సాక్షి, హైదరాబాద్: జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి (నిమ్జ్) ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ పర్యావరణ అనుమతులు ఇవ్వాలని నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. గత నెల 24, 25 తేదీల్లో సమావేశమైన ఈఏసీ నిమ్జ్ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించింది. పర్యావరణ అనుమతుల జారీలో పలు షరతులు విధిస్తూ సమావేశానికి సంబంధించిన మినిట్స్‌ను కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తాజాగా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది.
ఈఏసీ సూచనలను పరిగణనలోకి తీసుకుంటూ త్వరలో కేంద్ర పర్యావరణ శాఖ త్వరలో నిమ్జ్‌కు పర్యావరణ అనుమతులు ఇస్తూ ఆదేశాలు జారీచేస్తుంది. రెడ్ కేటగిరీ పరిశ్రమలన్నీ ఒకేచోట ఏర్పాటు చేయడం, పారిశ్రామిక వాడలు జనావాసాలకు నడుమ 500–700 మీటర్ల దూరం పాటించడం వంటి నిబంధనలు పాటించాలని ఈఏసీ సూచించింది. నిమ్జ్ సరిహద్దు వెంట గ్రీన్‌బెల్ట్ ఏర్పాటు, పర్యావరణ నిర్వహణ ప్రణాళిక అమలు, కాలుష్య జలాల శుద్దీకరణ, ప్రాజెక్టు విస్తీర్ణంలో 33 శాతం గ్రీన్‌బెల్ట్ వంటి నిబంధనలు పాటించాలని పేర్కొంది. ముంగి, చీలపల్లి తండాలను ప్రాజెక్టు పరిధి నుంచి మినహాయించాలని స్పష్టం చేసింది.
భూ సేకరణే అసలు సవాలు...
రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని వేగవంతం చేసేందుకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఝరాసంగం, న్యాలకల్ మండలాల్లోని 17 గ్రామాల్లో భారీ పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. 2016లో ఈ పారిశ్రామిక వాడకు కేంద్రం నిమ్జ్ హోదా కల్పించింది. నిమ్జ్ ఏర్పాటుకు 12,635 ఎకరాలు అవసరం కాగా, భూ సేకరణకు రూ.2450 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు.
తొలి విడతలో 3,501 ఎకరాలను సేకరిం చాల్సి ఉండగా, 2,925 ఎకరాల సేకరణ పూర్తయింది. మరో రెండు విడతల్లో 9వేల ఎకరాలకు పైగా సేకరించాల్సి ఉండగా, రెండో విడత భూ సేకరణకు నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ప్రస్తుతం భూ ముల ధరలు భారీగా పెరగడంతో ప్రభుత్వం ఇచ్చే పరిహారం తమకు సరిపోదని ఆందోళనకు దిగుతున్నారు. దీంతో భూ సేకరణ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఇదిలాఉంటే 2022–23 బడ్జెట్‌లో నిమ్జ్ భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్లు మాత్రమే కేటాయించడం గమనార్హం.
మౌలిక వసతులకు నిధులేవీ?
నిమ్జ్‌కు తొలి విడతలో సేకరించిన భూమిని మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఐఐసీ)కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. మౌలిక వసతుల కల్పనకు రూ.13వేల కోట్లు అవసరమని అంచనా వేయగా, తొలిదశలో కనీసం రూ.2వేల కోట్లు ఇవ్వాలని పరిశ్రమల మంత్రి కేటీఆర్ పలుమార్లు కేంద్రానికి లేఖ రాశారు. అయితే కేంద్రం కేవలం రూ.3 కోట్లు మాత్రమే ఇచ్చింది.
నిమ్జ్‌లో ఏర్పాటయ్యే పరిశ్రమలు
ఎలక్ట్రికల్ మెషినరీ, మెటల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, నాన్ మెటాలిక్ మినరల్స్, ఆటోమొబైల్స్, ట్రాన్స్‌పోర్ట్ ఎక్విప్‌మెంట్
పెట్టుబడులు అంచనా: రూ.60వేల కోట్లు
ఉద్యోగ అవకాశాలు: 2.77 లక్షలు
Comments
Please login to add a commentAdd a comment