‘అమ్మా... ఆకలేస్తోంద’ని
ఎన్నిసార్లు అడిగారో...ఎంతలా అలిసిపోయారో..
అమ్మ తినిపించే గోరు ముద్ద కోసం ఎంతగా తపించిపోయారో... తల్లడిల్లిపోయారో..
అన్నం ముద్ద దొరక్క.. ఆకలి తీరక
ఊపిరొదిలిన ఆ పాపలకే తెలుసు..
పిల్లల ఆకలి తీర్చడం కోసం.. ఎన్ని గడపలు తొక్కారో.. కన్నబిడ్డలు దూరమై..
ఎంత వేదన అనుభవిస్తున్నారో...
బిడ్డలను కోల్పోయిన ఆ తల్లిదండ్రులకే తెలుసు..
నింగిలోకి రాకెట్లు దూసుకుపోతున్న యుగంలోనూ ఆకలిచావులు పలకరిస్తున్నాయి.
పౌష్టికాహారం దొరక్క అర్థంతరంగా ఆగిన ఈ రెండు నిండు ప్రాణాలు.. పాలకుల తీరును ప్రశ్నిస్తున్నాయి. సమాజంలోని అంతరాలకు అద్దం పడుతున్నాయి. జానెడు పొట్టకు గుక్కెడు పాలు అందించని అధికారుల అలసత్వాన్నిఎక్కిరిస్తున్నాయి. ఆకలైనప్పుడు పిడికెడు అన్నం దొరకనప్పుడు... జీవించడానికి అవసరమైన భరోసా ఇవ్వనప్పుడు.. కోట్ల రూపాయల బడ్జెట్లు ఎందుకంటూ హేళనగా నవ్వుతున్నాయి.
సిద్దవటం: పౌష్టికాహార లోపంతో ఇద్దరు చిన్నారులు చనిపోయిన సంఘటన అన్నమయ్య జిల్లా సిద్దవటం మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ విషయాన్ని వైద్య సిబ్బంది ధ్రువీకరించారు. సిద్దవటం మండలంలోని బొగ్గిడివారంపల్లె పంచాయతీ నిర్మలగిరి కాలనీ వద్ద ఖాళీ ప్రదేశంలో సంచార జీవనం చేసేవారు గుడారం వేసుకుని ఉంటున్నారు.
ఈ గుడారంలో నివాసం ఉంటున్న 5 సంవత్సరాలు, 2 సంవత్సరాల వయస్సుగల బాలికలకు ఇద్దరికి అస్వస్థతగా ఉందని పడుకొని ఉన్నా రు. పిలిస్తే పలకడం లేదని, రాత్రి నుంచి ఇరువురికి జ్వరం వస్తోందని, వారి గుడిసెలో ఉన్న పెద్దఅమ్మాయి సమీపంలోని గ్రామస్తులకు తెలిపింది. గ్రామస్తులతో విషయం తెలుసుకున్న బొగ్గిడివారిపల్లె గ్రామ సచివాలయ పరిధిలో ఉన్న ఏఎన్‌ఎం, ఆశా వర్కర్‌లు, 104 సిబ్బంది అక్కడికి వెళ్లి పరిశీలించారు.
అప్పటికే ఇద్దరు బాలికలు మరణించి ఉన్నారు. వారికి శరీరం పైన ఎలాంటి గాయాలు, విషపురుగులు కుట్టినట్లు గాని లేవన్నారు. కాగా చనిపోయిన పిల్లల తల్లిదండ్రులు సంచార జీవనం చేస్తున్నారు. వీరికి ఆరుగురు పిల్లలు. మంగళవారం చివరి ఇద్దరు పిల్లలు చనిపోయారు. వీరు ఈ ప్రాంతానికి వచ్చి సుమారు 10 రోజులు కావొస్తోందని, పిల్లలు ఇద్దరు చనిపోయినప్పుడు వీరి తల్లి దండ్రులు ప్లాస్టిక్ వస్తువులు ఏరుకునేందుకు, భిక్షాటన కోసం మాధవరం గ్రామంలోకి వెళ్లారు. కాగా.. ఇద్దరు చిన్నారుల మృతి వార్త తెలుసుకుని తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు వేదన చెందారు.
Comments
Please login to add a commentAdd a comment