మోహన్‌బాబు కుటుంబ వివాదంలో హైకోర్టు సూచన
మొదట పరిష్కరించుకునే అవకాశం ఇవ్వండి... తర్వాత చట్ట ప్రకారం వెళ్లొచ్చు
మోహన్‌బాబు నివాసం వద్ద భద్రత పరిస్థితిని సమీక్షించండి
కుటుంబ వివాదంలో మీడియా ఇంత హంగామా ఎందుకన్న జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి
సీపీ విచారణకు హాజరు నుంచిమోహన్ బాబు, విష్ణుకు మినహాయింపు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబ వివాదాల్లో అతిగా జోక్యం వద్దని పోలీసులకు హైకోర్టు సూచించింది. మొదట సమస్యను పరిష్కరించుకునే అవకాశం వారికి ఇవ్వాలని... అది సాధ్యం కాకుంటే చట్టప్రకారం ముందుకు వెళ్లాలని ఆదేశించింది.
మోహన్‌బాబు ఇంటి వద్ద పోలీస్ పికెట్ సాధ్యం కాకుంటే.. ప్రతి రెండు గంటలకోసారి భద్రత పరిస్థితిని సమీక్షిస్తూ ఉండాలని స్పష్టం చేసింది. అలాగే మోహన్‌బాబు, విష్ణులకు రాచకొండ పోలీసులు జారీ చేసిన నోటీసులను నిలిపివేసింది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.
మోహన్‌బాబు పిటిషన్‌తో..: తనపై దాడి చేశారంటూ మోహన్‌బాబు కుమారుడు, నటుడు మంచు మనోజ్ ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పహాడీ షరీఫ్ పోలీసులు.. బుధవారం ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని మోహన్‌బాబు, విష్ణు, మనోజ్‌లకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటీసులను సవాల్ చేస్తూ మోహన్‌బాబు బుధవారం హైకోర్టులో లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు.
ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, ఆస్పత్రిలో ఉన్నానని.. ఈ పరిస్థితుల్లో పోలీసుల విచారణకు హాజరుకాలేనని కోర్టుకు వివరించారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. ప్రభుత్వం తరఫున హోంశాఖ జీపీ మహేశ్‌రాజే వాదనలు వినిపిస్తూ.. పరస్పర ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసులు నమోదయ్యాయని వివరించారు. అలాగే జర్నలిస్టుపై దాడి చేసినందుకు మోహన్‌బాబుపై మరో క్రిమినల్ కేసు నమోదైందని తెలిపారు.
ఇక మనోజ్ బౌన్సర్లను తీసుకొచ్చి మోహన్‌బాబు ఇంట్లో తగాదా సృష్టిస్తున్నారని మోహన్‌బాబు తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. బీఎన్‌ఎస్‌ఎస్, సెక్షన్ 126 ప్రకారం రాచకొండ పోలీస్ కమిషనర్ జారీ చేసిన నోటీసులను కొట్టివేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. రాచకొండ పోలీసుల ఎదుట మోహన్‌బాబు, విష్ణు హాజరుకావాలన్న నోటీసులను నిలిపివేశారు.
శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా మోహన్‌బాబు ఇంటి చుట్టూ నిఘా ఉంచాలని పోలీసులను ఆదేశించారు. ఇక కుటుంబ వివాదంలో మీడియా ఎందుకింత హంగామా సృష్టిస్తోందని న్యాయమూర్తి ప్రశ్నించారు. సోషల్ మీడియాలో తప్పుడు కథనాలతో పరువుకు నష్టం కలిగించొద్దని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment