండు రోజుల క్రితం నిర్మాణంలో ఉన్న ఇంటి సీసీ కెమెరాల ఫుటేజిని పరిశీలించగా వీరారెడ్డిది సహజ మరణం కాదని, హత్య అన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యువకులు వీరారెడ్డి మొఖంపై దిండు అదిమి పెట్టి, ఊపిరాడకుండా చేసినట్లు అందులో కనిపించింది. కొద్దిసేపు కాళ్లు కొట్టుకున్న వృద్ధుడు ఆ తర్వాత చలనం లేకుండా ఉండిపోయాడు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ఆ యువకులిద్దరూ వెళ్లిపోయారు. ఈ విషయం పోలీసులకు చేరింది. అయితే, ఫిర్యాదు లేకపోవడంతో పోలీసులు మిన్నకుండిపోయారు. గ్రామస్తులంతా ఈ విషయాన్ని బాహాటంగా చర్చించుకోవడంతో పోలీసులు విచారణ చేపట్టారు. అల్లాడుపల్లె హరినాథరెడ్డి, కాల్వపల్లె నరసింహాలు అనే ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారిలో హరినాథరెడ్డి వీరారెడ్డికి స్వయానా మనుమడు కావడం విశేషం. హత్యతో ఆగని ఆ యువకులు ఓ యువతిని చెరబట్టేందుకు ప్రయత్నించారు. దాంతో వ్యవహారం మరింతగా ప్రచారంలోకి వచ్చింది. వీరిద్దరూ టీడీపీ కార్యకర్తలు కావడం, ఫిర్యాదు లేకపోవడంతో పోలీసులు వారిపై చర్యలకు వెనక్కి తగ్గినట్లు సమాచారం. వృద్ధుడి హత్యకు కారణాలు తెలియరాలేదు. -
ఐపీఎల్లో అనంతపురం యువకుడికి బంపర్ ఆఫర్!
అనంతపురం: జిల్లాకు చెందిన వర్ధమాన క్రికెటర్ కేహెచ్ వీరారెడ్డికి అరుదైన అవకాశం దక్కింది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)లో అత్యుత్తమ ప్రదర్శనతో రాయలసీమ కింగ్స్ జట్టు విజయానికి కారణమైన వీరారెడ్డి.. ఆ టోర్నీలో ఎమర్జింగ్ ప్లేయర్‌గా అవార్డు దక్కించుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోనే రెండో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డు సైతం నెలకొల్పిన ఆయన ఆటతీరుపై ప్రశంసలూ వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే తమ జట్టులో ప్రాతినిథ్యం వహించాలంటూ ముంబయి ఇండియన్స్‌తో పాటు రాజస్తాన్ రాయల్స్ నుంచి ఆయనకు పిలుపు అందింది. అయితే నాగపూర్‌లో జరిగే మూడు రోజుల శిక్షణకు హాజరు కావాలన్న రాజస్తాన్ రాయల్స్ పిలుపుపైనే వీరారెడ్డి మక్కువ చూపుతున్నట్లు తెలిసింది. ఈ అవకాశం దక్కితే అనంతపురం ఉమ్మడి జిల్లా నుంచి ఐపీఎల్లో అరంగ్రేటం చేసిన తొలి క్రికెటర్‌గా ఆయన ఖ్యాతి గడించనున్నారు. -
ఇటు నుంచి ఇటే జైలుకు పంపేవాళ్లం
సాక్షి, హైదరాబాద్: ఓ భూ వివాదానికి సంబంధించి సింగిల్ జడ్జి ఉత్తర్వులను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీవో ఎస్.శ్రీను, తహసీల్దార్ యు.ఉమాదేవిలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ పిటిషన్లపై అప్పీల్ దాఖలు చేసిన కేసుల్లో సదరు అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించినా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించింది. ఈ రోజు విచారణకు హాజరై ఉంటే.. ఇటు నుంచి ఇటే ఈ ముగ్గురిని జైలుకు పంపేవాళ్లమని హెచ్చరించింది. ఓ భూ వివాదం వ్యవహారంలో ఈ ముగ్గురు అధికారులకు 2 నెలల జైలు, రూ.2 వేలు జరిమానా విధిస్తూ 2020 డిసెంబర్ 15న సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన అప్పీళ్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా సదరు అధికారులు హాజరయ్యారా అని ధర్మాసనం ప్రశ్నించగా.. లేదని ప్రభుత్వ న్యాయవాది చెప్ప డంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘సింగిల్ జడ్జి ఆదేశాల్లో లోపం ఎక్కడ ఉందో చెప్పకుండా ఆదేశాలను అమలు చేయలే దు. పైగా కోర్టు ఆదేశాలను తమకు అనుకూలంగా మల్చుకు నే ప్రయత్నం చేశారు. పిటిషనర్లకు పట్టాదార్ పాస్‌పుస్తకాలు ఇవ్వాలని ఆదేశించినా.. ఇవ్వకపోగా రుజువు చేయకుండా పిటిషనర్ ఆక్రమణదారుడు అని ఎలా అంటారు? సింగిల్ జడ్జి ఉత్తర్వులపై అభ్యంతరముంటే ఆ ఉత్తర్వులను ఎత్తేయా లని కోరాలి. ఇవేమీ చేయకుండా నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ చేయాల్సిందంతా చేసి బేషరతు క్షమాపణలు కోరితే అంగీకరించం’అని కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణకు ఈ ముగ్గురు అధికారులు హాజరుకావాలని స్పష్టం చేస్తూ విచారణను ఏప్రిల్ 7కు వాయిదా వేసింది. సింగిల్ జడ్జి ఏమన్నారంటే.. