ప్రొద్దుటూరులో రౌడీషీటర్‌ దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

ప్రొద్దుటూరులో రౌడీషీటర్‌ దారుణ హత్య

Published Tue, Dec 3 2024 12:57 AM | Last Updated on Tue, Dec 3 2024 12:11 PM

-

లాడ్జీలో మద్యం సీసాలతో కొట్టి చంపిన దుండగులు

పరారీలో ప్రధాన అనుమానితులు సునీల్‌, లోకేశ్వరరెడ్డి

పోలీసుల అదుపులో టీడీపీ నేత వీఎస్‌ ముక్తియార్‌ సోదరుడు ముజీబ్‌ 

పరారీలో నిందితులు..

ప్రొద్దుటూరు క్రైం: పట్టణంలోని ఓ లాడ్జీలో జరిగిన హత్య కలకలం రేపింది. రౌడీషీటర్‌ కొప్పుల రాఘవేంద్రకుమార్‌ అలియాస్‌ పప్పీ (30)ని మద్యం సీసాలతో తలపై కొట్టి దారుణంగా హత్య చేశారు. లాడ్జీలోని గదిలో రక్తపు మడుగులో పడి ఉండగా రూం బాయ్‌ గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. సాయికుటీర్‌ రోడ్డుకు చెందిన లోకేశ్వరరెడ్డి ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తుంటాడు. అతను శనివారం బీజీఆర్‌ లాడ్జీలో గది తీసుకున్నాడు. ఆ రోజు నుంచి పలువురితో కలిసి లాడ్జీలో మద్యం సేవించాడు. 

అతనికి సంజీవనగర్‌కు చెందిన పప్పీతో పరిచయం ఉంది. ఈ క్రమంలో రాఘవేంద్రతో పాటు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వీఎస్‌ముక్తియార్‌ సోదరుడు ముజీబ్‌, రెడ్డివారివీధికి చెందిన సునీల్‌ ఆదివారం రాత్రి లాడ్జీకి వెళ్లారు. అక్కడ అందరూ కలిసి మద్యం తాగారు. అర్ధరాత్రి దాటిన తర్వాత 12.30 సమయంలో వారి మధ్య గొడవ జరుగుతుండటంతో ముజీజ్‌ లాడ్జీలో నుంచి బయటికి వెళ్లాడు. వెళ్లేటప్పుడు రూంలో గొడవ జరుగుతోందని రిసెప్షన్‌లో చెప్పాడు. మద్యం మత్తులో గొడవ పడటం సహజమేనని భావించి రిసెప్షన్‌లోని లాడ్జీ సిబ్బంది అతని మాటలను పట్టించుకోలేదు. 

ముజీబ్‌ వెళ్లిన తర్వాత సోమవారం వేకువ జామున 1.30 సమయంలో లోకేశ్వరరెడ్డి, సునీల్‌లు లాడ్జీలో నుంచి బయటికి వెళ్లిపోయారు. ఇదంతా లాడ్జీలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. సోమవారం ఉదయం గదిని శుభ్రం చేసేందుకు రూం బాయ్‌ వెంకటేష్‌ వెళ్లగా అప్పటికే పప్పీ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. లాడ్జీ సిబ్బంది సమాచారం మేరకు వన్‌టౌన్‌ సీఐ రామకృష్ణారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మద్యం సీసాలతో కొట్టడం వల్ల అతను మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు.

రాఘవేంద్ర అలియాస్‌ పప్పీపై అనేక కేసులు
పప్పీపై ప్రొద్దుటూరు టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో రౌడీషీట్‌ ఉంది. టూ టౌన్‌, త్రీ టౌన్‌, రూరల్‌ పోలీస్‌ స్టేషన్లలో పలు కేసులు అతనిపై నమోదయ్యాయి. 2013లో అతను పప్పీ గ్యాంగ్‌ పేరుతో పట్టణంలో హడలెత్తించాడు. పట్టణంలోని అనేక మంది యువకులను ప్రోగు చేసుకొని చిన్నాచితక దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడేవాడు. అతని ఆగడాలు శృతి మించడంతో పోలీసు ఉన్నతాధికారులు 2014లో అతన్ని పట్టణ బహిష్కరణ చేశారు. 

దీంతో అప్పటి నుంచి పప్పీ హైదరాబాద్‌, బెంగళూరులో ఉంటూ వచ్చాడు. తర్వాత కువైట్‌కు వెళ్లి వచ్చినట్లు సన్నిహితులు చెబుతున్నారు. రెండేళ్ల క్రితం రాఘవేంద్ర ప్రొద్దుటూరుకు వచ్చాడు. ఏడాది క్రితం సొంత బంధువులను బెదిరించగా వారు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఒక యువకుడిని ఫోన్‌లో బెదిరించగా అతను టూ టౌన్‌ పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో పోలీసులు పప్పీని పిలిపించి మందలించారు.

పోలీసుల విచారణ..
పప్పీని హత్య చేసిన వ్యక్తులెవరనేది పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినప్పటికీ.. హత్యకు గల కారణాలు మాత్రం అంతుచిక్కడం లేదు. డీఎస్పీ భక్తవత్సలం, సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్‌ఐలు సంజీవరెడ్డి, శ్రీనివాసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. డాగ్‌ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. ఘటనా స్థలంలో క్లూస్‌టీం వేలిముద్రలను సేకరించారు. మద్యం మత్తులో జరిగిన హత్యనా లేక పాతగొడవలే కారణమా అనేది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. పప్పీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. లాడ్జీ మేనేజర్‌ చంద్రఓబుళరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. నిందితుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టామన్నారు.

వివాహమై ఆరు నెలలైనా కాలేదు..
ఆరు నెలల క్రితం పప్పీ సంజీవనగర్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్న అనూషను రెండో పెళ్లి చేసుకున్నాడు. లాడ్జీలో భర్త మృతదేహాన్ని చూసి అనూష విలపించసాగింది. వివాహమై కనీసం ఆరు నెలలైనా కాకముందే భర్త దుర్మరణం చెందాడని కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. కుమారుడు మృతి చెందాడనే సమాచారం తెలియడంతో తల్లి సరస్వతి ఘటనా స్థలానికి చేరుకుంది. మృతదేహాన్ని చూసి ఆమె కన్నీరుమున్నీరైంది.

కొంత సేపటి వరకు మృతుడు ఎవరన్నది పోలీసులకు తెలియలేదు. ఆ తర్వాత హత్యకు గురైన వ్యక్తి పప్పీ అని పలువురు చెప్పడంతో అతని భార్య, తల్లిని పిలిపించి మృతదేహాన్ని చూపించారు. వారు చెప్పిన తర్వాత అతన్ని రాఘవేంద్రకుమార్‌ అలియాస్‌ పప్పీగా నిర్ధారించారు. రిసెప్షన్‌లోని రిజిష్టర్‌ను పరిశీలించిన పోలీసులు లోకేశ్వరరెడ్డి పేరుతో రూం బుక్‌ అయినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే లాడ్జీలోని వారి గదికి ఎవరెవరు వచ్చారనే విషయాలు సీసీ పుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు.

 వారిలో లోకేశ్వరరెడ్డి, సునీల్‌ సెల్‌ నంబర్లకు ఫోన్‌ చేయగా ఫోన్లు పని చేయలేదు. వారిద్దరు పరారీలో ఉండటంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది. లోకేశ్వరరెడ్డి, సునీల్‌లు పప్పీని హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. వారితో కలిసి ఉన్న మరో వ్యక్తి ముజీబ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement