అర్ధరాత్రి వేళ వృద్ధుడిని హత్య చేసిన ఇద్దరు టీడీపీ కార్యకర్తలు
సహజ మరణంగా భావించి కుటుంబ సభ్యుల అంత్యక్రియలు
సీసీ పుటేజీలతో వ్యవహారం బహిర్గతం
ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు
టీడీపీ కార్యకర్తలు కావడంతో వెనక్కి తగ్గిన పోలీసులు
సాక్షి ప్రతినిధి, కడప: 2024 డిసెంబర్ 6వతేదీ సమయం అర్ధరాత్రి ఒంటిగంట. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో ఖాళీగా ఉన్న మంచంపై నిద్రిస్తున్న 75 ఏళ్ల వృద్ధుడిని టీడీపీ కార్యకర్తలైన ఇద్దరు యువకులు ఊపిరి ఆడకుండా తలపై దిండు అదిమిపెట్టి హత్య చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి జారుకున్నారు. వృద్ధుడు అనారోగ్యంతో చనిపోయాడని గ్రామస్తులు, బంధువులు భావించి, అంత్యక్రియలు చేశారు. ఆ తర్వాత సీసీ టీవీ ఫుటేజిలో ఆ యువకుల దాష్టీకం బయటపడింది.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. వైఎస్సార్ జిల్లా మైదుకూరు మున్సిపాలిటీలోని శెట్టివారిపల్లె గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో అల్లాడుపల్లె వీరారెడ్డి (75) డిసెంబర్ 6న మృతి చెందాడు. మరునాడు ఉదయం మంచంపైనే వీరారెడ్డి మరణించినట్లు గమనించిన భవనం యజమాని అతని బంధువులకు తెలిపారు. అనారోగ్యంతో చనిపోయినట్లు బంధువులు, గ్రామస్తులు భావించారు. అంత్యక్రియలు చేశారు.
రెండు రోజుల క్రితం నిర్మాణంలో ఉన్న ఇంటి సీసీ కెమెరాల ఫుటేజిని పరిశీలించగా వీరారెడ్డిది సహజ మరణం కాదని, హత్య అన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యువకులు వీరారెడ్డి మొఖంపై దిండు అదిమి పెట్టి, ఊపిరాడకుండా చేసినట్లు అందులో కనిపించింది. కొద్దిసేపు కాళ్లు కొట్టుకున్న వృద్ధుడు ఆ తర్వాత చలనం లేకుండా ఉండిపోయాడు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ఆ యువకులిద్దరూ వెళ్లిపోయారు. ఈ విషయం పోలీసులకు చేరింది. అయితే, ఫిర్యాదు లేకపోవడంతో పోలీసులు మిన్నకుండిపోయారు.
గ్రామస్తులంతా ఈ విషయాన్ని బాహాటంగా చర్చించుకోవడంతో పోలీసులు విచారణ చేపట్టారు. అల్లాడుపల్లె హరినాథరెడ్డి, కాల్వపల్లె నరసింహాలు అనే ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారిలో హరినాథరెడ్డి వీరారెడ్డికి స్వయానా మనుమడు కావడం విశేషం. హత్యతో ఆగని ఆ యువకులు ఓ యువతిని చెరబట్టేందుకు ప్రయత్నించారు. దాంతో వ్యవహారం మరింతగా ప్రచారంలోకి వచ్చింది. వీరిద్దరూ టీడీపీ కార్యకర్తలు కావడం, ఫిర్యాదు లేకపోవడంతో పోలీసులు వారిపై చర్యలకు వెనక్కి తగ్గినట్లు సమాచారం. వృద్ధుడి హత్యకు కారణాలు తెలియరాలేదు.
Comments
Please login to add a commentAdd a comment