వీరారెడ్డి
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఈ బాలవీరకు పట్టుమని పన్నెండేళ్లు ఉంటాయి. ఆరేళ్ల వయసు నుంచే క్రికెట్ ఆడడమంటే అంటే ఆసక్తి. లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేయలేదు.. నిరంతర సాధన మరవలేదు. చదువునూ పక్కనపెట్టలేదు. బ్యాట్ పట్టి మైదానంలోకి దిగితే ‘శత’క్కొట్టుడే అతని గురి. జిల్లా, అంతర జిల్లాలు, రాష్ట్ర స్థాయిలోనూ రాణిస్తున్నాడు. జాతీయ జట్టుకు సారథ్యమే తన లక్ష్యమని చెప్తున్నాడు అనంతపురం నగరానికి చెందిన వీరారెడ్డి. అనంతపురం నగరంలోని రామచంద్రనగర్‌కు చెందిన కోగటం విజయభాస్కర్‌రెడ్డి, కోగటం శ్రీదేవి దంపతుల కుమారుడు వీరారెడ్డి. తల్లి అనంతపురం మాజీ కార్పొరేటర్. వీరారెడ్డి ప్రస్తుతం నారాయణ పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్నాడు. తన 6 ఏళ్ల వయస్సు నుంచే క్రికెట్ అంటే మక్కువ ఏర్పడింది. కోచ్ చంద్రమోహన్‌రెడ్డి వద్ద మెలకువలు నేర్చుకున్నాడు.
జట్టులో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్
వీరారెడ్డి ఆటతీరును చూసి అండర్ –12 జిల్లా జట్టుకు సారధ్య బాధ్యతలు అప్పగించారు. తనదైన ఆటతీరుతో జిల్లా జట్టు విజేతగా నిలవడంలో కీలకపాత్ర వహించాడు. 11 ఏళ్లకే అండర్–14 జట్టులో చోటు సంపాదించడమే కాకుండా ఆ జట్టును విజయపథంలో నడిపించాడు.
నిరంతర సాధనే బలం
ప్రస్తుతం ఆంధ్ర క్రికెట్‌లో ప్రత్యేకత చాటుకుంటున్న వీరారెడ్డికి నిరంతర ప్రాక్టీసే బలం. రోజూ ఐదు గంటల పాటు సాధన చేస్తాడు. ఉదయం 6 నుంచి 8 వరకు.. సాయంత్రం 5 నుంచి 8 వరకు ప్రాక్టీస్ చేస్తుంటాడు. అంతర్జాతీయ క్రికెటర్లు ధోని, కోహ్లి, రోహిత్ లాంటి వారి ఆటతీరును చూసి, మెలకువలు పాటిస్తున్నాడు.
‘శత’కమే అతని లక్ష్యం
♦ అండర్–14 విభాగంలో అర్థ సెంచరీని సాధించాడు.
♦ అండర్–12 అంతర్ జిల్లా క్రీడా పోటీల్లో 4 మ్యాచ్‌లు ఆడగా మూడింట్లో నాటౌట్‌గా నిలిచాడు.
♦ గుంటూరులో జరిగిన మ్యాచ్‌లో 89 పరుగులు సాధించి బెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా ఎంపికయ్యాడు.
♦ గతేడాది రాష్ట్ర క్యాంపునకు ఎంపికయ్యాడు.
♦ అంతర్ జిల్లా క్రీడా పోటీల్లో రెండు అర్థ సెంచరీలు చేశాడు.
♦ 11 ఏళ్లకే అండర్–14 జట్టులో చోటు సాధించడమే కాకుండా 150 పరుగులు సాధించిన ఘనత దక్కింది.
♦ గత రెండేళ్లలో వివిధ ప్రాంతాల్లో జరిగిన మ్యాచ్‌ల్లో 33 అర్థ సెంచరీలు, 3 సెంచరీలు సాధించాడు.
♦ ఆత్మకూరు జట్టుపై 106 పరుగులతో అజేయంగా నిలిచాడు. సౌత్‌జోన్ జట్టుకు ఎంపికయ్యాడు. మంగళగిరిలో నిర్వహించే కోచింగ్ క్యాంపునకు ఎంపికయ్యాడు.
అన్ని విభాగాల్లోనూ విజయమే
వీరారెడ్డి జట్టులో బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ తనదైన గుర్తింపు దక్కించుకుంటున్నాడు. అండర్–12 అంతర్ జిల్లా క్రీడా పోటీల్లో 4 మ్యాచ్‌లు ఆడి 6 వికెట్లు తీశాడు. ఫీల్డింగ్‌లోనూ సత్తాచాటుతున్నాడు. బెస్ట్ ఆల్‌రౌండర్‌గానూ రాణిస్తూ అందరి మన్ననలను అందుకుంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment