గోడ కూలి హిటాచీ డ్రైవర్ దుర్మరణం
స్పిన్నింగ్‌మిల్లు పాత భవనాలను కూలదోస్తుండగా ఘటన
పనిచేస్తున్న వాహనంలోనే పోయిన ప్రాణం
మదనపల్లె: ఈరోజు పనిచూసుకుని పండక్కి ఇంటికి వచ్చేస్తానమ్మా.. అమ్మను ఇబ్బంది పెట్టకండి. చక్కగా చదువుకోండి. వచ్చేటప్పుడు మీకు కావాల్సినవి తీసుకువస్తా అని చెప్పిన మా నాన్న ఎందుకు చనిపోయాడు అంటూ పిల్లలు ఏడుస్తున్న తీరు ప్రభుత్వాసుపత్రిలో పలువురిని కలచివేసింది. మదనపల్లె మండలం సీటీఎం స్పిన్నింగ్ మిల్లులో పాత భవనాలను తొలగిస్తుండగా, ప్రమాదవశాత్తు భవనం గోడ హిటాచీ వాహనం మీద పడి డ్రైవర్ వాహనంలోనే ప్రాణాలు కోల్పోయిన ఘటన శనివారం జరిగింది. గోడ ఒక్కసారిగా వాహనం మీద పడటంతో డ్రైవర్ శరీరం వాహనంలో ఇరుక్కుపోయి రక్తసిక్తమైంది.
వైఎస్సార్ జిల్లా వల్లూరు మండలం కుమారునిపల్లెకు చెందిన నారాయణరెడ్డి, జయమ్మ దంపతుల కుమారుడు ఎస్.రమేష్‌రెడ్డి(40) హిటాచీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఉపాధి నిమిత్తం కదిరి పట్టణం అడపాలవీధి పంచాయతీ కార్యాలయం సమీపంలో నివసిస్తున్నాడు. ఇతనికి భార్య ప్రవీణ, కుమార్తెలు సాహితి(13), భవ్యశ్రీ(11), కుమారుడు రోచన్‌రెడ్డి(4) ఉన్నారు. స్థానికుడైన ఎస్వీ కన్‌స్ట్రక్షన్స్ యజమాని, కాంట్రాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి వద్ద 15 ఏళ్లుగా రమేష్‌రెడ్డి హిటాచీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రెండునెలల క్రితం సీటీఎం స్పిన్నింగ్ మిల్లు భవనాల తొలగింపు, చదును పనుల కోసం రమేష్‌రెడ్డి ఇక్కడకు వచ్చి పని చేస్తున్నాడు. పనులు దాదాపు చివరిదశకు చేరుకున్నాయి. కేవలం ఐదురోజుల పని మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో శనివారం పనిచేసి, పండుగకు ఇంటికి వస్తానని రమేష్‌రెడ్డి కుటుంబ సభ్యులకు శుక్రవారం రాత్రి ఫోన్ చేసి చెప్పాడు.
అయితే శనివారం ఉదయం హిటాచీతో స్పిన్నింగ్ మిల్లులోని పాత భవనాన్ని తొలగిస్తుండగా, శిథిల స్థితిలో ఉన్న పెద్దగోడ అటువైపు పడుతుందనే ఆలోచనతో, హిటాచీతో నెట్టుతుండగా, ప్రమాదవశాత్తు వాహనం మీద పడిపోయింది. డ్రైవర్ సీటులో ఉన్న రమేష్‌రెడ్డి అక్కడికక్కడే దుర్మరణం పాలై గోడ శిథిలాల కింద చిక్కుకుపోయి రక్తమోడుతూ వాహనంలోనే ఇరుక్కుపోయాడు. ప్రమాదంలో హిటాచీ వాహనం ధ్వంసమైంది. గమనించిన తోటిపనివారు పోలీసులకు, కాంట్రాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న డీఎస్పీ దర్బార్ కొండయ్య నాయుడు, పోలీస్ సిబ్బంది, స్థానికుల సహాయంతో శిథిలాలను తొలగించి, వాహనంలో ఇరుక్కుపోయిన రమేష్‌రెడ్డి మృతదేహాన్ని బయటకు తీశారు.
ఘటనకు సంబంధించిన వివరాలను అక్కడ ఉన్న వారిని అడిగి తెలుసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. రమేష్‌రెడ్డి భార్య ప్రవీణ ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. కాగా, సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి చేరుకుని రమేష్‌రెడ్డి మృతదేహాన్ని చూసి తల్లడిల్లిపోయారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న యజమాని గుర్తుపట్టలేని స్థితిలో శవమై పడి ఉండటాన్ని చూసిన భార్య, పిల్లలు గుండెలవిసేలా రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment