రాజోలు, న్యూస్‌లైన్ : భర్తను హతమార్చిన కేసులో ములికిపల్లి గ్రామానికి చెందిన నిందితురాలు దుర్గాభవానిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం సీఐ పెద్దిరాజు విలేకరులకు వివరాలు వెల్లడించారు. అనుమానంతో వేధిస్తున్న భర్త బత్తుల సత్యనారాయణ(60)ను భార్య దుర్గాభవాని ఈ నెల 25వ తేదీ రాత్రి హతమార్చింది. గ్రామంలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకలు చూసేందుకు వెళ్లిన భార్యాభర్తలు మద్యం తాగి ఇంటికి చేరుకున్నారు. అనంతరం ఇద్దరు గొడవ పడ్డారు. ఈ క్రమంలో దుర్గాభవాని ఇంట్లో బియ్యం డబ్బా పక్కనే ఉన్న కత్తి తీసుకుని భర్తపై విరుచుకుపడింది.
తీవ్రంగా గాయపడ్డ భర్త చనిపోయాడనుకుని ఇంటి ఎదురుగా ఉన్న పంట కాలువలో పడేసింది. కాలువలో కొనఊపిరితో ఉన్న భర్తను గమనించి పైకి తీసింది. ఇటుకతో అతడి తలపై బలంగా మోది హతమార్చింది. అతడి మృతదేహాన్ని సుమారు 100 మీటర్ల దూరంలో ఉన్న కడలి డ్రెయిన్‌లో పడేసింది. ఇంట్లో ఉన్న రక్తపు మరకలు, వాకిట్లో ఉన్న రక్తపు మరకలను తొలగించేందుకు పేడతో అలికివేసింది. ఆదివారం రాజోలు బస్టాండ్ ఆవరణలో ఉన్న దుర్గాభవానిని పోలీసులు అరెస్టు చేసి, మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. అమలాపురం డీఎస్పీ వీరారెడ్డి ఆధ్వర్యంలో ట్రైనీ డీఎస్పీ దిలిప్‌కిరణ్, సీఐ పెద్దిరాజు కేసు దర్యాప్తు చేశారు.
భర్త హత్య కేసులో భార్య అరెస్టు
Published Mon, Dec 30 2013 1:16 AM | Last Updated on Fri, Jul 27 2018 2:21 PM
Advertisement
Advertisement