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఈజె డేవిడ్.. ఎనిమిదేళ్ల క్రితం సంగారెడ్డి రెడ్డి జిల్లా కంది సమీపంలోని చిమ్నాపూర్‌లో ఐదెకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమికి పట్టాదార్ పాస్‌బుక్ ఇవ్వాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా.. అది ప్రభుత్వ భూమి అని రెవెన్యూ అధికారులు అభ్యర్థనను తిరస్కరించారు. దీంతో డేవిడ్ హైకోర్టును ఆశ్రయించగా.. రెవెన్యూ అధికారులు పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జి ఆదేశించారు. అయితే.. ఈ భూమికి సంబంధించి విలేజ్ మ్యాప్, టిప్పన్, వసూల్ బక్వాయి, సేత్వా ర్ తదితర రికార్డులు లేవని, ఇవి ‘ఖిల్లాదాఖ్లా’భూములంటూ డేవిడ్ దరఖాస్తును తహసీల్దార్ తిరస్కరించారు. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ ఆర్డీవో, తర్వాత అదనపు కలెక్టర్ ముందు అప్పీల్ దాఖలు చేయగా.. తహసీల్దార్ ఆదేశాలను సమర్థిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ నేపథ్యంలో కోర్టు ధిక్కరణ కింద డేవిడ్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సింగిల్ జడ్జి జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు.. అధికారులు ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ ముగ్గురికి రెండు నెలల జైలు, రూ.2 వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. -
మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి కన్నుమూత
సాక్షి, మహబూబ్‌నగర్: అమరచింత మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్‌గా పని చేశారు. వీరారెడ్డి మృతితో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వీరారెడ్డి మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం ప్రకటించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
సింగరేణికి కొత్త డైరెక్టర్లు..
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో ఇద్దరు కొత్త డైరెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమిం చింది. ప్రాజెక్టులు, ప్లానింగ్ (పి–పి) విభాగం డైరెక్టర్‌గా బి.వీరారెడ్డి, ఎలక్ట్రికల్–మెకానికల్ విభాగం డైరెక్టర్‌గా డి.సత్యనారాయణను నియమించింది. ఖాళీగా ఉన్న రెండు డైరెక్టర్ పోస్టుల భర్తీకి శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ నేతత్వంలోని ఎంపిక కమిటీ ఇంటర్వూ్యలు నిర్వహించి వీరిద్దరి పేర్లను ఖరారు చేసింది. కమిటీలో ఇంధనశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్, కోలిండియా నుంచి శేఖర్ సరన్, కేంద్ర బొగ్గు శాఖ సెక్రటరీ పి.ఎస్.ఎల్.స్వామి ఉన్నారు. వీరారెడ్డి గతంలో అడ్రియాల లాంగ్ వాల్ జనరల్ మేనేజర్‌గా పనిచేశారు. డి.సత్యనారాయణ రావు ప్రస్తుతం భూగర్భ గనుల జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. డైరెక్టర్ (పి–పి) పోస్టులకు మొత్తం ఐదుగురు సీనియర్ జనరల్ మేనేజర్ హోదాలు కలిగిన వీరారెడ్డి, జి.వెంకటేశ్వరరెడ్డి, ఎస్.డి.ఎం. సుభానీ, కె.గురవయ్య, హబీబ్ హుస్సేన్‌లను, డెరైక్టర్ (ఎక్ట్రికల్–మెకానికల్) పోస్టులకు సీనియర్ జనరల్ మేనేజర్ హోదా కలిగిన డి.సత్యనారాయణ రావు, జి.ఎస్. రాంచంద్రమూర్తి, ఎం.నాగేశ్వర్ రావు, డి.వి.ఎస్.సూర్యనారాయణలను పిలిచారు. -
మళ్లీ బరిలోకి !
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఉంది.. ఉమ్మడి జిల్లా సహకార సొసైటీ బ్యాంకు(డీసీసీబీ)కు ఏకధాటిగా 13 ఏళ్ల నుంచి కొనసాగుతుండడంతో అన్ని ప్రాంతాలపై పట్టు ఉంది.. ఉమ్మడి రాష్ట్రంలో కేబినెట్ ర్యాంకుతో ప్రభుత్వ విప్‌గా పనిచేసిన సత్తా ఉంది.. అలాంటి నేత ప్రస్తుతం మరోసారి ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు.. ఆయనే పాలమూరు రాజకీయ భీష్ముడిగా పేరొందిన కె.వీరారెడ్డి. ‘సాక్షి’కి శుక్రవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో వీరారెడ్డి తన మనోగతాన్ని వెల్లడించారు. బ్యాంకు అభివృద్ధి, రైతులకు చేసిన సేవలతో పాటు రాజకీయ అనుభవం, ఈసారి ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతుండడానికి కారణాలు, ఉమ్మడి జిల్లా నేతలతో రాజకీయ సంబంధాలు.. ఇలా పలు అంశాలు చెప్పుకొచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.... రైతులకు అండగా నిలిచాం... జిల్లా సహకార సొసైటీ బ్యాంకు(డీసీసీబీ)ని రైతులకు చేరువ చేయడంలో విజయం సాధించగలిగాను. అందుకే ఏకధాటిగా 13 ఏళ్లుగా డీసీసీబీ చైర్మన్‌గా కొనసాగుతున్నా. రైతుల్లో నాపై నమ్మకం ఉండడంతోనే చైర్మన్‌గా ఎన్నుకుంటున్నా రు. సహకార ఎన్నికల సందర్భంగా పోటీ చేస్తామే తప్ప.. అనంతరం రాజకీయాలకు అతీతంగా రైతులకు అందుబాటులో ఉంటూ వారికి సేవ చేస్తున్నా. రుణాల మంజూరు విషయంలో అర్హులైన వారందరికీ అందజేస్తాం. అందుకే ఇన్నాళ్లుగా ఎలాంటి మచ్చ లేకుండా చైర్మన్‌గా కొనసాగగలుగుతున్నా. నూతన ఒరవడి డీసీసీబీ చైర్మన్‌గా బ్యాంకు అభివృద్ధి కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చా. గతంలో లోటు పరిస్థితి ఉండగా.. గత ఎనిమిదేళ్లుగా లాభాల్లోకి తీసుకొచ్చాం. ప్రస్తుతం బ్యాంకు వార్షికంగా రూ.2.48 కోట్ల లాభంతో నడుస్తోంది. ఉమ్మడి జిల్లాలో లక్ష మందికి పైగా రైతులకు రూ.865 కోట్ల రుణాలు అందజేశాం. నేను బ్యాంకు పగ్గాలు చేపట్టాకే బంగారు ఆభరణాలపై రుణాలు అందజేస్తున్నాం. డిపాజిట్లు కూడా రూ.277 కోట్లకు పెరిగాయి. అలాగే ప్రభుత్వ రంగం వాటిల్లో రూ.176 కోట్లను పెట్టుబడి పెట్టాం. ఈ ఏడాది పంట రుణాలను రూ.350 కోట్ల లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటి వరకు రూ.250 కోట్లు అందజేశాం. ఈ 13 ఏళ్ల కాలంలో సంస్థకు స్థిరాస్థులు సమకూర్చగలిగా. ముఖ్యంగా తొమ్మిది బ్రాంచ్‌లకు సొంత భవనాలు నిర్మించడం గర్వంగా ఉంది. ఆప్కాబ్ బాధ్యతలు.. అదృష్టం ఉమ్మడి రాష్ట్రంలో 2013లో ఆప్కాబ్ చైర్మన్‌గా బాద్యతలు దక్కడం అదృష్టంగా భావిస్తాను. ఆప్కా బ్ చైర్మన్‌గా తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వíßహించిన వారిలో నేను రెండో వాడిని. ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 17 ఏళ్ల తర్వాత ఆప్కాబ్ చైర్మన్ పదవిని తెలంగాణ ప్రాంతానికి ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. అప్పట్లో అంటే 2013లో మంత్రిగా ఉన్న డీకే అరుణ... సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు సహచర మంత్రులను ఒప్పించి నాకు పదవి ఇప్పించగలిగారు. ఆ సమయంలో కరీంనగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తికి పదవి కోసం మంత్రిగా ఉన్న దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తీవ్రంగా ప్రయత్నించినా డీకే.అరుణ పట్టుదలతో నాకే దక్కింది. డీకేతో వైరం లేదు.. ఆప్కాబ్ చైర్మన్‌తో పాటు డీసీసీబీ చైర్మన్ కావడంలో డీకే.అరుణ కృషి ఉంది. అలాంటిది ఆమెతో నాకు వైరం ఏర్పడినట్లు ప్రచారం చేయడం కరెక్టు కాదు. కాకపోతే రాజకీయంగా నిలదొక్కుకోవడం కోసం ఎమ్మెల్యేగా బరిలో నిలవాలని భావిస్తున్నా. గతంలో నేను అమరచింత(ప్రస్తుతం ఈ స్థానం రద్దయ్యింది) ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. 1978 నుంచి 83 వరకు ఓసారి, 1989 నుంచి 94 వరకు మ రోసారి గెలుపొందాను. రెండోసారి గెలిచినప్పు డు కేబినెట్ ర్యాంకుతో ప్రభుత్వ విప్‌గా పనిచేశా ను. అనంతరం పార్టీలో నెలకొన్న పరిస్థితుల కారణంగా కాంగ్రెస్ తరఫున టికెట్ దక్కలేదు. అప్ప టి నుంచి ఎమ్మెల్యేగా బరిలో నిలవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. గత ఎన్నికల సందర్భంగా బరిలో దిగాలని భావించినా డీసీసీబీ చైర్మన్‌గా ఉన్నాననే కారణంగా టికెట్ నిరాకరించారు. అందుకే ఈసారి చివరి ప్రయత్నంగా ఓసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నా. అయి తే నేను గతంలో ప్రాతినిధ్యం వహించిన అమరచింత 2009లో రద్దయి అందులోని మండలాలు మూడు నియోజకవర్గాల్లోకి వెళ్లాయి. ఆత్మకూరు, అమరచింత, నర్వ మండలాలు మక్తల్ నియోజకవర్గంలోకి, ధన్వాడ, మరికల్ మండలాలు నారాయణపేట నియోజకవర్గంలోకి, సీసీ కుంట, దేవరకద్ర మండలాలు దేవరక్రద నియోజకవర్గంలోకి వెళ్లాయి. ఇందులో కాస్త పట్టున్న మండలాలు మక్తల్‌లో కలిసినందున అక్కడి నుంచి బరిలో దిగాలని బావిస్తున్నా. లేదంటే నారాయణపేట అయినా ఓకే. అందుకు అనుగుణంగానే రెండు నియోజకవర్గాల్లో ఎక్కడ అవకాశం ఇచ్చినా సరే అని కాంగ్రెస్ అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు. అందుకే జైపాల్‌రెడ్డి వెంట.. ఈసారి ఎట్టి పరిస్థితిలో ఎమ్మెల్యేగా బరిలో నిలవాలని కొంత కాలంగా ప్రయత్నిస్తున్నా. ఈ విషయమై పార్టీ ముఖ్యనేత డీకే.అరుణను సంప్రదించినా ఎలాంటి హామీ లభించలేదు. మక్తల్ లేదా నారాయణపేట నుంచి అవకాశం కల్పించాలని విన్నవించాను. కానీ రెండు చోట్ల కూడా నాకు అవకాశం కల్పించడం లేదు. నారాయణపేటలో నేను ముందు నుంచి పనిచేస్తున్నా... నన్ను కాదని టీఆర్ఎస్ నేత శివకుమార్‌ను తీసుకొచ్చారు. అందులో భాగంగానే ముందు నుంచి పనిచేస్తున్న అందరం కలిసి నారాయణపేటలో సభ ఏర్పాటు చేసి జైపాల్‌రెడ్డిని ఆహ్వానించాల్సి వచ్చింది. ఇవన్నీ రాజకీయంగా, కాకతాళీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలే తప్ప డీకే.అరుణతో వ్యక్తిగతంగా ఎలాంటి వైరం లేదు. -
