మనమే పవర్ స్టార్లం
కరెంటు కష్టాలకు సోలార్ ‘శక్తి’
సోలార్ యూనిట్ల కోసం పెరుగుతున్న దరఖాస్తులు
{పజలపై తగ్గుతున్న భారం కోతల నుంచి విముక్తి
199 కేంద్రాల్లో 3700 మెగవాట్లకు ఉత్పత్తి
ఈయన పేరు పి.వీరారెడ్డి. హైదర్‌గూడలో నివాసం. ఇంట్లో రెండు ఏసీలు, ఫ్రిజ్, నాలుగు ఫ్యాన్లు, టీవీ, పది లైట్లు ఉన్నాయి. నెలకు సరాసరి విద్యుత్ బిల్లు రూ.2 వేలకుపైగా వచ్చేది. అధిక బిల్లులకు తోడు విద్యుత్ కోత. విద్యుత్ కష్టాల నుంచి గట్టెక్కాలని ప్లాన్ చేశారు. సోలార్ విద్యుత్ ద్వారా లబ్ధి పొందవచ్చన్న విషయం తెలుసుకున్నారు. రూఫ్‌టాప్ సోలార్ పథకానికి ప్రభుత్వం ఇచ్చే రాయితీతో సోలార్ యూనిట్‌ను కొనుగోలు చేశారు. చకచకా మూడు కిలోవాట్లు సామర్థ్యం కలిగిన సోలార్ పలకలను ఇంటిపై అమర్చారు. గ్రిడ్‌కు అనుసంధానం చేశాడు. బిల్లు రెండొందలకు పడిపోయింది.. అంతే కాందడోయ్ మిగులు విద్యుత్‌ను డిస్కంకు విక్రయిండం ద్వారా అదనంగా ఆదాయం కూడా పొందుతున్నారు.. ఇంకెందుకు ఆలస్యం విద్యుత్‌ను ఉత్పత్తి చేద్దాం పదండి సాక్షి, సిటీబ్యూరో:
రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నెలకొని ఉంది. కరెంటు ఎప్పుడు వస్తుందో..పోతుందో తెలియని పరిస్థితి..గతేడాది శీతాకాలం వచ్చే వరకూ కూడా కోతలు అమలయ్యాయి.. మరో వైపు గుండె గు‘బిల్లు’మనిపించే చార్జీలు.. కరెంటు కష్టాల నుంచి బయటపడేందుకు గ్రేటర్ వాసులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషణ మొదలెట్టారు.
రూఫ్‌టాప్ సోలార్ నెట్ మీటరింగ్ పథకం ద్వారా కలిగే లబ్ధిని తెలుసుకున్నారు. ఇళ్లపై సోలార్ యూనిట్లను ఏర్పాటు ద్వారా కోతలు..అధిక బిల్లుల నుంచి విముక్తి..అదనంగా ఉన్న కరెంటు గ్రిడ్‌కు విక్రయించి ఆదాయం పొందవచ్చు.. ఈ విషయాలను తెలుసుకున్న సిటిజనులు తెలంగాణ దక్షిన మండల విద్యుత్ పంపిణీ సంస్థకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకూ తొమ్మిది సర్కిళ్ల పరిధిలో 520 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో ఇప్పటికే 199 సోలార్ యూనిట్లను అనుమతి ఇచ్చారు. 3700 మెగావాట్లకుపైగా విద్యు త్ ఉత్పత్తి అవుతోంది.
మారుతున్న ఆలోచనా ధోరణి
గ్రేటర్ పరిధిలో 38 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. గృహ విద్యుత్ కనెక్షన్లు 31 లక్షలు, వాణిజ్య కనెక్షన్లు 5.20 లక్షలు, చిన్న, మధ్య తరహా భారీ పరిశ్రమలు 40 వేలు, వీధి లైట్లు లక్ష ఉండగా, ప్రకటనల బోర్డులు 3200పైగా ఉన్నాయి. వీటి అవసరాలు తీర్చాలంటే రోజుకు సగటున 45 మిలియన్ యూనిట్లు అవసరం. ప్రస్తుతం 40 మిలియన్లకు మించి సరఫరా కావడం లేదు. డిమాండ్‌కు సరఫరాకు మధ్య వ్యత్యాసం నమోదవుతుండడంతో అత్యవర లోడ్ రిలీఫ్ పేరుతో ఇష్టం వచ్చినట్లు అనధికారిక కోతలు అమలవుతున్నాయి. విద్యుత్ సంక్షోభం నుంచి గట్టేక్కేందుకు ప్రజలు తమ ఆలోచన ధోరణిని మార్చుకుంటున్నారు. ఎవరి అవసరాలకు అనుగునంగా వారే స్వయంగా ఇంటిపై సోలార్ యూనిట్లను ఏర్పాటు చేసుకుని విద్యుత్ ఉత్ప త్తి చేస్తూ, అవసరానికి వాడుకోగా మిగులు విద్యుత్‌ను యూనిట్‌కు రూ.3.38 చొప్పున డిస్కంకు విక్రయిస్తున్నారు.
గుజరాతే ఆదర్శం...
కేంద్రప్రభుత్వం 2010లో జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ సోలార్ మిషన్ ఏర్పాటు చేసింది. 2009 సెప్టెంబర్‌లోనే క్లింటన్ ఫౌండే షన్‌తో గుజరాత్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 2010లో చర్నకా గ్రామంలో సౌర విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి ఇప్పటికే 224 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. గుజరాత్‌ను రాజస్థాన్ అనుసరించి జోధాపూర్, జైసల్మీర్ జిల్లాల్లో రెండు పార్కులు ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, జమ్ము, కశ్మీర్, పంజాబ్, ఒడిసా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు అదే బాటలో నడుస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలంలో ఐదువేల ఎకరాల సాగుకు యోగ్యం కాని భూమిలో సోలార్ పార్కును ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ప్లాంటు సకాలంలో పూర్తయియే విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కవచ్చని నిపుణులు అభిప్రాయడుతున్నారు.
తగ్గిన బిల్లు
‘సికింద్రాబాద్ గాంధీ జనరల్ ఆస్పత్రి . 2014 సెప్టెంబర్‌లో రూ.3.5 కోట్ల ఖర్చుతో 400 కిలోవాట్ సామర్థ్యం కలిగిన సోలార్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ఆస్పత్రికి నెలకు రూ.21-22 లక్షల వచ్చే కరెంట్ బిల్లు, జనవరిలో రూ.19 లక్షలు వస్తే ఫిబ్రవరిలో రూ.17.70 ల క్షలు వచ్చింది. సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత ఆస్పత్రికి వచ్చే నెలసరి విద్యుత్ బిల్లు భారీగా తగ్గిపోయింది. రోగులకు కష్టాలు తప్పాయి.