క్రికెట్లో బాల'వీర'
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఈ బాలవీరకు పట్టుమని పన్నెండేళ్లు ఉంటాయి. ఆరేళ్ల వయసు నుంచే క్రికెట్ ఆడడమంటే అంటే ఆసక్తి. లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేయలేదు.. నిరంతర సాధన మరవలేదు. చదువునూ పక్కనపెట్టలేదు. బ్యాట్ పట్టి మైదానంలోకి దిగితే ‘శత’క్కొట్టుడే అతని గురి. జిల్లా, అంతర జిల్లాలు, రాష్ట్ర స్థాయిలోనూ రాణిస్తున్నాడు. జాతీయ జట్టుకు సారథ్యమే తన లక్ష్యమని చెప్తున్నాడు అనంతపురం నగరానికి చెందిన వీరారెడ్డి. అనంతపురం నగరంలోని రామచంద్రనగర్‌కు చెందిన కోగటం విజయభాస్కర్‌రెడ్డి, కోగటం శ్రీదేవి దంపతుల కుమారుడు వీరారెడ్డి. తల్లి అనంతపురం మాజీ కార్పొరేటర్. వీరారెడ్డి ప్రస్తుతం నారాయణ పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్నాడు. తన 6 ఏళ్ల వయస్సు నుంచే క్రికెట్ అంటే మక్కువ ఏర్పడింది. కోచ్ చంద్రమోహన్‌రెడ్డి వద్ద మెలకువలు నేర్చుకున్నాడు. జట్టులో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ వీరారెడ్డి ఆటతీరును చూసి అండర్ –12 జిల్లా జట్టుకు సారధ్య బాధ్యతలు అప్పగించారు. తనదైన ఆటతీరుతో జిల్లా జట్టు విజేతగా నిలవడంలో కీలకపాత్ర వహించాడు. 11 ఏళ్లకే అండర్–14 జట్టులో చోటు సంపాదించడమే కాకుండా ఆ జట్టును విజయపథంలో నడిపించాడు. నిరంతర సాధనే బలం ప్రస్తుతం ఆంధ్ర క్రికెట్లో ప్రత్యేకత చాటుకుంటున్న వీరారెడ్డికి నిరంతర ప్రాక్టీసే బలం. రోజూ ఐదు గంటల పాటు సాధన చేస్తాడు. ఉదయం 6 నుంచి 8 వరకు.. సాయంత్రం 5 నుంచి 8 వరకు ప్రాక్టీస్ చేస్తుంటాడు. అంతర్జాతీయ క్రికెటర్లు ధోని, కోహ్లి, రోహిత్ లాంటి వారి ఆటతీరును చూసి, మెలకువలు పాటిస్తున్నాడు. ‘శత’కమే అతని లక్ష్యం ♦ అండర్–14 విభాగంలో అర్థ సెంచరీని సాధించాడు. ♦ అండర్–12 అంతర్ జిల్లా క్రీడా పోటీల్లో 4 మ్యాచ్‌లు ఆడగా మూడింట్లో నాటౌట్‌గా నిలిచాడు. ♦ గుంటూరులో జరిగిన మ్యాచ్‌లో 89 పరుగులు సాధించి బెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా ఎంపికయ్యాడు. ♦ గతేడాది రాష్ట్ర క్యాంపునకు ఎంపికయ్యాడు. ♦ అంతర్ జిల్లా క్రీడా పోటీల్లో రెండు అర్థ సెంచరీలు చేశాడు. ♦ 11 ఏళ్లకే అండర్–14 జట్టులో చోటు సాధించడమే కాకుండా 150 పరుగులు సాధించిన ఘనత దక్కింది. ♦ గత రెండేళ్లలో వివిధ ప్రాంతాల్లో జరిగిన మ్యాచ్‌ల్లో 33 అర్థ సెంచరీలు, 3 సెంచరీలు సాధించాడు. ♦ ఆత్మకూరు జట్టుపై 106 పరుగులతో అజేయంగా నిలిచాడు. సౌత్‌జోన్ జట్టుకు ఎంపికయ్యాడు. మంగళగిరిలో నిర్వహించే కోచింగ్ క్యాంపునకు ఎంపికయ్యాడు. అన్ని విభాగాల్లోనూ విజయమే వీరారెడ్డి జట్టులో బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ తనదైన గుర్తింపు దక్కించుకుంటున్నాడు. అండర్–12 అంతర్ జిల్లా క్రీడా పోటీల్లో 4 మ్యాచ్‌లు ఆడి 6 వికెట్లు తీశాడు. ఫీల్డింగ్‌లోనూ సత్తాచాటుతున్నాడు. బెస్ట్ ఆల్‌రౌండర్‌గానూ రాణిస్తూ అందరి మన్ననలను అందుకుంటున్నాడు. -
స్తంభంపైనే రైతు మృత్యువాత
కోహెడ రూరల్: ఫ్యూజును సరిచేస్తుండగా ఓ రైతు విద్యుత్ స్తంభంపై మృత్యువాత పడ్డాడు. సిద్దిపేట జిల్లా వరికోలు గ్రామానికి చెందిన కొట్టే వీరారెడ్డి (30) సోమవారం సాయంత్రం తన పొలం పనుల్లో ఉండగా ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫ్యూజ్ సమస్య తలెత్తింది. విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి లైన్‌కు సరఫరా నిలిపివేయించాడు. వెంటనే ట్రాన్స్ఫార్మర్ ఉన్న స్తంభం పైకి ఎక్కి ఫ్యూజ్‌ను సరి చేస్తుండగా విద్యుత్ సరాఫరా అయ్యింది. దీంతో విద్యుదాఘాతానికి గురైన వీరారెడ్డి స్తంభంపైనే ప్రాణాలొదిలాడు. ఎల్సీ తీసుకుని పనులు చేస్తుండగా, విద్యుత్ ఎలా సరఫరా చేస్తారంటూ గ్రామస్తులు మండిపడ్డారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతు కుటుంబానికి న్యాయం జరిగే వరకు స్తంభం పై నుంచి మృతదేహన్ని కిందకు దించబోమని భీష్మించారు. -
మనమే పవర్ స్టార్లం
కరెంటు కష్టాలకు సోలార్ ‘శక్తి’ సోలార్ యూనిట్ల కోసం పెరుగుతున్న దరఖాస్తులు {పజలపై తగ్గుతున్న భారం కోతల నుంచి విముక్తి 199 కేంద్రాల్లో 3700 మెగవాట్లకు ఉత్పత్తి ఈయన పేరు పి.వీరారెడ్డి. హైదర్‌గూడలో నివాసం. ఇంట్లో రెండు ఏసీలు, ఫ్రిజ్, నాలుగు ఫ్యాన్లు, టీవీ, పది లైట్లు ఉన్నాయి. నెలకు సరాసరి విద్యుత్ బిల్లు రూ.2 వేలకుపైగా వచ్చేది. అధిక బిల్లులకు తోడు విద్యుత్ కోత. విద్యుత్ కష్టాల నుంచి గట్టెక్కాలని ప్లాన్ చేశారు. సోలార్ విద్యుత్ ద్వారా లబ్ధి పొందవచ్చన్న విషయం తెలుసుకున్నారు. రూఫ్‌టాప్ సోలార్ పథకానికి ప్రభుత్వం ఇచ్చే రాయితీతో సోలార్ యూనిట్‌ను కొనుగోలు చేశారు. చకచకా మూడు కిలోవాట్లు సామర్థ్యం కలిగిన సోలార్ పలకలను ఇంటిపై అమర్చారు. గ్రిడ్‌కు అనుసంధానం చేశాడు. బిల్లు రెండొందలకు పడిపోయింది.. అంతే కాందడోయ్ మిగులు విద్యుత్‌ను డిస్కంకు విక్రయిండం ద్వారా అదనంగా ఆదాయం కూడా పొందుతున్నారు.. ఇంకెందుకు ఆలస్యం విద్యుత్‌ను ఉత్పత్తి చేద్దాం పదండి సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నెలకొని ఉంది. కరెంటు ఎప్పుడు వస్తుందో..పోతుందో తెలియని పరిస్థితి..గతేడాది శీతాకాలం వచ్చే వరకూ కూడా కోతలు అమలయ్యాయి.. మరో వైపు గుండె గు‘బిల్లు’మనిపించే చార్జీలు.. కరెంటు కష్టాల నుంచి బయటపడేందుకు గ్రేటర్ వాసులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషణ మొదలెట్టారు. రూఫ్‌టాప్ సోలార్ నెట్ మీటరింగ్ పథకం ద్వారా కలిగే లబ్ధిని తెలుసుకున్నారు. ఇళ్లపై సోలార్ యూనిట్లను ఏర్పాటు ద్వారా కోతలు..అధిక బిల్లుల నుంచి విముక్తి..అదనంగా ఉన్న కరెంటు గ్రిడ్‌కు విక్రయించి ఆదాయం పొందవచ్చు.. ఈ విషయాలను తెలుసుకున్న సిటిజనులు తెలంగాణ దక్షిన మండల విద్యుత్ పంపిణీ సంస్థకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకూ తొమ్మిది సర్కిళ్ల పరిధిలో 520 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో ఇప్పటికే 199 సోలార్ యూనిట్లను అనుమతి ఇచ్చారు. 3700 మెగావాట్లకుపైగా విద్యు త్ ఉత్పత్తి అవుతోంది. మారుతున్న ఆలోచనా ధోరణి గ్రేటర్ పరిధిలో 38 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. గృహ విద్యుత్ కనెక్షన్లు 31 లక్షలు, వాణిజ్య కనెక్షన్లు 5.20 లక్షలు, చిన్న, మధ్య తరహా భారీ పరిశ్రమలు 40 వేలు, వీధి లైట్లు లక్ష ఉండగా, ప్రకటనల బోర్డులు 3200పైగా ఉన్నాయి. వీటి అవసరాలు తీర్చాలంటే రోజుకు సగటున 45 మిలియన్ యూనిట్లు అవసరం. ప్రస్తుతం 40 మిలియన్లకు మించి సరఫరా కావడం లేదు. డిమాండ్‌కు సరఫరాకు మధ్య వ్యత్యాసం నమోదవుతుండడంతో అత్యవర లోడ్ రిలీఫ్ పేరుతో ఇష్టం వచ్చినట్లు అనధికారిక కోతలు అమలవుతున్నాయి. విద్యుత్ సంక్షోభం నుంచి గట్టేక్కేందుకు ప్రజలు తమ ఆలోచన ధోరణిని మార్చుకుంటున్నారు. ఎవరి అవసరాలకు అనుగునంగా వారే స్వయంగా ఇంటిపై సోలార్ యూనిట్లను ఏర్పాటు చేసుకుని విద్యుత్ ఉత్ప త్తి చేస్తూ, అవసరానికి వాడుకోగా మిగులు విద్యుత్‌ను యూనిట్‌కు రూ.3.38 చొప్పున డిస్కంకు విక్రయిస్తున్నారు. గుజరాతే ఆదర్శం... కేంద్రప్రభుత్వం 2010లో జవహర్లాల్ నెహ్రూ జాతీయ సోలార్ మిషన్ ఏర్పాటు చేసింది. 2009 సెప్టెంబర్‌లోనే క్లింటన్ ఫౌండే షన్తో గుజరాత్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 2010లో చర్నకా గ్రామంలో సౌర విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి ఇప్పటికే 224 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. గుజరాత్‌ను రాజస్థాన్ అనుసరించి జోధాపూర్, జైసల్మీర్ జిల్లాల్లో రెండు పార్కులు ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, జమ్ము, కశ్మీర్, పంజాబ్, ఒడిసా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు అదే బాటలో నడుస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలంలో ఐదువేల ఎకరాల సాగుకు యోగ్యం కాని భూమిలో సోలార్ పార్కును ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ప్లాంటు సకాలంలో పూర్తయియే విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కవచ్చని నిపుణులు అభిప్రాయడుతున్నారు. తగ్గిన బిల్లు ‘సికింద్రాబాద్ గాంధీ జనరల్ ఆస్పత్రి . 2014 సెప్టెంబర్‌లో రూ.3.5 కోట్ల ఖర్చుతో 400 కిలోవాట్ సామర్థ్యం కలిగిన సోలార్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ఆస్పత్రికి నెలకు రూ.21-22 లక్షల వచ్చే కరెంట్ బిల్లు, జనవరిలో రూ.19 లక్షలు వస్తే ఫిబ్రవరిలో రూ.17.70 ల క్షలు వచ్చింది. సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత ఆస్పత్రికి వచ్చే నెలసరి విద్యుత్ బిల్లు భారీగా తగ్గిపోయింది. రోగులకు కష్టాలు తప్పాయి. -
భర్త హత్య కేసులో భార్య అరెస్టు
రాజోలు, న్యూస్‌లైన్ : భర్తను హతమార్చిన కేసులో ములికిపల్లి గ్రామానికి చెందిన నిందితురాలు దుర్గాభవానిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం సీఐ పెద్దిరాజు విలేకరులకు వివరాలు వెల్లడించారు. అనుమానంతో వేధిస్తున్న భర్త బత్తుల సత్యనారాయణ(60)ను భార్య దుర్గాభవాని ఈ నెల 25వ తేదీ రాత్రి హతమార్చింది. గ్రామంలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకలు చూసేందుకు వెళ్లిన భార్యాభర్తలు మద్యం తాగి ఇంటికి చేరుకున్నారు. అనంతరం ఇద్దరు గొడవ పడ్డారు. ఈ క్రమంలో దుర్గాభవాని ఇంట్లో బియ్యం డబ్బా పక్కనే ఉన్న కత్తి తీసుకుని భర్తపై విరుచుకుపడింది. తీవ్రంగా గాయపడ్డ భర్త చనిపోయాడనుకుని ఇంటి ఎదురుగా ఉన్న పంట కాలువలో పడేసింది. కాలువలో కొనఊపిరితో ఉన్న భర్తను గమనించి పైకి తీసింది. ఇటుకతో అతడి తలపై బలంగా మోది హతమార్చింది. అతడి మృతదేహాన్ని సుమారు 100 మీటర్ల దూరంలో ఉన్న కడలి డ్రెయిన్‌లో పడేసింది. ఇంట్లో ఉన్న రక్తపు మరకలు, వాకిట్లో ఉన్న రక్తపు మరకలను తొలగించేందుకు పేడతో అలికివేసింది. ఆదివారం రాజోలు బస్టాండ్ ఆవరణలో ఉన్న దుర్గాభవానిని పోలీసులు అరెస్టు చేసి, మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. అమలాపురం డీఎస్పీ వీరారెడ్డి ఆధ్వర్యంలో ట్రైనీ డీఎస్పీ దిలిప్‌కిరణ్, సీఐ పెద్దిరాజు కేసు దర్యాప్తు చేశారు. -
నైతిక విలువలు పాటిస్తేనే మానసిక ఆరోగ్యం
కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్ : యువత నైతిక విలువలు పాటించాలని, తద్వారా మానసిక ఆరోగ్యం కలుగుతుందని ఐసీఎస్ఎస్ఆర్ గౌరవ డెరైక్టర్, ఓయూ రిటైర్డ్ రిజిస్ట్రార్, మనో విజ్ఞానశాస్త్ర ప్రధాన అధ్యాపకురాలు ప్రొఫెసర్ బీనా అన్నారు. శుక్రవారం జిల్లా జైలులో ‘నేరాలు-సామాజిక బాధ్యత, ఆత్మహత్యలు-నివారణ’ అంశాలపై ఖైదీలతో నిర్వహించిన మానసిక వికాస కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఒక్క నిమిషం మనస్సును అదుపులో పెట్టుకోలేకపోతే.. విచక్షణ కోల్పోయేలా ఆవేశానికి గురిచేస్తుందన్నారు. వ్యసనాలకు దూరంగా ఉంటూ, మనస్సును అదుపులో పెట్టుకోవాలని సూచించారు. నీతి, నీజాయితీతో మెలిగినప్పుడే నైతివ విలువలు పెరుగుతాయని, తద్వారా మానసిక ఆరోగ్యం కలుగుతుందన్నారు. మరో ముఖ్య అతిథి, శాతావాహన యూనివర్శిటీ వీసీ వీరారెడ్డి మాట్లాడుతూ, తెలియక చేసిన తప్పులను సరిదిద్దుకోవడమే ఉత్తమమన్నారు. అనంతరం బీనాను సన్మానించారు. అంతకుముందు అవగాహన సదస్సులు నిర్వహించినందుకు గాను ప్రశంసపత్రం అందజేశారు. జిల్లా జైలు సూపరింటెండెంట్ గౌరి రామచంద్రం, అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్‌రెడ్డి, జైలర్ సోమయ్య, సైకాలజీ కౌన్సెలర్ మహేందర్, మెడికల్ ఆఫీసర్ మొయినొద్దిన్, డెప్యూటీ జైలర్ సుధాకర్‌రెడ్డి, జైలు సిబ్బంది, ఖైదీలు పాల్గొన్నారు.